Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నాపేరు సావర్కర్‌ కాదు, గాంధీ, గాంధీలు క్షమాపణలు చెప్పరు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య దుమారం లేపింది. సూరత్‌ కోర్టుకు రాహుల్‌ క్షమాపణ చెప్పి ఉంటే శిక్ష పడేది కాదు, లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యేది కాదు అంటూ బిజెపి చేస్తున్న ప్రచారానికి ప్రతిగా పై విధంగా మాట్లాడారు. రాహుల్‌ అనర్హతకు నిరసనగా ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి తాము రావటం లేదని ఉద్దావ్‌ థాక్రే శివసేన వర్తమానం పంపింది, రాహుల్‌ సావర్కర్‌ మీద చేసిన విమర్శను దానికి కారణంగా చూపింది. దాంతో ఎన్‌సిపి నేత శరద్‌ పావర్‌ రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు, శివసేన హాజరైంది. తాను మరోసారి సావర్కర్‌ గురించి మాట్లాడనని రాహుల్‌ గాంధీ చెప్పారని వార్తలు వచ్చాయి. నిజంగా అలాగే చెప్పారా మరొకటా అన్నది అధికారికంగా ప్రకటించలేదు గనుక దాని గురించి పక్కన పెడదాం.


ఈ పరిణామాల నేపధ్యంలో కాషాయ మరుగుజ్జు దళాలు రంగంలోకి దిగాయి.సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ కేసు దాఖలు చేస్తానని హెచ్చరించటంతో సావర్కర్‌ మీద చేసిన ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారు. ఏం జరిగిందనేది తరువాత చూద్దాం. సావర్కర్‌ క్షమాపణ గురించి మరోసారి చర్చకు తెరలేవటంతో అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అసలు సావర్కర్‌ ఎందుకు క్షమాపణ చెప్పారు, ఎవరికి చెప్పారు ? ఎప్పుడు చెప్పారు అని సందేహాలను లేవనెత్తారు. ఇది సహజం. సావర్కర్‌ గొప్ప స్వాతంత్య్రసమర యోధుడు గనుక భారత రత్న ఇవ్వాలన్నవారు కొందరు నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు, గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చేసిన వాగ్దానాల్లో అది ఒకటి. ఆ మాటకొస్తే జాతిపితను హత్యచేసిన గాడ్సేను కూడా పూజిస్తూ చివరకు గుడులు కట్టేందుకు కూడా సిద్దపడుతున్నవారు రెచ్చిపోతున్న రోజులివి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి,ఉద్దావ్‌ థాక్రే శివసేన ఒక కూటమిలో ఉన్నందున వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం బిజెపి-ఏకనాధ్‌ షిండే శివసేన కూటమి ఈ ఏడాది మే 28వ తేదీ నుంచి వారం రోజుల పాటు సావర్కర్‌ జన్మదిన వారోత్సం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పూనుకుంది. దానికి రాహుల్‌ గాంధీ విమర్శ ఒక పెద్ద అవకాశాన్నిచ్చింది.


” ఈ రోజు సావర్కర్‌ ఒక జాతీయ అంశం కాదు, పాతది.దేశంలో కేంద్రీకరించేందుకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మేము కూడా సావర్కర్‌ గురించి కొన్ని అంశాలు మాట్లాడాము, కానీ అది వ్యక్తిగతమైనది కాదు. అది హిందూ మహాసభకు వ్యతిరేకమైనవి.మరోవైపు కూడా చూడాలి. సావర్కర్‌ చేసిన సేవలను మనం విస్మరించలేము. 32 సంవత్సరాల నాడు సావర్కర్‌ గురించి నేను పార్లమెంటులో మాట్లాడాను ” అని ఆదివారం నాడు శరద్‌ పవార్‌ నాగపూర్‌లో విలేకర్లతో చెప్పారు. దేశంలోని సమస్యల గురించి విదేశీ గడ్డ మీద ఒక భారతీయుడు మాట్లాడం ఇదే మొదటిసారి కాదు అంటూ రాహుల్‌ గాంధీని సమర్ధించారు. సావర్కర్‌ను విమర్శించినందుకు రాహుల్‌ గాంధీని దేశం క్షమించదని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదివారం నాడు అన్నారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌ కాలేడన్నారు. సావర్కర్‌ జీవితాంతం స్వాతంత్య్రంకోసం పోరాడితే రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ వారితో కలసి దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపించారు.సావర్కర్‌ చేసిన త్యాగాల గురించి మహారాష్ట్ర వాసులకు తెలిపేందుకు రాష్ట్రమంతటా సావర్కర్‌ గౌరవ్‌ జాతా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏకనాధ్‌ షిండే ప్రకటించారు.


ఇక కాషాయ మరుగుజ్జుల ప్రచారం గురించి చూద్దాం. సావర్కర్‌ మనవడు రంజిత్‌ ఇంతవరకు రాహుల్‌ గాంధీ మీద ఎలాంటి కేసు దాఖలు చేయలేదు, క్షమాపణ చెప్పకపోతే చేస్తానని బెదిరించారు.గతంలో కూడా ఇలాంటి బెదరింపులే చేశారు. రాహుల్‌ గాంధీ గతంలో చేసిన ట్వీట్లు గానీ లేదా వ్యాఖ్యలను గానీ వెనక్కు తీసుకోలేదని పిటిఐ వార్తా సంస్థ, ఇతరులు స్పష్టం చేశారు. అసలు దాన్ని గురించే కాదు, ఇతర ఏ ఒక్కదాన్ని కూడా తొలగించలేదు. అలా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన వారే తమ ట్వీట్లను వెనక్కు తీసుకున్నారు లేదా పాత సామాన్ల గదిలో పడవేశారు. ” కేసు దాఖలు చేస్తానని సావర్కర్‌ మనవడు బెదిరించిన తరువాత వీర్‌ సావర్కర్‌ మీద చేసిన అన్ని ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారు. ” అన్న ట్వీట్‌ను లక్షలాది మందిపేరుతో పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేశారు. స్వాతంత్య్రం కోసం సావర్కర్‌ ఏమి చేశారన్నది చర్చ. ఒక మేకపిల్లను సింహం మాదిరి ప్రచారం చేశారంటూ గతంలో ఒక విశ్లేషణ వెలువడింది.


సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.


తప్పుడు ప్రచారం చేయటంలో, ఇతరుల మీద నిందలు మోపటంలో కొందరు పేరు మోశారు.మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి క్షమాపణ లేఖలు రాసినట్లు గతంలో రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆరోపించారు. దీనిపై 2021 నవంబరు 22వ తేదీ ఫ్రంట్‌లైన్‌ పత్రిక ఇంటర్వ్యూలో లాస్‌ ఏంజల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడు ప్రొఫెసర్‌ వినయ లాల్‌ సావర్కర్‌ గురించి చేస్తున్న అనేక తప్పుడు ప్రచారాలను సవాలు చేశారు. దానిలో కొన్నింటి సారాంశం ఇలా ఉంది. రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పిన అంశం పూర్తిగా నిరాధారం, అల్లిన కట్టుకథ, మహాత్మాగాంధీ సలహా ఇచ్చినట్లు ఏ చిన్న ఆధారం కూడా లేదు. మంత్రికంటే ముందే అనేక మంది దీని గురించి చెప్పారు. 1911లో సావర్కర్‌ రాసిన క్షమాపణ పిటీషన్‌ కాపీ దొరకటం లేదు గానీ 1913 తరువాత రాసినవి అందుబాటులో ఉన్నాయి. ఇతర ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించిన బ్రిటిష్‌ సర్కార్‌ తమ సోదరుడికి వర్తింప చేయలేదని, మీరేమైనా చేయగలరా అంటూ 1920 జనవరి 18న సావర్కర్‌ సోదరుడు మహాత్మాగాంధీకి లేఖ రాశారు. మీ లేఖ చేరింది, మీకు సలహా ఇవ్వటం కష్టం అని గాంధీ జవాబు రాశారు. తరువాత ఒక ఆర్టికల్లో ఇతర రాజకీయ ఖైదీల మాదిరి సావర్కర్‌ సోదరులు క్షమాభిక్షకు అర్హులే అని రాశారు తప్ప మరొకటి కాదు.సావర్కర్‌ మద్దతుదారులు, భక్తులు చిత్రిస్తున్నమాదిరి హీరో కాదు.దేశ స్వాతంత్య్రం కోసం చేసింది చాలా తక్కువ.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ కూడా చేసిందేమీ లేదు, బ్రిటిష్‌ వారితో కుమ్మక్కు అయ్యారు. దేశ విభజనకు ద్విజాతి సిద్దాంతాన్ని ప్రతిపాదించింది జిన్నా అని చెబుతారు గానీ జిన్నాకంటే ముందే సావర్కర్‌ ప్రతిపాదించారు. అంబేద్కర్‌ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. పరస్పరం వ్యతిరేకించకపోగా ఇద్దరిదీ ఒకే అభిప్రాయం, విభజన జరగాలని గట్టిగా కోరారు అని థాట్స్‌ అన్‌ పాకిస్తాన్‌ (1940) అనే పుస్తకంలో అంబేద్కర్‌ రాశారు. అని లాల్‌ పేర్కొన్నారు.


విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ” సంఘపరివార్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది చరిత్రకారులు హరప్పా నాగరికతను సరస్వతి నాగరికతగా చిత్రించటంలో ఇది కనిపిస్తుంది. గతంలో ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌లో మార్పులు చేసేందుకు చూశారు. దీని మీద దేశంలో ఎందుకు వ్యతిరేకత లేదు ? ” అని వినయ లాల్‌ పేర్కొన్నారు.చరిత్రను తిరగరాయదలచుకున్నవారికి వాస్తవాలు, శాస్త్రీయ అవగాహనతో పని ఉండదని సంఘపరివార్‌ ప్రేరేపిత రాతలు వెల్లడిస్తున్నాయి. వీరత్వంగురించి రాస్తూ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు సావర్కర్‌ పికిలి పిట్ట (బుల్‌బుల్‌) రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలో పర్యటించి తిరిగి వెళ్లేవారని కర్ణాటక ఎనిమిదవ తరగతి పుస్తకంలో రాశారు.అదే పుస్తకంలో మహాత్మాగాంధీ హత్య ప్రస్తావన లేదు. అంతకు ముందు రాజస్తాన్‌లో ప్రచురించిన పుస్తకాల్లో హల్దీఘటీ పోరులో అక్బర్‌ మీద మహరాణా ప్రతాప్‌ గెలిచినట్లు రాశారు.

పాకిస్తాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి మూడు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని భారత దేశ పిత అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించాడు.

దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తణ ప్రాయంగా అర్పించాడు. ఎంత తేడా, అసలు సిసలు దేశభక్తుడు, నకిలీకి ఉన్న తేడాను గుర్తించలేని స్థితిలో జనం ఉన్నారని భావించేవారే సావర్కర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.


‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి చిత్రాలతో సహా పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు. 1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ దాని గురించి రాసి ఉండవచ్చు తప్ప వేరు కాదు. అసలు సిసలు చరిత్ర పేరుతో వక్రీకరణలతో నకిలీ చరిత్రను జనాల మీద రుద్దాలని చూస్తున్నారు.