ఎం కోటేశ్వరరావు
చైనాలోని టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన యాంట్ గ్రూప్ కంపెనీలపై వివాదాస్పద జాక్ మా ఆధిపత్యానికి తెరపడింది.జపాన్‌లో ఉంటున్నట్లు వార్తలు రాగా చైనా నుంచి తప్పుకున్నారా లేక తాత్కాలికంగా అక్కడ ఉంటున్నాడా అన్నది స్పష్టం కాలేదు.యాంట్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం యాజమాన్య వ్యవస్థలో చేసిన మార్పుల ప్రకారం ఒక వాటాదారు లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా గానీ కంపెనీని అదుపులోకి తీసుకొనేందుకు వీలు లేదు. పరోక్ష పద్దతుల్లో 53.46 శాతం వాటాలపై అదుపు ఉన్న కారణంగా జాక్ మా పెత్తనం ఇప్పటి వరకు కొనసాగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అతగాడికి 6.2శాతం ఓటింగ్ హక్కులు మాత్రమే ఉంటాయి. మన దేశంలో అదానీ, అంబానీ వంటి వారు క్రమంగా అనేక కంపెనీలను మింగివేస్తూ రోజు రోజుకూ సంపదలను మరింత పోగు చేసుకుంటున్న తీరు తెన్నులు తెలిసిందే. చైనాలో అలాంటి అవకాశం ఉండదని జాక్ మా ఉదంతం స్పష్టం చేసింది.
మారిన నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకుల్లో ఒకడైన జాక్ మా, ఇతర యాజమాన్య, సిబ్బంది ప్రతినిధులు పది మంది తమ ఓటింగ్ హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవచ్చు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలో మార్పు ఉండదని కంపెనీ ప్రకటన తెలిపింది.ఈ ప్రకటన తరువాత హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో కంపెనీల వాటాల ధర తొమ్మిదిశాతం పెరిగింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు జాక్ మా థాయిలాండ్ రాజధాని బాంకాక్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. టోకియో నగరంలో తన కుటుంబంతో సహా ఉంటున్నారని, అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్, స్పెయిన్, నెదర్లాండ్స్ తదితర దేశాలు వెళ్లి వస్తున్నట్లు గతేడాది నవంబరులో ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక పేర్కొన్నది. నూతన సంవత్సరం సందర్భంగా చైనాలోని కొందరు టీచర్లతో జాక్ మాట్లాడుతున్న వీడియో వెలువడినట్లు హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు అనే పత్రిక రాసింది. తాను త్వరలోనే ప్రత్యక్షంగా దర్శనమిస్తానని దానిలో చెప్పటాన్ని బట్టి తిరిగి జాక్ మా తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నది.దీన్ని బట్టి జాక్ మా తిరిగి చైనా వచ్చాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టం కావటం లేదు. 2020లో వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటి నుంచీ జాక్ మా గురించి అనేక పుకార్లు వచ్చాయి. జైల్లో పెట్టారని, అసలు మనిషినే అంతం చేశారని కూడ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి బహిరంగ జీవితంలో సరిగా కనిపించటం లేదు.
ఝజియాంగ్ వాణిజ్య,పారిశ్రామికవేత్తల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఒక వెబ్‌సైట్‌లో వార్తను ఉటంకిస్తూ డిసెంబరు ఎనిమిదవ తేదీన చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న తూర్పు చైనా ఝజియాంగ్ ప్రాంతంలో గతేడాది ఆగస్టు నాటికి 9.06 మిలియన్ల సంస్థలు సదరు మండలిలో ఉన్నట్లు, అది ఏర్పడిన 2025 నుంచి జాక్ మా అధ్యక్షుడిగా ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది.యాభై ఐదేండ్ల వయసులో జాక్ మా 2019 సెప్టెంబరు లోనే అధికారికంగా ఆలీబాబా కంపెనీ చైర్మన్ పదవి నుంచి వైదొలగినట్లు, హరున్ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం చైనాలో తొమ్మిదవ పెద్ద ధనవంతుడిగా ఉన్నాడని, సెప్టెంబరు ఆఖరు నాటికి అతని సంపద విలువ అంతకు ముందుతో పోలిస్తే మూడుశాతం పెరిగి 29.124 బిలియన్ డాలర్లని కంపెనీ రికార్డుల ప్రకారం ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. చిన్న కంపెనీలను మింగివేసేందుకు జాక్ మా చూసినట్లు వెల్లడి కావటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని వాల్‌స్ట్రీట్ జర్నల్ గతంలో రాసింది. తాజా పరిస్థితి గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్ మాను అదుపులోకి తెచ్చింది. ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందిందన్నది స్పష్టం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఇతర దేశాల మాదిరే చైనా ఆర్థిక రంగం కూడా ప్రభావితమైంది. జాక్ మా, ఇతర టెక్ కంపెనీలపై తీసుకున్న క్రమబద్దీకరణ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడినట్లు ఎవరూ చెప్పటం లేదు.
సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప వక్రీకరించి చెప్పేవారు చెబుతున్నట్లుగా దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్-ఎంగెల్స్ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచాల్సి ఉంది. అది ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే చెప్పలేము. అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది తెలిసిందే.
రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా అనుమతించారు. దీంతో జాక్ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతించదని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
గ్లాస్‌నోస్త్ పేరుతో సోవియట్ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. జాక్ మా ఆంట్ కంపెనీ 37 బిలియన్ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రించారు. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్ కంపెనీ వాండా యజమాని వాంగ్ జియాన్‌లిన్, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. జాక్ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా 2020 అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే.
చైనా మీద వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులకు తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వారి కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.నీరు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే వరకు అంతర్గతంగా మరుగుతుంది తప్ప ఆ తరువాతనే ఆవిరిగా రూపం మార్చుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కనిపించదు. చైనా సోషలిస్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా, ఇతర దాని మిత్ర దేశాలు నిరంతరం చూస్తున్నాయి. ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. అందుకు సహకరించే శక్తులు, వ్యక్తుల కోసం అది ఎదురు చూస్తుంది. సోవియట్ కూల్చివేతకు ముందు కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి గా ఉన్న బోరిస్ ఎల్సిన్ ముందు రాజీనామా చేశాడు. తరువాత సిఐఏ పథకం ప్రకారం దేశాధ్యక్షుడైన చరిత్ర తెలిసిందే. అందువలన సిఐఏ ఎవరి మీద వల విసురుతుందో, ఎవరు చిక్కేదీ చెప్పలేము. దీని అర్ధం జాక్ మా అలాంటి వారి జాబితాలో ఉన్నాడని చెప్పటం కాదు. చరిత్ర చెప్పాల్సిందే !