Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.