Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీకి రెండు డిగ్రీలు ఉన్నాయట, అవి నకిలీవని కొందరంటున్నారు. అయితే ఏమిటటా ? ఈ దేశంలో వివాదం కానిది ఏముంది ! కొందరికి ప్రతిదాన్నీ రచ్చ చేయకపోతే నిదుర పట్టదు. ఇదీ అంతే, మోడీ నిజం, మోడీ పాలన నిజం, ప్రపంచంలోని పలు దేశాల నేతలతో పోలిస్తే జనాదరణలో మోడీకి 76శాతం మంది నీరాజనం పడుతున్నట్లు తాజాగా ఒక అమెరికా సంస్థ మోర్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది చూడలేదా ! చూడకేం, మనల్ని విమర్శిస్తేనేమో చూడండి విదేశీ సంస్థలు మన జాతీయవాదుల మీద ఎలా దాడి చేస్తున్నాయో అంటారు. పొగిడితేనేమో చూడండి ఆహా విదేశాల వారే మనల్ని పొగుడుతుంటే మన దేశంలోని వారు ఎలా విమర్శిస్తున్నారో అని కూడా రుసరుసలాడతారు. అంటే మాకు రెండు నాలికలు ఉన్నాయంటున్నారా ? రామ రామ అలా అని బతకటమే, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి(డు) అన్నారు కదండీ. చర్చలు ఇలా సాగుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రధాని రెండు డిగ్రీలు, రెండు భారత్‌లు, ఇతర అంశాల గురించి చూద్దాం !


నరేంద్రమోడీ రెండు డిగ్రీల వివాదం గురించి మీడియాలో, రాజకీయనేతల ప్రకటనల్లో చర్చ జరుగుతోంది.వీటిని ఎందరు విద్యావంతులు పట్టించుకున్నారు, అసలు పట్టించుకోని వారు ఎందరు ? ఒకటి మాత్రం చేదు నిజం, అదేమిటంటే పట్టించుకొనేది ఒక చిన్న భారత్‌, అసలు దాని జోలికి వెళ్లనిది పెద్ద భారతం. అందుకే కొందరు ఏం చెప్పినా తాత్కాలికంగానైనా సాగుతోంది. అసలు వివాదం ఏమిటి ? దేశంలో అనేక మంది దొంగ డిగ్రీలు సమర్పించి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరే వారి గురించి తెలిసిందే. నరేంద్రమోడీ చిన్న తనంలోనే టీ అమ్ముతూ తండ్రికి తోడ్పడినట్లు చెప్పారు గనుక చదువు కోలేదు. అనేక మంది కాలేజీకి వెళ్లకుండానే దూరవిద్య ద్వారా పరీక్షలు రాసి డిగ్రీలు పొందారు. వారిలో తాను ఒకరిని అని మోడీ చెప్పారు. ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌కు నరేంద్రమోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన డిగ్రీల మీద అనుమానం వచ్చింది. అదేమీ నేరం కాదు.సమాచార హక్కు చట్టం కింద మోడీ గారు ఢిల్లీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీలకు సంబంధించి ఏ రోల్‌ నంబరు, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిందీ వివరాలు కావాలని అడిగారు. కేంద్ర సమాచార కమిషన్‌ దానికి స్పందించి ఆ వివరాలు సమర్పించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరింది.తద్వారా జనాలకు వాటి గురించి తెలుసుకోవటానికి సాయపడుతుందని కూడా పేర్కొన్నది. కేజరీవాల్‌ మాదిరే అనేక మంది సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు అడిగితే ప్రధాని కార్యాలయం, విశ్వవిద్యాలయాలు కూడా తిరస్కరించాయి. నరేంద్రమోడీ డిగ్రీలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కనుక వాటిని వెల్లడించకూడదని చెప్పి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు.అలాంటి అంశాలకు సమాచార హక్కుచట్టం వర్తించదు. తన ఎన్నికల అఫిడవిట్‌లో నరేంద్రమోడీ తాను దూరవిద్యద్వారా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎంఎ పట్టా పొందినట్లు పేర్కొన్నారు. కనుక అవి దేశ రహస్యాలు కాదు.


ఫలానా పదవికి ఫలానా విద్యార్హత ఉండాలని రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో గానీ నిర్దేశించలేదు కదా మరి మోడీ డిగ్రీల గురించి ఇంత రచ్చ ఎందుకు అని సందేహం రావచ్చు.నాది వానాకాలం చదువు అని మోడీ రాసి ఉంటే గొడవ ఉండకపోను.తప్పుడు సమాచారమిచ్చారన్నదే అరోపణ.డిగ్రీ ఉంటే చూపాలి, లేకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు గనుక అది అనర్హత కిందికి వస్తుంది. మోడీ గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేసినపుడు తాను అవివాహితుడనని అఫిడవిట్లలో పేర్కొన్నారు.కానీ 2014 లోక్‌సభ ఎన్నికలపుడు తాను యశోదాబెన్‌ అనే ఆమెను వివాహం చేసుకున్నట్లు రాశారు. జాతికి ఏకత, శీలము నేర్పుతామని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పని చేసిన మోడీ నిజాలను దాచవచ్చా ? వివాహం గురించే నిజాలు దాచారు గనుక డిగ్రీల గురించి కూడా అనుమానం తలెత్తింది.అది పెనుభూతం అవుతోంది.ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ చెప్పుకోవాలి. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అసలేం చదివారో తెలీదు గానీ ఆమె పెద్ద చదువులు చదువుకున్న వారికి మార్గదర్శకత్వం వహించే మానవవనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. పూర్తిగా రాజకీశాస్త్ర పాఠాలే చదివి ఎంఎ డిగ్రీ చదివినట్లు చెప్పిన ప్రధాని అనేక మందికి పెద్ద ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అందుకే మోడినోమిక్స్‌ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అదంతా వైఫల్యాల మయం అని విమర్శకులు అనవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య గొప్పదనం అది.


స్మృతి ఇరానీ ఒక ఎన్నికల అఫిడవిట్‌లో తాను 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బిఏ డిగ్రీ పొందినట్లు రాశారు.మరొక ఎన్నికలో బికాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు.2014లో కేంద్ర మంత్రిగా ఉండగా తాను అమెరికాలోని ఏలే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందినట్లు చెప్పారు.2017లో ఆమె డిగ్రీ గురించి సమాచారహక్కు కింద అడగ్గా వెల్లడించవద్దని ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని కోరారు.ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కొట్టివేశారు.చివరకు విధిలేక 2019లో తనకు డిగ్రీ లేదని ఆమె అంగీకరించారు. అసలింతకీ ఆమె ఏలే కథ ఎలా చెప్పారంటే 2013లో భారత్‌ నుంచి వెళ్లిన పదిమంది ఎంపీల బృందంలో ఆమె ఒకరు. సదరు సంస్థలో ఆరు రోజుల పాటు నాయకత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి వాటికి హాజరైతే సర్టిఫికెట్లు ఇస్తారు. దాన్నే డిగ్రీగా బుకాయించేందుకు చూశారు. ఇక ప్రధాన కథలోకి వస్తే ఎవరెలాంటి సమాధానాలిచ్చారో చూద్దాం. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తుకు ప్రధాని కార్యాలయం ” ప్రధాని విద్యార్హతల వివరాలు ప్రధాని కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.మీ ప్రధాని గురించి తెలుసుకోండి అన్నదానిలో దొరుకుతాయి.కోరిన సమాచారం కావాలంటే ఎన్నికల కమిషన్ను అడగండి ” అని సమాధానం చెప్పింది. దానికి ఇసి ఏమి చెప్పిందంటే ఈ సమాచారం మా వద్దలేదని, సిసిఐ.ఎన్‌ఐసి.ఇన్‌లో అభ్యర్ధుల అఫిడవిట్లు అన్న విభాగంలో చూడవచ్చు అని పేర్కొన్నది. మోడీ ఎంఎ డిగ్రీ గురించి సమాచారం అడిగితే గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఒక్క ముక్కలో ” ఆర్‌టిఐ చట్టం 2005 ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గతపరచకూడదు ” అని జవాబిచ్చింది.


మోడీ డిగ్రీల వ్యవహారం మరో మలుపు తిరిగింది.తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్‌ అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. దాన్ని విచారించిన కమిటీ ఏం చెప్పిందటే ” ప్రజా సంబంధ అధికార వ్యవస్థ తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆఫీసు రికార్డులో లేనిదాన్ని ఇవ్వలేరు. ప్రధాని కార్యాలయం కూడా అదే వివరాలను ఇవ్వాలనటం సరైంది కాదు.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయ విడుదల చేయనవసరం లేదు. ప్రధాన మంత్రి కావటానికి కనీస అర్హతలను నిర్వచించలేదు గనుక మోడీ డిగ్రీల గురించిన వివరాలను ప్రధాని కార్యాలయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు ” అని పేర్కొన్నది. అడిగిన సమాచారం సాధారణంగా ఉందని, రోల్‌ నంబరు లేకుండా తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసిన వాదనను అంగీకరించింది. ఈ పరిణామం తరువాత అరవింద్‌ కేజరీవాల్‌ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులకు లేఖ రాశారు. దాన్నే సమాచార హక్కు దరఖాస్తుగా పరిగణించి నరేంద్రమోడీ డిగ్రీల రోల్‌ నంబర్లు అందచేస్తే వివరాలను తెలుసుకోవచ్చునంటూ ప్రధాని కార్యాలయాన్ని శ్రీధర్‌ కోరారు.


రెండు విశ్వవిద్యాలయాలు కూడా నరేంద్రమోడీకి ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేదని చెబితే ఏమౌతుంది ? ప్రస్తుతం ఉన్న శిక్షాస్మృతి లోని సెక్షన్‌ 191 ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వటం నేరపూరితమైన తప్పిదం. దానికి శిక్ష ఏమిటో స్పష్టంగా లేదు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం పనిచేసే సంస్థ(ఏడిఆర్‌) 1999లో వేసిన ప్రజాప్రయోజన దావా, తరువాత కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ నేర, ఆర్థిక, విద్యకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో విధిగా సమర్పించాలి. వాటిలో అక్రమాలుంటే నేరపూరితం అవుతుంది. ఈ వివరాలు వాస్తవమా కాదా అన్నది ఎన్నికల కమిషన్‌ విచారించదు, తప్పని తేలినా శిక్షించే అధికారం దానికి లేదు. అందుకే కోర్టులకు వెళుతున్నారు. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను ఇంటిలిజెన్సీ సంస్థల ద్వారా తనిఖీ చేయించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. అలా చేయ కూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వల్పకాలంలో తనిఖీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ కూడా పేర్కొన్నది. తరువాత కనీసం గెలిచిన వారి వివరాలను ఆరు నెలల్లో తనిఖీ చేయించాలని ఏడిఆర్‌ కోరినా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవటం లేదు, అఫిడవిట్లన్నీ ఆదాయపన్ను శాఖకు పంపుతున్నామని మాత్రమే చెప్పింది, ఐటి శాఖ చేస్తున్నదేమీ లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన వివాహ స్థితి గురించి నరేంద్రమోడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ సునీల్‌ సరవాగి దాఖలు చేసిన పిటీషన్‌పై 2013లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలను ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నది. దాంతో విధిలేక నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో తనకు యశోదాబెన్‌తో వివాహం జరిగినట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనవలసి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరు సంఘపరివార్‌ అని చెప్పుకొనే వారు కూడా కోర్టు ఆదేశిస్తే తప్ప నిజాలు చెప్పరన్నమాట !


ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్ట పరుస్తామని చెప్పుకొనే బిజెపి, కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ చేసిన ఒక చక్కటి సిఫార్సును పక్కన పడేశాయి. తప్పుడు అఫిడవిట్లు ఇస్తే అనర్హత వేటు వేయాలని, ఇప్పుడున్న ఆరు నెలల శిక్షను రెండు సంవత్సరాలకు పెంచాలని, ఈ కేసులను రోజు వారీ విచారించాలని, నామినేషన్ల దాఖలు ఆఖరి గడువుకు తనిఖీకి వారం రోజుల వ్యవధి ఉంటే ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుందని చెప్పింది. కానీ గత తొమ్మిదేండ్లుగా మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు, అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపించటం లేదు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ డిగ్రీల గురించి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది, అనేక అనుమానాలకు తెరలేపింది. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన ఉదంతంలో నరేంద్రమోడీ డిగ్రీ వివరాలను ఢిల్లీ సిఎం కేజరీవాల్‌కు అందచేయాలని గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని కోరటం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పటమే కాదు కేజరీవాల్‌ రు.25వేల జరిమానా కూడా విధించింది. దీని మీద కేజరీవాల్‌ ధ్వజమెత్తారు. మోడీ డిగ్రీల మీద అనుమానాలను పెంచిందన్నారు. తమ సంస్థలలో మోడీ డిగ్రీలు పొందినందుకు పండగ చేసుకోవాల్సిన గుజరాత్‌ లేదా ఢిల్లీ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని దాచేందుకు చూస్తున్నాయన్నారు.


ఇక గుజరాత్‌ హైకోర్టులో కేసుకు సంబంధించి వాదనలను చూద్దాం. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌(సిఐసి) ఉత్తరువులు జారీ చేశారు.కేజరీవాల్‌ ఎన్నికల గుర్తింపు కార్డు మీద వచ్చిన దరఖాస్తును పరిష్కరించకుండానే తమకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నది.తన వివరాలు అందచేసేందుకు సిద్దమేనని, మోడీ డిగ్రీ వివరాలను కూడా సమర్పించాలని కమిషన్‌ అడగాలని కేజరీవాల్‌ కమిషన్‌ ముందు వాదించారు. తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించామని నరేంద్రమోడీ పొందిన 1978 డిగ్రీ వాస్తవమైనదేనని ఢిల్లీ విశ్వవిద్యాయం వాదించింది. ఆ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించాలన్న సిఐసి ఉత్తరువును 2017లో ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఆ కేసు ఇంకా తేలలేదు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం తరఫున గుజరాత్‌ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.ప్రత్యర్ధుల మీద క్షక్ష తీర్చుకొనేందుకు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయటం పిల్లచేష్టలన్నారు.విశ్వవిద్యాలయం మోడీ డిగ్రీని బహిరంగంగా అందుబాటులో ఉంచిందన్నారు.ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) జె ప్రకారం వివరాలను వెల్లడించనవసరం లేదన్నారు. ఏదైనా బహిరంగ కార్యకలాపం లేదా ప్రజాప్రయోజనం కాని లేనపుడు, ఒక వ్యక్తి గోప్యతలో అనవసరంగా చొరబడినపుడు, సమాచార వెల్లడిద్వారా విస్తృత ప్రజాప్రయోజనం కలుగుతుందని సబంధిత అధికారులు సంతృప్తి చెందితే తప్ప సమాచారం పొందలేరు.విశ్వవిద్యాలయం విశ్వాసపాత్రను పోషించేదిగా ఉన్నందున చట్టంలోని పై సెక్షన్‌ ప్రకారం సమాచారం ఇవ్వనవసరం లేదు అని వాదించారు.దాన్ని గుజరాత్‌ హైకోర్టు అంగీకరించింది.


” కొంత మంది జనాలు గౌరవనీయ ప్రధాని డిగ్రీలు నకిలీవని అంటున్నారు. పూర్తి రాజకీయ శాస్త్రంలో మోడీ పొందిన డిగ్రీ చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనదని నేను నిజంగా నమ్ముతున్నాను. కనుక దానిని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవన ప్రధాన ప్రవేశద్వారం వద్ద ప్రదర్శించాలి, తద్వారా దాని గురించి సందేహాలు లేవనెత్తే వారి నోళ్లను మూయించవచ్చని శివసేన(ఉద్దావ్‌ థాకరే) నేత సంజయ రౌత్‌ అన్నారు.డిగ్రీలు నకిలీవని తేలితే ఉన్న లోక్‌సభ్యత్వం రద్దవుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదని ఆప్‌ ఎంపీ సంజయ సింగ్‌ అన్నారు. నరేంద్రమోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రిపేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీచేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది.1994లో ఆ అక్షరాలకు మైక్రోసాప్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న. అవీ తప్పుల తడకలు. ఎంఏ మొదటి భాగంలో నరేంద్రకుమార్‌ దామోదరదాస్‌ మోడీ అని ఉంటే రెండవ భాగంలో నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అని ఉంది.
ఇంత రచ్చ జరుగుతున్నా నరేంద్రమోడీ నోరు మెదపటం లేదు. నిబంధనలకు భాష్యం,వాటిని కోర్టు ఆమోదించటం ద్వారా రక్షణ పొందుతున్నట్లుగా కనిపిస్తున్నది. అనేక మంది మోడీ భక్తులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. నిందల పాలైన సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి పునీతగా వెలికివచ్చినట్లుగా నరేంద్రమోడీ కూడా వాస్తవాలు చెప్పి విమర్శకుల నోళ్లు ఎందుకు మూయించటం లేదని వారిలో వారు మధనపడుతున్నారు. కోర్టులు, నిబంధనలు ఎలా ఉన్నా నైతిక బాధ్యతగా ఎందుకు వెల్లడించరు,ఎందుకు పిరికిబారుతున్నారు అన్నది ప్రశ్న.