Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక దేశంలో అణచివేతకు పాల్పడుతున్న భద్రతా దళాలు – తిరగబడిన ప్రజాపక్ష సాయుధ దళాల అంతర్యుద్ధం సాధారణం. దానికి భిన్నంగా ఆఫ్రికాలోని సూడాన్‌లో మిలిటరీ-పారా మిలిటరీ అధికార పోరుతో జనాన్ని చంపుతున్నాయి.ఇది రాసిన సమయానికి దాదాపు మూడు వందల మంది మరణించగా రెండువేల మందికిపైగా పౌరులు గాయపడినట్లు వార్తలు. బాధితులు ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చని భయపడుతున్నారు. మిలిటరీ రాజధాని ఖార్టుమ్‌ నగరంలో కొన్ని ప్రాంతాలపై వైమానికదాడులు జరుపుతున్నట్లు వార్తలు. ఇది అక్కడి తీవ్ర పరిస్థితికి నిదర్శనం. ఆ దాడుల్లో ఏం జరిగిందీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, భద్రతా దళాలు పోరు విరమించాలని సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ కోరింది.ఈ నెల 12న ప్రారంభమైన పరస్పరదాడులు ఏ పర్యవసానాలకు దారితీసేదీ, అసలేం జరుగుతున్నదీ పూర్తిగా వెల్లడికావటం లేదు. ఎవరు ముందు దాడులకు దిగారన్నదాని మీద ఎవరి కథనాలు వారు వినిపిస్తున్నారు. అమెరికా, మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి కాల్పులను విరమించాలని చేసిన సూచనలను ఇరు పక్షాలు పట్టించుకోలేదని తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.దాడులు దేశమంతటా జరుగుతున్నట్లు, వాటిలో చిక్కుకు పోయిన జనానికి విద్యుత్‌, మంచినీటి కొరత ఏర్పడిందని గాయపడిన వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా వీలు కావటం లేదని ఆల్‌ జజీరా టీవీ పేర్కొన్నది. సూడాన్‌లో మొత్తం నాలుగున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు.


మిలిటరీ అధిపతి అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అధిపతి హిమెతీ ఆధిపత్య కుమ్ములాటలే గాక వర్తమాన పరిణామాల్లో ఇంకా ఇతరం అంశాలు కూడా పని చేస్తున్నాయి. గతంలో జరిగిన అంతర్యుద్ధం ముగింపు కోసం జరిగిన ఒప్పందాల్లో ఆర్‌ఎస్‌ఎఫ్‌ మిలిటరీలో విలీనం ఒకటి. ఒప్పందం మీద సంతకాలు జరిగిన రెండు సంవత్సరాల్లో అది పూర్తి కావాలని అంగీకరించినట్లు మిలిటరీ అధిపతి బుర్హాన్‌ చెబుతుండగా, కాదు పది సంవత్సరాలని హిమెతీ భాష్యం చెబుతున్నాడు. అంటే పది సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎఫ్‌ స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్థగా తన ఆధిపత్యంలో కొనసాగాలని, ఆ మేరకు తనకు అధికారంలో వాటా దక్కాలని డిమాండ్‌ చేస్తున్నాడు.ఇది పైకి కనిపిస్తున్న కారణంగా కనిపిస్తున్నప్పటికీ అంతకు ముందు జరిగిన పరిణామాలను బట్టి ఎవరూ మిలిటరీ పాలనకు స్వస్తి చెప్పి పౌరపాలన ఏర్పాటుకు అంగీకరించేందుకు సిద్దం కాదని, అధికారాన్ని స్వంతం చేసుకొనేందుకే ఇదంతా అన్న అభిప్రాయం కూడా వెల్లడౌతున్నది.” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ చెప్పారు.


తాజా పరిణామాల పూర్వపరాలను ఒక్కసారి అవలోకిద్దాం.1989కి ముందు ప్రధానిగా ఉన్న సాదిక్‌ అల్‌ మహదీ ప్రజావ్యతిరేకిగా మారటాన్ని అవకాశంగా తీసుకొని కుట్ర ద్వారా అల్‌ బషీర్‌ అధికారానికి వచ్చి నియంతగా మారాడు. తీవ్రమైన ఇస్లామిక్‌ విధానాలు, మానవహక్కుల ఉల్లంఘనలు, అణచివేతలకు పాల్పడటంతో అనేక తిరుగుబాట్లు జరిగినా వాటిని అణచివేశాడు. 2018 డిసెంబరు 19న ప్రారంభమైన నిరసనలు బషీర్‌ అధికారాన్ని కుదిపివేశాయి. దీన్ని డిసెంబరు లేదా సూడాన్‌ విప్లవంగా వర్ణించారు. మూడు దశాబ్దాల నిరంకుశ పాలనకు మద్దతుగా ఉన్న భద్రతా దళాలే తిరుగుబాటు చేయటంతో 2019 ఏప్రిల్‌ 11న అధికారాన్ని వదులుకున్నాడు. ఆ స్థానంలో సంధికాల మిలిటరీ మండలి(టిఎంఎసి) అధికారానికి వచ్చింది.వచ్చిన వెంటనే ఇది కూడా జనాన్ని అణచివేసేందుకు పూనుకుంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యపునరుద్దరణ కోరిన జనాలపై జూన్‌ మూడున రాజధాని ఖార్టుమ్‌లో భద్రతాదళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణకాండకు పాల్పడ్డాయి. అనేక మంది యువతులు మానభంగానికి గురయ్యారు, 128 మంది మరణించగా 650 మంది గాయపడ్డారు. తరువాత జూలై, ఆగస్టు మాసాల్లో స్వేచ్చ, మార్పును కోరే శక్తుల కూటమి(ఎఫ్‌ఎఫ్‌సి)తో టిఎంసి ఒక ఒప్పందం చేసుకుంది.దాని ప్రకారం కొత్త రాజ్యాంగ రచన,2022లో ఎన్నికలు, ఆలోగా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. ఐదుగురు మిలిటరీ ప్రతినిధులు, ఐదుగురు పౌర ప్రతినిధులు, ఇరుపక్షాలకూ ఆమోదమైన మరొక పౌరప్రతినిధితో సంపూర్ణ అధికారాలు గల 11 మందితో మండలి ఏర్పాటు. అది మూడు సంవత్సరాల మూడునెలలపాటు కొనసాగటం, తొలి 21 మాసాలు దానికి మిలిటరీ ప్రతినిధి, మిగిలిన పద్దెనిమిది మాసాలు పౌర ప్రతినిధి అధిపతిగా ఉండటం, పౌర ప్రధాని, మంత్రి మండలిని ఎఫ్‌ఎఫ్‌సి నియమించటం, పదకొండు మంది ప్రతినిధుల మండలి, మంత్రివర్గ ఏర్పాటు తరువాత తాత్కాలిక పార్లమెంటు ఏర్పాటు,2019 తిరుగుబాటు, ఖార్టూమ్‌ ఊచకోత మీద పారదర్శకంగా స్వతంత్ర విచారణ అంశాలున్నాయి.


ఈ ఒప్పందం జరిగినప్పటి నుంచీ దానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు చేశారు.2020లో మాజీ అధ్యక్షుడు అల్‌ బషీర్‌ అనుచరులుగా ఉన్న మిలిటరీ అధికారులు తిరుగుబాటు నాటకం, ప్రధానిగా ఉన్న అబ్దుల్లా హమ్‌దోక్‌పై హత్యాయత్నం జరిగింది. దాని వెనుక ఎవరున్నదీ ఇప్పటికీ వెల్లడికాలేదంటే ప్రస్తుత మిలిటరీ పాలకులే అన్నది స్పష్టం. ఒప్పందం ప్రకారం 2021 ఫిబ్రవరిలో సర్వసత్తాక అధికార మండలి అధ్యక్షపదవి నుంచి మిలిటరీ అధికారి బుర్హాన్‌ తప్పుకోవాలి. దాన్ని తుంగలో తొక్కి శాంతి ఒప్పందం పేరుతో మరొక 20నెలలు కొనసాగేందుకు అంగీకరించారు. దాన్ని కూడా ఉల్లంఘించి అదే ఏడాది అక్టోబరు 25న తిరుగుబాటు చేసి పూర్తి అధికారం తనదిగా ప్రకటించుకున్న బుర్హాన్‌, పదకొండు మంది కమిటీని రద్దు చేశాడు. గతేడాది జరగాల్సిన ఎన్నికలూ లేవు.అణచివేతకు పూనుకున్నాడు. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ బుర్హాన్‌ మిలిటరీ నిరంకుశపాలనకు ఏదో ఒకసాకుతో మద్దతు ఇస్తున్నాయి.తిరిగి ప్రజా ఉద్యమం లేచే అవకాశం ఉండటం, కమ్యూనిస్టు పార్టీ, దానితో కలసి పని చేస్తున్న సంస్థలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించటం ప్రారంభమైంది. ప్రదర్శకులపై దమనకాండకు పాల్పడి 120 మందిని చంపటంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించి మరొక ప్రహసనానికి తెరలేపారు. మిలిటరీ నియంత, మితవాద శక్తులతో కూడిన ఎఫ్‌ఎఫ్‌సి మధ్య 2022 డిసెంబరులో అధికార భాగస్వామ్య అవగాహన కుదిరింది. దాన్ని ఐదువేలకు పైగా ఉన్న స్థానిక ప్రతిఘటన కమిటీలు తిరస్కరించాయి. ఒప్పందాన్ని ఒక కుట్రగా పేర్కొన్నాయి.పాలకులు గద్దె దిగేవరకూ పోరు అపకూడదని నిర్ణయించాయి. తాజా అవగాహన మేరకు పౌర సమాజానికి చెందిన ప్రధాన మంత్రి మిలిటరీ దళాల ప్రధాన అధికారిగా ఉంటారు. తరువాత దీని మీద వివరణ ఇచ్చిన బుర్హాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ మిలిటరీ ప్రధాన అధికారి అంటే నియామకాలు జరపటం గానీ, అధికారిక సమావేశాలకు అధ్యక్షత వహించటం గానీ ఉండదని, తనకు నివేదించిన వాటిని అమోదించటమే అన్నారు.అయినప్పటికీ ఒప్పందానికి అంగీకారమే అని ఎఫ్‌ఎఫ్‌సి తలూపింది.ఇంకా అనేక అంశాలపై రాజీ, లొంగుబాటును ప్రదర్శించింది. అవగాహనను ఖరారు చేస్తూ ఒప్పందంపై ఏప్రిల్‌ ఒకటిన సంతకాలు జరపాలన్నదాన్ని ఆరవ తేదీకి వాయిదా వేశారు, పదకొండవ తేదీ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని, రెండు సంవత్సరాల్లో ఎన్నికలు జరపాలని చెప్పారు. కొత్త సర్కార్‌ ఏర్పాటు జరగలేదు. పన్నెండవ తేదీన మిలిటరీ-పారామిలిటరీ పరస్పరదాడులకు దిగాయి. దీనికి తెరవెనుక జరిగిన పరిణామాలే మూలం.


అవే మిలిటరీ-పారామిలిటరీ దళాల మధ్య తాజా ఆయుధపోరుకు దారితీశాయి. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను రెండు సంవత్సరాల్లో మిలిటరీలో విలీనం చేస్తే ప్రస్తుతం దాని అధిపతిగా ఉన్న హిమెతీ అధికారుల మందలో ఒకడిగా ఉంటాడు తప్ప దానిలోని లక్ష మందికి అధిపతిగా ఇంకేమాత్రం ఉండడు. అందువలన మిలిటరీలో విలీనం పదేండ్లలో జరగాలని అతడు అడ్డం తిరిగాడు. దానికి బుర్హాన్‌ అంగీకరించలేదు. దానికి మరొక మెలికపెట్టి గతంలో కుదిరిన అవగాహనతో నిమిత్తం లేని ఇతర పార్టీలు, శక్తులను కూడా ఒప్పందంలో చేర్చాలని కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. మాజీ నియంత బషీర్‌కు మద్దతుదారుగా ఉన్న ఇస్లామిస్ట్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను చేర్చాలని పట్టుబడుతున్నాడు. ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.నియంత బషీర్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరులో కలసి వచ్చిన ఉదారవాద, మితవాద శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ కూటమిలో చేరింది. అల్‌ బషీర్‌ పాలన అంతమైన తరువాత అధికారానికి వచ్చిన సంధికాలపు మిలిటరీ మండలి కొన్ని సంస్కరణల అమలు గురించి చెప్పినప్పటికీ అది కూడా పౌరుల మీద ఊచకోతకు పాల్పడింది. మిలిటరీతో రాజీపడుతున్న ఎఫ్‌ఎఫ్‌సి వైఖరిని తప్పుపడుతూ ఆ సంస్థ నుంచి 2020 నవంబరు ఏడున కమ్యూనిస్టు పార్టీ వెలుపలికి వచ్చింది. భావ సారూప్యత, మిలిటరీ పాలనను వ్యతిరేకించే ఇతర శక్తులతో కొత్త కూటమిని ఏర్పాటు చేసింది.దానికి విప్లవాత్మక మార్పుల శక్తులు (ఎఫ్‌ఆర్‌సి) అని పేరు పెట్టారు.దీని నాయకత్వాన గతేడాది భారీ ప్రదర్శనలు, నిరసన తెలిపారు.


సూడాన్‌లో జరుగుతున్న పరిణామాల్లో పారామిలిటరీ దళాలు రాజధానిలోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని పట్టుకున్నట్లు నిర్ధారణగాని వార్తలు వచ్చాయి.మరోవైపు ఈ దళాలు రక్షణ కోసం పౌరనివాసాల్లో చేరి రక్షణ పొందుతున్నట్లు మరికొన్ని వార్తలు. ఈ నేపధ్యంలో కోటి మంది జనాభా ఉన్న ఖార్టుమ్‌, పరిసర ప్రాంతాలపై మిలిటరీ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు ఒక కథనం. ఆ దాడులు జరుపుతున్నది ఈజిప్టు మిలిటరీ అని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా గందరగోళం కలిగిస్తున్నాయి. సూడాన్‌ మిలిటరీ, పారామిలిటరీ ప్రజలను అణచివేసేందుకే గతంలో పని చేసింది. పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీ అధిపతికి బంగారు గనులు కూడా ఉన్నాయి. నియంత బషీర్‌ను గద్దె దింపిన తరువాత దేశ రిజర్వుబాంకుకు వంద కోట్ల డాలర్లను అందచేశాడంటే ఏ స్థితిలో ప్రజల సంపదలను కొల్లగొట్టిందీ అర్ధం చేసుకోవచ్చు. బహుశా ఇది కూడా తాజా ఘర్షణలకు మూలం కావచ్చు. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదంలో అరబ్బు, మధ్యప్రాచ్య దేశాలు ఇరు పక్షాలకూ మద్దతు ఇచ్చేవిగా చీలి ఉన్నాయి. మిలిటరీకి అమెరికా మద్దతు ఉంది. పారామిలిటరీ-మిలటరీ ఎవరిది పై చేయిగా మారినా సూడాన్‌ తిరిగి ఉక్కుపాదాల నియంత్రణలోకే వెళ్లనుందని చెప్పవచ్చు.మరోవైపు ప్రజాప్రతిఘటన దళాలు విప్లవం కొనసాగుతుంది, ఎలాంటి సంప్రదింపులు ఉండవు,ఎవరితోనూ సంప్రదింపులు ఉండవు, చట్టవిరుద్దమైన పాలకులతో ఎలాంటి రాజీలేదని జనాన్ని సమీకరించేందుకు పూనుకున్నాయి.