Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈస్టర్‌ రోజున ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఒక చర్చి ప్రార్ధనలకు వెళ్లగానే క్రైస్తవులందరూ తమ చంకనెక్కినట్లు, ఇదే ఊపులో ఈద్‌ రోజున ముస్లింలను సంతుష్టీకరించి వారిని మరో చంకనెక్కించుకుందామని కేరళలో బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు కార్యకర్తలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వీర, శూర హిందూత్వ వాదులకు ఇది మింగుడు పడని అంశమే. వారు మైనారిటీ విద్వేషం అనే పులిని ఎక్కి ఉన్నారు. అధికారం కోసం దేనికైనా నరేంద్రమోడీ సిద్దపడేట్లు ఉన్నారు. ఉన్న ఒక్క అసెంబ్లీ సీటును పొగొట్టుకొని కొరకరాని కొయ్యగా ఉన్న కేరళలో పాగా వేసేందుకు చూస్తున్న బిజెపి ఆత్రం అంతా ఇంతా కాదు. అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం తాము చేస్తే సంసారం అన్నట్లుగా ఫోజు పెడుతోంది. ఒక రాజకీయపార్టీగా జనాభిమానం పొందాలన్న కోరిక ఉండటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇంతకాలం తమనేతలు, మద్దతుదార్లు చేసిన క్రైస్తవ, ముస్లిం విద్వేష ప్రసంగాలు, ప్రచారాన్ని ఆ సామాజిక తరగతుల వారు మరిచినట్లు, మారుమనసు పుచ్చుకొని ఇతర పార్టీలను వదలి తమ వైపు వచ్చినట్లు బిజెపి భావిస్తున్నది. వారు మరీ అంత అమాయకంగా ఉన్నట్లు భావిస్తున్నారా ? అవకాశ వాదులు ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఈ రోజుల్లో అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నట్లుగానే వీరిలో కూడా ఉన్నారు. లేకుంటే చెట్టపట్టాలు వేసుకొని తిరగరు. అదే విధంగా మెజారిటీ మతోన్మాదం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా దానికి తక్కువేమీ కాదు. రెండూ ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటివి. ఒకదాన్ని మరొకటి ఆలంబనగా చేసుకొని తమ అజెండాలను అమలు జరుపుతున్నాయి.


కేరళ రాష్ట్ర బిజెపికి మార్గదర్శకుడిగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌ తాజాగా రీడిఫ్‌ డాట్‌ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ(ఏప్రిల్‌ పన్నెండవ తేదీ)లో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది.కేరళలో ఓటు అనుబంధాలు మారతాయి. గత పార్లమెంటు ఎన్నికల తరువాత జన వైఖరి మారింది.నరేంద్రమోడీ సుపరిపాలన ఎలా ఉంటుందో ఇంతకు ముందు కేరళవాసులు చూడలేదు.2019 ఎన్నికల్లో జనం రెండు శిబిరాలుగా చీలారు. ఒకసారి గెలిచిన మోడీ తిరిగి గెలవరని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని అప్పుడు భావించారు.అందుకే కాంగ్రెస్‌కు 20కి గాను పందొమ్మిది ఇచ్చారు.ఈ సారి బిజెపికి కనీసం ఐదు సీట్లు వస్తాయి. క్రైస్తవులు, ఇతర సామాజిక తరగతులు ఇతర ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు.కాంగ్రెస్‌ ఓటు బాంకు బాగా పడిపోయింది. క్రిస్మస్‌ రోజు నుంచి వేలాది మంది బిజెపి కార్యకర్తలు వేలాది క్రైస్తవుల గృహాలను సందర్శించారు.వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. వారికి కేకులు ఇచ్చారు, వారిని లంచ్‌, డిన్నర్లకు ఆహ్వానించారు.అందరూ సంతోషించారు. మరోలక్ష ఇండ్లను సందర్శించే పధకం ఉంది. మళయాళీ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 15న ” విషు ” సందర్భంగా హిందూ కార్యకర్తలు క్రైస్తవులు, ముస్లింల ఇండ్లను సందర్శించి తమ ఇండ్లలో జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తారు. ఈద్‌ రోజున శుభాకాంక్షలు తెలుపుతారు.


ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవులు సురక్షితంగా ఉన్నారని పొగిడిన సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి అధిపతి మార్‌ జార్జి అలంచెరీ తీరును కాథలిక్‌ పత్రిక ” సత్యదీపం” సంపాదకీయంలో కడిగిపారేసింది. ఒక పత్రిక ఇంటర్వ్యూలో అలంచెరీ మాట్లాడుతూ కేరళలో బిజెపి ప్రజల ఆమోదం పొందుతున్నదని కూడా చెప్పారు.చిన్న చిన్న ప్రయోజనాల కోసం అలా మాట్లాడితే చరిత్ర క్షమించదని హెచ్చరించింది. దేశంలో క్రైస్తవుల మీద పెరుగుతున్న దాడుల గురించి బాధ్యత కలిగిన కాథలిక్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇండియా ఆర్చిబిషప్‌ ఒకరు (బెంగలూర్‌ మెట్రోపాలిటన్‌ ఆర్చిబిషప్‌ పీటర్‌ మచాడో) సుప్రీం కోర్టు ముందు ఒక పిటీషన్‌ దాఖలు చేసి ఉండగా అలంచెరీ ఇలా మాట్లాడటం ఏమిటని నిలదీసింది.క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని వర్ణించిన, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పనిచేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ”ఆలోచనల గుత్తి ” అనే పుస్తకంలో రాసినదాన్ని ఇప్పటికీ బోధిస్తున్నప్పటికీ చర్చి నాయకత్వం తమ బుర్రలను మార్చుకొనేందుకు దోహదం చేసిందేమిటని ప్రశ్నించింది. రాజకీయాలేమీ లేవంటూ బిషప్పులు, క్రైస్తవుల ఇండ్లకు తిరుగుతున్న బిజెపి నేతల రాజకీయం గురించి లౌకిక కేరళ సులభంగానే అర్ధం చేసుకోగలదని పేర్కొన్నది. స్టాన్‌ స్వామిని ఎలా చంపేశారు ? కందమాల్‌ బాధితులకు (2008లో ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులను చంపి, వందలాది చర్చ్‌లను ధ్వంసం చేసిన ఉదంతం) న్యాయాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారో తమ వద్దకు వచ్చిన అతిధులను అడగకుండా బిషప్పులు ”రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారని ” ఎద్దేవా చేసింది.


” హిందూ సమాజం యుద్దంలో ఉంది, అందువలన కలహశీలంగా ఉండటం సహజం.అంతర్గతంగా ఉన్న శత్రువుతోనే యుద్దం. కాబట్టి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని రక్షించుకొనేందుకు యుద్దం జరుపుతున్నది. విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలుగా పోరులో ఉంది. దీనికి సంఫ్‌ు మద్దతు ఇచ్చింది ”అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇటీవల తమ పత్రిక ” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో పేర్కొన్నారు. గోల్వాల్కర్‌ చెప్పినదే మరో రూపంలో చెప్పారు. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన బిజెపికి మద్దతు ప్రకటించేందుకు కేరళలోని చర్చి అధికారులు సాకులు చూపుతున్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ (ఆలోచనల గుత్తి ) పేరుతో 1940,50 దశకాల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇప్పుడు పనికిరావని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ నమ్మబలుకుతున్నారు. అ పుస్తకంలోని అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళి కాదని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. క్రైస్తవులు భారత్‌ గాక తమ విదేశాల్లోని తమ పవిత్ర ప్రాంతానికే విధేయులుగా ఉంటారని, 1857 నుంచి బ్రిటీష్‌ వారితో కుమ్మక్కు అయ్యారని,బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, క్రైస్తవ మిషనరీలు రక్తం తాగుతారని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఆ పేరుతో మతమార్పిడి నిరోధ చట్టాలను చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ గోల్వాల్కర్‌ భాషలోనే క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ క్రిస్మస్‌, ఆంగ్ల సంవత్సరాదులను విమర్శించింది. రబ్బరు ధరలను పెంచితే కేరళలో బిజెపికి మద్దతు ఇస్తారని తెలిచ్చేరి ఆర్చిబిషప్‌ ఎంజె పంప్లానీ ప్రకటించారు. కొందరు చర్చి నేతలు భూమితో సహా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి కొందరిని తమకు అనుకూలంగా బిజెపి మార్చుకుంటున్న తీరు తెన్నులు మనకు తెలిసిందే అని మాజీ ఎంపీ సెబాస్టియన్‌ పాల్‌ అన్నారు. గుర్తు చేసుకుందాం అనే పేరుతో ఏప్రిల్‌ 17న ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు క్రైస్తవులపై దాడులను వివరించేందుకు ఎగ్జిబిషన్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నట్లు డివైఎఫ్‌ఐ ప్రకటించింది.


తమ అజెండాను జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు ఊహాజనితమైన అంశాలను ముందుకు తేవటం, వాటి ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టటం సంఘపరివార్‌ ఎత్తుగడ అన్నది తెలిసిందే.” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో మోహన్‌ భగవత్‌ చెప్పింది అదే. ” కపటం లేని నిజం ఏమంటే హిందూస్తాన్‌ ఎప్పటికీ హిందూస్తాన్‌గానే ఉండిపోవాలి. నేటి భారత్‌లో నివశిస్తున్న ముస్లింలకు హాని ఉండదు.వారి విశ్వాసానికి వారు కట్టుబడి ఉండాలని కోరుకుంటే వారు ఉండవచ్చు. ఒక వేళ వారు తమ పూర్వీకుల విశ్వాసానికి తిరిగి రావాలంటే వారు రావచ్చు. అది పూర్తిగా వారిష్టం. హిందువుల్లో అలాంటి పంతం లేదు, ఇస్లాం భయపడాల్సిందేమీ లేదు. కానీ ఇదే సమయంలో ముస్లింలు తాము ఉన్నతులమనే ప్రచండమైన వాక్పటిమను వదులుకోవాలి…… జనాభా అసమతూకం అనేది ఒక ప్రధాన ప్రశ్న, దాని గురించి మనం ఆలోచించాలి…..అది ఒక్క జననాల రేటు గురించే కాదు. అసమతూకం ఏర్పడటానికి మతమార్పిడులు, అక్రమ చొరబాట్లు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే సమతూకం పునరుద్దరణ అవుతుంది.మనం దీన్ని కూడా చూడాలి.” గురువుగా సంఘీయులు భావించే గోల్వాల్కర్‌ బోధనల సారం కూడా ఇదే. ఒక వైపు అవి ఇప్పుడు పనికి రావు అని అదే సంఘీయులు కొందరు మరోవైపు చెప్పటం ఎప్పటికా మాటలాడి అప్పటికి తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు నాలుకలతో మాట్లాడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. మేకతోలు కప్పుకున్నప్పటికీ పులి స్వభావం మారదు. కుటుంబనియంత్రణ పాటించకుండా జనాభాను పెంచివేస్తున్నారని,హిందువులు మైనారిటీగా మారనున్నట్లు చేస్తున్న ప్రచారం ఎవరు చేస్తున్నదీ తెలిసిందే.


జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కాదు అసలు ఉండదు అన్నది కొందరి భావన అందుకే గతంలో ఎవరేం చెప్పారో, ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవటం అవసరం.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ 2021 జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. అలాంటపుడు జనాభా సమతూకం ఎలా ఉంటేనేం ?దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు ?
ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శనదేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.

2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. అలాంటి శక్తులకు మద్దతు ఇచ్చేందుకు ఇస్లాం, క్రైస్తవ మతాధికారులుగా ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బిజెపిని ఒక్క ప్రశ్న అడగాలి. కేరళలో ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులకు కేకులిచ్చి మంచి చేసుకోవాలని చూశారు. ఈద్‌(రంజాన్‌) సందర్భంగా ముస్లింలను కూడా అదే విధంగా కలవాలని నిర్ణయించారు. కేరళ సిఎం పినరయి విజయన్‌ అన్నట్లు గతంలో చేసిన దానికి పశ్చాత్తాపంగా అలా చేస్తే మంచిదే.కేరళలో మాదిరి దేశంలోని ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్‌ వంటి చోట్ల కూడా బిజెపి అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందా, అసదుద్దీన్‌ ఒవైసి తదితరులను ఆలింగనం చేసుకొని శుభం పలుకుతుందా ?