Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


లడక్‌ సరిహద్దులో గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా పెట్టుబడులను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్రమోడీ చైనా దిగుమతులను కూడా అడ్డుకుంటారని అనేక మంది కాషాయ దేశభక్తులు నిజంగానే ఆశించారు, భ్రమించారు, కోరుకున్నారు. మోడీ వారి మనో భావాలను దారుణంగా దెబ్బతీశారు. చైనాతో వాణిజ్య లావాదేవీలను వంద బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఆశించిన మన్మోహన్‌ సింగ్‌ అది నెరవేరకుండానే గద్దె దిగారు. మన్మోహన్‌ సింగ్‌ వైఫల్యాలను, మౌనాన్ని ఎండగట్టి రాజకీయంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీని ఒకందుకు ” అభినందించక ” తప్పదు. చైనాతో లావాదేవీలను వంద బి.డాలర్లు దాటించి ఒక రికార్డు నెలకొల్పారు. తాజాగాచైనాతో వాణిజ్య లోటును కూడా ఏకంగా వంద బి.డాలర్లు దాటించి సరిలేరు నాకెవ్వరూ అన్నట్లుగా మౌన గీతాలు పాడుతున్నారు. కాకపోతే ఈ ఘనత గురించి బిజెపితో సహా ఎవరూ ఎక్కడా చెప్పరు, టీవీలు చర్చలు జరిపి ఆహౌ ఓహౌ అన్న వాతావరణం కల్పించవు. మోడీ నోరు విప్పరు. ఇదేం నిర్వాకం బాబూ అని బిజెపి ప్రతినిధులను అడిగితే సరిహద్దు వివాదాలకూ మిగతా వాటికి లంకెలేదు, వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా చేసుకోక తప్పదు కదా అంటారు. ఇదొక జుమ్లా, తప్పించుకొనే మోసకారి వాదన.


తాజాగా చైనా జనవరి 13న విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 2022(వారి లెక్క జనవరి నుంచి డిసెంబరు )లో 135.98 బి.డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 125 బి.డాలర్లుంది. అఫ్‌ కోర్సు ఈ లెక్కలు తప్పని ” దేశభక్తులు ” చెప్పినా ఎవరూ చేసేదేమీ లేదు. చైనా నుంచి దిగుమతులు 118.5 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 17.48 బి.డాలర్లు. నిఖరంగా మనం 101.02 బి.డాలర్లు చైనాకు సమర్పించుకున్నాం.2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరిగింది. ఏ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ దిగుమతులు చేసుకుంటున్నారో, ఏటేటా పెంచుతున్నారో ఎవరైనా చెప్పగలరా ? ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలూ సభ్యులుగా ఉన్నందున లావాదేవీలు జరిపినపుడు దాని నిబంధనలను పాటించాల్సిన విధి తప్ప మరొక లంపటం ఎవరికీ లేదు. దాని వెలుపల ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న మాదిరి ద్విపక్ష ఒప్పందాలు కూడా లేవు.చైనాలోని మన దేశ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో లావాదేవీల గురించి తప్ప ఫలానా ఒప్పందం ప్రకారం పెరుగుతున్నట్లు ఎక్కడా ఉండదు.మన దేశం చైనాతో సహా 38 దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరుపుతున్నది తప్ప ఇంకా ఖరారు చేసుకోలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది కలలు కన్నారు. అనేక చైనా వస్తువుల మీద మన దేశం ఆంక్షలు విధించింది. టీవీలు, పాదరక్షలు, బొమ్మలు, ఫర్నీచర్‌ వంటి 89 వస్తువులపై దిగుమతి పన్నులు పెంచి నిరుత్సాహపరచింది. యాప్స్‌పై నిషేధం సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాకుండా చూస్తున్నది. మరి ఒప్పందాలు ఉంటే ఈ ఆంక్షలు ఎలా పెట్టినట్లు ?


గాల్వన్‌ ఉదంతాల తరువాత మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం మనతో భూ సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమీక్షించి అనుమతి ఇచ్చిన తరువాతనే స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అలాంటి సరిహద్దులున్న దేశాల్లో ఒక్క చైనా తప్ప గతంలో మన దేశంలో పెట్టుబడి పెట్టిన వారెవరూ లేరు గనుక ఆ నిబంధన చైనాను లక్ష్యంగా చేసిందే అన్నది స్పష్టం. చైనా నుంచి తెచ్చుకోవాలని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కోరలేదు. చైనాతో సహా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నింటి నుంచి నిబంధనలను పాటించిన మేరకు ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. మూడో దేశం నుంచి వచ్చే చైనా పెట్టుబడులను అడ్డుకొనే అవకాశం లేదు. స్టాటిస్టా వెబ్‌సైట్‌ సమాచారం మేరకు 2015లో గరిష్టంగా మన దేశానికి చైనా నుంచి వచ్చిన పెట్టుబడులు 70.525 కోట్ల డాలర్లు. తరువాత 2019లో 53.46 కోట్లకు తగ్గాయి. ఆంక్షలు విధించిన తరువాత 2020లో20.519 కోట్లకు, 2021లో 29.946 కోట్ల డాలర్లకు తగ్గాయి.2022 జూన్‌ 29 నాటికి 382 ప్రతిపాదనలు రాగా చైనాతో సంబంధమున్న 80కి అంగీకారం తెలిపారు. 2014నుంచి 2019 వరకు ఏటా సగటున 36 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా 2021-22 ఆరు నెలల్లో 3.6 కోట్లకు తగ్గాయి.


ఒక గణతంత్ర దేశంగా మనం ఎలాంటి నిబంధనలైనా పెట్టుకోవచ్చు, అమలు జరపవచ్చు. పెట్టుబడుల సూత్రాన్నే దిగుమతులకు వర్తింప చేసి అనుమతులు ఇచ్చిన తరువాతే లావాదేవీలు జరపాలన్న నిబంధన ఎందుకు పెట్టలేదు అన్నది సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న.ఒప్పందాల ప్రకారమే మనం రికార్డులను బద్దలు కొడుతూ చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అని చెబుతున్నవారు అదే ఒప్పందం ప్రకారం చైనా మన దేశం నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటంలేదు, ఆ మేరకు మన ప్రభుత్వం ఎందుకు డిమాండ్‌ చేయటంలేదో చెప్పాలి కదా ! 2022లో మొత్తం చైనా వాణిజ్య మిగులు 877.6 బి.డాలర్లు అంటే దానిలో మన వాటా 101 బి.డాలర్లు (11.5శాతం) ఉంది. ఇక చైనా ఆర్థికం అంతా దిగజారింది, ఇబ్బందుల్లో ఉంది అని చెబుతున్నవారు నమ్మినా నమ్మకున్నా వృద్ది వేగం తగ్గింది తప్ప తిరోగమనంలో లేదు.2021లో 3.548 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు చేస్తే 2022లో అది 3.95 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.


1962లో సరిహద్దు వివాదం తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.1988లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత 1993లో సరిహద్దులో శాంతి సామరస్యాల గురించి జరిగిన ఒప్పందం, 2003లో వాజ్‌పాయి పర్యటనతో మరొక అడుగు ముందుకు వేసి మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వాణిజ్యంతో సహా వివిధ రంగాలకు సంబంధించి చైనాతో అనేక డజన్ల సాధారణ ఒప్పందాలున్నాయి. మానస సరోవర యాత్రకు నాథూలా మార్గాన్ని తెరవటం వాటిలో ఒకటి. ఏ ప్రధానీ కలవన్ని సార్లు నరేంద్రమోడీ వివిధ సందర్భాల్లో చైనా నేతలతో భేటీ కావటం కూడా ఒక రికార్డుగా ఉంది. రాజీవ్‌ గాంధీ పర్యటనకు,చైనాలో సంస్కరణలకు తెరలేపక ముందే ఐరాస చొరవతో 1975లో ఆసియా-పసిఫిక్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాన్నే బాంకాక్‌ ఒప్పందం అంటారు.దానిలో చైనా, మనం ఇతర దేశాలు భాగస్వాములు. ఈ దేశాల మధ్య ప్రాధాన్యత ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా దానిలో ఉంది.2005లో ఒప్పంద దేశాల మంత్రుల మండలి సమావేశం బీజింగ్‌లో జరిగింది. సవరించిన పన్నుల తగ్గింపు చర్చలకు మరుసటి ఏడాది ఒక రూపం వచ్చింది. దాన్ని మరింతగా విశదీకరించి ఖరారు చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక రూపానికి రాలేదు. అప్పుడే చైనా -భారత్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఏడిబి చొరవతో చర్చలు జరిగాయి.ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థ వెబ్‌సైట్‌లో 2022 జనవరి నాలుగవ తేదీ నాటికి నవీకరించిన సమాచారం ప్రకారం చైనాకు వంద దేశాలతో వివిధ ఒప్పందాలుండగా 17 దేశాలు, బృందాలతో మాత్రమే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలున్నాయి. వీటిలో మన దేశం లేదు. ఇవిగాక 2022 నుంచి అమల్లోకి వచ్చిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో తొలుత మన దేశం చేరేందుకు అంగీకరించినా తరువాత దూరంగా ఉంది. దీనిలో చేరితే మన ఎగుమతులకు బదులు ఇతర దేశాల నుంచి దిగుమతులు మరింతగా పెరుగుతాయని, అది మన పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి దెబ్బ అని చెప్పిన అంశం తెలిసిందే. ఒప్పందంలో చేరిన దేశాలు దిగుమతుల మీద పన్నులు తగ్గించాల్సి ఉంటుంది.దాంతో చైనా నుంచి మరింతగా దిగుమతులు పెరుగుతాయని మన కార్పొరేట్లు హెచ్చరించాయి. ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దాని ప్రకారం రెండు దశాబ్దాలలో పూర్తిగా పన్నులను రద్దు చేస్తారు.


కార్పొరేట్‌ లాబీకి లొంగి మన దేశంలో దొరికే వాటిని కూడా మోడీ సర్కార్‌ దిగుమతి చేసుకుంటున్నది.ఇప్పటికి వెల్లడైన సమాచారం మేరకు మన దేశంలో 319.02 బిలియన్‌ టన్నుల బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఒక బిలియన్‌ టన్నులు కూడా మనం వెలికి తీయటం లేదు. కానీ దరిద్రం ఏమిటంటే గత పాలకుల విధానాలను తప్పు పట్టిన నరేంద్రమోడీ అదే బాటలో నడుస్తూ మన దగ్గర బొగ్గు తవ్వకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఉత్తరువులు జారీ చేసిన అపరదేశ భక్తి పరుడిగా రుజువు చేసుకున్నారు. మన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పదిశాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత దాని మీద వచ్చిన విమర్శలను తట్టుకోలేక తరువాత వెనక్కు తగ్గారు. ఇదంతా ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్న అదానీ కోసం అన్నది తెలిసిందే. మన బొగ్గును మనం తవ్వుకుంటే ఉపాధి కల్పనతో పాటు డాలర్లూ మిగులుతాయి. నరేంద్రమోడీకి ఈ మాత్రం తెలియదని అనుకొనేంత అమాయకులెవరూ లేరు.


చైనా నాసిరకం వస్తువులను తయారు చేస్తుందన్నది ఒక ప్రచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లన్నింటా నాసిరకం కొంటున్నారా ? తక్కువ ధరలకు వస్తువులను సరఫరా చేస్తున్నందున అలాంటి అభిప్రాయంతో పాటు చైనా బజార్ల పేరుతో మన దేశంలో తయారు చేసిన నకిలీ వస్తువులను అమ్మిన కారణంగా అనేక మంది అలా అనుకోవచ్చు. ఒక వేళ నిజంగానే చైనా సరకులు నాసి అనుకుంటే మన విలువైన విదేశీమారకద్రవ్యాన్ని ఫణంగా పెట్టి ఆ సరకులను దిగుమతి చేసుకొని మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? నిజానికి చైనా నుంచి ఇప్పుడు మనం రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతి చేసుకుంటున్న వస్తువులేవీ ఇతర దేశాల్లో దొరకనివి కాదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారంటే కార్పొరేట్‌ లాబీ వత్తిడికి మోడీ సర్కార్‌ తలవంచటమే, అది చెప్పినట్లు వినటమే. అవే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉండటమే అసలు కారణం. ఆ సంగతిని అంగీకరించటానికి ముందుకురారు. మరోవైపున కాషాయదళాలు మాత్రం నిరంతరం చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ కొంత మంది మనోభావాల సంతుష్టీకరణ, మరికొందరిని తప్పుదారి పట్టిస్తుంటాయి.