Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !