Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అందరికీ జోశ్యం చెప్పే బల్లి తానే కుడితి తొట్లో పడికొట్టుకున్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. పదేండ్ల క్రితం కేవలం వందడాలర్ల(రు.8,200)తో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి లక్షలాది పత్రాలను లీకు చేశాడు. స్నోడెన్‌కు ఇటీవలనే పుతిన్‌ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చాడు. అంతకు ముందు 1971లో అమెరికా రక్షణ శాఖ పత్రాలు కూడా వెల్లడయ్యాయి. అదే విధంగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రహస్య పత్రాలను సేకరించి బహిర్గత పరచిన వికీలీక్స్‌ లక్షలాది అమెరికా రహస్య పత్రాలను వెల్లడించటంతో ప్రాచుర్యం పొందింది.వాటి గురించి అమెరికాలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.ఆ సంస్థలో ప్రముఖుడైన జూలియన్‌ అసాంజేను పట్టుకొనేందుకు,జైల్లో పెట్టేందుకు వీలైతే మట్టుపెట్టేందుకు చూస్తూనే ఉంది.


ఇప్పుడు మరోసారి అలాంటి సంచలనం మరో విధంగా చెప్పాలంటే రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువ అన్నట్లుగా వెల్లడైన వందకు పైగా పత్రాలు అమెరికా, నాటో కూటమిని పెద్ద ఇరకాటంలో పెట్టాయనటం అతిశయోక్తి కాదు. రహస్యం, అతి రహస్యం అని దాచుకున్న రక్షణశాఖ ఫైళ్లు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకేం వెల్లడౌతాయోనని అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచంలో ఎక్కడే జరిగినా పసిగట్టి చెబుతామని చెప్పుకొనే అమెరికా తాజాగా తన ఫైళ్లను వెల్లడి చేసింది ఎవరన్నది తేల్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నది. ఎవరు వాటిని వెల్లడించిందీ తరువాత సంగతి, అసలు ఎంత అజాగ్రత్తగా ఫైళ్ల నిర్వహణ చేస్తున్నదో లోకానికి వెల్లడైంది. అమెరికన్లతో తామేమి మాట్లాడినా అవి వెల్లడికావటం తధ్యంగా ఉంది కనుక ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలనే ఆలోచన,జాగ్రత్తలకు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని పురికొల్పింది. తమ గురించిఎలాంటి సమాచారం సేకరించిందో అదెక్కడ వెల్లడి అవుతుందో అన్న ఆందోళన అమెరికా మిత్రదేశాల్లో కూడా తలెత్తింది.


ఈ ఫైళ్లలో ఉన్న అంశాలు వికీలీక్స్‌, ఇతర వాటి మాదిరి గతంలో జరిగిన ఉదంతాలు, పరిణామాల సమాచారం కాదు. వర్తమానంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని గురించి అమెరికా అంతర్గత అంచనా, ఆందోళనలతో పాటు ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, చివరికి తాను చెప్పినట్లు ఆడుతున్న ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మీద కూడా దొంగకన్నేసినట్లు తేలింది.ఉక్రెయిన్‌ దళాల వద్ద ఉన్న మందుగుండు, ఇతర ఆయుధాలు ఎప్పటివరకు సరిపోతాయి, మిలిటరీలో తలెత్తిన ఆందోళన, ఆ సంక్షోభంలో రోజువారీ అంశాల్లో అమెరికా ఎంతవరకు నిమగమైంది, పెద్దగా బహిర్గతం గాని ఉపగ్రహాలద్వారా సమాచారాన్ని సేకరించే పద్దతులతో సహా రష్యా గురించి ఎలా తెలుసుకుంటున్నదీ, మిత్ర దేశాల మీద ఎలా కన్నేసిందీ మొదలైన వివరాలున్న పత్రాలు ఇప్పటివరకు వెలికి వచ్చాయి. రష్యన్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి(హాకింగ్‌) సమాచారాన్ని కొల్లగొట్టారని అమెరికా ఒక కథను ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి ఆ కథ అంతగా అతకటం లేదని కొందరు చెప్పారు.దాంతో పత్రాల్లో కొంత వాస్తవం కొంత కల్పన ఉందని అమెరికా అధికారులు చెవులు కొరుకుతున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని ఫైళ్లు కుర్రాళ్లు ఆటలాడుకొనే వెబ్‌సైట్లలో తొలుత దర్శనమిచ్చాయి.


ఒక కథనం ప్రకారం ఐదునెలల క్రితం అక్టోబరులో కంప్యూటర్‌గేమ్స్‌(ఆటలు) ఆడుకొనే ఒక డిస్కార్డ్‌ వేదిక (ఒక ఛానల్‌) మీద కొన్ని వివరాలు కనిపించాయి. మన దేశంలో ఇప్పుడు నరేంద్రమోడీ- అదానీ పాత్రలతో( గతంలో అమ్మా-నాన్న ఆట మాదిరి) కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉక్రెయిన్‌ సంక్షోభం మీద ఆడుకుంటున్న కుర్రకారులో ఒకడు తనది పై చేయి అని చూపుకొనేందుకు ఎలుగుబంటితో పంది పోరు అంటూ ఒక వీడియోను వర్ణిస్తూ కొన్ని పత్రాలను పెట్టటంతో కొంత మంది భలే సమాచారం అంటూ స్పందించారు. దాంతో ఆ లీకు వీరుడు మరిన్ని జతచేశాడు. ఆ గేమ్‌లో పాల్గొన్నవారు ఉక్రెయిన్‌ పోరు పేరుతో అప్పటికే నాటో కూటమి విడుదల చేసిన అనేక కల్పిత వీడియోలను కూడా పోటా పోటీగా తమ వాదనలకు మద్దతుగా చూపారు. అనేక మంది ఆ రహస్యపత్రాలు కూడా అలాంటి వాటిలో భాగమే అనుకొని తరువాత వదలివేశారు.ఐదు నెలల తరువాత మరొక ఆటగాడు తన వాదనలకు మద్దతు పొందేందుకు మరికొన్ని పత్రాలను జత చేశాడు. తరువాత అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఎడిట్‌ చేసి పెట్టింది. దాన్ని బట్టి వాటిని రష్యన్లు సంపాదించి పెట్టారని భావించారు. అంతకు ముందు వాటిని చూసిన వారు ఉక్రెయిన్‌ పోరు గురించి ప్రచారం చేస్తున్న అనేక అవాస్తవాల్లో భాగం అనుకున్నారు తప్ప తీవ్రమైనవిగా పరిగణించలేదు. చీమ చిటుక్కుమన్నా పసిగడతామని చెప్పుకొనే అమెరికా నిఘా సంస్థలు వాటిని పసిగట్టలేకపోయినట్లా లేక, జనం ఎవరూ నమ్మరులే అని తెలిసి కూడా ఉపేక్షించారా, ఒక వేళ గేమర్స్‌ మీద చర్యలు తీసుకుంటే లేనిపోని రచ్చవుతుందని మూసిపెడతామని చూశారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచించేకొద్దీ గందరగోళంగా ఉంది.


వెల్లడైన వందకు పైగా పత్రాల్లోని అనేక అంశాలను ఖరారు చేసేందుకు ఇటీవలనే అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిలే, ఇతర ఉన్నతాధికారులకు వాటిని సమర్పించారు. ఇంత త్వరగా అవి బహిర్గతం కావటం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాప్‌ సీక్రెట్లుగా పరిగణించే పత్రాలకు అంగీకారం, వాటిని పరిశీలించేందుకు అనుమతించే వారి సంఖ్య గురించి చెబుతూ 2019లో పన్నెండు లక్షల మందికి అవకాశం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఇటీవలనే వెల్లడించింది. అందువలన వారిలో ఎవరైనా వాటిని వెల్లడించాలనుకుంటే ఆ పని చేయవచ్చు. అమెరికా ప్రభుత్వ విధానాలు నచ్చని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నపుడు తనకు అందుబాటులోకి వచ్చిన అనేక అంశాలను బహిర్గతపరిచాడు. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతా సంస్థ , ఐదు కళ్ల పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ గూఢచార సంస్థలతో కలసి జరుపుతున్న నిఘా బండారాన్ని వెల్లడించాడు. అమెరికా అధికారపక్షం డెమోక్రాట్లు, ప్రతిపక్షం(పార్లమెంటు దిగువసభలో మెజారిటీ పార్టీ) రిపబ్లికన్ల మధ్య ఉన్న విబేధాలు కూడా ఈ లీకుల వెనుక ఉండవచ్చన్నది మరొక కథనం. నాటోలోని పశ్చిమ దేశాలు కొన్ని అమెరికా వైఖరితో పూర్తిగా ఏకీభవించటం లేదు. అందువలన అవి కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ పోరులో పుతిన్‌ సేనలను ఓడించటం అంత తేలిక కాదని భావిస్తున్న అమెరికా కొంత మంది విధాన నిర్ణేతలు వివాదానికి ముగింపు పలికేందుకు ఈ లీక్‌ దోహదం చేస్తుందని భావించి ఆ పని చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. రష్యా గనుక వీటిని సంపాదించి ఉంటే దానిలో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు చూస్తుంది తప్ప బహిరంగపరచదు అన్నది ఒక అభిప్రాయం. కష్టపడి సంపాదించిందాన్ని బహిర్గతం చేస్తే శత్రువు ఎత్తుగడలు మారిపోతాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు అమెరికా సుముఖంగా లేదని, అతి పెద్ద ఆటంకం అన్నది ఈ పత్రాల్లో తేటతెల్లమైంది.కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థల కొరత, బకుమట్‌ పట్టణాన్ని పట్టుకోవటంలో పుతిన్‌ సేనల విజయం వంటి అనేక అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి.ఈ పత్రాల్లోని సమాచారం కట్టుకథలైనా అది ప్రచారంలోకి తేవటం మానసికంగా ఉక్రెయిన్ను దెబ్బతీసేదిగా ఉంది. ఉద్రిక్తతలు పెరిగి మిలిటరీ రంగంలోకి దిగితే డాన్‌బోస్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు అదుపులోకి తీసుకుంటాయని అమెరికాకు ముందుగానే తెలుసునని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షల మంది రష్యన్‌ సేనలు మరణించినట్లు సిఐఏ,అమెరికా, నాటో కూటమి దేశాలన్నీ ఊదరగొట్టాయి.ఈ పత్రాల ప్రకారం పదహారు నుంచి 17,500 మధ్య మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు మే రెండవ తేదీ వరకే సరిపోతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి మద్దతు ఇస్తున్న తూర్పు ఐరోపా, ఇతర దేశాల నమ్మకాలను దెబ్బతీసేవే. మిత్రదేశాల కంటే తొత్తు దేశాలుగా పేరు మోసిన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాల మీద కూడా అమెరికా దొంగ కన్నేసినట్లు దాని రాయబారులు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో నెతన్యాహు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాల్సిందిగా జనాన్ని అక్కడి గూఢచార సంస్థ మొసాద్‌ రెచ్చగొట్టినట్లుగా అమెరికా పత్రాల్లో ఉంది. అదే విధంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఇంకాకరికి ఆయుధాల సరఫరా తమ విధానాలకు వ్యతిరేకం అని చెబుతున్నా ఉక్రెయినుకు మూడులక్షల 30వేల ఫిరంగి మందుగుండు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అమెరికా వత్తిడి చేసింది. ఫలానా తేదీలోగా జరగాలని కూడా ఆదేశించింది. ఇదంతా కేవలం నలభై రోజుల క్రితం జరిగింది. ఇది దక్షిణ కొరియాను ఇరుకున పెడుతుంది. పక్కనే ఉన్న రష్యా ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోదని అక్కడి పాలక పార్టీ భావిస్తున్నది.


గతంలో స్నోడెన్‌, మానింగ్‌, వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం ఎక్కువ భాగం పాతదే కానీ అమెరికా దుష్ట పన్నాగాలను లోకానికి వెల్లడించింది. తాజా సమాచారం వర్తమాన అంశాలది కావటం ఆమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పదేండ్ల నాటికి ఇప్పటికీ అమెరికాను ఎదుర్కోవటంలో చైనా, రష్యా సామర్ధ్యం పెరిగింది. తాజా పత్రాలు అమెరికా ఎత్తుగడలను కూడా కొంత మేరకు వెల్లడించినందున వచ్చే రోజుల్లో వాటిని పక్కన పెట్టి కొత్త పథకాలు రూపొందించాలంటే నిపుణులకు సమయం పడుతుంది. మిగిలిన దేశాలకూ వ్యవధి దొరుకుతుంది. బలాబలాలను అంచనా వేసుకొనేందుకు వీలుకలుగుతుంది.ఇదొకటైతే అనేక దేశాలు అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల గురించి పునరాలోచించుకొనే పరిస్థితిని కూడా కల్పించింది.తమ గురించి, తమ అంతర్గత వ్యహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకుంటున్నదో అనే అనుమానాలు తలెత్తుతాయి. ఉక్రెయిను, జెలెనెస్కీ ఏమైనా అమెరికాను ఎక్కువగా ఆందోళన పరుస్తున్నదీ ఈ అంశాలే అని చెప్పవచ్చు. ఇంకెన్ని పత్రాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉంది.