Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటీవలి వరకు అమెరికా తొత్తుగా ఉన్న హొండూరాస్‌ ఆదివారం నాడు తైవాన్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడ వామపక్ష శక్తులు అధికారానికి రావటమే ఈ మార్పుకు కారణం. మారుతున్న బలాబలాలకు నిదర్శనంగా 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది దేశాలు తైవాన్ను వదలి చైనాతో సంబంధాలు పెట్టుకున్నాయి. హొండూరాస్‌పై వత్తిడి తెచ్చేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపిన అమెరికా చివరికి చేసేదేమీ లేక మీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ హొండూరాస్‌కు చెప్పింది. ఈ పరిణామం తైవాన్ను గుర్తిస్తున్న ఇతర దేశాల మీద కూడా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. తైవాన్ను గుర్తించినందుకు ప్రతిఫలంగా అమెరికా, తైవాన్నుంచి కూడా సదరు దేశాలకు పెట్టుబడులు, ఇతరంగా ప్రతిఫలం ముడుతున్నది. అది ఎంతో కాలం కొనసాగించలేరని ఒక్కొక్కటి జారుకుంటున్న తీరు వెల్లడిస్తున్నది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ ఏడవ తేదీ వరకు తైవాన్‌ ప్రాంత పాలకురాలు తై ఇంగ్‌ వెన్‌ లాటిన్‌ అమెరికా, అమెరికా తదితర దేశాలను సందర్శించనున్నారు. తైవాన్‌ వేర్పాటు వాదులకు ప్రపంచంలో ఎంతో మద్దతు ఉందని చెప్పి విశ్వాసం కల్పించేందుకు ప్రధానంగా ఆమె వెళుతున్నారు. పైకి ఏమి చెప్పినప్పటికీ తమకు చైనా నుంచి ముప్పు వస్తున్నదని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. ఇదంతా అమెరికా అడిస్తున్న నాటకం అన్నది తెలిసిందే.


ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది.నడమంత్రపు సిరి నరం మీది పుండు కుదురుగా ఉండనివ్వవు అన్నట్లుగా అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది.గత వారంలో అమెరికా మిలిటరీ జాయింట్‌ ఛీఫ్‌ల చైర్మన్‌ మార్క్‌ మిలే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ రక్షణశాఖ పార్లమెంటరీ ఉపకమిటీ ముందు మిలిటరీ విధానం, ఆలోచనల గురించి మాట్లాడారు. రికార్డు స్థాయిలో మిలిటరీ బడ్జెట్‌ ప్రధానంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినదని స్పష్టం చేశారు. చైనాతో పోరుకు తమను సన్నద్దం చేస్తుందని అన్నారు.ఉప సంఘం చైర్మన్‌ కెన్‌ క్లవర్ట్‌ తొలి పలుకులు పలుకుతూ అవసరమైతే ఈ రాత్రికి రాత్రే పోరుకు సిద్దంగా ఉండాలి, ప్రపంచంలో ఎదురులేని శక్తిగా వేగంగా నవీకరించాలని ప్రకటించాడు. చైనా మిలిటరీతో అమెరికా వ్యూహాత్మక పోటీ దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ అని ఆస్టిన్‌ చెప్పాడు. మార్క్‌ మిలే మాట్లాడుతూ రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని వర్ణించాడు.ప్రస్తుతం మొత్తం 10,330 యూనిట్లు ఉన్నాయని, వాటిలో 4,680 చురుకైన విధుల్లో ఉన్నట్లు, అవి ఎంతగా అంటే వాటిలో అరవైశాతాన్ని 30 రోజుల్లో, పదిశాతాన్ని కేవలం 96 గంటల లోపుగానే మోహరించవచ్చని చెప్పాడు. ఈ సన్నద్దతను కొనసాగించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.దీనితో ప్రతి విభాగాన్ని సంసిద్దం గావించవచ్చన్నారు.మొత్తం లక్ష కోట్ల డాలర్లను బైడెన్‌ సర్కార్‌ సిద్దం చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యను అవకాశంగా తీసుకొని ఎలాంటి టెండర్లతో నిమిత్తం లేకుండా అమెరికాతో సహ అనేక దేశాల్లో నేరుగా పరికరాలు, అస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. మిలిటరీ ఎత్తుగడల గురించి కూడా మిలే, ఆస్టిన్‌ వెల్లడించారు. దేశ ఉద్ధేశ్యాలు శాంతియుతమైనవే, హింసాకాండ జరగవచ్చనే బెదిరింపులతో అమెరికా తన ఆలోచనలను రుద్దాలి అవి విఫలమైతే హింసాకాండకు దిగాలి అన్నారు.యుద్దం కంటే ఖర్చు ఎక్కువ కానప్పటికీ యుద్దసన్నద్దత, నిరోధించటం కూడా అసాధారణ రీతిలో ఖర్చుకు దారితీస్తుంది. ఈ భారీ బడ్జెట్‌ యుద్దాన్ని నిరోధిస్తుంది, అవసరమైతే పోరుకు మనల్ని సన్నద్ద పరుస్తుందని మిలే వాదించాడు. ఇలాంటి మాటలతో అమెరికన్లను, ప్రపంచ జనాలను మభ్యపెట్టేందుకు గతంలో అనేక మంది మిలిటరీ అధికారులు చూశారు. దీని వెనుక మిలిటరీ పరిశ్రమల అధిపతులకు లబ్ది చేకూర్చే ఎత్తుగడ ఉంది. నిజానికి చరిత్రలో హిట్లర్‌ మిలిటరీ అధికారులు కూడా ఇదేవిధంగా మాట్లాడారు, జర్మన్లను మభ్యపెట్టారు. వారిలో ఒకడైన ఎరిక్‌ రాడెర్‌ జర్మన్‌ నావికాదళ అధికారి, రెండవ ప్రపంచ యుద్ద నేరాలను విచారించిన న్యూరెంబర్గ్‌ కోర్టులో చేసిన ఇదే వాదనలను తిరస్కరించి జీవితకాల శిక్ష వేశారు. జర్మనీకి దుష్ట ఆలోచనలు లేవని, మిలిటరీ బలంగా ఉంటే కోరుకున్న ప్రాంతాలను యుద్దంతో నిమిత్తం లేకుండా బలాన్ని చూపి పొందవచ్చని వాదించాడు. నిజానికి మిలిటరీని పెంచటమేగాక, దాడుల పధకంలో కూడా ఎరిక్‌ రాడెర్‌ చురుకైన పాత్రధారి అని కోర్టు నిర్ధారించింది. ఆర్థికంగా దిగజారుడును మిలిటరీ హింసాకాండద్వారా పూడ్చుకోవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు.” ఏ దేశంలోనూ లేని విధంగా చైనాలో సంపద, వృద్ది జరుగుతున్నట్లు మనకు కనిపిస్తున్నది.విపరీతంగా సంపద పెరిగితే ప్రపంచవ్యాపితంగా అధికారం కూడా అలాగే పెరుగుతుంది.ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న మనం ఎల్లవేళలా అదే స్థానంలో ఉండాలని ” మిలే చెప్పాడు.


సినిమాలు, టీవీ చిత్రాల ద్వారా అమెరికన్లకు ముప్పు ఎలా ఎటు వైపు నుంచి వస్తున్నదో చూపటం అక్కడ జరుగుతున్నది.వాటిలో గతంలో రష్యన్లు, ఇతర అమెరికా వ్యతిరేకులను ప్రతినాయకులుగా చూపే వారు. వారి మీద అమెరికన్లలో ద్వేషం పుట్టించేవారు. ఇప్పుడు చైనా, ఇతర దేశాల వారిని కూడా ప్రధానంగా చూపుతున్నారు.దానిలో భాగంగానే ఇటీవల కొన్ని అమెరికా సంస్థలు, పార్లమెంటులోని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కొన్ని ఊహాజనిత యుద్ద క్రీడలను కంప్యూటర్లలో సృష్టించి జనానికి చూపుతున్నారు. వాటి ప్రకారం 2025నాటికి తైవాన్‌ అంశం మీద అమెరికా-చైనా పోరుకు తలపడతాయని, దానిలో చైనా ఓడిపోతుందని చిత్రించారు. ఇది హాలీవుడ్‌ సినిమా వంటిదే. వాటిలో అమెరికా సిఐఏ గూఢచారులను తెలివిగలవారిగా ఇతర దేశాల వారిని దద్దమ్మలుగా చిత్రిస్తారు. నిజానికి ఇంతవరకు ఏ ఒక్క యుద్దంలోనూ అమెరికా గెలిచిన ఉదంతం లేదు. దాన్ని సిఐఏ పసిగట్టి తమ నేతలను హెచ్చరించి పరువు నిలిపిందీ లేదు. అమెరికా రిటైర్డ్‌ నావీ అధికారి మార్క్‌ మాంట్‌గోమరీ ఓర్లాండోలో రిపబ్లికన్‌ ఎంపీలకు చైనాతో పోరు అనే ఒక ఊహా చిత్రాన్ని చూపాడు. దానిలో వేలాది మంది అమెరికన్లు మరణిస్తారని, విమానవాహక నావలను ముంచివేస్తారని చిత్రించాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మిలిటరీలో పని చేస్తున్న వారిలో 15 నుంచి 50 మంది లేదా దేశం మొత్తంగా ఐదు నుంచి ఇరవైవేల మంది ఒక వారంలో మరణిస్తారని చూపాడు. దానిలో తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు చైనా ప్రధాన ప్రాంతంపై ఎలాదాడి చేసేది, దాని నౌకలను ఎలా ముంచేది, మిలిటరీని ఎలా చక్రబంధం చేసేది, వివిధ కోణాల్లో జరిగే పర్యవసానాలను చూపారు. ఇలాంటి వాటిని బూచిగా చూపి అమెరికా తన దుర్మార్గాలను జనంతో ఆమోదింప చేసుకునేందుకు చూస్తున్నది.ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా తైవాన్‌ ఆక్రమణకు చైనా పూనుకుంటే నేరుగా అమెరికా మిలిటరీని దింపుతారా అన్న ప్రశ్నకు జో బైడెన్‌ అవును అని సమాధానమిచ్చాడు.


ప్రజాబలం, పట్టుదలలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ మిలిటరీ రీత్యా అమెరికాతో 50 సంవత్సరాల నాడు వియత్నాం సరితూగే స్థితిలో లేదు. అయినా బతుకు జీవుడా అంటూ అమెరికా మిలిటరీ ఎలా పారిపోయిందీ ప్రపంచమంతా చూసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందీ అదే. తాలిబాన్లకు సలాం కొట్టి అమెరికన్లు వెళ్లారు. అలాంటిది చైనాతో ఢకొీనగలమని అమెరికన్లను నమ్మించేందుకు అక్కడి యుద్ధోన్మాదులు చూస్తున్నారు. ” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో 2022 ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు మిలిటరీ డ్రిల్లుల ద్వారా చైనా చూపుతున్నది. వత్తిడి పెంచి రాయితీలు పొందేందుకు, వీలుగాకుంటే దాడికి తెగించేందుకు అమెరికా చూస్తున్నది. దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి ప్రతిగానే ఇటీవల షీ జింపింగ్‌ మాస్కో వెళ్లి పుతిన్‌తో మరింత గట్టిగా బంధానికి తెరతీశాడు. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని, ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడైంది. చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను సిఐఏ ప్రకటించింది.


ఏడు దశాబ్దాల నాడున్న చైనాకు నేటి చైనాకు ఏ విధంగానూ పోలికే లేదు. ఇరాన్‌-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చి తన పలుకుబడి ఏమిటో ప్రదర్శించింది. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.డేనియల్‌ ఎల్స్‌బర్గ్‌ బహిర్గతపరచిన పెంటగన్‌ పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ అధిగమించింది. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే నిప్పుతో చెలగాటాలాడవద్దని బైడెన్‌తో భేటీలో షీ జింపింగ్‌ హెచ్చరించగలిగాడు.