Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !