Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


2023లో 858 బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని పెంటగన్‌ (అమెరికా రక్షణ శాఖ ) నిర్ణయించింది. ఇది అడిగినదానికంటే 45 బి.డాలర్లు అదనం. నిజానికి 1200బి.డాలర్లు ఖర్చు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజు తలచుకోవాలే గానీ దెబ్బలకు కొదవా అన్నట్లుగా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు కనుసైగ చేయాలేగానీ అమెరికా పాలకులు డాలర్లతో వాలిపోతారు. స్టాక్‌హౌం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రీ) గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో తొలిసారిగా ప్రపంచ రక్షణ ఖర్చు రెండు లక్షల కోట్ల డాలర్లు (2,113 బి.డాలర్లు) దాటింది. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా వాటా మొత్తంలో 62శాతం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు లేదా బాధితులను ఆదుకొనేందుకు చేసిన ఖర్చు సంగతేమో గానీ వరుసగా ఏడేళ్లు , కరోనాలో ఆర్థిక రంగం దిగజారినప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం మిలిటరీ ఖర్చు మాత్రం పెరిగింది.


అమెరికాలో 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. సాంకేతికంగా ఇతర దేశాల కంటే పైచేయిగా ఉండాలన్న వైఖరితో ఏటా భారీ ఎత్తున పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. రష్యా నుంచి ప్రధానంగా ఎగుమతి జరిగే చమురు ధరలు తక్కువగా ఉండి రాబడి తగ్గటంతో 2016 నుంచి 2019 వరకు దాని మిలిటరీ ఖర్చు కూడా తగ్గింది. అయితే, అమెరికా, ఇతర నాటో దేశాల కుట్రలను పసిగట్టి తరువాత ఉక్రెయిన్‌ సరిహద్దులో మిలిటరీని పెంచటంతో ఖర్చు కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2021లో ఖర్చు పెరిగినందున 65.9బి.డాలర్లకు చేరింది. గతేడాది 75, ఈ ఏడాది 84బి.డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెండవ స్థానంలో ఉన్న చైనా ఖర్చు 293 బి.డాలర్లుంది. గత 27 సంవత్సరాలుగా వరుసగా పెరుగుతూనే ఉంది.76.6 బి.డాలర్లతో మన దేశం మిలిటరీ ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. ఇటీవల జపాన్‌ భారీ మొత్తాలను పెంచటంతో మనలను వెనక్కు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించనున్నట్లు వార్తలు. 2021లో 50 బి.డాలర్లకు మించిన ఖర్చు ఉన్న దేశాలు వరుసగా అమెరికా(801), చైనా (293), భారత్‌ (76.6), బ్రిటన్‌ (68.4), రష్యా (65.9), ఫ్రాన్స్‌ (56.6), జర్మనీ (56), సౌదీ అరేబియా (55.6), జపాన్‌(54.1), దక్షిణ కొరియా (50.2) ఉంది.
అమెరికాతో సహా ప్రత్యేకించి చైనాను దెబ్బతీసేందుకు చూస్తున్న దేశాలు దాన్నొక బూచిగా చూపుతూ తమ ఖర్చును పెంచుతున్నాయి.

ఏ దేశమూ మరో దేశాన్ని నమ్మే పరిస్థితి లేనందున మిలిటరీ నవీకరణకు తప్పనిసరిగా కొంత ఖర్చు పెరగటం సహజం. అమెరికా, ఐరోపాలోని ప్రయివేటు రంగంలోని ఆయుధ కంపెనీల లాభాలను పెంచేందుకు వివిధ ప్రాంతాలలో చిచ్చు రేపుతున్నందున, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేక దేశాలు ఖర్చును పెంచాల్సి వస్తోంది. రెండవ అంశమే ప్రధానంగా పని చేస్తోంది. ప్రపంచాన్ని భయ పెట్టేందుకు, తన పెత్తనాన్ని రుద్దేందుకు అవసరం లేకున్నా తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తరువాత కాలంలో ప్రపంచమంతటా అణ్వాయుధాల తయారీ, ఇతర వాటికి పదును పెట్టే, సేకరణ పోటీకి తెరతీసింది. సోవియట్‌ యూనియన్ను బూచిగా చూపి రక్షణ పేరుతో నాటో కూటమిని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్నే ఏకంగా తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మిలిటరీ శక్తితో చైనా, ఇండో-చైనా దేశాలను ఆక్రమించుకున్నది జపాన్‌.అది రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిన తరువాత దాని మీదకు ఎవరో దాడికి రానున్నట్లు బూచిగా చూపి రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పిటలోకి తీసుకున్నదీ అమెరికానే. ఇప్పుడు చైనాను బూచిగా చూపి ఇతర దేశాలను తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే కొత్త కథలు అల్లుతోంది.


చైనా దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల అణ్వాయుధాలు 2035 నాటికి 1,500కు పెరుగుతాయని, అందువలన దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పెంటగన్‌ అందరినీ ఉసిగొల్పుతోంది. అంతే కాదు, అమెరికాలోని ఆయుధ పరిశ్రమల కోసం కూడా మీడియాలో కట్టుకథలను అల్లించటం, వాటిని చూపి బడ్జెట్‌ను పెంచాలని వత్తిడి తేవటం అమెరికాలో అనేక మంది అధికారుల, ఎంపీల రోజువారీ వృత్తి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర 13,080 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇక అణువిద్యుత్‌ కేంద్రం ఉన్న ప్రతి దేశం వాటిని ఏ క్షణంలోనైనా రూపొందించగల సత్తా కలిగినదిగా పరిగణిస్తున్నారు. రష్యా వద్ద 6,257 అణ్వస్త్రాలు ఉంటే వాటిలో తక్షణమే దాడికి పనికి వచ్చేవి 1,458, అందుబాటులో ఉన్నది 3,039, పనికి రానివి 1,760గా చెబుతున్నారు. ఆ తరువాత అమెరికా వద్ద ఇలాంటివే వరుసగా 5,550-1,389-2,361-1,800 ఉన్నట్లు అంచనా. వీటితో పోలిస్తే చైనా ఒక మరుగుజ్జు మాదిరి ఉంటుంది. ఇక దేశాల వారీగా చైనా వద్ద 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, పాకిస్థాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు ఉన్నట్లు అంచనా. ఈ అంచనాలు, సంఖ్యలను ఎవరూ పూర్తిగా నిర్ధారించలేరు. అవసరమైతే ఎప్పటికప్పుడు రూపొందిందే ఆధునిక పరిజ్ఞానం అమెరికా, రష్యా వద్ద ఉంది. ఇప్పుడు చైనాను చూపి మరింతగా మిలిటరీ ఖర్చు ఎందుకు చూపుతున్నట్లు అన్నది ప్రశ్న.


ఏడాదికి ఒక సారో రెండుసార్లో ఎవరైనా కొనుగోలు చేసి కాల్చగల దీపావళి బాంబుల వంటివి కాదుఅణ్వాయుధాలు. వాటి రూపకల్పనకు ఖర్చైన మాదిరే నిర్వీర్యం చేసేందుకు కూడా చేతి సొమ్ము వదిలించుకోవాల్సిందే. అమెరికా తప్ప ఇంతవరకు ఏ దేశమూ వాటిని ప్రయోగించలేదు.అలాంటి పని చేస్తే ఏ దేశమూ మిగలదు.భారత్‌కు పాకిస్థాన్‌ ఎంత దూరమో పాకిస్థాన్‌కూ భారత్‌ అంతే దూరం. అదే విధంగా ఇతర అణుశక్తి దేశాలూ కూడా. ఎవరు అస్త్రాన్ని వదిలినా వెంటనే మరొకరు సంధిస్తారు. కట్టుకథలు, పిట్టకతలను ఆకర్షణీయంగా మలచటం తప్ప వాటిలో హేతుబద్దత కనిపించదు. ఉదాహరణకు గతేడాది నవంబరు 29న సిఎన్‌ఎన్‌ ఒక వార్తను అల్లింది. దాని ప్రకారం చైనా వద్ద 2020లో రెండువందల అణ్వాయుధాలుండగా 2022 నాటికి 400కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేగానికి అనుగుణంగా 2035 నాటికి 1,500కు పెరగవచ్చని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు పెరిగితే పదమూడు సంవత్సరాల్లో 12,800కు చేరతాయి.అది జరిగేదేనా ? ఈ లోగా ఇతర దేశాలు చేతులు ముడుచుకు కూర్చుంటాయా ? ఇలాంటి అంకెలకు ఆధారం ఏమిటి ?


అణ్వాయుధాలంటే ఫాక్షనిస్టులు ఇండ్ల దగ్గర నాటు బాంబులను చుట్టినట్లు కాదు. అవసరమైన యురేనియం,ప్లుటోనియం కోసం అణురియాక్టర్లు, శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగాలి.దానికోసం ఎంతో ఖర్చు అవుతుంది. అనేక దేశాలు విద్యుత్‌ వంటి పౌర అవసరాల కోసం అణుకేంద్రాల నిర్మాణం చేస్తున్నాయి. అక్కడే అణ్వాయుధాల రూపకల్పనకు అవసరమైన గ్రేడ్ల యురేనియం,ప్లుటోనియం కూడా తయారు చేయవచ్చు.విద్యుత్‌ కోసం చైనాతో సహా అనేక దేశాలు అణుకేంద్రాల నిర్మాణం చేపట్టాయి. మన దేశంలో 22 రియాక్టర్లు, ఎనిమిది విద్యుత్‌ కేంద్రాలున్నాయి. మరో పది రియాక్టర్లు, విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణం,ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెంటగన్‌ నివేదికల్లో చెప్పినవన్నీ ప్రమాణాలు కాదు. ఊహాగానాలు, ఆధారం లేని ఆరోపణలు అనేకం ఉంటాయి. మూడు వందల ఖండాంతర క్షిపణుల(ఐసిబిఎం)ను ప్రయోగించేందుకు అవసరమైన నిర్మాణాలను చైనా జరుపుతోందన్నది దానిలో ఒకటి. దీనికి ఎలాంటి ఆధారం లేదని అమెరికా పత్రికలే రాశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ సంస్థకు చెందిన వారు చైనా వద్ద కేవలం 110 మాత్రమే ఖండాంతర క్షిపణులున్నట్లు, బహుశా దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా కలుపుకొని 300 సంఖ్య చెప్పి ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా1960 దశకం నుంచి ఐసిబిఎం, అణుక్షిపణి జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లను సమన్వయం చేస్తున్న విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వీటిని మరింత నవీకరించేందుకు 1.8లక్షల కోట్ల డాలర్లతో ఒక పధకాన్ని ప్రారంభించారు. చైనా కూడా ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తున్నదనే అనుమానం పెంటగన్‌కు ఉండి, చీకట్లో బాణాలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ దేశానికైనా తన జాగ్రత్తలో తానుండే హక్కు, అవకాశం ఉంది.


అణుక్షిపణుల జలాంతర్గాములతో 1959 నుంచే అమెరికా పహారా కాస్తున్నది. చైనా వద్ద ఉన్న అలాంటి జలాంతర్గాములు 2021 నుంచి పని చేస్తున్నట్లు అంచనా. అమెరికా వద్ద 11,840 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేరుకొనే జలాంతర్గాములు క్షిపణులు ఉండగా చైనా వద్ద 6,880 కిమీ దూరం వెళ్లే క్షిపణులున్నట్లు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం వాస్తవం చైనా అంటే చౌక ధరలకు అందించే పాదరక్షలు, దుస్తులు,ఫోన్లు, టీవీల వంటి వినియోగవస్తువులను మాత్రమే భారీ ఎత్తున తయారు చేయగలదని అనేక మంది ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. బొమ్మ విమానాలు, దీపావళి తారాజువ్వలనే కాదు నిజమైన వాటిని రూపొందించగల సత్తా సమకూర్చుకుంది. చైనాలో గుట్టు ఎక్కువ. రోజువారీ వస్తువులతో పాటు తనను దెబ్బతీసేందుకు చూసే వారికి దడపుట్టించే ఆధునిక అస్త్రాలను కూడా అది ఇప్పుడు కలిగి ఉంది. అమెరికాకు పట్టుకున్న భయాలలో అదొకటి. ఇటీవల తైవాన్‌ జలసంధిలో అలాంటి వాటిని చైనా ప్రదర్శించింది.


2023లో జర్మనీతో సహా నాటో దేశాలన్నీ రక్షణ ఖర్చును భారీ ఎత్తున పెంచనున్నాయి. వాటి జిడిపిలో రెండు శాతం అందుకు కేటాయించాలని, నాటో ఖర్చును తామెంత కాలం భరించాలంటూ, ఒక వేళ రష్యా గనుక దాడి చేస్తే రక్షణకు తాము వచ్చేది లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు బహిరంగంగానే వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ నేపధ్యంలో భారీగా పెంచుతున్నప్పటికీ పెంటగన్‌ వాటిని లోక కల్యాణం కోసం అన్నట్లుగా చూస్తున్నది. జిడిపిలో రెండు శాతం అన్న దానికి అనుగుణంగా ప్రత్యేక ఆయుధ నిధి కోసం తాము 106బి.డాలర్లు ఖర్చు చేస్తామని గతేడాది ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన మూడు రోజుల తరువాత జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు.జర్మనీ ఆయుధ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవటంతో పాటు, అమెరికాను సంతుష్టీకరించటం నాటోలో అమెరికా తరువాత పెత్తనం తనదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్థికంగా దిగజారి ఉన్నందున బ్రిటన్‌ ఖర్చు పెంచే స్థితిలో లేదు. జపాన్‌ మాదిరే ఇటీవలి కాలంలో జర్మనీ తన ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నది. తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌,ఫిన్లండ్‌ కూడా నాటోలో చేరి మిలిటరీ ఖర్చును పెంచనున్నాయి. పోలాండ్‌ కూడా ఖర్చు పెంచేందుకు పూనుకుంది.ఇవన్నీ జరిగితే సింహభాగం అమెరికా సంస్థలే లబ్ది పొందుతాయి.


భారీ ఎత్తున పెంచిన పెంటగన్‌ బడ్జెట్‌తో సంతృప్తి చెందని మిలిటరీ కార్పొరేట్ల కనుసన్నలలో నడిచే ఎంపీలు, అధికారులు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ సలహాదారు మెక్‌ మాస్టర్‌ పన్నెండువందల బి.డాలర్లు కావాలని చెప్పాడు. జపాన్‌ రెండింతలు చేసేందుకు పూనుకున్నదని దాన్ని చూసి నేర్చుకోవాలంటూ చైనాను నిలువరించేందుకు అవసరమైనదాని కంటే అమెరికా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు విమర్శించాడు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంటగన్‌ వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుందని కొందరు గుండెలు బాదుకున్నారు. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్న అమెరికాకు తోడుగా, జపాన్‌, ఆస్ట్రేలియా కూడా రక్షణ ఖర్చు పేరుతో సమీకరణ కావటం ఆందోళన కలిగించే పరిణామం.