Tags
5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar
ఎం కోటేశ్వరరావు
” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్ సింగ్ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.
డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్ డాలర్ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్ పెసో,చైనా యువాన్, దక్షిణ కొరియా వాన్, మలేసియా రింగిట్, థాయిలాండ్ బట్ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్ జర్నల్ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్ ఎన్ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్ 8.6, ఆస్ట్రేలియా డాలర్ 6.5,దక్షిణ కొరియా వాన్ 5.5 శాతం చొప్పున క్షీణించింది.
2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్ ట్రంప్, ఇప్పుడు జో బైడెన్,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్ పుతిన్, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్ షేర్వాణీ అందర్ పరేషానీగా ఉంది.
మన్మోహన్ సింగ్ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.
నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్ ఖాతా అంటారు) 36.4 బిలియన్ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.
డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.
ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జై శంకర్ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?