Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
పెట్టుబడిదారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.కొలంబస్‌ అమెరికాను కనుగొనటంలోనే అది తొలిసారిగా స్పష్టమైంది. ఆ పరంపరలో ఓడలు, సముద్ర మార్గాలు,దేశాల ఆక్రమణ, వలసపాలన, ముడి చమురు, విలువైన ఖనిజ సంపదలను ఆక్రమించుకొనేందుకు, వాటినుంచి లాభాలను పిండుకొనేందుకు జరిపిన దాడులు, యుద్ధాల చరిత్ర తెలిసింది. ఆ జాబితాలో ఇప్పుడు తెల్లబంగారంగా భావిస్తున్న లిథియం అనే ఖనిజం చేరనుందా ? రానున్న రోజుల్లో చమురుతో పాటు అది కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాలుష్య ఉద్గారాలను 2050నాటికి సున్నా స్థాయికి తగ్గించే విధంగా శుద్దమైన ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలనేది ఒక లక్ష్యం.తద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు పూనుకోవాలని ప్రపంచం చూస్తోంది.దీనికి గాను వాహన రంగంలో రెండువందల కోట్ల ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రిక్‌తో పాటు అవసరమైతే చమురు ఇంథనాన్ని వినియోగించే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైది పెద్ద మొత్తంలో విద్యుత్‌ నిలువ చేయగలిగిన బ్యాటరీలు.వాటికి అవసరమైనది లిథియం. ఇప్పటివరకు కనుగొన్నమేరకు ఆ ఖనిజ నిల్వలు 250 కోట్ల బ్యాటరీల తయారీకి మాత్రమే సరిపోతాయట. సముద్రాల్లో , రాతి శిలల ప్రాంతాల్లో కూడా ఇది భారీగా దొరుకుతుంది.


ఈ పూర్వరంగంలో ఎంతో విలువైన లిథియం నిల్వలను కొత్తగా కనుగొనేందుకు, ఉన్న వాటిని తమ స్వంతం చేసుకొనేందుకు బహుళజాతి గుత్త కంపెనీలు చూస్తున్నాయి. వాటికి అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించేందుకు పూనుకున్నాయి. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా అందుకోసం కుట్రలు ఉంటాయని చెప్పనవసరం లేదు. బహుళజాతి కంపెనీల కోసం పని చేసే పత్రికల్లో ఒకటైన టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ చివరి వారంలో ” లిథియం కోసం ఒకవేళ దక్షిణ అమెరికా ఒక ఓపెక్‌ను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ” అంటూ ఒక విశ్లేషణా హెచ్చరికను ప్రచురించింది. ఒపెక్‌ అంటే చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ. అలాంటి దానినే లిథియం ఖనిజానికీ ఏర్పాటు చేస్తే అనేది దాని భయం. ప్రపంచంలో 2020 నాటికి కనుగొన్న మేరకు ఉన్న నిల్వలు రెండు కోట్ల పదిలక్షల టన్నులు. ఈ మొత్తంలో ఒక్క చిలీలోనే 92లక్షల టన్నులు ఉంది. తరువాత మన దేశంలోని జమ్మూ-కాశ్మీరు ప్రాంతంలో 59లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 47, అర్జెంటీనా 19, చైనా 15, అమెరికాలో 7.5, కెనడాలో 5.3లక్షల టన్నుల నిల్వలున్నాయి. వీటి నుంచి 82వేల టన్నులు అదే ఏడాది వెలికి తీయగా ఒక్క ఆస్ట్రేలియాలోనే 40,చిలీ 18, చైనా 14, అర్జెంటీనా 6.2 వేల టన్నులు వెలికి తీశారు.మరుసటి ఏడాది లక్ష టన్నులకు పెరిగింది.దీనిలో అమెరికా వాటా కేవలం ఒక్కశాతమే ఉంది.


గతంలో గ్లాసును కరిగించే ఉష్టోగ్రతలను తగ్గించేందుకు, అల్యూమినియం ఆక్సైడ్‌ కరిగింపు,సిరామిక్స్‌ వంటివాటిలో లిథియంను వాడేవారు. రెండువేల సంవత్సరం తరువాత బ్యాటరీల తయారీకి ఉపయోగించటంతో దాని డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది భౌగోళిక రాజకీయాలనే ప్రభావితం చేసేదిగా మారుతోందంటే అతిశయోక్తి కాదు.2020లో ప్రపంచమంతటా 30లక్షల విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తే మరుసటి ఏడాదికి 66లక్షలకు పెరిగాయి.మార్కెట్‌లో వీటి వాటా 9శాతం.రానున్న పది సంవత్సరాల్లో పెట్రోలు, డీజిలు మోటారు వాహనాల కొనుగోలును క్రమంగా తగ్గిస్తామని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చమురు ధరలు పెరగటంతో సాధారణ పౌరులు కూడా వాటివైపే మొగ్గుతున్నారు. మోటారు వాహనాలు, ఇతర రంగాల్లో చిప్స్‌ ప్రాధాన్యత ఎలా పెరిగిందో లిథియ బ్యాటరీలు కూడా అంతే ప్రాధాన్యవహించనున్నాయి. అందుకే ఆరు దశాబ్దాల క్రితం చమురు దేశాలు మార్కెట్‌ను అదుపు చేసేందుకు ఒపెక్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా లిథియం ఖనిజం ఉన్న దేశాలు కూడా ఒక్కటైతే అమెరికా,జపాన్‌,ఐరోపాలోని వాహన తయారీ కంపెనీలు విద్యుత్‌ వాహన రంగంలో అడుగుపెట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. టైమ్‌ పత్రిక విశ్లేషణలో వెల్లడించిన భయమదే.


లాటిన్‌ అమెరికా దేశాల్లో లిథియం నిల్వలున్నాయి.పెరూ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష నేత పెడ్రో కాస్టిలో ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల ప్రభుత్వం ఏప్రిల్‌ 10న ఒక ప్రకటన చేస్తూ అమెరికా లిథియం కంపెనీ అనుబంధ కెనడా కంపెనీకి లిథియం ఖనిజ గనులను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెరూవియన్లు ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.కుట్ర పూరితంగా అధికారానికి వచ్చిన ప్రభుత్వానికి తెలుపుతున్న నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ను కూడా చేర్చారు. కార్పొరేట్ల లాభాలు, ఇతర లబ్ది గురించి చూపుతున్న శ్రద్ద ఆ ప్రాంత పౌరుల పట్ల లేదని, తమ డిమాండ్లను విస్మరిస్తే ఖనిజతవ్వకాలను అనుమతించేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఖనిజమున్న పూనో ప్రాంతంలోని స్థానిక తెగలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు సమావేశమై ఆ ఖనిజం మీద సంపూర్ణ హక్కు తమదేనని, తమ సంక్షేమానికే వనరులను వినియోగించాలని, తమను సంప్రదించకుండా నిర్ణయాలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ముడిసరకులను ఎగుమతి చేసే ప్రాంతంగా, దేశంగా మారిస్తే సహించేది లేదని పరిశ్రమలను పెట్టి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.


నిజానికి ఇది ఒక్క పెరూ సమస్యమాత్రమే కాదు, ప్రపంచంలో సహజ సంపదలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. లిథియంను కార్పొరేట్ల పరం చేసేందుకు పెరూ కుట్రదారులు చూస్తున్నారు, ప్రజల పరం చేయాలని తాను కోరుతున్నట్లు పెడ్రో కాస్టిలో చెప్పారు. దీనిలో భాగంగానే బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సీ లాటిన్‌ అమెరికా లిథియం ఉత్పత్తి, ఎగుమతులకు ఓపెక్‌ మాదిరి సంస్థ ఏర్పాటును ప్రతిపాదించినట్లు చెప్పాడు. అర్జెంటీనా సర్కార్‌ కూడా దీనిపట్ల ఆసక్తి వెల్లడించింది. మెక్సికో, చిలీ అధినేతలు కూడా ఇటీవల లిథియం గనులను జాతీయం చేయాలని ప్రకటించారు. తమ ప్రాంత సంపదలను తమ పౌరుల సంక్షేమానికే అన్న అంశం దీనివెనుక ఉంది. పెరటిగా తోటగా చేసుకొని నిరంకుశ, మిలిటరీ పాలకులను గద్దె మీద కూర్చోపెట్టిన అమెరికా ముడిసరకుల ఎగుమతి ప్రాంతంగా దీన్ని చూసింది తప్ప పరిశ్రమలను వృద్ది చేయలేదు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఈ పరిస్థితిని మార్చాలని చూస్తున్నాయి.


టైమ్‌ వంటి కార్పొరేట్‌ మీడియాకు జన ఆకాంక్షలు పట్టవు. కొద్ది రోజుల క్రితం చిలీ ప్రభుత్వం లిథియం గనులను ప్రభుత్వ అదుపులోకి తేవాలని ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు సాగిస్తున్న రెండు అమెరికన్‌ కంపెనీలను కొన్ని సంవత్సరాల తరువాత అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించటం, కొత్తగా జరిపే తవ్వకాలను ఆధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అనేక దేశాల్లో ఈ పాక్షిక జాతీయకరణ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. చమురు దేశాల్లో ఒపెక్‌ ఏర్పాటును కూడా నాడు బహుళజాతి గుత్త సంస్థలు అంగీకరించలేదు, విఫలం చేసేందుకు చూశారు. మన దేశంతో సహా అనేక దేశాలు చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఒపెక్‌ ఇప్పుడు రష్యాతో సహా 40శాతం చమురు సరఫరాను అదుపు చేస్తున్నది.లిథియం అంశంలో కూడా అదే జరిగితే లాభాలు తెచ్చే మరో గంగిగోవు తమకు దక్కదని బహుళజాతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.2010లో కేవలం 23,500 టన్నుల డిమాండ్‌ మాత్రమే ఉన్న ఈ ఖనిజం 2030నాటికి 40లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. లాటిన్‌ అమెరికాలోని ఉప్పునీటి కయ్యలలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే శుద్ధి ఎంతో సంక్లిష్టమైనదిగా, ఖర్చుతో కూడినదిగా మారటంతో అనేక దేశాల్లో వినియోగంలోకి రాలేదు. లాటిన్‌ అమెరికా దేశాలకు పెట్టుబడులు సమస్య కూడా ఉంది. సంయుక్తరంగంలో తామెందుకు పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్లు పెదవి విరుస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియాలలో కఠిన శిలలు ఉండే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి. పాక్షిక జాతీయం, ప్రయివేటు రంగ భాగస్వామ్యం అన్న తమ విధానం పెట్టుబడులకు దోహదం చేస్తుందని చిలీ వామపక్ష అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెబుతున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా, కాలుష్యం పెంచని ఆధునిక పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టే వారికి 49.99 శాతం వాటా ఇస్తామని చెప్పాడు. ఖనిజ తవ్వకం స్థానికులకు, దేశ పౌరులకు లబ్ది కలిగించేదిగా ఉండాలన్నాడు.


1995లో ప్రపంచ లిథియం ఉత్పత్తిలో మూడో వంతు వాటా కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. దాని గనుల్లో ఉన్న నిల్వలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.ఈ ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతున్న దశలో తమ ఆటో రంగానికి అవసరమైన దానిని చేజిక్కించుకొనేందుకు అక్కడి కంపెనీలు తప్పకుండా చూస్తాయి.చైనాలో ఉన్న గనులతో పాటు విదేశాల్లో కూడా దాని కంపెనీలకు 5.6బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బాటరీలకు అవసరమైన ప్రపంచ ముడి ఖనిజంలో 60శాతం మేరకు చైనాలో శుద్ది చేస్తున్నారు. డిమాండ్‌ పెరిగే కొద్దీ చిలీ ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో 60శాతం చిలీ, బొలీవియా, అర్జెంటీనా త్రికోణ ప్రాంతంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక చెబుతున్నది. ఫోన్లు, కార్లకు అవసరమైన బాటరీలకు ఇది అనువుగా ఉండటంతో ఒక దశంలో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబరులో టన్ను ధర 14 నుంచి 80వేల డాలర్లకు చేరి తరువాత తగ్గింది. 2040 నాటికి ఇప్పుడున్న డిమాండ్‌ 40 రెట్లు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న చిలీ అమెరికన్‌ కంపెనీల అనుమతి గడువు 2030లో ముగియనున్నది.దానిని పొడిగిస్తారా లేక సంయుక్త భాగస్వామ్యంలోకి మారుస్తారా అన్న అనుమానాలతో ఆ కంపెనీల వాటాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని చిలీ రాగి కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదే మాదిరి లిథియం కంపెనీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ఈ పూర్వరంగంలో అది తెచ్చే లాభాల కోసం సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉంది. చిలీ రాగి గనులకూ ప్రసిద్ది అన్నది తెలిసిందే.ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమను అక్కడ 1973లో అధికారానికి వచ్చిన వామపక్ష నేత సాల్వెడార్‌ అలెండీ జాతీయం చేయటాన్ని అమెరికా, కార్పొరేట్‌ సంస్థలు సహించలేక కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మిలిటరీ తిరుగుబాటుతో అలెండీని హత్య చేశారు. ఇప్పుడు లిథియం పాక్షిక జాతీయకరణ నిర్ణయం నాటి పరిణామాలను గుర్తుకు తెచ్చిందని కొందరు పేర్కొన్నారు.