Tags
10 trillion dollar economy, Amith shah, BJP, China, India Exports, India GDP, India imports from China, love jihad, Narendra Modi Failures, Ram Mandir, RSS, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
2019లో నరేంద్రమోడీ ఒక పిలుపునిచ్చారు. 2024 మార్చి నాటికి(లోక్‌సభ ఎన్నికల తరుణం) దేశ జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు దాన్నే ఊరిస్తూ జనంలో చర్చ జరగాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. అనుకోని పరిణామాలు ఎదురు కావటంతో మిగతా కబుర్ల మాదిరే ఇప్పుడు మోడీ కూడా దీని గురించి కూడా మాట్లాడటం లేదు. కొత్త ” కతలు ” తప్ప ఒకసారి చెప్పినదానిని మరోసారి చెప్పి బోరు కొట్టించే అలవాటు లేదు కదా ! ఆ తరువాత మోడీ మౌనం, ఆర్థిక సలహాదారులు 2027కి సాధిస్తాం అన్నారు, ఐఎంఎఫ్ 2029 అని చెప్పి కాదు కాదు లెక్క తప్పింది 2027కే అని చెప్పింది. పొలిటీషిియన్ అన్నతరువాత ఒపీనియన్స్ మారుస్తుండాలని గిరీశం చెప్పినట్లుగానే ఆ సంస్థ కూడా పరిస్థితిని బట్టి మా అంచనా తప్పిందంటూ మరోసారి మార్చదని చెప్పలేము. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి. తాజాగా ఐదు లక్షల డాలర్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పాత పాట పాడితే బోరు కొడుతుంది కనుక కొత్త పల్లవి అందుకున్నారు.
ఈ మధ్య దేశ జిడిపి గురించి కొత్త గీతాలు వినిపిస్తున్నారు. మిత్రోం అంటూ శ్రావ్యమైన గళం నుంచి జిడిపి గానం ఎక్కడా వినపడటం లేదు, కనపడటం లేదు. పది లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పెరుగుతున్న భారత్ అంటూ సిఇబిఆర్ అనే సంస్థ తాజాగా ఒక విశ్లేషణ చేసింది. దాని ప్రకారం 2035 నాటికి పది లక్షల డాలర్లకు చేరుతుందని చెప్పింది. ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు పడితే తదుపరి ఒక లక్ష డాలర్లను జత చేసేందుకు ఏడు సంవత్సరాలు, ఆ తరువాత మూడవ లక్షకు ఐదు సంవత్సరాలు (2019) పట్టిందని, ప్రస్తుతం 3.1లక్షల కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొన్నది. ప్రస్తుత వేగాన్ని చూస్తే రానున్న 14-15 సంవత్సరాల్లో ప్రతి రెండేళ్లకు ఒక లక్ష కోట్ల డాలర్ల వంతున జిడిపి పెరుగుతుందని అంచనా వేసింది.
తెలుగు నాట అంత్య కంటే ఆది నిషఉ్ఠరమే మేలని భావించేవారు ఏదైనా చెప్పే ముందు అంటే అన్నారని తెగ గింజుకుంటారు గానీ అని ప్రారంభిస్తారు. పట్టణాల్లో పదిశాతం, దేశ సగటు 8.3శాతం నిరుద్యోగం ఉందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 2022 డిసెంబరులో 40.48 శాతం పెరిగిందని సిఎంఐఇ పేర్కొన్నది. దేశ జిడిపి ఎంత పెరిగింది, ఎన్ని పెట్టుబడులను ఆకర్షించారు అన్నది ఒక అంశమైతే దాని వలన జనాలకు ఒరిగిందేమిటి అన్నది ప్రశ్న. సంపద పెరిగి కొందరి చేతుల్లో పోగుపడితే ఫలితం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల(పిఎల్‌ఐ) పధకాన్ని అమలు జరుపుతున్నది. కరోనా కాలంలో ఫార్మా రంగంలోకి పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరగలేదు. లక్ష్యాన్ని మించి 107శాతం పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరిగింది 13శాతమే. ఇక మన దేశం నుంచి సెల్‌ఫోన్ల ఎగుమతులు పెద్దగా పెరిగినట్లు అది తమ ఘనతగా చెప్పుకుంటున్న చోట అనుకున్నదానిలో వచ్చిన పెట్టుబడి 38శాతం కాగా ఉపాధి పెరిగింది కేవలం నాలుగు శాతమే. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పెట్టుబడులు 4.89శాతం కాగా పెరిగిన ఉపాధి 0.39శాతమే. (ఇండియా కేబుల్ విశ్లేషణ 2022 నవంబరు 14) అందుకే పెట్టుబడులు వచ్చి ఉపాధి రహిత వృద్ధి జరిగితే జిడిపి పెరిగినా జనానికి వచ్చేదేమీ ఉండదు.
అందుకే ఈ అంశాల గురించి జుమ్లా కబుర్లు చెబితే జనం నమ్మరు గనుక బిజెపి నేతలు కొత్త కబుర్లు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి గురించి కొత్త రికార్డులు నమోదౌతున్నా, వీటిని గురించి పట్టించుకోకుండా ఇతర అంశాల గురించి మాట్లాడేవారిని ఏమనాలి ? 2024 జనవరి ఒకటి నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం సిద్దం అవుతుందని ఆ రోజునే దర్శనం చేసుకొనేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్ షా చెబుతారు. గతంలో కాశీని చూసేందుకు ఏడాదికి కోటి మంది వచ్చే వారని, కాశీ విశ్వనాధ్ ధామ్ అభివృద్ధి తరువాత ఒక్క గత శ్రావణమాసంలోనే కోటి మంది వచ్చారని, అదే మాదిరి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైన తరువాత పది రెట్లు పెరుగుతారని, ఆధ్యాత్మిక టూరిజాన్ని వృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్ సిఎం ఆదిత్య నాధ్ ఊరిస్తున్నారు. లక్షల కొలది ఉద్యోగాలను సృష్టిస్తామని, అందుకు గాను ఫలానా పధకాలు ఫలానా తేదీలోగా ఉనికిలోకి వస్తాయని చెప్పాల్సిన వారు పూజలు పునస్కారాలు, దేవుళ్ల సందర్శనకు వసతులు కల్పిస్తామంటున్నారు. రోడ్లు, మురుగు కాలవల వంటి అల్ప అంశాలను వదలి లవ్ జీహాద్ మీద కేంద్రీకరించాలని కర్ణాటకలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్ కుమార్ నిరంజన్ సెలవిస్తారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే పండ్లు కాస్తాయి. వీరంతా దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన గుజరాత్ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్ కబుర్లు ఎక్కడా వినిపించటం లేదిప్పుడు, ఎందుకంటారు ? ఆధ్యాత్మిక టూరిజం గురించి ఒక వైపు కబుర్లు చెబుతూ మరోవైపు ఝార్కండ్ ప్రభుత్వం తలపెట్టిన ఆధ్యాత్మిక టూరిజాన్ని సంఘపరివార్ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి సర్కార్ లేదు. ఇరవై నాలుగుమంది జైన తీర్ధంకరులలో ఒకరైన( 23వ) పార్శ్వనాధ్ గిర్ధ్ జిల్లాలోని షిఖర్జీ పర్వతంపై మోక్షం పొందినట్లు చెబుతారు. జైనులకు అదొక పుణ్యస్థలం. ఆ ప్రాంతంలో టూరిజం వద్దని జైనులు అంటున్నారు, దానికి బిజెపి మద్దతు ఇస్తున్నది.అయోధ్యలో వారే అమలు చేస్తారు, మరొక చోట వద్దంటారు. రాజకీయంగాకపోతే ఏమిటి ?
రానున్న ఏడు సంవత్సరాల్లో 7లక్షల కోట్లకు చేరనున్న జిడిపి అంటూ మరొక వార్త. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ చెప్పిన అంశాల ఆధారంగా వచ్చింది. 2023 మార్చి ఆఖరుకు మన జిడిపి 3.5లక్షల డాలర్లు ఉంటుందని, వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఇది అసాధ్యం కాదని మర్చంట్స్ ఛాంబర్ (ఎంసిసిఐ) సమావేశంలో నాగేశ్వరన్ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. అందువలన ఎంత పెరిగితే ఏమి లాభం ! దేశంలోని పది మంది ధనికుల చేతుల్లో దేశ జిడిపిలో 11శాతం విలువగల సంపద ఉంది. ఫిన్‌బోల్డ్ అనే సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం ప్రకారం 2022 డిసెంబరు నాటికి పది మంది సంపద 387 బిలియన్ డాలర్లు లేదా రు.31.64లక్షల కోట్లు. దేశ జిడిపి అక్టోబరు నాటికి 3.47 లక్షల కోట్ల డాలర్లని ఐఎంఎఫ్ అంచనా వేసింది, దీనిలో 11.16శాతం పది మంది చేతిలో ఉంది. తొలి ఐదు స్థానాల్లో ఉన్నవారి వివరాలు దిగువన చూడవచ్చు.
ధనికుడి పేరు ×××× సంపద బి.డాలర్లు
గౌతమ్ అదానీ ××× 132.79
ముఖేష్ అంబానీ ×× 96.5
సైరస్ పూనావాలా×× 24.88
శివ నాడార్ ××××× 22.58
దమాని(డి మార్ట్) ×× 21.25
సంపదలు ఇలా కొద్ది మంది వద్ద పోగుపడుతూ ఉంటే దేశ ఆర్థిక, సామాజిక వృద్ధి కుంటుపడుతుందని, అనేక అనర్ధాలకు దారితీస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నా సంపదలు పోగుపడటాన్ని మన పాలకులు అనుమతిస్తున్నారు.ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంపదల అంతరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. సంపదలు ఇలా పెరగటానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. సంపద పెరిగిన కొద్దీ పన్నులు పెంచాల్సి ఉండగా తగ్గించటం వాటిలో ఒకటి. ఉపాధి లేకపోవటం, ఉన్నవారికి కూడా వేతనాలు తక్కువగా ఉండటం, సామాజిక భద్రత లేకపోవటం, విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించటం వంటి అంశాలన్నీ సంపదల అసమానతలను పెంచుతున్నాయి. వాటిని తగ్గించేందుకు చేసిందేమీ లేదు.
వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అనే కితాబుకు భారత్ దూరం అన్నది మరొక వార్త. దేశంలో డిమాండ్ తగ్గిన కారణంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7శాతానికి తగ్గుతుందని ప్రభుత్వమే పేర్కొన్నది. ఈ కారణంగా వేగంగా వృద్ది చెందున్న భారత్ అనే పేరుకు దూరం కానుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే తక్కువగా ఆర్‌బిఐ 6.8శాతమే ఉంటుందని చెప్పింది. గతేడాది 8.7శాతం ఉంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో 7.6 శాతం ఉంటుదని అంచనా వేస్తున్నందున అది మొదటి స్థానంలో ఉంటుంది.ద్రవ్యోల్బణం కారణంగా వర్తమాన సంవత్సరంలో నిజవేతనాల్లో పెరుగుదల లేకపోవటం లేదా కొన్ని నెలల్లో తిరోగమనంలో కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు బిజెపి నేతలెవరూ ఏం చేసేదీ చెప్పరు.
ఆర్థికవేత్తలు లేదా వారు పని చేస్తున్న సంస్థలు వేసే అంచనాలు, చెప్పే జోశ్యాల తీరు తెన్నులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అమెరికాలోని కార్నెగీ సంస్థ 2009లో ఒక అంచనాను ప్రపంచం ముందుంచింది. దాని ప్రకారం 2009లో 1.1లక్షల కోట్లడాలర్లుగా ఉన్న భారత జిడిపి 2050 నాటికి 17.8 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అదే కాలంలో చైనా జిడిపి 3.3 నుంచి 45.6లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండవ స్థానంలో ఉండే అమెరికాలో 39లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. పైన పేర్కొన్న సిఇబిఆర్ సంస్థ అంచనా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక లక్ష కోట్ల డాలర్ల జిడిపి పెరుగుతుందనుకుంటే ఆ ప్రకారం చూసినా 2035 తరువాత పదిహేను సంవత్సరాలో ఏడులక్షల కోట్లు పెరిగితే దీని అంచనా ప్రకారం కూడా 17-18లక్షల కోట్లకు పరిమితం అవుతుంది. ఇక ముకేష్ అంబానీ పండిట్ దీన దయాళ్ ఇంథన విశ్వవిద్యాలయ సభలో చెప్పినదాని ప్రకారం 2047 నాటికి( నూరేళ్ల స్వాతంత్య్రం) ఇప్పుడున్న 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40లక్షల కోట్లకు పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆసియా ధనికుడు గౌతమ్ అదానీ 2050 నాటికి 30లక్షల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పన్నెండు – పద్దెనిమిది నెలలకు ఒక లక్ష కోట్ల వంతున పెరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ప్రముఖులు ఇంత తేడాగా ఎలా చెబుతారు ?
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని, చైనా జనాభా ఇప్పుడున్న 140 కోట్ల నుంచి 130 కోట్లకు తగ్గుతుందని చెబుతున్నారు.( ఈ ఏడాదే చైనాను వెనక్కు నెట్టి మన దేశం పెద్ద దేశంగా మారనుంది) పని చేసే శక్తి కలిగిన జనాభా భారత్‌లో పెరుగుతున్నందున ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా తెగతెంపులు చేసుకోనున్నాయని, తరువాత సరఫరా గొలుసులో చైనా లేకపోతే భారత్ లబ్దిపొందుతుందని చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ ఐఫోన్ 14ను భారత్‌లో తయారు చేయటాన్ని దానికి రుజువుగా చూపుతున్నారు. నరేంద్రమోడీ జి20 బాధ్యతలు చేపట్టినందున అమెరికా, చైనా, భారత్ మూడు ధృవాల ప్రపంచ వ్యవస్థకు ఈ ఏడాది నాంది అవుతుందని కొందరు చెప్పటం ప్రారంభించారు.(2024లోక్‌సభ ఎన్నికలకు జి20 సారధ్యాన్ని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చేస్తున్న యత్నాలను చూసి మెప్పు పొందేందుకు కూడా అలా చెప్పవచ్చు.)
మన ఎగుమతులు తగ్గటం, దిగుమతులు పెరగటంతో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్న అంశం పాలకులకు పట్టినట్లు లేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2022లో మన వస్తు దిగుమతులు 54.7శాతం పెరిగి 610 బి.డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్-నవంబరు మాసాల్లో 494 బి.డాలర్లు కాగా అదే కాలంతో గతేడాది 381బి.డాలర్లు మాత్రమే. ఇక వాణిజ్యలోటు ఏప్రిల్-నవంబరు మధ్య 115.39 నుంచి 198.35 బి.డాలర్లకు చేరింది. ఈ ఏడాది 700బి.డాలర్లు దాటవచ్చని అంచనా.దాన్ని బట్టి లోటు ఎంత ఉండేది అప్పుడే చెప్పలేము. స్వయం సమృద్ధి – ఆత్మనిర్భరత, ఎగుమతి- దిగుమతులు ఉపాధి కల్పన ఫలితాల గురించి చెప్పకుండా జనాలకు రామాలయం గురించి అమిత్ షా చెబుతున్నారు.
చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. లావాదేవీల్లో సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు పాటించాలి తప్ప, మన దేశానికి చైనాకు ఎగుమతులు-దిగుమతుల కోటా గురించి ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలేమీ లేవు. చైనాకు ధీటుగా ఐఫోన్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెబుతున్న వారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర వస్తువులను నిలిపివేసి ఇక్కడే ఎందుకు తయారు చేయటం లేదు ? విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు ? స్వదేశీ జాగరణ మంచ్ ఇటీవల ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు. చైనా నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ ఏటా తన రికార్డులను తానే బద్దలు కొడుతుంటే ఏమి చేస్తున్నట్లు ? చైనా యాప్‌ల రద్దు హడావుడి చేస్తే సరిపోతుందా ? మన ఉపాధిని ఫణంగా పెట్టే దిగుమతి లాబీకి ఎందుకు లొంగిపోతున్నట్లు ? 2021-22లో తొలి ఎనిమిది నెలల్లో అక్కడి నుంచి 59.17 బి.డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 67.92 బి.డాలర్లకు పెంచారు . చైనా వస్తువులు నాసిరకం అని ప్రచారం చేస్తారు, అదే నిజమైతే అలాంటి వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసి మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చైనాకు ఎందుకు కట్టబెడుతున్నట్లు ? మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులకు పదో ఏడు వస్తున్నది. వాటి అమలుకు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడలేదే ! వాటి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు ?