Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.