Tags

, , ,


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.