Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ(45 ) పుట్టిన రోజు సందర్భంగా జనవరి 25న అమెరికా, జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు ఆధునిక టాంకులను అందచేస్తామని ప్రకటించాయి.ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు ఫిబ్రవరి 24నాటికి ఏడాది పూర్తి అవుతుంది. ఉక్రెయిన్‌-రష్యాలను కూర్చోబెట్టి రెండు దేశాల్లో ఉన్న భయ, సందేహాలను పోగొట్టి వివాదాన్ని పరిష్కరించి ప్రశాంతతను చేకూర్చాల్సిందిపోయి మరింత ఆజ్యం పోసేందుకు పూనుకున్నాయి. టాంకులను ఎప్పుడైతే ఇస్తామని చెప్పిన వెంటనే తమకు జెట్‌ యుద్ద విమానాలు కావాలని ఉక్రెయిన్‌ కోరటం గమనించాల్సిన అంశం. సంక్షోభంలో ఇదొక ప్రమాదకర కొత్త మలుపు. నిజానికి ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని చెప్పవచ్చు. సమీప భవిష్యత్‌లో దీన్ని ముగించే బదులు ఏ పరిణామాలకు దీన్ని తీసుకుపోతాయో అన్న ఆందోళన కలుగుతోంది.


తమ వద్ద ఉన్న అబ్రామ్‌ టాంకులను ఇస్తామని అమెరికా, లెపర్డ్‌(చిరుత పులి) రకం టాంకులను ఇస్తామని జర్మనీ కొద్ది తేడాతో ఒకే రోజు ప్రకటించాయి. జర్మనీ ఆ రకం టాంకులను ఇప్పటికే అనేక నాటో దేశాలకు సరఫరా చేసింది. ఒప్పందం ప్రకారం వాటిని మరో దేశానికి విక్రయించాలంటే జర్మనీ అనుమతి అవసరం. గత రెండు మూడు నెలలుగా ఆ మేరకు కొన్ని దేశాలు వత్తిడి తెస్తున్నాయి. తామే వాటిని ఉక్రెయిన్‌ ఇచ్చేందుకు అంగీకరించినందున మిగతా దేశాలకు సైతం అనుమతి ఇచ్చింది. అబ్రామ్‌ రకం టాంకులను అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించేశాడు. దీని వెనుక అమెరికా దుష్ట పన్నాగం గురించిన హెచ్చరికలు వినిపించాయి. జర్మనీలోని యుద్ద, ఆయుధ లాబీలను కూడగట్టుకొని అమెరికా వేసిన ఎత్తుగడలో భాగంగా జర్మనీ కూడా టాంకులను అందించేందుకు సిద్దపడిందన్నది ఒక కథనం. ఐరోపాలో తమ పెత్తనాన్ని సుస్థిరం గావించుకొనేందుకు జర్మన్‌ పాలకవర్గ పూనికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నది మరొక కథనం. జర్మనీని ముందుకు తోస్తే ఒక వేళ రష్యా ప్రతిదాడికి దిగితే తొలి దెబ్బ పడేది జర్మనీ మీదనే కనుక తన చేతికి మట్టి అంటకుండా ఐరోపాలో పెత్తనాన్ని పటిష్టపరుచుకొనేందుకు అమెరికాకు వీలుకలుగుతుంది.


సినిమాల్లో కథను రక్తి కట్టించేందుకు నాటకీయ మలుపులు తిప్పుతారు. పశ్చిమ దేశాల తీరు మొదటి నుంచీ అలాగే ఉంది. సైనిక చర్య ప్రారంభం కాగానే రష్యాతో రాజీ చర్చలంటూ తొలి అంకానికి తెరలేపారు.పరిష్కారానికి తాము మద్దతు ఇస్తున్నామంటూ సానుకూల వచనాలు పలికారు. తరువాత పడనీయకుండా కొత్త కొత్త డిమాండ్లను ముందుకు తెస్తూ సాగదీశారు.చివరకు మాటా మంతీ లేని స్థితికి నెట్టారు. ఆ తరువాత రష్యాను ఎదుర్కొనేందుకు తమకు తోడ్పడాలంటూ జెలెనెస్కీ చేసిన ప్రతిపాదనలన్నింటినీ అవి రష్యాతో వైరాన్ని పెంచేవిగా ఉన్నవంటూ ముందు పశ్చిమ దేశాలు తిరస్కరించటం తరువాత ఆకస్మికంగా మారు మనస్సు పుచ్చుకున్నట్లుగా అనివార్యమైనందున అంగీకరించాల్సి వచ్చిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాయి. దాన్లో భాగంగా నాటో దేశాలు వేలాది ఎటిజిఎం( నిర్దేశిత టాంకు విధ్వంసక క్షిపణులు), మాన్‌పాడ్స్‌(భుజాల మీద మోసుకుపోతూ విమానాలు, హెలికాప్టర్ల మీద దాడి చేసేవి)ను ఉక్రెయిన్‌కు అందచేశారు. ఇప్పుడు భారీ టాంకులను, వాటిని నడిపేందుకు అవసరమైన ఇంథనాన్ని అందచేసేందుకు కూడా నిర్ణయించాయి. ఆ ప్రకటనలు ఇంకా జనం నోళ్లలో నాను తుండగానే తమకు జెట్‌ విమానాలిచ్చి పుతిన్‌ సేనలను ఎదుర్కొనేందుకు తోడ్పడాలని ఉక్రెయిన్‌ వినతులు ప్రారంభించింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ వద్ద ఉన్న సోవియట్‌ కాలం నాటి టాంకులు, విమానాలు నిండుకుంటున్నందున కొత్త వాటిని సమకూర్చుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతిఘటనంతా పశ్చిమ దేశాల సరకు, సరంజామాతోనే. నాటో కూటమికి చెందిన మిలిటరీ ప్రత్యక్షంగా పాల్గొనదు తప్ప ఆయుధాలన్నీ దాదాపు వారివే.


తదుపరి పెద్ద తమకు పెద్ద ఆటంకం ఫైటర్‌ జెట్స్‌ మాత్రమే అని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి సలహాదారు యూరీ శాక్‌ చెప్పాడు. నాలుగవ తరం ఆధునిక విమానాలను సాధ్యమైనంత త్వరలో పొందేందుకు చేయాల్సిందంతా చేస్తాము అన్నాడు. వాటిలో అమెరికా ఎఫ్‌16తో సహా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. ” తొలుత వారు మాకు భారీ ఫిరంగులు ఇవ్వాలను కోలేదు, తరువాత ఇచ్చారు. హిమార్స్‌ వ్యవస్థలను కూడా ఇవ్వాలనుకోలేదు, తరువాత ఇచ్చారు, టాంకులు కూడా అంతే ఇప్పుడు ఇస్తామని చెప్పారు. అణ్వాయుధాలు తప్ప మేం పొందలేనిది ఏదీ లేదు ” అని శాక్‌ చెప్పాడంటే పశ్చిమ దేశాల పథకం గురించి తెలియదని అనుకోలేము. తమ గగన తలంలోకి రష్యా చొరబడకుండా ఉండేందుకు తమకు విమానాలు కావాలని గతేడాదే జెలెనెస్కీ అమెరికా కాగ్రెస్‌ను కోరాడు. ఆ కోర్కెను అంగీకరించటమంటే అది నాటో కూటమి రష్యాతో ప్రత్యక్షంగా తలపడటంతో సమానం కనుక మరీ ఎక్కువగా ఆ డిమాండ్‌ను ముందుకు తీసుకురావద్దని గతంలో సలహా ఇచ్చినట్లు వార్తలు. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించటమంటే వాటిని కూడా అందచేసేందుకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్దం చేస్తున్నారనే అనుకోవాలి. అందుకు గాను ప్రచార యంత్రాంగాన్ని ఒక విధంగా ఇప్పటికే రంగంలోకి దించారు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు తగ్గటం వెనుక భారీ దాడులకు సిద్దం కావటమే అంటూ కథనాలు రాశారు.


మరో దేశానికి మారణాయుధాలు అందిస్తే అమెరికా సమాజంలో వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉంది.దాన్ని నివారించేందుకు ముందుగానే అమెరికా రాజకీయ నేతలు కూడా సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అంతకు ముందే రష్యాను ఒక బూచిగా చూపుతున్న సంగతి తెలిసిందే.” వారికేమి కావాలో తెలుసుకొనేందుకు కీవ్‌ (ఉక్రెయిన్‌) నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం.మరిన్ని ఆయుధాలు కావాలని కోరుతున్న ఉక్రేనియన్లను కూడా మనం తప్పు పట్టలేము.యుద్ద విమానాల గురించి వారు మాట్లాడటం ఇదే మొదటి సారి కాదు. దాని గురించి చేసేందుకు నా వద్ద ఎలాంటి ప్రకటనలు లేవు. ” అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి జాన్‌ కిర్బీ చెప్పాడు. అంటే తరువాత వీలు చూసుకొని రష్యా ఏకపక్ష దురాక్రమణ కారణంగా ఇవ్వటం మినహా తమకు మరొక మార్గం లేదని పెంటగన్‌ చెప్పేందుకు చూస్తున్నదనుకోవాలి.టాంకులు ఉక్రెయిన్‌ ప్రాంతాలను కాపాడటం తప్ప రష్యాకు ముప్పుతెచ్చేందుకు కాదని అమెరికా విదేశాంగ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ చెప్పాడు. పుతిన్‌ సేనలు ఎప్పుడు వెనక్కు పోతే పోరు ఆ మరునాడే ఆగుతుందన్నాడు. ప్రపంచాన్ని నమ్మించే వంచన కబుర్లు తప్ప ఇవి మరొకటి కాదు.తమ ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇచ్చి, నాటోను విస్తరించబోమని, ఉక్రెయిన్ను తమ పక్కలో బల్లెంగా మార్చబోమని నాటో కూటమి హామీ ఇస్తే సైనిక చర్యను వెంటనే ఆపివేస్తామని ప్రారంభంలోనే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.


జర్మనీ తొలుత 14 చిరుత రకం టాంకులు ఇస్తామని చెబితే అమెరికా 31 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తరువాత వాటిని ఇంకా పెంచుతారు. ఇవిగాక ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న ఇతర ఐరోపా దేశాలు కూడా తమ వద్ద ఉన్న చిరుతలను అందచేస్తామని ప్రకటిస్తున్నాయి. పశ్చిమ దేశాలు ఇప్పటి వరకు ఇచ్చిన సాయంతో పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టామని, అనేక విజయాలను సాధించినట్లు చేసిన ప్రచారం గురించి తెలిసిందే. నిజానికి అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పుడు భారీ టాంకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? విమానాలను ఎందుకు కోరుతున్నట్లు ? పోనీ ఇవ్వనున్న టాంకుల సామర్ధ్యం ఏమిటి అన్న చర్చను జరిపేందుకు పశ్చిమ దేశాల మీడియా సిద్దం కావటం లేదు.టాంకులు ఇవ్వటాన్ని చారిత్రాత్మకం అని జర్మనీ వర్ణించటమే కాదు ఆట తీరునే మార్చివేస్తుందని చెప్పుకుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి పశ్చిమ దేశాల నేతలు, వారికి వంత పాడే మీడియా విశ్లేషకులు అదే కబుర్లు చెబుతున్నారు, ఇదిగో పుతిన్‌ పతనం అదిగో రష్యా వెనుకడుగు అని అంటూనే ఉన్నారు. ఇలాంటి టక్కు టమారాలను చాలా చూశాం టాంకుల అందచేత ఒక విధ్వంసకర పధకం, టాంకుల గురించి అతివర్ణన అంటూ రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ కొట్టిపారవేశాడు.


రష్యాతో పోరుకు జర్మన్‌ టాంకులు ఇవ్వటం చారిత్రక తప్పిదం అవుతుందని జర్మన్‌ పార్లమెంటులోని వామపక్ష పార్టీ ప్రతినిధి సెవిమ్‌ డగడెలెన్‌ రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.ఆమె పార్లమెంటు రక్షణ, విదేశాంగ కమిటీలలో, నాటో పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఆ విశ్లేషణ సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌కు టాంకులు ఇచ్చినప్పటికీ రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ దాడుల్లో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలు జర్మనీ మిలిటరీ మరోసారి తమ దేశం మీద దాడికి తెరలేపిందనే భావిస్తారు. జర్మనీ చరిత్రను తాజా చర్చలో ఎవరూ ముందుకు తీసుకురావటం లేదు. జర్మనీ టాంకుల సరఫరాతో ఉక్రెయిన్‌పై దాడికి రష్యాలో పెద్ద ఎత్తున సానుకూల ప్రజాభిప్రాయం వెల్లువెత్తవచ్చు. దీనికి స్వయంగా జర్మన్‌ ఛాన్సలర్‌, సోషల్‌డెమోక్రటిక్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. టాంకుల సరఫరా ప్రాధాన్యతను నొక్కి చెప్పేందుకు జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా అవసరమైతే పోరు జరుగుతున్న ఖార్‌కివ్‌ ప్రాంతానికి కూడా వెళతామని చెప్పారు.ఆయుధ సరఫరా, శిక్షణ పేరుతో చివరికి జర్మనీ కూడా పోరులో భాగస్వామి కాగల అవకాశం ఉందని పార్లమెంటు పరిశోధనా సేవల విభాగం పేర్కొన్నది. ఇతర నాటో దేశాలు జర్మనీ మీద వత్తిడి తెస్తున్నాయి. తాము భారీ టాంకులను ఇస్తున్నట్లు బ్రిటన్‌ చెప్పటం, తమ వద్ద ఉన్న జర్మన్‌ టాంకులను అందచేయాలని నిర్ణయించినట్లు పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడా ఏకపక్షంగా ప్రకటించటం దానిలో భాగమే. ఈ పరిణామాల వలన జర్మన్‌-రష్యా సంబంధాలు దెబ్బతింటాయి. అది బహిరంగ పోరుకు దారి తీసి ఇతర దేశాలు లబ్దిపొందేందుకు తోడ్పడుతుంది.


బెర్లిన్ను కేంద్రంగా మార్చి ఐరోపా పరిష్కారం అంటూ రష్యాతో పోరుకు అమెరికా ఎందుకు జర్మన్లను ముందుకు నెడుతున్నట్లు ? దీనికి సంబంధించి అమెరికన్లు చేస్తున్న వాదనలు సాకు మాత్రమే అన్నారు.అమెరికా మిలిటరీ సామర్ధ్యం నిర్వహణ సమస్యలవంటి వాటితోపాటు చైనాను ఎదుర్కొనేందుకు అవసరమని చెప్పటం విశ్వసనీయమైంది కాదు. రష్యా ఎదురుదాడికి దిగితే తొలి దెబ్బ తగిలేది జర్మనీకే అని అమెరికా భావిస్తుండవచ్చు. తద్వారా జర్మనీ-రష్యా మధ్య శాశ్వతంగా సహకారం ఉండకూడదన్న అమెరికా దీర్ఘకాలికవ్యూహాత్మక లక్ష్యంలో భాగం కావచ్చు. పశ్చిమ దేశాల టాంకులు గనుక రంగంలోకి దిగితే అణ్వాయుధాలను తీస్తే ముందుగా వేసేది జర్మనీ మీదనే. మిత్ర దేశాన్ని ఒక సామంత దేశంగా పరిగణించి దాన్ని బలిచేసే ఎత్తుగడ ఉంది. మరోవైపున చైనాకు వ్యతిరేకంగా జపాన్ను కూడా అమెరికా అదే విధంగా ముందుకు నెడుతోంది. ఈ పూర్వరంగంలో యుద్దోన్మాదులను నిలువరించేందుకు జర్మనీ తన విదేశాంగ విధానానికి నూతన వ్యూహం అవసరం. ముగ్గురు జర్మన్‌ పార్లమెంటు సభ్యుల పేర్లు ప్రస్తావించి వారు అమెరికా కార్పొరేట్లు, ఆయుధడీలర్లు, అమెరికాయుద్ద యంత్రాంగ సేవలో ఉన్నారా అని ప్రశ్నించారు. అదే గనుక నిజమైతే అది వినాశనానికి దారితీస్తుందని వామపక్ష నేత హెచ్చరించారు. ఒకసారి గనుక జర్మనీ టాంకులను అందచేస్తే అది మరిన్ని అస్త్రాల అందచేతకు తలుపులు తెరిచినట్లు అవుతుంది, ఇప్పటికే కొందరు ఫైటర్‌ జెట్ల గురించి చెబుతున్నారు, తరువాత క్షిపణులు, అవి పనిచేయకపోతే చివరికి మన సైనికులను పంపుతారని అన్నారు. పరిపరి విధాలుగా వెలువడుతున్న ఈ అంశాలు మరింత స్పష్టం కావాల్సి ఉంది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు ప్రపంచ శాంతికి, ప్రజలకు ముప్పుతెచ్చేవిగా ఉన్నట్లు చెప్పవచ్చు.