Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?