Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దక్షిణ భారతంలో అడ్డదారిలో మూడున్నర సంవత్సరాల క్రితం అధికారం కైవశం చేసుకున్న ఏకౖౖెక రాష్ట్రాన్ని బిజెపి కోల్పోయింది. బిడ్డ పోయినా పురుటి వాసన పోదు అన్న సామెత తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు చేసిన వాగ్దానాలు, నేతల ప్రసంగాలు రానున్న రోజుల్లో చర్చనీయాంశాలుగా మారతాయి. వాటిలో ఒకటి ప్రధాని నరేంద్రమోడీ మీద కాంగ్రెస్‌ దాఖలు చేసిన ఒక కేసు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఉగ్రవాదానికి-కాంగ్రెస్‌కు సంబంధాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాల మీద విస్తృత దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య పుట్టినిల్లు మన దేశమే అని నరేంద్రమోడీ స్వయంగా చెప్పినందున చట్టం ముందు అందరూ సమానులే కనుక తన మీద దాఖలైన కేసుకు సహకరిస్తారా లేదా అన్నది చూద్దాం.ఓట్‌ బాంక్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని పోషించింది,ఆశ్రయం కల్పించింది, లొంగింది అని మోడీ ఒక ఎన్నికల సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రధాని పదవిని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించటమే గనుక చర్య తీసుకోవాలంటూ పోలింగ్‌కు ముందే బెంగలూరు నగరంలోని హై గ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మోడీ పేర్లున్న కొందరి గురించి రాహుల్‌ గాంధీ కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికలపుడు చేసిన వ్యాఖ్యలు,వాటి మీద గుజరాత్‌లోని సూరత్‌లో కేసు, కోర్టు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష, దాంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వెంటనే అనర్హత వేటు, సదరు తీర్పు చెప్పిన జడ్జికి పదోన్నతి, దాన్ని నిలిపివేసిన సుప్రీం కోర్టు ఆదేశం వంటి అంశాలన్నీ తెలిసినవే. ఈ పూర్వరంగంలో తమ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది గనుక కాంగ్రెస్‌ తాను దాఖలు చేసిన కేసు పట్ల ఎంత శ్రద్ద చూపుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఉగ్రవాదులు అనే అనుమానంతో మధ్య ప్రదేశ్‌ పోలీసులు హైదరాబాదు, శివారు ప్రాంతాలలో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేసి భోపాల్‌ తరలించారు. అక్కడ దొరికిన పదకొండు మంది నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇక్కడ సోదాలు జరిపి పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మజ్లిస్‌ నేత ఒవైసికి చెందిన మెడికాల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరు కూడా ఉన్నారు. వారు ఏ దుండగాలకు పాల్పడిందీ ఇంకా వెల్లడికాలేదు. ఇలా పట్టుబడినపుడల్లా మీడియాలో, బిజెపి నేతల నోళ్లలో హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు నిందితులు సౌత్‌ గ్రూప్‌కు చెందిన వారు అన్న పదజాలాన్ని చార్జి షీట్లలో పదే పదే ప్రస్తావించటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టి మొత్తం దక్షిణ భారతాన్ని నిందించేవిధంగా ఉన్నట్లు చివాట్లు వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను లండన్‌లో జరిగిన ఒక సభలో విమర్శించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీశారని ఊరూవాడా టాంటాం వేస్తున్న వారు హైదరాబాద్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొని అవమానిస్తున్నట్లు కాదా ? ఎక్కడ ఉగ్రవాదులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వారి అడ్డాగా వర్ణిస్తే బిజెపి పాలనలో ఉన్న భోపాల్‌ను కూడా ఆ పార్టీ నేతలు అదే విధంగా పేర్కొంటున్నారా ? ముస్లింలందరూ ఉగ్రవాదులు, దేశ ద్రోహాలు కాదు గానీ దొరికినవారందరూ ముస్లింలే అనే ప్రచారం జరుగుతోంది.నిజమేనా ? అదే ప్రాతిపదికన మరి హిందువులు, క్రైస్తవులు, సిక్కుల సంగతేమిటి ?


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ ఎం కుల్కర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసు దళం పూనేలో మే నెల మూడవ తేదీన అరెస్టు చేసింది, పదిహేనవ తేదీ వరకు కస్టడీకి పంపారు.యాభై తొమ్మిది సంవత్సరాల ఈ పెద్దమనిషి తన తండ్రి, తాతల నుంచి తాము ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్న వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నది రెండింజన్ల పార్టీ అన్నది తెలిసిందే. అందువలన కుట్రతోనో మరోరకంగానో అరెస్టు చేశారని చెప్పేందుకు లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్‌ వారికి సేవ చేసిన పూర్వరంగం, మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడు కావటంతో నాడు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందువలన ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు గానీ అభిమానించే వారు గానీ బహిరంగంగా ఆ అంశాన్ని చెప్పుకొనేందుకు సిగ్గుపడేవారు. గుట్టుగా దాచేవారు. రోజులు మారాయి. చరిత్ర మరుగునపడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు, ద్రోహం చేసిన వారిని అసలు సిసలు సమరయోధులుగా పేర్కొంటూ నకిలీ చరిత్రను రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కొత్త తరాలు అదే నిజమనుకుంటున్నాయి. కుల్కర్‌ లాంటి వారు పాకిస్తాన్‌కు మన రక్షణ రహస్యాలను ఎప్పటి నుంచి చేరవేస్తున్న జాతీయవాదో తెలియదు. తన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశపాలనలో చక్రం తిప్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం గురించి చెప్పుకుంటే తనవైపు చూడరని కుల్కర్‌ అనుకున్నాడేమో అన్న సందేహం కలుగుతోంది. ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పని చేస్తూ ఒక మహిళ వలలో పడి సమాచారాన్ని చేరవేసినట్లు ప్రాధమిక సమాచారం. చార్జిషీటు దాఖలు చేస్తే మొత్తం వెల్లడిఅవుతుంది.


డిఆర్‌డిఓకు చెందిన బాబూరామ్‌ డే అనే మరో ఉద్యోగిని ఫిబ్రవరి 24న ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు.బాలసోర్‌ జిల్లా చండీపూర్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పని చేస్తాడు. అన్ని పరీక్షలపుడు అతడు భాగస్వామి. ఆ సమాచారాన్ని, నిషేధిత ప్రాంతాల ఫొటోలను పాకిస్తాన్‌కు చేరేవేసేవాడని, అతను కూడా ఒక మహిళ వలలో చిక్కుకొని ఆమె ద్వారా కథ నడిపించేవాడని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు అందచేస్తున్నారనే సమాచారంతో (2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ సలహా తానే ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి చెప్పుకున్నారు) 2019లో మధ్య ప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో భజరంగ్‌ దళ్‌ నేత బలరామ్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌, శుభమ్‌ మిశ్రా ఉన్నారు. పంపిన సమాచారం ఎప్పటికప్పుడు కనిపించకుండా చేసే ఒక ఆప్‌ ద్వారా వారు ఉగ్రవాదులకు నిధుల సమాచారాన్ని చేరవేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు బిజెపి యువమోర్చా, బిజెపి ఐటి విభాగ నేత ధృవ సక్సేనా మరోపదిమందిని కూడా ఇదే ఆరోపణలతో అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టుల గురించి రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ అనేక మంది బిజెపికి చెందిన వారు సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నారని, నిధులు, రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. బిజెపి నేతలు పాక్‌ ఐఎస్‌ఐ ఏజంట్లుగా మారారని, వారికి బెయిలు కోసం ప్రయత్నించినందుకు సిఎం శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలని, ఎవరు దేశద్రోహులో చెప్పాలని మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులతో రాజకీయం చేయకూడదని, కోర్టు వారికి బెయిలిచ్చిందని బిజెపి నేత దీపక్‌ విజయవర్గీయ సమర్ధించుకున్నారు. ఈ తర్కం తెలంగాణా బిజెపి నేత బండి సంజయకు అర్ధంగాక లేదా తెలియక తరచూ అదే రాజకీయం చేస్తున్నారా ? బిజెపి చేస్తే సంసారం, ఇతర పార్టీలు చేస్తే మరొకటా ?


కాశ్మీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకడు బిజెపి ప్రాంతీయనేత అని అతను అమిత్‌షాతో దిగిన ఫొటోలు ఉన్నట్లు, అమరనాధ్‌ యాత్రీకుల మీద దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు 2022 జూలై 9న కాంగ్రెస్‌ నేతలు ఒకే రోజు దేశమంతటా 23 చోట్ల విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. నూపుర్‌ శర్మ నోటి దురుసు మాటలకు ప్రభావితుడై మద్దతు తెలిపిన ఉదయపూర్‌ దర్జీ కనయలాల్‌ను హత్య చేసిన వారిలో బిజెపి మద్దతుదారులు ఉన్నట్లు, ఒక తీవ్రవాద బృందానికి ప్రభుత్వ నిధులను అందచేసినందుకు 2017లో అసోం బిజెపి నేత నిరంజన్‌ హజయికి ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు కూడా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.శ్రీనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉగ్రవాది అజార్‌ మసూద్‌ శిష్యుడు మహమ్మద్‌ ఫరూక్‌ ఖాన్ను బిజెపి నిలిపిందని కూడా వెల్లడించారు.


హైదరాబాదులో దొరికిన ఉగ్రవాదులు ఇరుగుపొరుగువారితో ఎలాంటి వివాదాలు లేకుండా అసలు ఉన్నట్లే తెలియకుండా ఉన్నారని, అరెస్టులతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడినట్లు మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ఎవరైనా మెడలో బిళ్ల వేసుకొని లేదా ఇంటికి బోర్డు పెట్టి తమ గుర్తింపును వెల్లడించుకుంటారా ? హైదరాబాదులో అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురు మతం మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నట్లు కూడా ఒక పత్రిక రాసింది. అదే వాస్తవమైతే కొందరు హిందువుల పధకం ప్రకారమే మతం మారి ముస్లింల పేరుతో ఉగ్రవాద విద్రోహులుగా పని చేస్తున్నట్లు భావించాలి. ఇదొక కొత్త కోణం. ఒక ఉగ్రవాద ముఠా కుట్రను భగం చేసినట్లు 2018 ఆగస్టులో మహారాష్ట్ర ఏటిఎస్‌ టీమ్‌ ప్రకటించింది.వారిలో ఒకడి అరెస్టు వార్తతో ఇరుగుపొరుగు వారు అవాక్కయ్యారట. ఇరుగుపొరుగువారితో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, సమాజంలో ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని కూడా చెప్పారట. వారిలో వైభవ్‌ రౌత్‌ గో వంశ రక్ష సమితి నేతగా చెప్పుకున్నాడు. అతని అనుచరులుగా సుధాన్వ గోంధాల్కర్‌, శరద్‌ కలాస్కర్‌ ఉన్నారు. పోలీసులు వెల్లడించినదాని ప్రకారం వీరు మరికొందరు కలసి ఒక ఉగ్రవాద ముఠాగా ఏర్పడ్డారు. వారిలో రౌత్‌, కలాస్కర్‌ వద్ద 20 నాటుబాంబులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, రెండు జిలిటెన్‌ స్టిక్స్‌, నాలుగు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 22 ఇతర డిటోనేటర్లు, రెండు సీసాల విషం, బాటరీలు, తదితరాలు దొరికాయి.సుధాన్వ గోంధాల్కర్‌ వద్ద పదకొండు నాటు తుపాకులు, తూటాలు, ఇతర విడిభాగాలు లభించాయి. ఇవన్నీ గోవులను సంరక్షించటానికే అని జనం నమ్మాలి. రౌత్‌ మతవిద్వేషాన్ని రెచ్చగొట్టటంలో దిట్ట. అతని నివాస ప్రాంతం పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండటంతో వారి పండుగులపుడు రౌత్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశిస్తారు.సనాతనతో సహా అనేక హిందూత్వ సంస్థలతో కలసి సభల్లో అతను పాల్గొంటాడు. కలాస్కర్‌ అరెస్టు వార్త వినగానే సోదరుడు, ఇతర బంధువులు నమ్మలేదు. కొల్లాపూర్‌లో ఏదో పని చేస్తున్నాడనే భావనలో వారు ఉన్నారు.వివిధ సందర్భాలలో హిందూత్వ సభలు, ప్రదర్శనల్లో కలుసుకున్న వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.మాలెగావ్‌ పేలుడు కేసులో అరెస్టయిన హిందూ తీవ్రవాదుల గురించి తెలిసిందే.


హిందూమతానికి ప్రమాదం వచ్చిందని, హిందూత్వ పేరుతో సాగిస్తున్న విద్వేష ప్రచారంతో అనేక మంది అమాయకులు నమ్మి అలాంటి వారి వలలో చిక్కుకుంటున్నారు. తొలుత బోధలతో బుర్రలను చెడగొట్టి తరువాత నేరాలు చేయించి తమ వలలో బంధిస్తారు.మాఫియా, గూండా ముఠాలు, ఇస్లామిక్‌, ఇతర అన్ని రకాల తీవ్రవాద సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇలాంటి శక్తులకు ఒక ప్రాంతం, దేశం, ఖండం అనే తేడాలు ఉండవు. ఎక్కడబడితే అక్కడ విష బీజాలు నాటుతారు. ఇస్లాంకు ముప్పు వచ్చిందని, భారత్‌తో సహా ప్రపంచమంతా ఇస్లామిక్‌ రాజ్యాలను స్థాపించాలని ఆ మత ఉగ్రవాద, ఛాందస సంస్థలు ఎలా రెచ్చగొడతాయో మిగిలిన మతోన్మాదశక్తులూ అంతే. దానికి ఒక ఉదాహరణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య. ఆమెను కాషాయ ఉగ్రవాదులు చంపారన్న కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. పదివేల పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందూ యువతీ,యువకులను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. అలా మారినవారే గౌరీ లంకేష్‌ను హతమార్చారు.వారిలో ఒకడు అమోల్‌ కాలే అనే మెకానికల్‌ ఇంజనీరు. బహుళజాతి గుత్త సంస్థలో ఉద్యోగం మానుకొని హిందూత్వకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు.హిందూ మతానికి ముప్పు తలెత్తిందనే విష ప్రభావానికి లోనై ఒక ఉన్మాదిగా మారినట్లు అతని తీరుతెన్నులు స్పష్టం చేశాయి. ఎవరైనా హిందూమతాన్ని కించపరిచినట్లు అని పిస్తే వారి మీద హింసాత్మక దాడులకు పాల్పడాలని తనకు అనిపిస్తుందని విచారణలో పోలీసులకు చెప్పాడు. గౌరితో పాటు హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారేల హత్యల్లోనూ ఇతని హస్తం ఉంది. మరోహేతువాది కెఎస్‌ భగవాన్ను కూడా చంపేందుకు కుట్ర చేశాడు.


కెనడా హిందూ మహాసభ అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రాన్‌ బెనర్జీ బీట్‌ ఆఫ్‌ ద నార్త్‌ అనే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీని గురించి 2022 జూన్‌ 25న వార్తలు వచ్చాయి.ముస్లింలు, సిక్కులను ఊచకోత కోయాలని చెప్పాడు. ” హిందూయిజం ఒక మార్గం. నేను తీవ్ర హిందూ జాతీయవాదిని.భారత్‌లో మాదిరి కెనడాలో కూడా నరేంద్రమోడీ పాలన రావాలని కోరుకుంటున్నాను. అతను ముస్లింలు, సిక్కు తీవ్రవాదులను హతమారుస్తాడు.దాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే వారు చావాల్సిందే, మోడీ చేస్తున్నది అద్భుతంగా ఉంది.” అని చెప్పాడు. ఇలా మాట్లాడినందుకు ఒకసారి అరెస్టైనా తీరు మార్చుకోలేదు. అమెరికా, కెనడాల్లో ఉన్న ఇలాంటి వారు హిందూత్వ సంస్థలకు అందచేస్తున్న నిధుల వంటి అనేక అంశాలను చూస్తే ఇస్లామిక్‌ జీహాదీల మాదిరే హిందూ జీహాదీలను కూడా తయారు చేస్తున్నారు. ఏ మత జీహాదీలైనా అమెరికా ఉగ్రవాద పరిశ్రమకు లాభాలు తెచ్చిపెట్టే వారిగా మారుతున్నారు.