• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP

రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో వంచనాపూరిత వాదనలు -వాస్తవాలూ !

08 Tuesday Dec 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ 1 Comment

Tags

Bharat Bandh 2020, Farmers agitations, India farmers' protest


ఎం కోటేశ్వరరావు
డిసెంబరు ఎనిమిదిన రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు భారత బంద్‌ జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలంటున్నది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా రెచ్చగొట్టేందుకు పూనుకొని వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. తాజా ఆందోళన ఎంతకాలం కొనసాగుతుంది, ఏమౌతుంది అన్నది ఒక అంశమైతే రైతుల ఆందోళనల సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. ప్రతి ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించే శక్తులు తప్పుడు వాదనలూ, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పంజాబు రైతులే ఎందుకు ఆందోళనలో ముందున్నారు, మిగతా రాష్ట్రాల వారు ఎందుకు స్పందించటం లేదు వంటి కొన్నింటి తీరు తెన్నులను చూద్దాం.


1.పార్లమెంట్‌ అంగీకరించిన తరువాత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ?
ఇది తర్కానికి నిలిచేది కాదు. పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన వ్యతిరేకత వ్యక్తం చేయకూడదని చెప్పటం నిరంకుశత్వలక్షణం. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిని అప్పటి పార్లమెంట్‌, రాష్ట్రపతి ఆమోదించారు. అయినా నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం ఎందుకు వ్యతిరేకించింది ? ఆర్టికల్‌ 370, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా పార్లమెంటు ఆమోదించినవే అయినా బిజెపి ఎందుకు వ్యతిరేకించింది, రద్దు చేసింది ?


2.ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఆందోళన చేయలేదు ?
ఇది తప్పుడు ప్రచారం. ఆర్డినెన్స్‌లు తెచ్చినపుడే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా వీధుల్లోకి రాలేదు, అన్నింటికీ మించి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందనే ఆశ, నమ్మకం ఉండటం. ఇవి రెండూ పోయిన తరువాత మరొక మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన బిజెపి మిత్రపక్షం అకాలీదళ్‌ చెప్పింది అదే. రెండు వ్యవసాయ, ఒక వినియోగదారుల చట్టాలకు సంబంధించి మార్పులను ఆర్డినెన్సుల ద్వారా అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు అంశాలూ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. చర్చలు జరపలేదు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నాయి గనుక మౌనం దాల్చాయి.


3. ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కదా !
పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ స్దానే బిల్లులను ప్రవేశపెట్టినపుడు సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం తోసి పుచ్చింది. నిరసనల మధ్య ఆమోద తతంగాన్ని పూర్తి చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపింది. వీటిని ఎందుకు తిరస్కరించినట్లు ? ఇది ప్రజాస్వామ్యమా ? విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అంతర్గతంగా హామీ ఇచ్చారు కనుకనే ఆర్డినెన్సు, తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమోద తతంగం చేశారు. అందువలన అవి రద్దయ్యేవరకు గళం విప్పుతూనే ఉండటం తప్పెలా అవుతుంది.


4. రైతులు మొండిగా ఉన్నారు, కమిటీ వేస్తామన్నారు కదా, ఎందుకు అంగీకరించరు ?
మొండిగా ఉన్నది ప్రభుత్వమే. తమ మిత్రపక్షం అకాలీదళ్‌ నిరసన వ్యక్తం చేసినా రాజకీయంగా దానితో విడగొట్టుకొనేందుకు అయినా సిద్దపడింది గానీ ఆ పార్టీ చెబుతున్నదానిని కూడా వినిపించుకోలేదు. సెప్టెంబరు 25న అఖిల భారత నిరసన దినం పాటించాలని అఖిల భారత కిసాన్‌ సంఘర్ష సమితి పిలుపు ఇచ్చింది, పాటించారు. అప్పుడు స్పందించలేదు. తరువాత నవంబరు 26న ఆందోళన పిలుపునూ పట్టించుకోలేదు. తీరా రైతులు ఢిల్లీ బయలు దేరిన తరువాత శివార్లలో కందకాలు తవ్వేందుకు, ఆటంకాలు ఏర్పాటుకు చూపిన శ్రద్ద పరిష్కారం మీద లేదు. రైతులు వచ్చిన వారం తరువాత చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయితే వత్తిడిని తట్టుకోలేక ముందే చర్చలకు పిలిచింది. కమిటీని వేస్తామనటం తప్ప మార్పులకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు కేంద్రం వైపు నుంచి లేవు. ఇది కాలయాపన, ఉద్యమాన్ని చల్లార్చే ఎత్తుగడ. అలాంటపుడు రైతులేమి చేయాలి ?


5. కేంద్రం చెబుతున్నది ఏమిటి ? రైతులు కోరుతున్నది ఏమిటి ?
ఐదుసార్లు చర్చలు జరిపారు. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని రైతులు ప్రతిసారీ చెప్పారు. సావిత్రీ నీ పతి ప్రాణంబుదక్క వరాలు కోరుకోమన్నట్లుగా అది మినహా ఇతర అంశాల గురించి మాట్లాడుదాం అనటం తప్ప కేంద్రం నుంచి మరొకమాటలేదు. రైతులు చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఇంతవరకు చెప్పలేదు.


6. కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు, కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తరువాత కూడా రైతులు ఆందోళన చేయటం ఏమిటి ?
ఆ మార్పులేమిటో నిర్దిష్టంగా చెబితే రైతులు ఆలోచిస్తారు. ఎవరు చెబుతున్నది ఏమిటో జనమూ గ్రహిస్తారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరితే ఆందోళనకు మద్దతు తగ్గిపోతుంది. అయినా ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో చెప్పిందేమీ లేదు. ఎవరితో సంప్రదించకుండానే ఆర్డినెన్సు తెచ్చారు. పార్లమెంట్‌లో అభ్యంతరాలను పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గురించి బిజెపి ఎంత హడావుడి చేసిందో తరువాత ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. యాభై రోజుల్లో పెద్ద నోట్ల రద్దు సమస్యను పరిష్కరించలేకపోతే శిక్షించమని మోడీ చెప్పారు. నాలుగేండ్ల తరువాత నల్లధనాన్ని తగ్గించామని బుకాయించటం తప్ప అంకెల్లో చూపారా? జిఎస్‌టి ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని చేసుకున్న ఒప్పందానికే ఎగనామం పెడుతూ దేవుడి లీల, కేంద్రం పరిహారం ఇవ్వలేదని బుకాయించిన తీరు చూశాము. అందువలన ప్రధాని నోటి మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు ? కనీస మద్దతు ధర గురించి చెబుతున్న మాటలనే చట్టబద్దం ఎందుకు చేయరని రాజస్దాన్‌, హర్యానాలో ఉన్న బిజెపి మిత్రపక్షాలే చెబుతున్నాయి. దాన్నయినా చేస్తామని ఎందుకు చెప్పటం లేదు ?


7. రైతులకు ఉపయోగం లేకపోతే జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు కేంద్రాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు ?
జయప్రకాష్‌ నారాయణ ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి. రాజకీయాల్లో ఒక విఫలనేత. ఆయన ఎందుకు సమర్ధిస్తున్నారో స్కాన్‌ చేసి చూడలేము. అయితే ఒక మేథావిగా ఆయన చెప్పిన మాటలను వినాల్సిందే. కానీ అవే ప్రమాణం కాదు. జెపి కంటే వ్యవసాయ-ఆర్ధిక రంగంలో ఎంతో పరిశోధనలు చేసిన నిపుణులు అనేక మంది వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో జెపి ఎంత బాగా తెలిసిన వ్యక్తో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా అంతే తెలుసు. మరి నాగేశ్వర్‌ వ్యతిరేకతను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.

7. రైతులను బిజెపి వ్యతిరేక పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి !
రైతులు అంత అమాయకులు కాదు. ఒక వేళ ఇతర పార్టీలు తప్పుదారి పట్టిస్తే బిజెపి వారిని సరైనదారిలో పెట్టలేనంత అసమర్ధంగా ఉందా ? ఈ ఆరోపణ రైతుల అనుభవం, తెలివితేటలను అవమానించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో, ప్రపంచంలో రైతాంగ ఉద్యమాలు కొత్త కాదు,ఎన్నో చారిత్మ్రాక పోరాటాలు చేశారని మరచిపోకూడదు. పంజాబ్‌ పోరాటాల గడ్డ, పంజాబీలు అటు సైన్యంలో జైజవాన్లుగా, వ్యవసాయంలో జైకిసాన్లుగా వారి పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సెప్టెంబరు 25న తొలి ఆందోళన ప్రారంభమైంది. అప్పటి నుంచి రైతులను సమాధాన పరిచేందుకు బిజెపి చేసింది ఏమిటి ?


8.ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ 2019 మానిఫెస్టోలో చెప్పింది.
ప్లేటు ఫిరాయించటం రాజకీయాల్లో కొత్త కాదు, అది ప్రజలకు మేలు చేసేది, తప్పిదాన్ని సరిదిద్దుకొనేది అయితే ఇబ్బంది ఏమిటి. ముఖ్యమంత్రిగా జిఎస్‌టిని వ్యతిరేకించిన నరేంద్రమోడీ తీరా తాను ప్రధాని అయిన తరువాత తగినకసరత్తు లేకుండా అమలు జరపటాన్ని , దేశాన్ని ఇబ్బందుల పాటు చేయటాన్ని ఏమనాలి. అనేక రాష్ట్రాలకు ప్రకటించిన పాకేజీలు, హామీలను తిరస్కరించటం ఏమిటి ? రెండు తెలుగు రాష్ట్రాలకు బిజెపి, కేంద్రి ఇచ్చిన హామీలకు మొండి చేయి చూపటాన్ని ఏమనాలి? బిజెపి గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తోంది.

9. పంజాబ్‌ రైతులు, జాట్‌కులస్తులు తప్ప ఉద్యమంలో ఎవరూ లేరు ?
జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు చేస్తున్న తప్పుడు వాదన ఇది. కుల వ్యవస్ధ ఉన్న కారణంగా ప్రతి వారూ పుట్టుకతో ఏదో ఒక కులానికి చెందుతున్నారు. అనేక మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ఉన్నారు ? మరి జెపి ఒక్కరే లోక్‌సత్తా ఎందుకు పెట్టారు ? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు ? ప్రజల సొమ్ముతో వైద్య విద్యను చదివి ప్రాక్టీస్‌ చేయకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, జనానికి అవసరమైన మరొక వైద్యుడు తయారు కాకుండా అడ్డుకోవటమే. అలాంటి వారిలో జెపి ఒకరు ఎందుకు అయ్యారు ? పోనీ ఐఎఎస్‌ అధికారిగా అయినా కొనసాగి జనానికి మేలు చేయలేదు.
ఎస్‌ పంజాబ్‌ రైతులు ఉద్యమంలో ముందున్నారు. సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకేసారి ముందుకు ఎందుకు రాలేదో జెపి వంటి వారు చెప్పాలి. హరిత విప్లవంలో పంజాబ్‌ రైతులు ముందున్నారు. వ్యవసాయ మిగులును సాధించటంలోనూ వారే ముందున్నారు. ఆ మిగులుకు మార్కెటింగ్‌ సమస్యలు వచ్చినపుడు ప్రభావితమయ్యేదీ వారే కనుక, ముందుగా మేలుకున్నారు.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వంద ఎకరాలలో వంద కిలోల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయనుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని 15.71 ఎకరాల్లో 16.91 కిలోలు, మధ్య ప్రదేశ్‌లోని 12.7 ఎకరాల్లో 12.08 కిలోలు పంజాబ్‌లోని 5.4 ఎకరాల్లో 11.29 కిలోలు పండుతున్నాయి. మిగిలిన సంవత్సరాలలో కూడా స్వల్ప తేడాలతో ఇదే విధంగా ఉంటాయి. దీనర్దం ఏమిటి పంజాబ్‌లో అమ్ముకోవాల్సిందీ ఎక్కువే. మార్కెట్‌ కమిటీలను, సేకరణ వ్యవస్ధలను పనికిరాకుండా చేసి, కనీస మద్దతు ధరలను నీరుగారిస్తే ఎక్కువగా నష్టపోయేది పంజాబ్‌ రైతులే కనుక వారే ముందుగా మేలుకున్నారు.
2017-18 వివరాల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్‌ 13.26శాతంతో దేశంలో అగ్రస్దానంలో ఉంటే 11.85శాతంతో పంజాబ్‌, 11.75శాతంతో ఉత్తర ప్రదేశ్‌ రెండు, మూడు స్దానాల్లో ఉన్నాయి. ఇక బియ్యం వినియోగంలో నెలకు తలసరి వినియోగం పంజాబ్‌లో బియ్యం 0.4కిలోలు ఉంటే 14.5కిలోలతో ఒడిషా ప్రధమ స్దానంలో ఉంది. అందువలన రెండు రాష్ట్రాల రైతులకూ మార్కెటింగ్‌ సమస్యలు ఒకే విధంగా ఉంటాయా ? ఎంత పండినా వినియోగించే స్దితిలో ఒడిషా రైతు, అమ్ముకోవాల్సిన అవసరంతో పంజాబ్‌ రైతు ఉంటాడు. అందుకే ఆందోళనలో ముందుంటాడు. ఇలాంటి తేడాలే ఉంటాయి.


10.ఆందోళన చేస్తున్నది రైతులు కాదా ?
మరి ఎవరు ? సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు పంజాబ్‌ గురించి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకదానిలో చెప్పినదాని ప్రకారం పంజాబ్‌లో వ్యవసాయం చేసే గ్రామాలు కేవలం 1,500 మాత్రమేనట. అక్కడ 30వేల మంది అడితియాస్‌(కమిషన్‌ ఏజంట్లు), వారి వద్ద పని చేసే మూడులక్షల మంది సహాయకులు కలిపి ప్రతి గ్రామానికి 220 మంది చొప్పున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారట. చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో 12,729 గ్రామాలున్నాయి. తరువాత ఏవైనా కొన్నింటితో మున్సిపాలిటీలు ఏర్పాటు అయి ఉండవచ్చు. పన్నెండు వేలకు తగ్గవు.పంజాబ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా చెబుతుంటే 1500 గ్రామాలతో అంత ఉత్పత్తి సాధ్యమా ? దీన్ని ప్రచారం చేస్తున్న వారు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. ఇలాంటి లెక్కలతోనే అడితియాసే రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నట్లు బిజెపి, దాని తొత్తులు ప్రచారం చేస్తున్నారు.


11. ఇతర రాష్ట్రాలతో పోల్చటం తప్పంటారా ?
ఈ ప్రశ్నకు పంజాబ్‌ రైతుల గురించి చెప్పినదానిలోనే కొంత సమాధానం ఉంది. మార్కెట్‌ యార్డుల వెలుపల అమ్ముకొనే స్వేచ్చ ఇస్తే రైతులకు లాభం అని చెప్పేవారి దగ్గర ఆధారం లేదు. ఒక భ్రమ మాత్రమే. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2006లోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రద్దు చేసింది. ధాన్య సేకరణ బాధ్యతను సహకార సంస్దలకు, వ్యాపారమండళ్లకు అప్పగించింది. గత ఏడాది 30లక్షల టన్నులు సేకరణ లక్ష్యంగా చెప్పారు, 20లక్షల టన్నులకు దాట లేదు. గతేడాది క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,815 ఉంటే బహిరంగ మార్కెట్లో సీజన్లో రూ.1,350కి అమ్ముకున్నారు( మే 8, 2019 డౌన్‌టు ఎర్త్‌). ఏటా బీహార్‌లో 1.6 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో 30లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. ఈ ఏడాది నవంబరు 15 నుంచి డిసెంబరు ఐదువరకు కొన్నది కేవలం 793 టన్నులు మాత్రమే. కనీస మద్దతు ధర రూ.1,868 కాగా రైతులు రూ.800-1200 మధ్య అమ్ముకుంటున్నారు(డిసెంబరు ఆరు, 2020 ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌). అందుకే బీహార్‌ పరిస్ధితితో పోల్చుకొని పంజాబ్‌ రైతులు ముందే మేలుకున్నారు. పంజాబీలను చూసి బీహారీలు కూడా వీధుల్లోకి రావచ్చు.అందువలన అందరూ ఉద్యమంలోకి ఎందుకు రావటం లేదని కాదు వచ్చిన వారి డిమాండ్లలో న్యాయం ఎంత అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశాఖ రైల్వేజోన్‌ ఎండమావేనా ?

04 Sunday Oct 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Indian Railways, SCoR-Visakhapatnam, South Coast Railway (SCoR) zone


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నిజంగా తలచుకోవాలేగానీ ఏదైనా క్షణాల్లో అయిపోతుంది. కోరుకున్నవాటిని మాత్రమే తలచుకుంటారు, అదే అవుతుంది. జూన్‌ ఐదున వ్యవసాయ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చి సెప్టెంబరు మూడవ వారానికి పార్లమెంటులో ఆమోదం కూడా పొందారు. కరోనా అడ్డం రాలేదు. కాశ్మీరు రాష్ట్ర రద్దు అయితే ఒకే ఒక్క రోజులో పూర్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదు, ఎంత పట్టుదల, ఎంత వేగం ? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కారు మూడురాజధానులు, ఇతర కొన్ని కేసుల మీద ఉన్న ఆత్రంతో వివాదాల విచారణను వేగవంతం చేయించాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టటాన్ని చూశాము. రాష్ట్రానికి అది అత్యంత ప్రాముఖ్యత అంశంగా భావించారు. విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి ? ఎవరికైనా పట్టిందా, వెంటనే ఉనికిలోకి తీసుకురావాలనే కోరిక ఉందా ?


కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఉనికిలోకి రావటం గురించి అటు కేంద్రానికి పట్టలేదు, ఇటు రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఎంత సమయం తీసుకుంటారు ? ఏమిటి ఆటంకాలు ? రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాగ్దానం చేసినమేరకు నిర్ణయం తీసుకొనేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ప్రకటించారు. పందొమ్మిది నెలలు గడుస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కరోనాను చూపుతున్నారు ? కరోనా కారణంగా ఏది ఆగింది ? రైల్వే జోన్‌ ఉనికిలోకి ఎందుకు రావటం లేదు ?


విశాఖ రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తారు, ఆ భవనాల్లో జోనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. సిబ్బందిని కొత్తగా నియమించటం లేదు, ఉన్నవారినే సర్దుబాటు చేయవచ్చు, దానికీ ఇబ్బందీ లేదు.లాక్‌డౌన్‌ దశలవారీ ఎత్తివేస్తున్నారు.నామ మాత్రంగానే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరి ఆటంకం ఏమిటి ? కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు డబ్బు కొరతా ? అదేమీ వేల కోట్లు కాదే ! పోనీ అదైనా చెప్పాలి కదా ? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశారు. వస్తున్న వార్తలను బట్టి వచ్చే ఏడాది కూడా దేశ జిడిపి తిరోగమనంలో ఉంటుందని చెబుతున్నారు. పోనీ పురోగమనంలోకి వచ్చిన తరువాతే ఉనికిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడరు ? ఏమనుకోవాలి ?
వస్తున్న వార్తలను బట్టి సంస్కరణల పేరుతో ఇప్పుడు ఉన్న 17 రైల్వే జోన్లను తగ్గిస్తారా ? అందుకే 18వ జోన్‌ విశాఖను తాత్సారం చేస్తున్నారా ? రైల్వే సంస్కరణల్లో భాగంగా అసలు జోనల్‌ వ్యవస్ధలనే ఎత్తివేసి కార్యకాలపాల ఆధారంగా కొత్త సంస్ధలను ఏర్పాటు చేస్తారా ? అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.ఏమైనా జరగవచ్చు. రైల్వేలను కూడా దశలవారీ ప్రయివేటీకరించే ఆలోచనలో పాలకులు ఉన్నారు.దానికి అవసరమైన నియంత్రణ కమిషన్‌, ధరల పెరుగుదలకో మరొక పెరుగుదలకో చార్జీల పెంపును ముడిపెట్టి ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా అధికార యంత్రాంగమే నిర్ణయించే ఏర్పాట్లు కూడా ఆలోచనలో ఉన్నాయి.


జపాన్‌లో రైల్వే వ్యవస్ధ ప్రయివేటీకరణ తరువాత సరకు రవాణాకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించారు, ప్రయాణీకుల విషయానికి వస్తే ఆరు ప్రాంతీయ కంపెనీలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో రైళ్లు నడపాలో లేదో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చారు. చైనాలో పునర్వ్యవస్దీకరణలో భాగంగా సరకు రవాణా, ప్రయాణీకులు, రైలు మార్గాల యాజమాన్యాలకు స్వతంత్ర సంస్దలను ఏర్పాటు చేశారు. ఆ మూడు విభాగాల్లో కూడా ఉప విభాగాలు ఉంటాయి. బ్రిటన్‌లో ప్రయివేటీకరణలో భాగంగా 25కంపెనీలను ఏర్పాటు చేసి ప్రయివేటీకరించారు. మన దేశంలో కూడా ప్రయివేటు రైళ్లను అనుమతించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. రైల్వే బోర్డు, జోనల్‌, డివిజన్లను రద్దు చేసి కొత్త వాటిని తీసుకు రారనే హామీ లేదు.


ఈ నేపధ్యంలోనే మూడులక్షల ఉద్యోగాలను రద్దు చేయాలని 55 ఏండ్లు దాటిన వారి జాబితాలను సిద్దం చేయాలని, సిబ్బంది పని తీరును సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జోన్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 13-14 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.రిటైరైన ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచటం, పని తీరు బాగోలేదని భావించిన వారిని నిర్బంధంగా రిటైర్‌ చేయించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విషయమై జోనల్‌ అధికారులకు రాసిన లేఖలు తీవ్ర సంచలనం, ఉద్యోగుల్లో వ్యతిరేకత తలెత్తటంతో వివరణ పేరుతో శాంత పరిచేందుకు మరొక ప్రకటన చేశారు.పని తీరుబాగో లేని వారిని తొలగించటం అంటే కొత్త ఉద్యోగాలు ఉండవని కాదన్నదే దాని సారాంశం. 2014-19 మధ్య 2,83,637 పోస్టుల భర్తీ కసరత్తు జరిగిందని వాటిలో 1,41,060పోస్టులకు పరీక్షలను పూర్తిచేశామని ఆ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నది.


పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా రక్షణ సిబ్బందిని తప్ప కొత్తగా ఏ పోస్టును సృష్టించవద్దని ఆదేశించారు. ఉన్న సిబ్బందితో పలు రకాల పనులు చేయించాలి. కనీస సంఖ్యలో సిబ్బందితో పని చేయించేందుకు ఏర్పాటు చేయాలని, కొత్తగా నియామకాలు జరపవద్దని, గత రెండు సంవత్సరాల్లో సృష్టించిన పోస్టుల గురించి సమీక్ష జరపాలని, వాటిలో నియామకాలు జరపకపోతే నిలిపివేయాలని, సిబ్బందిని హేతుబద్దీకరించాలని, ఆర్ధికంగా లాభసాటి గాని శాఖలను మూసివేయాలని, ఇంకా అనేక పొదుపు చర్యలను ఆదేశించారు. 2014కు ముందు ప్రకటించిన గుల్బర్గ, జమ్ము, సిల్చార్‌ తప్ప కొత్త డివిజన్ల ఏర్పాటు ఆలోచన లేదని 2015లో కేంద్ర ప్రకటించింది.విశాఖను రద్దు చేస్తున్నారు కనుక రాయఘడ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గాను విశాఖ డివిజన్‌ను రద్దు చేసి దాని ఆధీనంలోని 30శాతం మార్గాలను విజయవాడ డివిజన్‌లో విలీనం చేసి మిగిలిన వాటితో రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖ జోన్‌ ఉనికిలోకి రానున్నదని సంకేతాలు ఇచ్చారు.వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను గత ఆగస్టులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని దానిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రైల్వే మార్గాలన్నీ విశాఖ జోన్‌లో ఉంచాలని పలువురు కోరారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తరువాత కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నుంచి ఆరునెలల వ్యవధి అవసరం అవుతుందని అంచనా. డిపిఆర్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోనరెడ్డి లేదా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గానీ ఈ అంశం మీద కేంద్రాన్ని సంప్రదించినట్లు వార్తలు లేవు.


విశాఖ జోన్‌ ఉనికిలోకి వస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఒడిషాలో రాజకీయ సమస్యలకు దారి తీయవచ్చు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలను ఒకేసారి సంతృప్తి పరచటం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది. తమ జోన్‌ పరిధి తగ్గిపోనుందనే భయంతో బిజెపి, దాని మిత్ర పక్షం బిజెడి తెచ్చిన వత్తిడి మేరకు విశాఖ డివిజన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిషాలో బిజెపి పరువును కాపాడేందుకు ఏదో ఒక సాకుతో విశాఖ జోన్‌ ఉనికిలోకి రాకుండా చూడాలని కేంద్రం చూస్తున్నదా ? రైల్వేజోన్ల తగ్గింపు అంశం కూడా పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి పార్లమెంట్‌లో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే వాస్తవమైతే ఆ పేరుతో విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినట్లుగానూ ఇవ్వనట్లుగానూ ఎటూ తేల్చకుండా ఉంచేందుకు పూనుకున్నారా ? ఏమో ! కేంద్ర పెద్దలు దేనికైనా సమర్ధులు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకపార్టీ లేదా బిజెపి లేదా దాని మిత్ర పక్షాలకు ఇదేమీ పట్టినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఒక దగా ! వి శాఖ రైల్వే జోన్‌ మరో దగా కాదు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ?

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.
ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?
విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.

మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.
సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.
ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.
రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ మొక్కజొన్నల దిగుమతి రైతాంగాన్ని దెబ్బతీస్తుందా -హైకోర్టులో రిట్‌ !

27 Monday Jul 2020

Posted by raomk in AP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

maize imports, maize imports by India, maize imports by modi government


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 25న నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఐక్య జనతా దళ్‌(జెడియు)-బిజెపి-ఎల్‌జెపి, ఇతర చిన్న పార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హౌమం నిర్వహించారు. అంతకు మూడు రోజుల ముందుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఐదులక్షల టన్నుల మొక్క జొన్నలు, పదివేల టన్నుల పాలు, పాలపొడి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణంగా దిగుమతి చేసుకోవాలని ఎవరైనా వాంఛిస్తే ధాన్య రకాలపై 50 నుంచి 60శాతం, పాలు, పాల ఉత్పత్తులపై 30 నుంచి 60శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించి తెప్పించుకోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధ కోటా నిబంధనల మేరకు పైన పేర్కొన్న పరిమాణాలను కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతి చేసుకోనున్నారు.


మొక్కజొన్నలను దిగమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు అక్రమ వాణిజ్య పద్దతులను అనుసరిస్తున్న కారణంగా రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటీషన్లలో అనేక మంది రైతులు తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకున్న సంస్దలు వాటిని నూతన విలక్షణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేందుకు వినియోగించాలనే షరతును పెట్టింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలను వేయించి పేలాలుగా తయారు చేస్తే అది కొత్త ఉత్పత్తి కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్నవాటిని తిరిగి వేరే సంచులలో నింపి అమ్మితే కుదరదని అటువంటపుడు కేంద్రం ఏవిధంగా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల కారణంగా తమకు రావాల్సిన ధరలు పడిపోయాయాని రైతులు వాదించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసును వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఉద్దీపన పధకాలు ప్రకటించినా మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలకు 90 రూపాయలు పెంచిన తరువాత 2020-21 సంవత్సరానికి రు.1,850గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి నిర్ణయాన్ని ప్రకటించక ముందే దిగుమతుల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్వింటాలుకు 900 నుంచి 1200 రూపాయల వరకు మాత్రమే రైతులు పొందారని అనేక రాష్ట్రాల వార్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులను విధిగా దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వర్తమాన తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో కోళ్ల దాణా తయారీదారులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో గుడ్లు, కోడి మాంస వినియోగం కూడా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ పాడి పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. వివాహాల సమయంలో ఐస్‌ క్రీమ్‌ పెద్ద ఎత్తున వినియోగించే విషయం తెలిసిందే. వివాహాలకు అతిధులపై తీవ్ర ఆంక్షలున్న కారణంగా ఈ ఏడాది అసలు అడిగిన వారే లేరు. ఇతర ఉత్పత్తులకు సైతం డిమాండ్‌, ధర కూడా గణనీయంగా పడిపోయింది.


మొక్క జొన్న విషయానికి వస్తే ఆసియా ఖండంలో అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు డిమాండ్‌ తగ్గి 2019లో మార్కెట్‌ పెరిగింది. చైనా 274 మిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో ఉండగా ఇండోనేషియా 33, భారత్‌ 28 మిలియన్‌ టన్నులతో వినియోగంలో రెండు మూడు స్ధానాల్లో ఉన్నాయి. అందువలన చైనా వినియోగం, సాగులో, కొనుగోలు విధానాల్లో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తలసరి వినియోగంలో దక్షిణ కొరియా 223 కిలోలతో ప్రధమ స్ధానంలో ఉండగా చైనా 188, వియత్నాం 159 కిలోలతో తరువాతి స్ధానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి విషయంలో 2019లో ఆసియాలో గరిష్ట స్ధాయిలో 379 మి.టన్నులు ఉత్పత్తి కాగా ఒక్క చైనా వాటాయే 270 మి.ట, ఇండోనేషియా 33, భారత్‌ 29 మి.టన్నులు ఉంది.మన దేశంలో వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొంత ఎగుమతి చేస్తున్నాము. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల కారణంగా దిగుమతులు కూడా చేసుకోవాల్సి వస్తోంది.చైనా వినియోగం ఎక్కువ, దానికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనలకు అనుగుణ్యంగా దిగుమతి చేసుకుంటున్నది. వర్తమాన సంవత్సరంలో చైనాలో 260-265 మి.ట, భారత్‌లో 28 మి.ట దిగుబడి ఉండవచ్చని అంచనా.


దిగుబడుల విషయానికి వస్తే ప్రపంచంలో చిలీలో సగటున హెక్టారుకు 13 టన్నులు ఉండగా అమెరికా, మరికొన్ని చోట్ల 11, ఐరోపా యూనియన్‌ దేశాల సగటు 8, చైనాలో ఆరు కాగా మన దేశంలో మూడు టన్నులు మాత్రమే వస్తున్నది.2019లో ఆసియా దేశాల సగటు దిగుబడి 5.5 టన్నులు. దిగుమతి చేసుకొనే దేశాలలో 2019లో జపాన్‌ 18, దక్షిణ కొరియా 11, వియత్నాం 11, ఇరాన్‌ 10, మలేసియా 4, చైనా 3.9 మిలియన్‌ టన్నుల చొప్పున దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది చైనా 7మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నారు. రికార్డు స్ధాయిలో ఈ ఏడాది కూడా పంట ఉంటుందని, ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది వివిధ దేశాలు దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల టన్ను వెల చైనా 222 డాలర్లు, మలేసియా 213, ఇరాన్‌ 182, వియత్నాం 177డాలర్లు చెల్లించాయన్నది సమాచారం. 2020 జూలై 20వ తేదీ కరెన్సీ మారకపు విలువ ప్రకారం మన కనీస మద్దతు ధర రూ.1,850 అంటే డాలర్లలో 24.74 అదే టన్ను ధర 247.4 డాలర్లు. మన దేశం దిగుమతి చేసుకొనే వాటి ధర పైన పేర్కొన్న కనిష్ట-గరిష్ట ధరల మధ్య ఉంటుందని అనుకుంటే అది మన రైతాంగాన్ని దెబ్బతీయటం ఖాయం. దిగుమతుల సాకుతో స్ధానిక వ్యాపారులు కారుచౌకగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని గడచిన తరుణంలోనే వెల్లడైంది. ఈ నేపధ్యంలో రైతులకు రక్షణ ఏమిటన్నది సమస్య. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఇచ్చినా ధరలు పడిపోతే వచ్చే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా మొక్క జొన్న నిల్వలను తగ్గించింది. ఈ కారణంగా 2028 వరకు అవసరాలకు అనుగుణ్యంగా దిగుమతులను పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే పన్ను తక్కువగా ఉండే విధంగా కోటా దిగుమతులను పెంచాలని అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి కోటాను మార్చేది లేదని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా స్పష్టం చేసింది. 2016లో చైనాలో నిల్వలు 260 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.2018 నాటికి అవి 80 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. ఆ ఏడాది 3.52 మి.టన్నులు దిగుమతి చేసుకోగా 2020లో 4మి.టకు పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటా కింద 7.2మి.టన్నులను ఒక శాతం పన్నుతో దిగుమతి చేసుకోనుంది. అదే ఇతరంగా చేసుకొనే దిగుమతులపై 65శాతం పన్ను విధిస్తున్నది. తాము 7.2మి.ట దిగుమతి చేసుకున్నప్పటికీ స్ధానిక రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపదని, మొత్తం వినియోగంలో రెండుశాతం కంటే ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.


గత నాలుగు సంవత్సరాలుగా చైనాలో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలల వ్యవధి ఉండే దలియన్‌ వస్తు మార్కెట్‌లో ముందస్తు ధర టన్ను 289 డాలర్లు పలికింది. మన కంటే రెండు రెట్లు అధికదిగుబడి పొందటంతో పాటు మన రైతాంగం గత ఏడాది పొందిన 132డాలర్లతో పోల్చితే ధర కూడా రైతాంగానికి ఎక్కువే గిడుతున్నట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.
మన రైతాంగానికి ధరల రక్షణతో పాటు దిగుబడుల పెంపుదల కూడా ఒక ముఖ్యమైన అంశమే అన్నది స్పష్టం. చైనాలో 120 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉండగా దానిలో ఉత్పత్తి అవుతున్న పంటల విలువ 1,367 బిలియన్‌ డాలర్లని, మన దేశంలో 156 మిలియన్‌ హెక్టార్లలో ఉత్పత్తి విలువు కేవలం 407 బిలియన్‌ డాలర్లే అని నిపుణులు అంచనా వేశారు. రెండు దేశాల్లో అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ చైనాలో కఠిన మైన నిబంధనలు, బలమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలు, పరిశోధనా-అభివృద్దికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వలన చైనా ముందుడుగు వేసేందుకు దోహదం చేశాయి. అశోక్‌ గులాటీ, ప్రెరన్నా టెరవే రూపొందిచిన ఒక నివేదిక ప్రకారం ఒక రూపాయి పరిశోధన-అభివృద్ధికి ఖర్చు చేస్తే జిడిపి రూ.11.20 పెరిగిందని పేర్కొన్నారు. 2018-19లో చైనా వ్యవసాయ పరిశోధనకు 780 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే భారత్‌లో 140 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.


ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ -ఉత్పత్తిదారులకు మద్దతు అంచనా)ను ధరల్లో చూస్తే సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకుంటే 2018-19లో చైనా రైతుల మొత్తం ఉత్పాదక విలువలో 15.3శాతం పొందగా అదే భారత్‌లో 5.7శాతమే అని చైనా వ్యవసాయ సంస్కరణల వలన అక్కడి రైతాంగం గణనీయంగా లబ్ది పొందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. ఫలాన పంట వేస్తేనే అందచేస్తామనే మాదిరి షరతులేమీ లేకుండా రైతులు ఏ పంట వేస్తే దానికి నేరుగా నగదు చెల్లింపు విధానాన్ని అమలు జరిపింది. 2018-19లో చైనా 2007 కోట్ల డాలర్లు అందచేయగా భారత్‌లో పిఎం కిసాన్‌ పధకంలో 300 కోట్ల డాలర్లు అందచేశారు. ఇవిగాక రెండు దేశాల్లోనూ ఇతర సబ్సిడీలు ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ పధకాలకు పెద్ద మొత్తంలో చైనా ఖర్చు చేస్తూ 2030 నాటికి 75శాతం భూములకు నీరందించే లక్ష్యంతో పధకాలను అమలు జరుపుతున్నారు. నీటి వాడకం విషయంలో మన కంటే కఠినమైన నిబంధనలను అమలు జరుపుతున్నారు, చార్జీలను వసూలు చేస్తున్నారు.


చైనాలో ప్రస్తుతం మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అక్కడ పట్టణాల్లో కూడా పరిమితంగా అయినా సాగు చేస్తున్నారు.బీజింగ్‌ మున్సిపాలిటీలో అలాంటి సాగుదార్లను నమోదు చేసి మొక్కల ఆసుపత్రుల ద్వారా చీడపీడల నివారణ సబ్సిడీ పధకాన్ని అమలు జరుపుతున్నారు. రసాయనాల వాడకం, పరిమాణం తగ్గింపు, సహజ పద్దతుల్లో కీటక నివారణ లక్ష్యాలుగా ఇది సాగుతోంది. దీన్ని హరిత తెగుళ్ల నివారణ సబ్సిడీ పధకంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల ఆసుపత్రులను (మన కళ్లు, కిడ్నీ, ఎముకలు, గుండె, గొంతు,ముక్కు ప్రత్యేక వైద్యశాలల మాదిరి) ఏర్పాటు చేశారు. ఆసుపత్రులను వ్యవసాయ మందుల సరఫరాదారులు, దుకాణదారులతో అనుసంధానించారు.నమోదు చేయించుకున్న రైతులు తమ పంటలకు వచ్చిన తెగుళ్ల గురించి మొక్కల ఆసుపత్రులలో వైద్యులకు వివరిస్తారు. వైద్యులు వాటి నివారణకు అవసరమైన రసాయన లేదా సహజ నివారణ పద్దతుల గురించి సిఫార్సు చేస్తారు. ఇంటర్నెట్‌ ద్వారా ఆయా ప్రాంతాల దుకాణదారులకు వాటిని వెంటనే పంపుతారు. రైతులు అక్కడకు వెళ్లి తమ గుర్తింపును చూపి వైద్యులు సూచించిన వాటిని సస్య రక్షణకు వినియోగిస్తారు. రైతులకు అందచేసిన వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని ఆయాశాఖలు విడుదల చేస్తాయి. రసాయనేతర సస్య రక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుతుండగా రసాయన ఉత్పత్తుల వినియోగం తగ్గుతున్నట్లు 2015-18 మధ్యకాలంలో వైద్యుల సిఫార్సులను పరిశీలించగా తేలింది. దీని వలన సబ్సిడీ మొత్తాలు కూడా తగ్గుతున్నట్లు గమనించారు. ఫలితాలను మరింతగా మదింపు వేసి విజయవంతమైనట్లు భావిస్తే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విత్తన స్వాతంత్య్రం- అధిక దిగుబడుల ఆవశ్యకత !

08 Wednesday Jul 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, farmers seeds rights


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

రైతాంగం పూర్తి స్ధాయిలో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగమయ్యారు. విత్తన స్వాతంత్య్రం కోల్పోయిన రైతాంగం విదేశీ కంపెనీల మీదనే ప్రధానంగా పత్తి విత్తనాల కోసం ఆధారపడక తప్పటం లేదు. బీటీ విత్తనాలు పురుగును రాకుండా చేస్తాయని మార్కెట్‌ లోకి 2002లో ప్రవేశించి ఇపుడు మార్కెట్‌ ను పూర్తిగా శాసిస్తున్నాయి. పత్తి రైతులు 95 శాతం బీటీ విత్తనాలనే వాడుతున్నారు. విదేశీ ఎంఎన్‌సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్న జాతీయ కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2019లో 354 లక్షల బేళ్ళ పత్తిని పండించారు.
ప్రపంచంలో హెక్టారుకు 109 కిలోలకు మించి దిగుబడులతో పత్తి పండించే దేశాలు 77 ఉన్నాయి. మరికొన్నింటిలో పండించినప్పటికీ దిగుబడి అతి తక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోవటం లేదు. వాటిలో ఆస్ట్రేలియా 2,056 కిలోలతో దిగుబడిలో ప్రధమ, 1,905 కిలోలతో ఇజ్రాయెల్‌, 1,748 కిలోలతో చైనా ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. 623కిలోలతో పాకిస్ధాన్‌ 32వ, 496కిలోలతో మన దేశం 36వ స్ధానంలో ఉంది. ప్రపంచ సగటు 765 కిలోలు. దీని కంటే ఎక్కువ దిగుబడులు 17దేశాలలో వస్తున్నాయి.
అనేక దేశాల మాదిరి హై డెన్సిటీ ప్లాంటింగ్‌ చేసి సూటిరకాల విత్తనాలను వాడుతూవుంటే పత్తి సగటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందుండేవాళ్ళం. రైతుల ఆదాయం పెరిగేది. మన దేశ శాస్త్రజ్ఞులు, పాలకులు , రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క భారతదేశంలోనే హైబ్రిడ్‌ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారు. అమెరికా , బ్రెజిల్‌, చైనా తో సహా ప్రపంచంలో పత్తి పండించే దేశాలన్నీ హైబ్రిడ్‌ విత్తనాలతో పత్తి పండించటంలేదు. జన్యుమార్పిడి బీటీ విత్తనాలతో సహా వెరైటీలను అంటే సూటి రకాల విత్తనాలను అంటే పంటనుండి తీసిన విత్తనాలనే కంపెనీలు పేటెంట్‌ చట్టం పేరున రైతులకు అమ్ముతున్నాయి.
మన దేశంలో హైబ్రిడ్‌ విత్తనాల తయారీని మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు ప్రోత్సహించాయి. అపార లాభాలను పొందాయి. ప్రతి సంవత్సరం తన విత్తనాలను అమ్ముకోవటానికి కంపెనీల దుష్ట ప్రణాలిక వలన రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. 1.విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతున్నది,2. పత్తి దిగుబడులు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు.
తన పంటలో మంచి గింజలను గుర్తించి తరువాత విత్తనాలుగా వాడే అలవాటును మెల్లగా మాన్పించి హైబ్రిడ్‌ విత్తనాలను అలవాటు చేశారు. నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాలను తయారుచేసిస్తామన్నారు. ఆ టెక్నాలజీ వేరన్నారు. 50 పత్తి గింజలను తెచ్చి మన దేశంలో మన చేతనే మల్టిప్లై చేయించి, మన మొక్కలతో సంకరం చేసి, అందమైన పాకింగ్‌ చేయించి, ప్రచారార్భాటాలతో రైతులచే కొనిపిస్తున్నారు. ఆడ మొగ మొక్కలను వేరుగా పెంచి , మొగచెట్ల పుప్పొడిని ఆడ మొక్కల పూవులపై అంటించి క్రాస్‌ (సంపర్కం) చేయాలి. మన దేశంలో చౌకగా వున్న బాల కార్మికులతో క్రాసింగ్‌ జరిపించి హైబ్రిడ్‌ విత్తనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. విత్తన ఉత్పత్తికి కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడనుండే హైబ్రిడ్‌ విత్తనాలు తయారీ అవుతున్నాయి.. అనుకూల వాతావరణం, చౌకగా అందుతున్న బాలకార్మికుల శ్రమ కంపెనీలకు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టాయి. దీనికి తోడుగా పేటెంట్‌ చట్టం పేరుచెప్పి తమ అనుమతి లేనిదే మరెవ్వరూ ఆ విత్తనాలను తయారు చేయరాదని కట్టడి చేశారు. పంటకు పురుగులు, చీడ పీడ విరగడౌతుందనీ దిగుబడి పెరుగుతుందనే ఆశతో రైతులు మోన్శాంటో బీటీ విత్తనాలను ఆశ్రయించారు. బీటీ జన్యవును మన పత్తి మొక్కలలోని దేశీయవిత్తనాలలో పెట్టవచ్చని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నవారు ధైర్యంచేయలేకపోయారు. మన దేశీయ విత్తనాలు పురుగులను బాగా తట్టుకుంటాయని గ్రహించలేకపోయారు. మోన్సాంటో కంపెనీ గుత్తాధిపత్యాన్నిపొందింది. ఇష్టమొచ్చిన రేటును వసూలు చేసింది. విత్తనాలు తయారుచేసే రైతుకి 250 రూ. ఇచ్చి 750 గ్రాములవిత్తనాలను మోన్శాంటో కంపెనీ తీసుకున్నది. పత్తి పండించే రైతుకి 450 గ్రాముల విత్తనాలను 1850 రూ. కి మించి అమ్మింది. ఇది దారుణమని నల్లమడ రైతుసంఘం ప్రచారం చేసింది. 2005 జూన్‌ నెల లో లామ్‌ ఫార్మ్‌ సభ లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విత్తనాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ వ్యాస రచయిత, తేళ్ళ క్రిష్ణమూర్తి, దండా వీరాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆందోళన ప్రారంభించి సదస్సులు, సభలు. ధర్నాలు చేశారు. జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి, కొల్లా రాజమోహన్‌ ఊరూరు తిరిగి రైతులను చైతన్య పరిచారు. రైతునాయకులు కొల్లి నాగేశ్వరరావు, యలమంచిలి శివాజీ, జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి , కొండా శివరామిరెడ్డి లాంటివారు కదిలారు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై యసే రాజశేఖరరెడ్డి గారు స్పందించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఎమ్‌ఆర్పీటీయస్‌ లో కేసు వేశారు. మోన్శాంటో కంపెనీ 1850 రూ. పత్తి విత్తనాల పాకెట్‌ ను 750 రూ.కి. తగ్గించకతప్పలేదు. మన దేశంలో బీటీ విత్తనాలపై పేటెంట్‌ లేకపోయినా పేటెంట్‌ వున్నదని దబాయించి రౌడీ మామూలుగా టెక్నాలజీ ఫీజు-రాయల్టీ పేరున వందల వేల కోట్ల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. బీటీ 1 అనీ, బీటీ 2 అనీ, బీటీ 3 అనీ రైతులకు ఆశలు కల్పంచి సొమ్ము చేసుకుంటున్నారు. సూటిరకాల విత్తనాలను సాంద్రతను పెంచి సాగుచేసి అధికదిగుబడులను సాధించటమే దీనికి పరిష్కారం ,
అనేకదేశాలలో, ప్రయోగాలు, పరిశోధనల తర్వాత హై డెన్సిటీ ప్లాంటింగ్‌ అంటే మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మొక్కల వలన ఎక్కువ దిగుబడి వస్తుందనీ, దేశీయ సూటిరకాల విత్తనాలకు పురుగును తట్టుకునే శక్తి ఎక్కువనికూడా అధ్యయనాలు నిరూపించాయి. బలాలు కూడా సగంపెట్టినా దిగుబడి తగ్గదంటున్నారు. బ్రెజిల్‌ లాంటి దేశాలు లాభపడ్తూఉండగా మనం మోన్సంటో, బేయర్‌ కంపెనీల మాటలు విని వారికి లాభాలు చేకూర్చేవిధంగా హైబ్రిడ్‌ విత్తనాలనే ఎందుకు వాడుతున్నామో ఆలోచించాలి.
బ్రెజిల్‌, చైనా, అమెరికా, భారతదేశాలలో ప్రయోగాలు చేశారు. ఒక ప్రయోగంలో హెక్టరుకు 1500 నుండి 1,05,000 మొక్కల వరకూ 6 ప్లాట్లుగా పెంచారు. మెపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ మందును ఉపయోగించి పెరుగుదలను నియంత్రించారు. తక్కువ మొక్కలున్న ప్లాటు తక్కువ దిగుబబడి నిచ్చింది. బాగా ఎక్కువ మొక్కలున్న ప్లాటు లోకి సూర్యరశ్మి, గాలి అందక మరీ ఎక్కువ పత్తినివ్వలేదు. మధ్యస్ధంగా 87,000 మొక్కలున్న ప్లాటు హెక్టారుకు 1682కేజీల లింటు కాటన్‌( 4546కేజీల సీడ్‌ కాటన్‌) వచ్చింది. నేలను బట్టి, భూసారాన్నిబట్టి, నీటి లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను సైంటిస్టులు, అనుభవజ్నులైన రైతులు నిర్ణయించుకుని ఎక్కువ మొక్కలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.
మన దేశ కాటన్‌ సైంటిస్టులు ఆ దేశాలకు వెళ్ళి హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు విధానాన్ని పరిశీలించారు. నాగపూర్‌ కాటన్‌ రీసర్చ్‌ సెంటర్‌ వారు సూరజ్‌ అనే సూటి రకాల వెరైటీని, నంద్యాల కాటన్‌ పరిశోధనా సంస్ధ, దేశీయ 1938 వెరైటీలను అభివధిచేసి రైతులకు ఇచ్చారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ తో మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వ సంస్ధలు ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేసారు. ప్రత్యమ్నాయంగా దేశీ విత్తనాల సాంద్రతను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని చూపారు. మన దేశరైతులు మోన్సాంటో, బేయర్స్‌ లాంటికంపెనీల మాటలువిని హైబ్రిడ్‌ విత్తనాలనే వాడుతున్నారు. మన పొలంలో మన పంట విత్తనాలను ఎక్కువగా నాటి ఎక్కువ మొక్కలను పెంచి పత్తి దిగుబడిని అంతర్జాతీయస్ధాయికి తేవచ్చని నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధవారు ప్రయోగాలు చేసి నిర్ధారించారు. ప్రదర్శనాక్షేత్రాలను ఏర్పాటు చేశారు. వారు సరఫరా చేసిన సూరజ్‌ వెరైటీని , నంద్యాల పత్తి పరిశోధనా సంస్ధ ఇచ్చిన వెరైటీలను రైతు రక్షణ వేదిక ప్రొఫెసర్‌ యన్‌ వేణుగోపారావు గారి నాయకత్వాన గుంటూరు జిల్లాలో ప్రచారం చేసింది. వెయ్యికన్నా ఎక్కువ సభ్యులతో సహకార సంస్ధగా ఏర్పడి సూటిరకాల అభివధికి దాదాపు 10 సం.కు పైగా కషిచేసింది. బీటీ వున్న సూటిరకాలుకూడా రైతు రక్షణ వేదిక రైతులు అభివద్దిóచేశారు. తక్కువ వనరులతో విషేషమయిన కషి జరిగింది. కార్పోరేట్‌ కంపెనీల హైబ్రిడ్‌ అనుకూల ప్రచారాల ముందు కొద్దిమంది కషి రైతులను ఉత్తేజపరచలేక పోయింది. నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధ, నంద్యాల పరిశోధనాసంస్ధలకు తోడుగా వ్యవసాయశాఖ, వ్యవసాయ విద్యాలయం కదలలేదు. ప్రయోగాలను, పరిశోధనలను కొనసాగించలేదు. రైతు సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నాయకులు సూటి రకాలగురించి, హై డెన్సిటీ ప్లాంటేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా మన రైతులు అదిక దిగుబడులద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటమేకాదు. దేశప్రజల విత్తన స్వాతంత్య్రాన్ని మోన్సాంటో లాంటి కోర్పోరేట్‌ శక్తులకు ధారపోసి దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతర్జాతీయ అనుభవాలను మన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. చిన్న రైతులను ఆర్ధికంగా నిలబెట్టినపుడే వ్యవసాయం రక్షించబడతుంది.
రైతు తన పొలంలోనుండి విత్తనాలను తీసుకొని కనీసం మూడు నాలుగు సంవత్సరాలు విత్తుకోవచ్చు. మొక్కల సాంద్రతను పెంచి అధిక దిగుబడిని పొంది , అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సగటు దిగుబడులలో అంతర్జాతీయ స్ధాయిని అందుకోవచ్చు. ఎమ్‌ యన్‌ సీ ల దోపిడీ ని ఎదుర్కొని విత్తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత నల్లమడ రైతు సంఘం, రైతు రక్షణ వేదిక నేత, గుంటూరు, ఫోన్‌ 9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా ?

15 Wednesday Apr 2020

Posted by raomk in AP, Current Affairs, NATIONAL NEWS, Opinion, STATES NEWS, Telangana, Telugu

≈ Leave a comment

Tags

a telugu journalist spews venom on communists, anti communists, Communists, Journalist attack on communists, venom on communists

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

 వేతన వాయిదా సరే, ఏపి మూడు రాజధానులు, తెలంగాణా కొత్త సచివాలయం సంగతేమిటి !

31 Tuesday Mar 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, employees, History, NATIONAL NEWS, Opinion, Pensioners, Telangana

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, AP CM YS Jagan, Government Employees wage deferment, KCR, Telangana CM

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌-నేడు ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌ = ఆంధ్రుల రాజధానులు !

21 Saturday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

AP three capitals, GN RAO Committee, YS jagan

Image result for andhra pradesh

ఎం కోటేశ్వరరావు
రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాజీ అయ్యేఎస్‌ అధికారి జిఎన్‌ రావు కార్యదర్శిగా నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా తమ నివేదిను అందించింది. దీనిలో ఏదో అలా జరిగిపోయింది గానీ, ముందస్తు ఆలోచనేమీ లేదని జగన్‌ అభిమానులు చెప్పుకోవచ్చు గానీ, అంతర్గతంగా వారే మరోవిధంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా వచ్చేది లేదు పోయేది లేదు. ఆంధ్రుల గురించి అలారాసి పెట్టి ఉంది, కనుక జరగాల్సింది జరిగింది అనుకోవాలా ?
ఒక్కటి మాత్రం స్పష్టం. అదేమిటో నాకన్నీ ముందే అలా తెలిసిపోతుంటాయి అన్నట్లుగా నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. కాలజ్ఞానం విషయంలో పోతులూరి వీరబ్రహ్మం గారిని మించి పోయారు. గత సర్కార్‌ హయాంలో రాజధాని నిర్ణయం జరగముందే అంతర్గత వ్యాపారం జరిగిందని ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో నివేదిక తయారీకి అంతర్గత బోధ జరిగిందన్నది కూడా అంతే స్పష్టం. అమరావతిలో అంతర్గత వ్యాపారం(ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌) జరిగిందనటానికి జగన్‌ సర్కార్‌ వెల్లడించిన భూముల వివరాలు సాక్ష్యం అనుకుంటే, జగన్‌ ముందే చెప్పినట్లుగానే మూడు రాజధానుల మీద అంతర్గత బోధ (ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌) జరిగిందనేందుకు జిఎన్‌ రావు కమిటీ నివేదిక తిరుగులేని సాక్ష్యం ! ఈ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపి, ఆమోదం వచ్చిన తరువాత ఎంతవరకు అమలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రమేయం, రాష్ట్ర అధికారాల గురించి చూడాల్సి ఉంది.
ఇక ఈ నివేదిక పూర్తి పాఠం ఇంకా అందలేదు కనుక జిఎన్‌రావు విలేకర్లతో చెప్పిన అంశాలకే ఈ పరిశీలన పరిమితం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌గా ఏర్పాటు చేయాలని, ఒక దానిలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రెండవ దానిలో ఉభయ గోదావరులు, కృష్ణా, మూడవ దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగవ దానిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉండాలని పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అమరావతి, విశాఖలో డివిజన్‌ బెంచ్‌లు పెట్టాలని సూచించారు. అమరావతిలో భాగం గాని మంగళగిరి ప్రాంతంలో మంత్రుల నివాసాలు, అమరావతిలో గవర్నర్‌, అసెంబ్లీ అని చెప్పారు. విశాఖలో అసెంబ్లీ వేసవి సమావేశాలు జరపాలన్నారు. ఇవన్నీ కూడా పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి జనాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చెప్పామన్నారు.
ఈ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సభ్యులు పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి వారు ప్రయాసకు గురై రాస్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేశారనిపిస్తోంది. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ను కర్ణాటక తరహాలో అని వారే చెప్పారు. ఇంటర్నెట్‌లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. రెండవది ప్రాంతీయ కమిషనరేట్స్‌ లేదా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అనేవి మనకు తెలియనివి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ముల్కీ నిబంధనల అమలును సుప్రీం కోర్టు సమర్ధించిన తరువాత దానిని రద్దు చేసి ఆరుసూత్రాల పధకంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. తరువాత వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ అంటే వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు. కర్ణాటక కమిషనరేట్స్‌ అయితే రెవెన్యూ డివిజన్లు. అంటే రాష్ట్ర కేంద్రం, జిల్లాల మధ్య మరొక అధికార దొంతర ఏర్పడుతుంది. లేదా గతంలో మాదిరి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అయితే రాజకీయనేతలకు ఉద్యోగాలిస్తారు. ఏది చేసినా వీటి ద్వారా ఆయా జిల్లాలను ఎలా అభివృద్ది చేస్తారు ? ఇప్పుడున్న వ్యవస్ధలో అభివృద్దికి అడ్డువస్తున్న ఆటంకా లేమిటి ?
కర్ణాటకలో అలాంటి ఏర్పాటు చేసినా అనేక ప్రాంతాలు వెనుకబడిపోయాయి. నైజాం సంస్ధానం నుంచి విడదీసి కర్ణాటకలో విలీనం చేసిన కన్నడ ప్రాంతాలలో ఇది చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ వరకు దారి తీసింది. ఇప్పటికీ దానిని ముందుకు తెస్తూనే ఉన్నారు. అనేక రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో అలాంటి డిమాండ్లే ఉన్నాయి. మొత్తంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఎక్కడ గతంలో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయో అక్కడే, ఎక్కడ రేవులు, రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సులభంగా సరకు రవాణా అవకాశాలుంటాయో అక్కడికే పెట్టుబడులు తరలి వెళుతున్నాయి తప్ప వెనుకబడిన ప్రాంతాలకు రావటం లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇది మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, అనేక సంస్ధలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి తమ అనుయాయలకు తెగనమ్మి కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. అటువంటపుడు నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుకు, అభివృద్ధికి సంబంధం ఏమిటి ? వైసిపి దగ్గర నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి పధకాల ఊసే లేదు. ప్రయివేటు పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్రమోడీ పలు విమర్శలపాలై పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగా అని చెప్పుకున్నా వచ్చిన పెట్టుబడులు లేవు, మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలం కావటం చూస్తున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు ?
జిఎన్‌ రావు కమిటీలో ఉన్నదంతా పట్ణణ ప్రణాళికల నిపుణులే కనుక పట్టణీకరణ గురించి ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజానికి ఇది సామాన్యులకు కూడా తెలిసిన అంశమే. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసేది ఎవరనేదే కదా ప్రశ్న. సహజవనరులను దోచుకోవటానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వెళతారు తప్ప పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఎక్కడా ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టిన చోట్లనే అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. మధ్య కోస్తోలో వ్యవసాయ రంగంలో మిగులు పట్టణీకరణ, వ్యాపారాల అభివృద్ధికి ఒక కారణం తప్ప ఒక్క పట్టుమని పదివేల మందికి ఒక దగ్గర ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ లేదు.
2019 జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో పని చేయటం ప్రారంభమైంది. తిరిగి దానిని కర్నూలుకు తరలించటానికి, విశాఖ, అమరావతిలో బెంచ్‌లు ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తాయన్నది సందేహమే. మద్రాసు ప్రావిన్సులోని తెలుగు ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయం(తెలుగుకు పర్యాయపదం ఆంధ్రం కనుక ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై నాటి కాంగ్రెస్‌ నేతల( ఆంధ్రా-రాయలసీమ) మధ్య వివాదం వచ్చింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగి చివరికి విశాఖలో 1926లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంత నేతలు తన్నుకు పోయారనే అసంతృప్తిలో ఉన్న రాయలసీమ నేతలను సంతృప్తి పరచేందుకు చిత్తూరు, ఇతర రాయలసీమ(సీడెడ్‌) జిల్లాలను మాత్రం దానిలో చేర్చకుండా మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. తరువాత మద్రాసు ప్రావిన్సు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినపుడు మరోసారి రాయల సీమకు అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఆ ప్రాంత నేతలు వ్యక్తం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఉభయ ప్రాంతాల నేతలు కాశీనాధుని నాగేశ్వరరావు గృహం శ్రీబాగ్‌లో సమావేశమై భవిష్యత్‌లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలనే ( పెద్ద మనుషుల )ఒప్పందానికి వచ్చారు. ఆమేరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. తరువాత రెండింటినీ హైదరాబాద్‌కు తరలించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత వివిధ చోట్ల హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు ఒక్కదానినీ ఆమోదించలేదు. ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అలహాబాద్‌లోహైకోర్టు, లక్నోలో బెంచ్‌ ఉంది. మరో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా అలాంటి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల బెంచ్‌లు పెట్టాలన్న ప్రతిపాదనను అంగీకరించటానికి కేంద్రం ఏ ప్రాతిపదికన ముందుకు వస్తుంది అన్నది ప్రశ్న. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని జిఎన్‌ రావు కమిటీ ఉటంకించింది.

Image result for ys jagan mohan reddy
ఈ కమిటీ నివేదిక ఒక ప్రహసన ప్రాయం అన్నది స్పష్టం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆకాంక్ష వైసిపిలో ఎన్నడూ కనిపించలేదు. వారు కోరుకున్న విధంగా వ్యవహరించేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలంటే దానికి ఒక కమిటీ నివేదిక కావాలి. అందుకోసం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఏమి రాయాలో రాయించుకున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడి అవుతున్నాయి. గతంలో రాజధాని నిర్ణయానికి ముందు అనుయాయులకు ఉప్పందించి లబ్ది చేకూర్చేట్లు చేశారని, చంద్రబాబుతో సహా అనేక మంది భూములు కొనుగోలు చేసిన గ్రామాలను రాజధాని పరిధి, భూ సేకరణ నుంచి తప్పించారని వైసిపి చెబుతోంది. ఆమేరకు అసెంబ్లీలో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వెనుక వైసిపి నేతలు కూడా అదే పనికి పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ వివరాలు ఐదేండ్ల తరువాత కొత్త ప్రభుత్వం వస్తే, వారు బయట పెట్టేంత వరకు అనుమానాలు, ఆరోపణలుగానే ఉంటాయి. ఐదేండ్ల తరువాత వచ్చే పాలకులు మూడు రాజధానుల్లో అనుకున్నట్లుగా అభివృద్ది జరగలేదంటూ మరొక కమిటీని వేసి మరో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ? తన అధికారానికి ఇక తిరుగులేదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నట్లే గతంలో చంద్రబాబు కూడా అనుకున్నారు, అయినా వేరేలా జరగలా ? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: