Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్య ప్రాచ్యంలో ఉప్పు నిప్పు మాదిరి ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మార్చి నెల పదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందం కొన్ని దేశాలను కంపింప చేస్తే, అనేక మందికి నిజమా అన్న ఆశ్చర్యానికి గురి చేసిందనే వర్ణనలు వెలువడ్డాయి. ఈజిప్టులోని సూయజ్‌ కాలువ 1956 వివాదం తరువాత బ్రిటిష్‌ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడినట్లే ఈ ఒప్పందం ఆమెరికా పెత్తనానికి తెరదించేందుకు నాంది అన్నట్లుగా కొందరు వర్ణించారు. దీని కంటే ఆ ఒప్పందం చైనా రాజధాని బీజింగ్‌లో కుదరటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ఇరాన్‌-సౌదీ ప్రత్యక్ష పోరుకు తలపడనప్పటికీ అనేక చోట్ల ఏదో ఒక పక్షానికి మద్దతు ఇస్తూ గడచిన నాలుగు దశాబ్దాలుగా పరోక్షంగా శత్రుదేశాలుగా మారాయి. గత ఏడు సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కూడా లేవు. బీజింగ్‌ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు నెలల్లోగా రాయబార కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది.ఇటీవలి కాలంలో దేశాలు ఏదో ఒక పక్షాన చేరటం లేదా తటస్థంగా ఉండటాన్ని ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం స్పష్టం చేసింది. అమెరికా, పశ్చిమ దేశాలకు తాన తందాన అనేందుకు పేద, వర్ధమాన దేశాలు సిద్దంగా లేవు అనే సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇరాన్‌-సౌదీ ఒప్పందం ఈ కూటమికి మింగుడుపడకపోయినా అమెరికా హర్షం ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం నాటి వరకు మన దేశం దీని గురించి ఎలాంటి స్పందన వెల్లడించలేదు.


రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి దారితీసిన కారణాలేమిటి ? షియా మతపెద్ద నిమిర్‌ అల్‌ నిమిర్‌తో సహా 50 మందిని సౌదీ అరేబియా 2016 జనవరి రెండున ఉరితీసింది. దీనికి నిరసనగా టెహరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం మీద ఇరానియన్లు దాడి చేశారు. ఇరాన్‌ అధిపతి అయాతుల్లా అలీ ఖమేనీ కక్ష తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. జనవరి మూడవ తేదీన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది. ఎమెన్‌లోని తమ రాయబార కార్యాలయం మీద సౌదీ వైమానిక దాడులు చేసినట్లు ఏడవ తేదీన ఇరాన్‌ ఆరోపించింది. వాస్తవం కాదని సౌదీ ఖండించింది. వార్షిక హాజ్‌ యాత్రకు వెళితే రక్షణకు హామీ లేదని, సౌదీ కుట్రకు పాల్పడవచ్చంటూ తన యాత్రీకుల మీద ఇరాన్‌ మేనెల 29న నిషేధం విధించింది.తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడికి ఇరాన్‌ కారకురాలని, దాని వలన తమ దేశంలో సగం సరఫరా నిలిచిందని సౌదీ చేసిన ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ గ్రూపు తామే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారి ఖాశిం సొలిమనీ బాగ్దాద్‌లో 2020జనవరి మూడున అమెరికా డ్రోన్‌దాడిలో మరణించారు. అతను ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్దరణకు కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత 2021 ఏప్రిల్‌ తొమ్మిదిన బాగ్దాద్‌లో సౌదీ-ఇరాన్‌ తొలి చర్చలు జరిగాయి. ఐదవ దఫా చర్చలు జరగనుండగా 41 మంది షియా ముస్లింలను సౌదీలో ఉరితీశారు. దాంతో ఎలాంటి కారణం చూపకుండా 2022 మార్చి 13న చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 21న ఐదవ దఫా చర్చలు జరిగాయి. అక్టోబరు 19న రాయబార కార్యాలయాలను రెండు దేశాలూ తెరవాలని ఇరాన్‌ అధిపతి ఖమేనీ సలహాదారు ఒక ప్రకటన చేశాడు. డిసెంబరు తొమ్మిన చైనా అధినేత షీ జింపింగ్‌ సాదీ సందర్శన జరిపి రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బిజింగ్‌ను సందర్శించి షీ జింపింగ్‌తో చర్చలు జరిపాడు. మార్చి పదవ తేదీన ఒప్పందం కుదిరింది.


ఒప్పందం కుదరటమే గొప్ప ముందడుగు. సంవత్సరాల తరబడి తెరవెనుక చైనా మంత్రాంగంతో రెండు దేశాలనూ ఒక దగ్గరకు తేవటం ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం అని చెప్పటం కంటే తరుగుతున్న అమెరికా, పశ్చిమ దేశాల పలుకుబడి అనటం సముచితంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఇరాన్‌-సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యం, చైనా విజయంగా కొందరు చూస్తున్నారు. ప్రపంచం అమెరికా చెప్పినట్లు నడిచే రోజులు గతించాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉన్న చమురు సంపదలు, భౌగోళికంగా ఉన్న ప్రాధాన్యత రీత్యా గతంలో బ్రిటన్‌, తరువాత అమెరికా ఆప్రాంతంపై పట్టుకోసం చూశాయి.దానిలో భాగంగా చిచ్చు రేపాయి.ఏదో ఒక పక్షం వహించి రెండోదాన్ని దెబ్బతీసి తన అదుపులో పెట్టుకోవటం, చివరకు నాటో తరహా కూటమిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తన పట్టులో బిగించుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. సాధారణ సంబంధాల ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇరాన్‌-సౌదీ మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర అనుమానాలు కూడా పరిష్కారం కావాల్సిఉంది. ఈ ఒప్పందానికి హామీదారుగా ఉన్న చైనా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వివాదాల్లో ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపిన దాఖలాల్లేని కారణంగానే రెండు దేశాలూ దాన్ని నమ్మి ముందుడుగువేశాయి. ఇది మిగతా వివాదాలకూ విస్తరిస్తే అమెరికాను పట్టించుకొనే వారే ఉండరు గనుక దీన్ని ముందుకు పోకుండా చూసేందుకు చేసేందుకు అది చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.1979లో అమెరికా మద్దతు ఉన్న ఇరాన్‌ షా ప్రభుత్వం పతనమైన తరువాత అమెరికా ఆ ప్రాంతంలో తలెత్తిన వివాదాల్లో ఇరాన్‌-సౌదీ ఘర్షణ పెరిగింది. ఇరాన్ను శత్రువుగా, సౌదీని మిత్రదేశంగా అమెరికా పరిగణించింది.


సయోధ్య అవసరమని రెండు దేశాలూ గుర్తించినందువల్లనే ఈ ఒప్పందానికి దారి తీసింది తప్ప చైనా వత్తిడేమీ దీనిలో లేదు.దీనిలో చైనా ప్రయోజనాలు లేవా అంటే దాని కంటే ఆ రెండు దేశాల, ప్రాంత ప్రయోజనాలు ఎక్కువ అన్నది స్పష్టం. ప్రస్తుతం ఉన్న కొన్ని వివాదాలను చూద్దాం. లెబనాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో హిజబుల్లా సంస్థకు ఇరాన్‌, ప్రత్యర్ధి పక్షాలకు సాదీ మద్దతు ఉంది. సిరియాలో దశాబ్దికాలానికి పైగా సాగుతున్న పోరులో సౌదీ మద్దతు ఉన్న జీహాదీలకు, ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఇతర మిలిటెంట్లకు వైరం ఉంది. ఎమెన్‌లో అమెరికా మద్దతుతో సౌదీ దాడులకు దిగుతున్నది. అక్కడ హౌతీ మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతు ఉంది.వారు కొన్ని సందర్భాలలో సౌదీ చమురు టాంకర్ల మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్‌లో అత్యధికులు షియా తెగ ముస్లింలు కాగా సౌదీలో సున్నీలు ఉన్నారు.ఇరాక్‌, బహరెయిన్‌లో, చివరికి సౌదీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సున్నీ-షియా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అవి క్రమంగా తగ్గుతాయి తప్ప పెరగవు అన్నది అందరూ చెబుతున్నారు. ఇంతకాలం సౌదీ-ఇరాన్‌ వివాదాలతో లాభపడిన అమెరికాకు ఈ పరిణామం సుతరామూ అంగీకారం కాదు. దానికి నిరంతరం ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉండాల్సిందే. ప్రపంచంలో అస్థిరతకు అమెరికా చూస్తుంటే సుస్థిరతకు చైనా చేయూత నందిస్తోంది. అమెరికా ఎక్కడ కాలుపెట్టినా తన ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకొనే ఉద్రిక్తతల సృష్టి తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు.


ఎందుకు సౌదీ అరేబియా అమెరికా నుంచి దూరంగా జరుగుతోంది ? పెట్రో డాలరు బదులు పెట్రో యువాన్‌కు సౌదీ మొగ్గుచూపుతున్నదన్న వార్తలు అమెరికా నేతలకు రక్తపోటును పెంచుతున్నాయి. దీనికి తోడు బ్రెజిల్‌,రష్యా,భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు, తద్వారా రష్యా, చైనాలకు దగ్గర కావాలని సౌదీ చూడటం కూడా దానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే మరింత నష్టమని కావచ్చు, మంచిదేగా అన్నట్లు తడిపొడిగా స్పందించింది. నిజానికి ఒప్పందం కుదరకుండా తెరవెనుక ఎంత చేసినా సాధ్యం కాలేదు.” దీని గురించి మాకు ఎప్పటికప్పుడు సౌదీ చెబుతూనే ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాంగానీ నేరుగా ప్రమేయం పెట్టుకోలేదు.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గటానికి చేసే యత్నాలకు మేము మద్దతు ఇస్తాం, అది మాకూ అవసరమే, మా పద్దతిలో మేమూ చేశాం ” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ అన్నాడు. ఇరాన్‌ పట్ల అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనత కారణంగానే సౌదీ తన దారులు తాను వెతుక్కొంటోందని ఒప్పంద ప్రకటన వార్త వెలువడగానే ఇజ్రాయెల్‌ స్పందించింది. అమెరికా పధకాల ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాల మీద దాడులు జరపాలన్న తమ కలనెరవేరదనే దుగ్గదానికి ఉంది. పాతిక సంవత్సరాల పాటు అమెరికా విదేశాంగశాఖలో మధ్య ప్రాచ్య విధాన సలహాదారుగా పనిచేసిన అరోన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఎన్‌బిసి టీవీతో మాట్లాడుతూ ” ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి, విశ్వసనీయత తగ్గుతున్నట్లుఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాంతీయ పొందికలు చోటు చేసుకుంటున్నాయి, అవి చైనా, రష్యాలకు సాధికారతను, వాటి స్థాయిని పెంచినట్లుగా ఉంది ” అన్నాడు.ఉక్రెయిన్‌ వివాదం పేరుతో రష్యామీద ప్రకటించిన ఆంక్షలను అనేక దేశాలు తిరస్కరించిన నేపధ్యంలో అమెరికా పలుకుబడి గురించి ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు తన విధానాలను సమీక్షించుకుంటుంది. దానికి సౌదీ అరేబియా మినహాయింపు కాదని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


మధ్య ప్రాచ్యపరిణామాల్లో అమెరికా వైఖరిని చూసిన తరువాత ఇరాన్‌-సౌదీ రెండూ పునరాలోచనలో పడటంతో పాటు, సర్దుబాట్లకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా విధించిన ఆంక్షలతో ఆ ప్రాంత దేశాల నుంచి ఇరాన్‌ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. సౌదీదీ అదే పరిస్థితి, అమెరికాను నమ్ముకొని దాని పధకంలో భాగంగా పని చేస్తే సాధించేదేమీ ఉండదని తేలింది. ఇరాన్‌తో చైనా, రష్యాల సంబంధాలు మరింతగా బలపడటంతో అమెరికాతో వైరం కారణంగా ఇరాన్‌ మరింత బలపడుతుందనేది సౌదీకి అర్దమైంది.దీనికి తోడు ఈ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా మాదిరి ఏ ఒక్క దేశంతోనూ అది ఘర్షణాత్మకవైఖరిని ప్రదర్శించటం లేదు.తన ఎత్తుగడలు, భావజాలాన్ని రుద్దటం లేదు. ఒకదానితో మరొకదానికి తంపులు పెట్టి పబ్బంగడుపుకోవటం లేదు.పరస్పర లబ్ది పొందే పెట్టుబడులు పెడుతున్నది.అందువల్లనే దానితో ప్రతి దేశమూ సంబంధాలు పెట్టుకొనేందుకు చూస్తున్నది. ఇరాన్‌-సౌదీ ఒప్పందం గురించి తొలుత ఇరాక్‌, ఒమన్‌ వంటి ప్రాంతీయ తటస్థ దేశాల్లో ఐదు దఫాలు ప్రాధమిక చర్చలు జరిగాయి. 2030నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి పది దేశాల్లో స్థానం సంపాదించాలంటే అమెరికా ఆధారిత విధానాలతో లాభం లేదని సౌదీకి అర్ధమైంది. అన్నింటి కంటే ఇరుగు పొరుగుదేశాల్లో అస్థిరత్వం, ఘర్షణల వాతావరణం ఉంటే అది ప్రారంభించిన హరిత చొరవ ముందుకు వెళ్లే అవకాశం లేదు. సౌదీతో సర్దుబాటు చేసుకుంటే ఇతర అరబ్బుదేశాలు తమ మీద దాడికి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇరాన్‌కు అర్ధమైంది. ఒంటరి తనం నుంచి అభివృద్ధి వైపు వెళ్లాలంటే మరొక దగ్గరదారి లేదు.తనను బూచిగా చూపి మధ్య ప్రాచ్య నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు మరొక మార్గం లేదు. ఒప్పందాలకు చైనా హామీదారుగా ఉన్నందున రెండు దేశాలకు పెద్ద భరోసా అన్నది స్పష్టం. చైనాకు తెరవెనుక అజండా లేదు. బిఆర్‌ఐ పేరుతో అది రూపొందించిన పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. తమ మీద వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన పోరుకు దిగిన అమెరికాను ఎదుర్కొనేందుకు అంతర్గతంగా మార్కెట్‌ను సృష్టించుకోవటంతో పాటు తన ఎగుమతులకు ఇతర మార్కెట్లను వెతుక్కోవలసిన అవసరాన్ని పశ్చిమ దేశాలు ముందుకు నెట్టాయి. ఇరాన్‌-సౌదీ ఒప్పందం మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ !