ఎం కోటేశ్వరరావు
” ధనిక రాష్ట్రం – అధ్వాన్న సూచికలు : కర్ణాటక నివేదిక ” అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు ఏడవ తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది.దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది. వర్తమాన సంవత్సర బడ్జెట్‌లో కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్యశాఖకు 5.8, విద్యకు 12.9శాతం కేటాయించింది. ఇది జాతీయ సగటు 6, 15.2 శాతాల కంటే తక్కువ. దేశ తలసరి సగటు రాబడి రు.1.51లక్షలు కాగా కర్ణాటకలో రు.2.49లక్షలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ ప్రకటించిన 2021 ఆకలి సూచిక దేశ సగటు 47 కాగా కర్ణాటకలో 53 ఉంది. తమిళనాడు 66, కేరళ 80 పాయింట్లతో ఎగువున ఉన్నాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి రాబడిలో తెలంగాణా తరువాత కర్ణాటక రెండవ స్థానంలో ఉంది. కానీ ఆకలి సూచికలో మాత్రం రాజస్థాన్‌కు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో దీన్ని, ఇతర మానవాభివృద్ధి సూచికల గురించి ఆలోచించాల్సిన బిజెపి పెద్దలు వాటిని విస్మరించి రాష్ట్ర ప్రజలకు తక్షణం కావాల్సింది లవ్ జీహాద్ నిరోధం అని, అందుకు గాను తమను ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే ఫలాలు వస్తాయి.
నళిన్ కుమార్ నిరంజన్ షెట్టి కటీల్ ! ఒక గల్లీ లీడర్ కాదు, పార్లమెంటు సభ్యుడు, కర్ణాటక బిజెపి అధ్యక్షుడు. మంగళూరులో బూత్ విజయ అభియాన్ పేరుతో జనవరి తొలి వారంలో నిర్వహించిన సమావేశంలో అతగాడి నోటి నుంచి వెలువడిన ఆణి ముత్యాలు ఇలా ఉన్నాయి. ” వేదవ్యాసుడు విధాన సౌధ(అసెంబ్లీ)లో చేతులు ఎత్తలేదని చర్చించవద్దు. నళిన్ కుమార్‌కు ఈ అంశం గురించి లేవనెత్తే హక్కు లేదని చెప్పవద్దు. నళిన్ కుమార్ కటీల్ వాటా నుంచి మీకు బంగారమేమీ రాదు.కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. రోడ్లు, మురుగు కాలవల వంటి చిన్న చిన్న అంశాల గురించి మాట్లాడవద్దు. మీ బిడ్డల భవిష్యత్ గురించి మీరు ఆందోళన చెందుతుంటే, మీరు లవ్ జీహాద్‌ను ఆపాలని కోరుకుంటే మనకు బిజెపి కావాలి. దాన్ని వదిలించుకోవాలంటే మనకు బిజెపి కావాలి.” అని సెలవిచ్చారు. ఎంత మహత్తర ఆలోచన !
ధనిక రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక దానికి అనుగుణంగా వివిధ సూచికల్లో లేదు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో 2020 సమాచారం ప్రకారం కొన్ని సూచికలు ఇలా ఉన్నాయి.
అంశం ×××××××× కర్ణాటక×× ఆంధ్రప్రదేశ్×× తెలంగాణా×× తమిళనాడు×× కేరళ
ప్రసూతి మరణాలు×× 83 ×× 58 ×× 56 ×× 58 ×× 30
పుట్టినపిల్లల మరణాలు× 19 ×× 24 ×× 21 ×× 13 ×× 6
పుట్టినవెంటనేమరణాలు× 14 ×× 17 ×× 15 ×× 9 ×× 4
5ఏళ్లలోపుపిల్లలమరణం× 21 ×× 27 ×× 23 ×× 13 ×× 8
కేరళతో పోలిస్తే తల్లీ, పిల్లల మరణాలను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం చేయాల్సిన పనులెన్నో ఉండగా దాని ఊసు లేకుండా మీ పిల్లలను లౌ జీహాద్ నుంచి రక్షిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అంటే వారికి సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి ఓట్లు పొందటం మీద ఉన్న శ్రద్ద తల్లీ, పిల్లల సంక్షేమం మీద లేదన్నది వేరే చెప్పనవసరం లేదు. కర్ణాటక ఇతర సూచికల్లో కూడా అంత ఘనమైన రికార్డును కలిగి లేదు. 2019 సూచిక ప్రకారం మానవాభివృద్ది సూచికలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు తరగతులుగా వర్గీకరించారు. వాటిలో కర్ణాటక మధ్యతరహా జాబితాలో 0.683తో ఐదవ స్థానంలో, మొత్తంలో 19వ స్థానంలో ఉంది. దేశ సగటు 0.646కు దగ్గరగా ఉంది. కేరళ 0.782తో ప్రధమ స్థానంలో ఉంది. కర్ణాటక స్థానాన్ని మెరుగుపరచటం అనే అజెండా బిజెపికి లేదు.
దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. ఇక ఐటి రంగంలో దేశానికి రాజధానిగా, మేథో కేంద్రంగా ఉంది. అలాంటి చోట 60శాతం మంది పిల్లలు పదకొండవ తరగతిలో చేరకుండానే చదువు మానివేస్తున్నారు.2021-22 వివరాల ప్రకారం తమిళనాడులో 81, కేరళలో 85శాతం మంది పన్నెండేళ్ల పాటు విద్య నేర్చుకున్నవారు ఉండగా కర్ణాటకలో 40శాతానికి మించి లేరు. వారి చదువు సంధ్యల గురించి గాక లౌ జీహాద్ గురించి బిజెపి తలిదండ్రులకు చెబుతున్నది.
మే నెలలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న బిజెపి అక్కడ రెండు ఇంజన్ల గురించి చెప్పటం లేదు.ఎందుకంటే రెండు ఇంజన్లు పని చేస్తున్నా అక్కడ స్థితి ఎలా ఉందో చూశాము. అందువలన దాని కేంద్రీకరణ అంతా హిజబ్, హలాల్, లౌ జీహాద్ మీదనే ఉంది. మెజారిటీ హిందువులను మనోభావాలతో సంతుష్టీకరించి ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. రెండు రాష్ట్రాలలో ఉన్నది బిజెపి ప్రభుత్వాలే, కేంద్రంలో ఉన్నదీ వారిదే అయినా మహారాష్ట్రతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకపోగా ఆ పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నది. ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? కేంద్ర ప్రభుత్వ విజయగానాలకు బదులు ఇటీవల కర్ణాటక వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా మాండ్యలో జరిగిన సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిన, కాశీ, కేదారనాధ్,బదరీనాధ్‌లను అభివృద్ది చేసిన నరేంద్రమోడీ కావాలా ? టిప్పు సుల్తాన్ను గొప్పగా చూపిన వారు కావాలో, దేశభక్తులతో ఉన్నవారో విచ్చిన్నకులతో చేతులు కలిపిన వారు కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. ఆ తరువాతే కొనసాగింపుగా రాష్ట్రనేత నళిన్ లౌ జీహాద్ నివారణకు బిజెపిని ఎంచుకోవాలన్నారు. కర్ణాటకలో వివిధ సామాజిక తరగతుల సమీకరణ, మఠాధిపతులు, పీఠాధిపతుల మద్దతు కోసం ప్రాకులాడటం బిజెపి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అవి ఎక్కువ కాలం సాగవు గనుక వివాదాస్పద అంశాలను ముందుకు తెస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
హిందూత్వ సమీకరణకు ప్రయోగశాలగా ఉన్న కర్ణాటకలో హిజబ్ వివాదాన్ని ముందుకు తెచ్చిన తీరు తెన్నులను చూశాము. దాని వలన రాష్ట్ర జిఎస్‌డిపి పెరగలేదు, ఉపాధి అవకాశాలు రాలేదు, ధరలు తగ్గలేదు గానీ జనాల బుర్రలు ఖరాబు చేశారు. వచ్చే ఎన్నికల్లో దానిపని అది చేస్తుంది.ప్రభుత్వ హిజబ్ నిషేధాన్ని హైకోర్టు సమర్ధించింది. దాని మీద సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా గతేడాది అక్టోబరులో ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు సమర్ధించగా మరొకరు తిరస్కరించటంతో అది పెద్ద డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. దాని మీద తీర్పు వచ్చే వరకు నిషేధం కానసాగుతుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. హిజబ్ వివాదం కొనసాగింపుగా హలాల్‌ను ముందుకు తెచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికార పక్షం అంగీకరించకపోతే కొన్ని అంశాలపై ప్రైవేటు బిల్లులు పెట్టటం, వాటి మీద జనంలో చర్చ రేపటం తెలిసిందే. కానీ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు ప్రైవేటు బిల్లులు పెట్టటం ఏమిటి ? అదీ అలాంటిదే. ఒక పెద్ద నాటకం, దానిలో భాగంగానే బిజెపి ఎంఎల్‌సి రవి కుమార్ హలాల్ ధృవీకరణ పత్రాల జారీ మీద ఒక బిల్లును పెడతానని ప్రకటించారు. ముస్లిం సంస్థలు హలాల్ పత్రాల జారీకి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒక నిర్ణీత అధికార వ్యవస్థను ఏర్పాటు చేసేంత వరకు ముస్లిం సంస్థలు ధృవీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని కోరనున్నట్లు వార్తలు. దీని గురించి ఇంతకు ముందు రవికుమార్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వమే హలాల్ పత్రాలను జారీ చేస్తే ఖజానాకు ఐదువేల కోట్ల మేరకు రాబడి వస్తుందని దానిలో పేర్కొన్నట్లు వార్తలు.
మరొకవైపు హలాల్ మాంస ఉత్పత్తులను బహిష్కరించాలని అనేక హిందూత్వ సంస్థలు పిలుపునిచ్చాయి. ముస్లిమేతరులకు అమ్మ వద్దని కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్ దుకాణాల ముందు ధర్నాలు కూడా చేశారు. సర్టిఫికెట్ల జారీ మీద నిషేధం వేరు, హలాల్ మాంసం మీద నిషేధం వేరు అన్న సంగతి తెలిసిందే. బిజెపి ప్రజాప్రతినిధి సర్టిఫికెట్ల మీద నిషేధం పెట్టాలని కోరుతుండగా సంఘపరివార్ తెరవెనుక ఉండి నడిపిస్తున్న సంస్థలు అసలు మాంసాన్నే నిషేధించాలని రోడ్లకు ఎక్కుతున్నాయి. దీంతో కొన్ని పత్రికలు హలాల్ మాంసం మీద నిషేధం విధించే దిశగా కర్ణాటక బిజెపి సర్కార్ ఉన్నట్లు వార్తలు ఇచ్చాయి. అవన్నీ బిజెపికి కొమ్ముకాసేవే కనుక అంతరంగం ఎరగకుండా అలా రాసినట్లు భావించలేము. పోనీ వాటిని ప్రభుత్వం స్పష్టంగా ఖండించిందా అంటే అదీ లేదు, అందుకనే అనేక అనుమానాలు తలెత్తాయి.
నిజానికి ఇది మనోభావాలతో ఆడుకొనే దుష్ట ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ప్రతి మతానికి కొన్ని క్రతువులు ఉన్నాయి. కొన్ని మతాలకు చెందిన వారు లేదా కొన్ని సామాజిక తరగతులు, ఒక మతంలోనే భిన్న క్రతువులను పాటించేవారు మాంసాహారం తినకూడదనే నిషేధం ఉంది. ఇస్లాం ఆచారాలు, నిబంధనల ప్రకారం తయారు చేసిన ఆహారం మాత్రమే తినాలని, అలా లేనిదాన్ని తినకూడదని ఆ మతంలో నిషేధించారు. అందుకే ఇది తినవచ్చు అని చెప్పేందుకు గాను హలాల్ ధృవీకరణ పత్రం ఉందని ఉత్పత్తుల మీద ముద్రిస్తున్నారు.అరబ్బు దేశాలలో హలాల్ పత్రాల జారీకి చట్టబద్దమైన సంస్థలు ఉంటాయి. మన దేశంలో అలాంటివి లేవు.హలాల్ సర్టిఫికెట్, మతం పేరుతో వసూలు చేస్తున్న పెద్ద మొత్తాలను విద్రోహ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి(హెచ్‌జెఎస్) పేరుతో ఉన్న సంస్థ ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం తయారైన ఉత్పత్తులను తినాలా లేదా అన్నది ఇతర మతస్థులు ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. దాని మీద బలవంతం ఏమీ లేదు. కానీ దీన్ని కూడా వివాదం చేశారు. గతంలో మాంసం మీద మాత్రమే అలాంటి సర్టిఫికెట్ ఉండేదని, ఇప్పుడు అనేక ఉత్పత్తులకు వాటిని జారీ చేస్తున్నారన్నది బిజెపి, హిందూత్వశక్తుల దుగ్ద. ఇది ఒక మానసిక సమస్య.హలాల్ చేసినట్లు తాము చెప్పిందే తినాలి లేనిది తినకూడదని ఇస్లామిక్ మతం చెబుతున్నది. దాన్ని అనుకరిస్తున్న లేదా అనుససరిస్తున్న కాషాయ దళాలు హలాల్ మాంసం తినకూడదని, అమ్మకూడదని చెబుతున్నాయి.ఒకే నాణానికి బొమ్మ బొరుసూ అంటే ఇదే కదా !