ఆఫ్ఘన్‌ పరిణామాలు అయోమయం – తాలిబాన్లతో మోడీ సర్కార్‌ తెరవెనుక చర్చలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


చరిత్రకు జాలి, దయ ఉండవు, అదే సమయంలో అది వింతైనది కూడా. అందుకే చాలా మందికి చరిత్ర అంటే భయం. చెప్పింది విను తప్ప చరిత్ర అడక్కు అంటారు. లేకపోతే ఏమిటి చెప్పండి ! తాము పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లోనే అమెరికా పరాభవాన్ని ఎవరైనా ఊహించారా ? ఉగ్రవాదం మీద పోరు అని చెప్పి ఇంతకాలం అమెరికాతో చేతులు కలిపిన మోడీ సర్కార్‌ కూడా ఆ తాలిబాన్లతోనే తెరవెనుక సంబంధాలను కొనసాగించిందని తెలుసా ? తాలిబాన్లు రష్యా,చైనాలతో సర్దుబాటుకు సిద్దం అవుతారని ఎప్పుడైనా భావించారా ? అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో జోక్యం, యుద్దానికి ఎందుకు దిగారు, ఇప్పుడెందుకు వెళ్లిపోతున్నారంటే అమెరికా దగ్గర సమాధానం ఉందా ? అక్కడ ఏకరూప ప్రభుత్వం ఉండే అవకాశం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పతనమైతే అమెరికా చేయగలిగిందీ, చేయాల్సిందీ ఏమీ లేదు. అక్కడి జనం, దాని ఇరుగు పొరుగు దేశాలు ఏం చేసుకుంటాయో వాటి ఇష్టం అని బైడెన్‌ చెప్పాడు.


ఒక అగ్రరాజ్య అధిపతి నుంచి ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్య వెలువడిందంటే అమెరికాను నమ్ముకున్న దేశాలు తమ పరిస్ధితి ఏమిటని ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటిదే జరిగితే దాన్ని నమ్ముకున్న వారు ముఖ్యంగా మన నరేంద్రమోడీ వంటి వారు పునరాలోచన చేయాల్సిన అవసరం లేదా ! అమెరికా ఇప్పుడు తప్పుకున్నంత మాత్రాన మిలిటరీ రీత్యా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆ ప్రాంతంలో శాశ్వతంగా జోక్యం చేసుకోదా ? మరో రూపంలో, కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగుతుందా ? కొంత మంది చెబుతున్నట్లుగా రాబోయే రోజుల్లో అక్కడ చైనా పలుకుబడి పెరుగుతుందా ? ఇవన్నీ ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నలే.


ఆఫ్ఘన్‌ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినవారు ముజాహిదిన్లు, వారి వారసులైన తాలిబాన్లు ఇప్పుడు మాస్కోలో రష్యా నేతలతో చర్చలు జరిపారు. తమ గడ్డమీద నుంచి ఇతర దేశాల మీద దాడులు చేయాలనుకొనే శక్తులకు అవకాశం ఇచ్చేది లేదని మాస్కోలో ప్రకటించారు. మరోవైపున చైనా తమకు మిత్ర దేశమని, దానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులకు తమ గడ్డమీద ఇంకేమాత్రం ఆశ్రయం కల్పించేది లేదని కూడా వారు ప్రకటించారు. ఇది రాస్తున్న సమయానికి మన దేశంతో సంబంధాల గురించి వారెలాంటి ప్రకటనా చేయలేదు. మొదటి రెండు సానుకూల ప్రకటనలు అయితే మన దేశం గురించి చెప్పకపోవటం ప్రతికూలమని భావించాలా ? ఇంకా అవగాహన కుదరలేదా ? వేచి చూద్దాం !

అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఏం జరుగుతోంది ? ఎవరికీ తెలియదు. ఏం జరగబోతోంది ? అది అనూహ్యం ! తాలిబాన్ల పేరుతో అనేక గ్రూపులు ఉన్నాయి. వాటిలో వాటికి పడనివీ కొన్ని. తాము దేశంలోని 85శాతం ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు చెబుతున్నారు. ఇరాన్‌, తజకిస్తాన్‌, చైనా సరిహద్దు ద్వారాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు. దాని గురించి ప్రభుత్వ స్పందన గురించి తెలియదు. అదెలా సాధ్యం అని జోబైడెన్‌ అనటం తప్ప అమెరికన్లు కూడా అక్కడి పరిస్ధితి గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. అక్కడి అస్ధిర, అస్తవ్యస్ధ పరిస్ధితి కారణంగా చైనా, మన దేశం కూడా దౌత్య సిబ్బందిని వెనక్కు రప్పించాయి. తమ దౌత్య సిబ్బంది రక్షణ కోసం వెయ్యి మంది వరకు తమ సిపాయిలు అక్కడే ఉంటారని అమెరికా ప్రకటించింది. పొరుగుదేశాలైన తుర్కుమెనిస్ధాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్ధాన్‌ ఆహ్వానం మేరకు పరిస్ధితిని సమీక్షించేందుకు జూలై 12-16 తేదీలలో చైనా విదేశాంగ మంత్రి ఆ దేశాల పర్యటన జరపనున్నారు.


కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ తొత్తు పాలన ఏర్పాటు చేయాలనుకున్న అమెరికన్లు ముజాహిదిన్లు, తాలిబాన్లను సృష్టించి చివరకు వారి దెబ్బకు తట్టుకోలేక రాజీ చేసుకొని తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోతున్నారు. కుక్కలు చింపిన విస్తరిలా వివిధ తాలిబాన్‌ ముఠాల చేతుల్లో చిక్కిన ఆ దేశం ఏమౌతుందో ఎవరూ చెప్పలేని స్ధితి.1978లో తిరుగుబాటు ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు-ఇతరులతో కూడిన ప్రభుత్వానికి ప్రారంభం నుంచే అమెరికన్లు ఎసరు పెట్టారు. దాంతో 1979లో ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్‌ యూనియన్‌ జోక్యం చేసుకుంది. నాటి నుంచి ముజాహిదిన్ల పేరుతో అనేక తిరుగుబాట్లు వాటి వెనుక పాకిస్దాన్‌, అమెరికా, సౌదీ అరేబియా హస్తాలున్నాయి. పదేండ్ల తరువాత సోవియట్‌ ఉపసంహరించుకుంది. తరువాత ముజాహిదీన్లే తాలిబాన్లుగా రూపాంతరం చెందారు. అమెరికన్ల పట్టు పెరిగిన తరువాత ఇరాన్‌ రంగంలోకి దిగి తనకు అనుకూలమైన తాలిబాన్లను పెంచి పోషించింది.


దేశంలో 85శాతం తమ వశమైందని ప్రకటించుకున్న తాలిబాన్‌ నేతలు మాస్కో వెళ్లి రష్యా, మధ్య ఆసియాలోని పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లైన తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, తుర్కిస్ధాన్‌లు, రష్యా మీద దాడి చేసేందుకు తమ దేశాన్ని స్ధావరంగా వినియోగించుకోనిచ్చేది లేదని రష్యా ప్రభుత్వానికి హామీ ఇచ్చి వచ్చారు. ఆ దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఉంది. దానిలో భాగంగా తజకిస్తాన్‌లో రష్యా మిలిటరీ స్ధావరం ఉంది. ఒక వేళ ఏదైనా దాడి జరిగితే ప్రతిఘటించేందుకు తజకిస్తాన్‌ కూడా 20వేల మంది మిలిటరీని సిద్దం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తప్పుకొనేందుకు తాలిబాన్లతో రాజీ చేసుకున్న అమెరికా నిర్ణయంతో రష్యా కూడా వెంటనే రంగంలోకి దిగింది. గత ఏడాది ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే ఆఖరు నాటికి అమెరికన్‌ సేనలు వెనక్కు వెళ్లి పోవాల్సి ఉంది. అయితే బైడెన్‌ ఆ గడువును సెప్టెంబరు వరకు పొడిగించినందున కొత్త అనుమానాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో రష్యా మార్చి నెల నుంచే తాలిబాన్లతో చర్చలు ప్రారంభించింది. దాని పర్యవసానమే మాస్కో పర్యటన, ప్రకటన. గత ఆరు సంవత్సరాలుగా రష్యన్లు తాలిబాన్లతో సంబంధాలను కలిగి ఉన్నారు. ఖొరసాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌కె) పేరుతో సమీకృతం అవుతున్న సాయుధ ముఠాలను ఎదుర్కొనేందుకు తాలిబాన్లకు సాయం అందించినట్లు కూడా చెబుతారు.


మరోవైపు చైనాను తమ స్నేహదేశంగా పరిగణిస్తామని కూడా తాలిబాన్లు ప్రకటించారు. తమకు సరిహద్దుగా ఉన్న గ్జిన్‌జియాన్‌ రాష్ట్రంలో ఉఘిర్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేది లేదని కూడా చెప్పారు. చైనా-ఆప్ఘనిస్ధాన్‌ మధ్య 80 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. అమెరికా అండతో తూర్పు తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం పేరుతో ఆల్‌ఖైదా గ్జిన్‌గియాంగ్‌ రాష్ట్రంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు వారికి ఆఫ్ఘనిస్తాన్‌ ఒక ఆశ్రయంగా ఉంది. తామింకేమాత్రం వారికి మద్దతు ఇచ్చేది లేదని, తమ దేశ పునర్‌నిర్మాణం కోసం చైనా పెట్టుబడుల గురించి త్వరలో చర్చలు జరుపుతామని, రక్షణ కూడా కల్పిస్తామని తాలిబాన్ల ప్రతినిధి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక విలేకరితో చెప్పాడు. గతంలో తమ ప్రతినిధి వర్గాలతో చైనా చర్చలు జరిపిందని గుర్తు చేశాడు.

తాలిబాన్లలో వివిధ ముఠాలు ఉన్నాయి. అవి అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలకు దిగితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్దకం. కొంతమందిని పాకిస్ధాన్‌ చేరదీయగా మరికొంత మంది ఇరాన్‌ మద్దతు పొందుతున్నారు. అమెరికన్లు కూడా తమకు అనుకూలమైన ముఠాలను తయారు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. వీటికి తోడు తెగలవారీ విబేధాలు కూడా ఉన్నాయి. అవి ఎవరి మద్దతు పొందినప్పటికీ మతం తప్ప మరొక ఏకీభావం లేదు. పెత్తనం గురించి కుమ్ములాటలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలపై పట్టు తప్ప మొత్తం దేశ అధికారం లేనందున ఎలా వ్యవహరించినప్పటికీ ఉన్న ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం ఎవరి హస్తగతం అవుతుందో తెలియదు. దాన్ని మిగతావారు అంగీకరిస్తారా ? అందువల్లనే కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలంటే ఇరుగు పొరుగుదేశాల సహకారం అవసరం కనుక ఇప్పుడేం మాట్లాడినా రష్యా, చైనా, ఇరాన్‌ తదితర దేశాలు పరిణామాలను ఆచితూచి గమనిస్తున్నాయి. అమెరికన్లు దేశం విడిచి వెళ్లినప్పటికీ తాలిబాన్లలో తమకు అనుకూలమైన శక్తులతో సంబంధాలు, సహాయాన్ని కొనసాగిస్తారన్నది స్పష్టం. కొంత మంది సైనికులు తాలిబాన్ల దాడికి తట్టుకోలేక పొరుగుదేశాలకు పారిపోయినట్లు చెప్పటమే తప్ప వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. దేశమిలిటరీ కంటే వారేమీ శక్తివంతులు కాదని అందువలన ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ దేశం వారి హస్తగతం కావటం అంత తేలిక కాదనే వాదనలూ ఉన్నాయి.


తాలిబాన్లను పెంచి పోషించిన అమెరికాకు చివరకు వారే ఏకు మేకయ్యారు. ఆల్‌ఖైదా నేత బిన్‌లాడెన్‌ రూపొందించిన పధకం ప్రకారం న్యూయార్క్‌ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం మీద దాడి చేసిన తరువాత అమెరికా కొత్త పల్లవి అందుకుంది.ఉగ్రవాదం మీద పోరు పేరుతో ప్రత్యక్ష దాడులకు దిగింది. గత రెండు దశాబ్దాలలో పాకిస్ధాన్‌లో ఉన్న బిన్‌లాడెన్‌ను పాక్‌ సాయంతో మట్టుబెట్టటం తప్ప అది సాధించిందేమీ లేకపోగా ఉగ్రవాదులను మరింతగా పెంచింది. అనేక దేశాలకు విస్తరించింది. జనానికి చెప్పరాని బాధలను తెచ్చి పెట్టింది. అన్ని చోట్లా అమెరికా, దాని ఐరోపా మిత్రపక్షాలకు ఎదురుదెబ్బలే. ఆప్ఘనిస్తాన్‌లో ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు ఆర్ధిక నష్టాలతో పాటు తన, నాటో కూటమి దేశాల సైనికుల ప్రాణాలు పోగొట్టటం తప్ప సాధించేదేమీ లేదని డోనాల్డ్‌ట్రంప్‌కు జ్ఞానోదయం అయింది. అందుకే తప్పుకుంటామని ఒప్పందం చేసుకున్నాడు, జోబైడెన్‌ దాన్ని అమలు జరుపుతున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌ మీద అమెరికా ఎందుకు ఆసక్తి చూపింది, ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నది ? అక్కడ కమ్యూనిస్టులు, ఇతరులు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడేమైనా అమెరికా పెట్టుబడులుంటే వాటిని కాపాడుకొనేందుకు జోక్యం అనుకోవచ్చు.అదేమీ లేదు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తన స్ధావరంగా ఏర్పాటు చేసుకుంటే ఇరాన్‌, మధ్య ఆసియా, రష్యా, చైనాల మీద అది దాడులు చేయలేదు. అందుకు అనువైన ప్రాంతం ఆప్ఘనిస్తాన్‌. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు గనుక వారు స్ధిరపడితే అది సోవియట్‌కు అనుకూల దేశంగా మారుతుందన్నదే అసలు దుగ్ద. దానితో పాటు ఆప్రాంతలో వెలికి తీయని విలువైన ఖనిజ సంపదమీద కూడా అమెరికా కంపెనీల కన్ను పడింది. అందుకే 1978 నుంచి 2021వరకు అది కొన్ని అంచనాల ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది తన సైనికులను బలిపెట్టింది, లక్షలాది మంది ఆఫ్ఘన్‌ పౌరుల ప్రాణాలను తీసింది. అయినా దానికి పట్టుదొరక లేదు. డబ్బూ పోయి శని పట్టె అన్నట్లు పరువూ పోయింది. గతంలో ప్రత్యర్ధిగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ ఇప్పుడు లేదు. దేశంలో ఆర్ధిక పరిస్ధితి సజావుగా లేదు. చైనాతో వాణిజ్య లడాయి పెట్టుకొని దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియని స్ధితిలో పడిపోయింది. దానికి తోడు కరోనా సంక్షోభం.

ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు అమెరికా వాడు పోతూ మన దేశానికి ప్రమాదం తెచ్చిపెట్టాడు. మనం స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి వైదొలిగి అమెరికా మిత్రులం అయ్యాం గనుక తాలిబాన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా రక్షణలో మనం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు వారు ఉండరు కనుక అవేమౌతాయో తెలియదు. ఇరాన్‌ లేదా పాక్‌ ప్రభావంలోని తాలిబాన్లు అధికారానికి వచ్చినా, అస్ధిర పరిస్ధితి ఏర్పడినా మనకు ఇబ్బందులే. అమెరికన్లు వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత పాకిస్ధాన్‌ మీద మన పాలకుల దాడి నెమ్మదించింది. అంతే కాదు పైకి సంఘపరివార్‌, బిజెపి వారు జనంలో పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా తెరవెనుక మంతనాలు జరపబట్టే ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటకీయ పరిణామాల మధ్య 2003 ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఇది ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమా !


మరోవైపు మా దేశంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ మన అధికారులు తాలిబాన్లతో చర్చలు జరిపారంటూ వచ్చిన వార్తలను మన విదేశాంగ శాఖ తోసి పుచ్చినప్పటికీ వివిధ వర్గాలతో సంబంధాలలో ఉన్నట్లు అంగీకరించింది. క్వెట్టా, క్వటారీ కేంద్రాలుగా ఉన్న తాలిబాన్ల ప్రతినిధులు కూడా ఈ వార్తలను నిర్ధారించారు. ఇరాన్‌, పాకిస్ధాన్లతో సంబంధాలు లేని తాలిబాన్‌ గ్రూపులతో మన అధికారులు సంబంధాలను కొనసాగిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం మన ఇంజనీర్లను కిడ్నాప్‌ చేసినపుడు కొన్ని తాలిబాన్‌ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొని వారిని విడిపించినప్పటి నుంచీ తెరవెనుక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా తప్పుకోవాలని నిర్ణయించిన తరువాత మన దేశం తాలిబాన్లతో చర్చలకు సుముఖత తెలిపింది. గతేడాది దోహాలో జరిగిన చర్చలలొ మన ప్రతినిధి బృందం వీడియో ద్వారా పాల్గొన్నది. మన ప్రతినిధులు ఇరాన్‌, రష్యాతో కూడా తెరవెనుక చర్చలు జరిపారని దాని వలన ఎలాంటి ఫలితం కనపడలేదని కూడా వార్తలు వచ్చాయి.లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి మన దేశ వ్యతిరేక బృందాలకు తావు ఇవ్వవద్దని మన దేశం తాలిబాన్లను కోరుతోంది. వారిని సంతుష్టీకరించేందుకు, మద్దతు సంపాదించేందుకే కాశ్మీరుకు తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని కేంద్రం లీకు వార్తలను వదలిందని కూడా కొందరి అభిప్రాయం. చైనా ప్రారంభించి సిల్క్‌ రోడ్‌ ప్రాజెక్టులో పాకిస్ధాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ కీలకమైన దేశాలు. ఆ పధకాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం గనుక అక్కడ ఏర్పడే లేదా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగినా చైనాకు అనుకూల పరిస్ధితి ఉంటుంది.


ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ గురించి ఏమి విశ్లేషణలను చేసినప్పటికీ అక్కడ ఏర్పడే ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి పరిణామాలు ఉంటాయి. అందువల్లనే రష్యా, చైనా, ఇరాన్‌, పాకిస్దాన్‌, మన దేశం కూడా ఎవరి ప్రయత్నాలను వారు చేస్తున్నాయి. తాలిబాన్లు ఉగ్రవాదులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. వారే అధికారాన్ని చేపడితే దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవటంలో లేదా తిరస్కరించటంలో ఆయా దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిష్తాయి.

ఆమెరికా నాయకత్వాన ఆయుధ, చైనా చొరవతో అభివృద్ది చతుష్టయ ప్రతిపాదన !

Tags

, ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి -6

ఎం కోటేశ్వరరావు


జర్మనీ, ఫ్రాన్స్‌తో కలసి ఆఫ్రికా అభివృద్దికి పనిచేసేందుకు చైనా సిద్దంగా ఉందని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ప్రతిపాదించినట్లు జపాన్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.చైనాకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి సమావేశాలు అక్టోబరులో జరగనున్నట్లు వార్త. ఒక వైపు అమెరికా దూకుడును అడ్డుకొనేందుకు చైనా కూడా పావులు కదుపుతున్నట్లు ఈ పరిణామం వెల్లడిస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్‌ గతంలో ఆఫ్రికాలోని కొన్ని దేశాలను వలసలుగా చేసుకున్న విషయం తెలిసిందే. గ్జీ చేసిన ప్రతిపాదన మీద రెండు దేశాల నుంచి స్పందన వెలువడలేదు. అయితే ఫ్రెంచి అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో చతుష్టయ ప్రతిపాదనను ప్రస్తావించనప్పటికీ అవసరమైన దేశాలకు రుణాల పునర్వ్యవస్తీకరణ చేసేందుకు చైనా ముందుకు రావటాన్ని ఫ్రాన్స్‌,జర్మనీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.బ్రిటన్‌లో జరిగిన బి3డబ్ల్యు ప్రకటన తరువాత చైనా వైపు నుంచి ఈ ప్రతిపాదన వెలువడింది.


అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి, ఐరోపా యూనియన్‌ ఇంకా కలసి వచ్చే దేశాలతో చైనాను దెబ్బతీయాలన్న ఆలోచన బహిరంగంగానే సాగుతోంది. ఎవరూ దాచుకోవటం లేదు. కానీ అదే అమెరికా మాటను మనం మాత్రం అది గీసిన గీతను జవదాటకుండా ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాము. జపాన్‌,ఆస్ట్రేలియా దేశాలు ఖాతరు చేయలేదు, తోటి సభ్యురాలైన మన దేశానికి విలువ ఇవ్వలేదు. చైనా భాగస్వామిగా ఉన్న ఆర్‌సిఇపి(ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)కూటమిలో చేరాయి. మనం చెబుతున్న ఇండో-పసిఫిక్‌ మరియు మన దేశ ఈశాన్య ప్రాంత అభివృద్దికి వాటి చర్య విఘాతం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం అమెరికా మోజుల్లో ఖాతరు చేయటం లేదు. ఒకవైపు అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా మిలిటరీ ప్రతిఘటనకు ఆ రెండు దేశాలు సిద్దం అంటున్నాయి, మరోవైపు చైనాతో కలసి వ్యాపారాన్ని చేస్తామని చెబుతున్నాయి. ఒకేసారి ఇది ఎలా సాధ్యం ? మనమేమో చైనాతో వ్యాపారం చేయం, దాని సంగతి చూస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఇది జరిగేదేనా ? అమెరికా తోక పట్టుకొని గంగానదిని ఈదగలమా ? అమెరికాను నమ్మి ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాం. పోనీ దానికి బదులు ప్రపంచ వాణిజ్య సంస్ధలో మనకు వ్యతిరేకంగా అమెరికా వేసిన కేసులు తప్ప ఇతర ” ప్రయోజనాలేమైనా ” పొందామా ? గతంలో మనకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం గురించి నరేంద్రమోడీ చెబుతారు. మరోవైపు ప్రపంచంలో అతి పెద్ద స్వేేచ్చావాణిజ్య కూటమి ప్రపంచ జిడిపిలో 30,జనాభాలో 30శాతం కలిగిన దేశాలకు మనం దూరం అంటారు. ఆ కూటమిలో చేరితే మనకు దెబ్బ అన్న పెద్దలు దాని బదులు సాధించిందేమిటి ?


చైనా ఉన్న కూటమిలో చేరితే దాని వస్తువులను మనం కొనాల్సి ఉంటుంది అంటారు. నిజమే, ఇప్పుడు కొనటం లేదా ? కరోనాకు ముందు 2019-20లో మన దేశ మొత్తం వాణిజ్య లోటు 161 బిలియన్‌ డాలర్లు, కరోనా కారణంగా మరుసటి ఏడాది 98బి.డాలర్లకు తగ్గిందనుకోండి. ఈలోటులో చైనా వాటా 55-60 బి.డాలర్ల మధ్య ఉంటోంది. మరి మిగతా లోటు సంగతి ఏమిటి ? మన పరిశ్రమలు, వ్యవసాయానికి రక్షణ కల్పించాల్సిందే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏడు సంవత్సరాల నుంచి మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశాన్ని కూడా చైనాకు పోటీగా ప్రపంచ ఫ్యాక్టరీగా తయారు చేయాలని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఇప్పుడు చైనాతో పోటీ పడేందుకు భయపడుతున్నామంటే వైఫల్యాన్ని అంగీకరించినట్లే కదా ?సమీప భవిష్యత్‌లో కూడా చైనాతో పోటీపడలేమని చెప్పినట్లే కదా ? మన దేశ వస్తూత్పత్తికి అవసరమైన యంత్రాలను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా గడవని స్ధితి.


ఆర్‌సిఇపి ఒప్పందానికి అమెరికా దూరంగా ఉంది. దాని అనుయాయి దేశాలు కూడా ఇప్పుడు చైనాకు దగ్గర అవుతున్నాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికాయే విశ్లేషణలో వాపోయింది. మన కోడి కూయకపోతే తెల్లవారదు అనుకున్న అమెరిన్లకు జ్ఞానోదయం అవుతున్నట్లా ? పదిహేను దేశాల ఈ కూటమి ఒప్పందం అమలుకు ఇప్పటికే చైనా, జపాన్‌ ఆమోదం తెలిపాయి.మరో నాలుగు ఆసియన్‌, ఒక ఆసియనేతర దేశ చట్టసభలు ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకసారి అంగీకరించిన తరువాత వెనుకో ముందో అది జరుగుతుంది. లేదూ అమెరికా అడ్డుపడితే ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఆర్‌సిఇపికి పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా చైనా లేకుండా పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం(టిపిపి) చేసుకోవాలంటూ చర్చలు ప్రారంభించిన అమెరికాయే దాన్నుంచి వైదొలిగింది. దాంతో ఆర్‌సిఇపి ముందుకు సాగింది. దాని అనుయాయి దేశాల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఆర్‌సిఇపిలో చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనవసరంగా అమెరికా భయపడిందనే అభిప్రాయం ఇప్పుడు కొంత మంది అమెరికన్లలోనే వెల్లడి అవుతోంది.తమ దేశంలో టిపిపికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కాగా ఆర్‌సిఇపిని ఎవరూ వ్యతిరేకించలేదని న్యూజిలాండర్స్‌ చెప్పారు. అమెరికా తమకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నాం గనుక ఆర్‌సిఇపిలో చేరటం తమకు ముఖ్యమని ఆస్ట్రేలియన్‌ ఎంపీ చెప్పాడు.


అంతర్జాతీయ వాణిజ్యంలో భారత నష్టాలు చైనాకు లాభాలుగా మారుతున్నాయని మన దేశానికి చెందిన విశ్లేషకులు కొందరు చెబుతున్నారు.మనకు చిరకాలంగా మిత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు చైనాకు దగ్గర అవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల ఉత్సవం సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం చైనా మీద రెండు నాణాలను విడుదల చేసింది. మరి మోడీ గారు ఏమి చేస్తున్నట్లు ? ఇరాన్‌ మరింత స్పష్టమైన ఉదాహరణ. మన రూపాయిని ప్రపంచంలో స్వీకరించే వేళ్ల మీద లెక్కించే దేశాలలో ఇరాన్‌ ఒకటి. అమెరికా బెదిరింపులకు లొంగి మనం దాన్నుంచి చమురు కొనుగోలు చేయటం మాని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దాంతో ఇరాన్‌ సహజంగానే చైనాకు మరింత దగ్గరైంది. చాబహార్‌ రేవు అభివృద్ది పధకాన్ని మనం కోల్పోయాము, చైనా చేపట్టింది. రష్యా-అమెరికా మధ్య వివాదం ముదురుతుండటంతో రష్యన్లు చైనాకు దగ్గర అవుతున్నారు. భారత ఉపఖండ దేశాల మీద దీని ప్రభావం పడకుండా ఉండదు.


ప్రపంచంలో అమెరికా ఆర్ధికంగా అగ్రరాజ్యం అన్నది తెలిసిందే. అక్కడ రోడ్లు ఊడ్చేవారు కూడా సూటూ బూటూ వేసుకొని కార్లలో వచ్చి ఊడ్చిపోతారని దాన్ని అభిమానించే వారు లొట్టలు వేసుకుంటూ చెబుతారు, అక్కడి ఇండ్లలో మరుగుదొడ్లు మన పడక గదుల్లా ఉంటాయని చెప్పిన పెద్దలు ఉన్నారు. అలాంటి అమెరికాను చూసి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ? అంతటి ధనిక దేశం కూడా కరోనాతో కకావికలైంది.ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ ఏడాది మూడువేల డాలర్ల మేరకు సాయం చేయాలని జో బైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. మన ప్రధాని మూడు వేలు కాదు కదా ఈ ఏడాది పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పేశారు. ఈ నెల 15 నుంచి అమెరికాలో ఆ పధకం అమలు చేయనున్నారు. కనీసంగా మూడువేల డాలర్లు , కొందరికి 3,600 డాలర్లు కూడా లభిస్తాయని వార్తలు. ఏడాదికి భార్యాభర్తకు లక్షా 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు, ఒంటరిగా ఉన్నట్లయితే లక్షా 12వేల ఐదు వందల డాలర్లకంటే తక్కువగా వచ్చేవారు ఈ సాయం పొందేందుకు అర్హులు. వారికి ఆరు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ప్రతి నెలా 250 డాలర్ల చొప్పున ఆరునెలల పాటు ఇస్తారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలుంటే మూడు వందల డాలర్లు ఇస్తారు. ఇంతే కాదు వారికి ప్రతి బిడ్డకు వచ్చే ఏడాది 1,500 నుంచి 1,800 డాలర్ల పన్ను రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఇదంతా అక్కడ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకే, మరి మన దేశంలో జనం దగ్గర డబ్బు లేకుండా వస్తువులు ఎలా అమ్ముడు పోతాయి. ఆర్ధిక వ్యవస్ధ ఎలా ముందుకు పోతుంది. అందుకే భారత పరిశ్రమల సమాఖ్య వారు అవసరమైతే నోట్లను అదనంగా అచ్చువేసి మూడు లక్షల కోట్ల రూపాయల మేర జనానికి డబ్బు పంచాలని చెప్పారు. వారేమీ కమ్యూనిస్టులు కాదు. వారు తయారు చేసే వస్తువులను జనం కొంటేనే కదా పరిశ్రమలు నడిచేది. నరేంద్రమోడీకి ఈ మాత్రం ఆలోచన కూడా తట్టలేదా ?


బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా జరిపిన సర్వేలో మన దేశంలో 77శాతం మంది కార్మికులు ఉద్యోగం పోయింది లేదా ఆదాయానికి కోత పడిందని చెప్పారు, ఇరవైశాతం మంది ఉద్యోగాలు కోల్పోతే 57శాతానికి వేతనాల కోత పడింది. పరిస్ధితి ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కార్పొరేట్లకు ఆత్మనిర్భరత – కష్టజీవులకు బతుకు దుర్భరత అన్నట్లుగా తయారైంది. చైనాకు సమంగా జనాభా మన దేశంలో ఉంది. గతేడాది మన దేశంలో ఎలక్ట్రానిక్‌ వాణిజ్య విలువ 38 బిలియన్‌ డాలర్లని రెడ్‌సీర్‌ విశ్లేషణ పేర్కొన్నది. అదే చైనాలో 1.8లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. అందువలన మన దేశంలో ఉన్న ఉపాధి, వాటి మీద వస్తున్న ఆదాయం ఎంత తక్కువో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఏమి చూసి ముందువస్తారు ? కార్పొరేట్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కట్టబెడుతోంది కనుక ఆర్ధిక కార్యకలాపాలు లేకపోయినా కంపెనీల లాభాలను పంచుకొనేందుకు విదేశీ సంస్ధలు మన కంపెనీల వాటాలను కొనేందుకు ముందుకు వస్తున్నాయి తప్ప ప్రత్యక్ష పెట్టుబడులకు కాదు.


నోట్లను ముద్రించి ప్రభుత్వానికి నగదు ఇవ్వటం రిజర్వుబ్యాంకుల పని అని నైజీరియా రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఎంఫిలీ చెప్పాడు.(మన దేశంలో దేశమంతటికీ చెందిన రిజర్వుబ్యాంకు లాభాలను కేంద్రం తన ఖాతాకు మరలించుకొని లోటును పూడ్చుకుంటున్నది) నైజీరియా రిజర్వుబ్యాంకు ముద్రించిన 60బిలియన్‌ నైరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచటంపై వచ్చిన విమర్శలను ఎంఫిలీ తిప్పి కొట్టారు. నోట్ల ముద్రణకు తిరస్కరించటం బాధ్యతా రాహిత్యం అన్నాడు.

ప్రియమైన భారతీయులకు మీ నరేంద్రమోడీ రాసిన లేఖార్ధములు !

Tags

, , ,


హలో ప్రియమైన భారతీయులారా !
నేను భారత ప్రధాని నరేంద్రమోడీని,


మిత్రోం ఈ మధ్య నేను రాసిన లేఖ పేరుతో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా భక్తులు, అభిమానులు లేదా నా వ్యతిరేకులు గానీ వాటిని రాసి ఉండవచ్చు. అభిమానులు అయితే నాకు మద్దతుగా, వ్యతిరేకులు అయితే నా మీద తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు కావచ్చు. ఏమైనప్పటికీ నేను మీకు అదే పద్దతిలో కొన్ని విషయాలు చెప్పదలిచాను. నా పేరుతో అనధికారికంగా తిరుగుతున్న అంశాల మాదిరే వీటిని కూడా అనధికారికంగానే పరిగణించాలన్నది నా మనుసులోని మాట. నాపేరుతో ఉన్న లేఖ అంశాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇస్తామరి !


” మీరు నాకు బాధ్యతలను అప్పగించి ఏడు సంవత్సరాలైంది.ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ముళ్ల సింహాసనం ఎదురైంది ”


మిత్రోం మనలో మాట, నేను ఇప్పుడు కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాను గనుక నా అభిమానులు నాకు దక్కింది ముళ్ల సింహాసనం అని చెప్పవచ్చుగాని నేనుగా ఎప్పుడూ నోరు విప్పి ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. మిత్రోం పెళ్లి కాగానే హనీమూన్‌ ఉంటుంది. నాకు అలాంటిదేమీ అవసరం లేదని నేను అప్పుడే చెప్పాను. నాకు ముందున్న ప్రభుత్వాలు వంద రోజులు కాదు అంతకంటే ఎక్కువే హానీమూన్‌ గడిపాయి, వంద రోజులు కాదు కదా వంద గంటలు కూడా గడవక ముందే నా మీద విమర్శలు ప్రారంభమయ్యాయి.


” గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అస్త్యస్ధ పాలన కారణంగా అన్ని ప్రభుత్వ వ్యవస్ధలూ చిన్నాభిన్నం అయ్యాయి.పెద్ద మొత్తంలో విదేశీ అప్పు పేరుకు పోయింది, భారతీయ కంపెనీలు నష్టాల పాలయ్యాయి.”

మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో లేదా ఇతర పేర్లతో రాసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్లకు పదే పదే చెప్పాను గానీ వారికి అది ఎక్కినట్లు లేదు. కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటే నేనేదో కంపెనీల గురించి తప్ప జనాలకు కలిగిన నష్టాలను పట్టించుకోలేదనుకుంటారు. అందుకే కదా అచ్చే దిన్‌ , గుజరాత్‌ మోడల్‌ అని చెప్పాను. అయితే ఇన్నేండ్ల తరువాత వాటిని గుర్తు చేస్తే జనం నా పీక ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఉండరు. నా సంగతి తెలుసుగా ఒకసారి చెప్పిన మాట తిరిగి చెప్పటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా జనానికి ఎప్పుడూ కొత్త కబుర్లు చెప్పాలి తప్ప పాత చింతకాయ పచ్చడి ఎందుకు ? అర్ధం చేసుకోరూ !


మిత్రోం అరవై సంవత్సరాల గతపాలనలో విదేశీ అప్పు 446 బిలియన్‌ డాలర్లు అయితే ఏడు సంవత్సరాలలోనే దానికి నేను 124 బిలియన్‌ డాలర్లు అదనంగా చేర్చాను. దేశీయ అప్పు ఇదే కాలంలో 55 లక్షల కోట్ల నుంచి 117 లక్షల కోట్లకు పెంచాను అంటున్నారు. రెండూ కలిపితే 2021 మార్చి ఆఖరుకు రు.121లక్షల కోట్లు, అవును చేశాను, ముందే చెబుతున్నా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అది 136లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇదంతా నా సరదా కోసం చేశానా, నేనేమైనా వెనుకేసుకున్నానా ? దేశం అంటే మీ కోసమే కదా ! నన్ను నమ్మాలి మరి !!


మిత్రోం రాహుల్‌ గాంధీ, సీతారామ్‌ ఏచూరీ వంటి వారు ఎంత సేపూ కరోనా, జనం చేతికి డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలీ అంటారు. మీరు చెప్పండి జనం చేతికి కొన్ని వేలిస్తాం, వాటితో వారేమన్నా పరిశ్రమలు పెడతారా, వాణిజ్యం చేస్తారా, పది మందికి ఉపాధి కల్పిస్తారా ? కరోనా కాలంలో జనం దివాలా తీశారు – కార్పొరేట్లు బలిశారని అంటున్నారు. మన ఎస్‌బిఐ వారిని అన కూడదు గానీ అస్సలు బుర్రుందా ? ఎప్పుడేం చెప్పాలో తెలిసినట్లు లేదు. కరోనా కారణంగా వ్యక్తిగత అప్పులు జిడిపిలో 32.5 నుంచి 37.3శాతానికి పెరిగాయని చెబుతారా ? లెక్కలు సరిగా వేసినట్లు లేదు.


మిత్రోం రెండు సంవత్సరాల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు నిరుద్యోగం గురించి లెక్కలు సరిగా వేయలేదని, పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అని, అలాంటి వన్నీ లెక్కల్లో రాలేదని చెప్పాం గుర్తుంది కదా ! ఇప్పుడు కరోనా అప్పుల్లో ప్రతిదాన్నీ కలిపినట్లున్నారు, అందుకే సంఖ్య పెరిగింది. బి పాజిటివ్‌గా చూసినపుడు ఇలాంటి పరిస్దితి వచ్చినపుడే జనం పొదుపు చేస్తారు. అదే అసలైన దేశభక్తి. ఇక కరోనా కాలంలో కార్పొరేట్లు బలిశారు అంటున్నారు. మంచిదే కదా వారు బలిస్తే పెట్టుబడులు పెడతారు, పది మందికి ఉపాధి కల్పిస్తారు. అందుకే కదా గతేడాది 20లక్షల కోట్ల ఆత్మనిర్భరత, ఈ ఏడాది 6.209లక్షల కోట్ల తాయిల పొట్లం. అయినా అందరినీ ఒకేసారి బాగు చేయగలమా, ముందు కంపెనీలను బలపడేట్లు చేద్దాం – తరువాత జనం సంగతి చూద్దాం.


” ఇరాన్‌ అప్పు 48వేల కోట్లు వదలిపోయారు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు అప్పు 40వేల కోట్లు ”


మిత్రోం వీటి గురించి పదే పదే ఎక్కువగా ప్రచారం చేయకండిరా గోబెల్స్‌ కూడా సిగ్డుపడతాడు మన పరువే పోతుంది అని నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నా మా వారికి, అయినా వినటంలా. ఇరాన్‌ నుంచి మనం చమురు కొన్నాం. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని మన ఖజానాలో వేసుకున్నాం. మనకేం నష్టం లేదు. ఆ చమురుకు డబ్బు చెల్లించే సమయానికి అమెరికా వారు ఆంక్షలు పెట్టారు. బ్యాంకు ఖాతాలను స్ధంభింప చేశారు. మనమేం చేస్తాం. మీరు చెప్పండి ! ఇరాన్ను వదులుకోగలం గానీ అమెరికాకు ఆగ్రహం వస్తే తట్టుకోగలమా ? అందుకే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో చెల్లించటం కుదరలేదు కనుక నా హయాంలో చెల్లించా. తరువాత మాకు అమెరికా ముఖ్యం తప్ప మీరు కాదు అంటూ ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లనే ఏకంగా నిలిపివేశాం. దాని బదులు అమెరికా నుంచి కొంటున్నాం.ఈ విషయంలో డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత సంతోషం కలిగిందో నేను వర్ణించలేనబ్బా !

మిత్రోం ఇరాన్‌కు మనకూ ఎలాంటి పేచీ లేదు. అయినా అమెరికా కోసం దాని దగ్గర చమురు కొనటం ఆపాం. కానీ అదేంటో ఈ చర్యతో వారు చైనాకు దగ్గరైనట్లు, ఆ పనేదో నేనే చేసినట్లు కొందరు అర్ధాలు తీస్తున్నారు. ఇక యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఉన్న బాకీల గురించి అవి మన దేశానికి చెందిన సంస్దలు అక్కడ చేసిన అప్పులు. వాటికి తిప్పలో మరో కారణంతోనో అవి చేతులెత్తేశాయి. అవి కూడా మన మీద పడ్డాయి.


” భారతీయ చమురు కంపెనీలకు వచ్చిన నష్టాల మొత్తం రు.1,33,000 కోట్లు ”


మిత్రోం ఇంత మొత్తం మన కంపెనీలకు నష్టం వచ్చిందని నేనెక్కడా చెప్పినట్లు లేదు. గత ప్రభుత్వాలు చమురు బాండ్లుగా ఇచ్చిన మొత్తం నా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని మా మంత్రులు చెప్పారు. ఇప్పటికే వాటిని తీర్చేశామని అత్యుత్సాహంతో చెప్పి ఉండవచ్చు.ప్రతిపక్షాలకు పనీ పాటా లేదు. 2026 నాటికి తీర్చాల్సిన ఈ అప్పుల పేరుతో నేను గత ఏడు సంవత్సరాలుగా చమురు పన్ను పేరుతో జనాల జేబులు కొల్లగొట్టానని ఆడిపోసుకుంటున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి ! నా జేబులో వేసుకున్నానా !

” ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రు.58,000,భారతీయ రైల్వేల నష్టాలు రు.22,000, బిఎస్‌ఎన్‌ నష్టాలు రు.1,500 ”


మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో పోస్టు చేస్తున్న వారు నా భక్తుల ముసుగులో ఉన్న వ్యతిరేకులు తప్ప మరొకటి, కాదు ఇప్పటి ఎప్పటివో ఎందుకు వచ్చాయో చెప్పకపోతే పోయేది నా పరువే కదా !


” సైనికులకు కనీస ఆయుధాలు లేవు, వారికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు లేవు, ఆధునిక యుద్ద విమానాలు లేవు, సైన్యాలు నాలుగు రోజులు కూడా నిలవలేవు ”


మిత్రోం మనలో మాట. నిజానికి మన సైన్యం అంత దుస్దితిలో ఉందంటే మా గురువు గారు అతల్‌ బిహారీ వాజ్‌పారుకి, అంతకంటే పెద్ద గురువు ఎల్‌కె అద్వానీకి అవమానం. వారి పాలన ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది.మన సైన్యం నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసేట్లుంటే కార్గిల్‌ యుద్దంలో రెండు నెలల మూడు వారాల రెండు రోజులు ఎలా యుద్దం చేసి విజయం సాధించారు. ఉత్తినే, మా అమిత్‌ షా అప్పుడప్పుడు అంటుంటాడు కదా జుమ్లా అని అందుకే ఏదో అలా చెబుతుంటాం. సరే మా వాళ్లు నా పేరుతో చేస్తున్న ప్రచారం గురించి చెప్పాను, నా మనసులోని మాటలు కూడా చెప్పాను. పరిస్ధితి ఇలా ఉండగా బాధ్యతలు స్వీకరించిన నేను నిర్ణయించుకున్నదేమిటంటే….


” ఆ సమయంలో వ్యవస్ధలన్నింటినీ సరి చేయటం నా ప్రధాన బాధ్యత అనుకున్నాను. అదృష్టం కొద్దీ భారతీయుల కోసం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగి వచ్చాయి. అయితే తగ్గిన ధరలమేరకు మీరు పూర్తిగా లబ్ది పొందలేదు. ప్రభుత్వం తప్పు చేసిందని మీరు తప్పకుండా భావిస్తూ ఉండి ఉంటారు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.అయితే చమురు ధరల కారణంగా నామీద మీకు కొద్దిగా కోపంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేనేమీ చేయలేను. ఎందుకంటే నేను నా భవిష్యత్‌ తరాల కోసం పనిచేస్తున్నాను. అంతకు ముందున్న ప్రభుత్వ తెలివితక్కువ తనం మనకు శాపంగా మారింది. వారు అప్పు తెచ్చి చమురు కొనుగోలు చేశారు, అయినప్పటికీ పౌరుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు వారు ధరలను పెంచలేదు. అప్పుడు ఆయన విదేశాల నుంచి రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇందుకోసం మనం ప్రతి సంవత్సరం వడ్డీ కింద ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. మన దేశానికి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారు. రుణం తీర్చాలని మనకు చెప్పారు, అలా చేస్తేనే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన దేశానికి చమురు దొరుకుతుందన్నారు.”

మిత్రోం ఇవన్నీ స్వయంగా నేనే మీకు చెబుతున్నట్లుగా ఉంది కదూ, ఉత్తినే. అసలు నేనెక్కడా ఈ మాటలు చెప్పలేదు. అయితే నేను చెప్పినట్లుగా ప్రచారం చేస్తుంటే మనకు వాటంగా ఉన్నాయి కదా అని మౌనంగా ఉన్నా. మీరు కూడా అదే చేస్తారు కదా. సరే,


” చమురు మీద పన్నులు వేసిన కారణం ఏమిటంటారు. మనం వడ్డీతో సహా రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాం అని ఈ రోజు గర్వంగా చెప్పవచ్చు ”


మిత్రోం ఇలా చెబుతున్నానంటే ఈ అప్పువేరు, చమురు బాండ్ల అప్పు వేరా, అయితే ఎక్కడా అధికారికంగా అలా చెప్పలేదేం అని మీరు అడగవచ్చు. దేశభక్తులం, దేశ రహస్యాలను ఎలా చెబుతాం, చమురు బాండ్ల చెల్లింపు గడువు 2026 వరకు ఉందని బడ్జెట్‌ పత్రాల్లో ఉంది కదా అని మీరు నిలదీయవచ్చు. బడ్జెట్‌ పత్రాల్లో రాసినవన్నీ నిజం అనుకుంటే నేనేం చేయలేను. జుమ్లా, ఏదో రాస్తుంటాం. మీరు నిజంగా దేశభక్తులే అయితే అప్పు తీరిందంటున్నారు కదా పెంచిన పన్ను తగ్గిస్తారా అని మాత్రం అడగవద్దు,

” రైల్వేలు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పధకాలన్నింటినీ పూర్తి చేశాం, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.గతం కంటే వేగంగా అన్ని రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తి చేశాం. అదే విధంగా 18,500 గ్రామాలను విద్యుదీకరించాం. ఐదు కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు పేదలకు ఉచితంగా ఇచ్చాం. వందలాది కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేశాం. యువకులకు ఒకటిన్నరలక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో 50 కోట్ల మందికి వైద్య బీమాకోసం లక్షా 50వేల కోట్లతో పధకాన్ని ప్రారంభించాం”


మిత్రోం, భూమికి గొడుగు తొడిగించాం, పగలే లైట్లు వెలిగించాం, ఎడా పెడా చేతికి వచ్చిన బంగారం అంతా జనానికి ఇచ్చాం చివరకు అన్నీ పొగొట్టుకుని మాకు తినేందుకు తిండిలేక ఇలా అడుక్కునేందుకు వచ్చాం అనే తుపాకి రాముడి లేదా పిట్టల దొర మాటల్లా ఉన్నట్లు మీకు అనిపిస్తున్నాయి కదూ, నాకు తెలుసు. ఇన్ని పధకాలకు ఇంతంత భారీ మొత్తాలను ఖర్చు చేసిన మీరు కరోనా రోగులకు ఆక్సిజన్‌ కూడా అందించలేకపోయారెందుకని అడుగుతారు. ఉచితంగా వాక్సిన్‌ వేస్తామని మడమ తిప్పారెందుకుని కూడా అడుగుతారు. కరోనా మరణాలకు పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారెందుకు అని నిలదీయవచ్చు.అసలు ఈ కోర్టులున్నాయి చూశారూ….ఒక్కోసారి ఏం చేస్తాయో తెలియదు.


” మన సైనికులకు అన్ని అధునాతన ఆయుధాలను, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లను, రాఫెల్‌ యుద్ద విమానాలను, ఇంకా అనేక రకాల మారణాయుధాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాం. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు. అ సొమ్ము మీరిచ్చిందే, మీరంతా పెట్రోలు, డీజిలు కొని దేశానికి డబ్బు ఇచ్చారు. పెట్రోలు, డీజిలు మీద పన్ను రద్దు చేస్తే మనం అప్పులను తీర్చటం సాధ్యమా ? మనం అప్పులను తీర్చగలం, అదే విధంగా కొత్త పధకాలను తీసుకురాగలం. కాబట్టి పరోక్షంగా ప్రతిదాని మీద పన్నులు పెంచాల్సిందే. నూటముప్పయి కోట్ల మంది పౌరుల బాధ్యత వాహన యజమానిదిగా మాత్రమే ఉండకూడదు.”

మిత్రోం చమురు ధర లీటరుకు ఏడు పైసలు పెంచినందుకు మన నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి గతంలో ఢిల్లీలో ఎడ్లబండి మీద ఊరేగి నిరసన తెలిపారు కదా అని కొంత మంది పాత వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారు. దేశభక్తులు మీరు అలా ప్రచారం చేస్తే, నిలదీస్తే నా మనోభావాలు గాయపడతాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ చమురు మీద ఇంతగా పన్నులు లేవు కదా అని కొందరంటున్నారు. మన దేశ పరువును బజారుకీడ్చటం తప్ప దీనిలో దేశభక్తి ఉందా ? మనం ఇతర దేశాల గురించి పోల్చుకోవటం అంటే టూల్‌కిట్‌ను విదేశాలకు అందించటమే. అది దేశద్రోహం కదా !


” చివరిగా ఒక మాట… మీరు కుటుంబ పెద్ద అయితే మీ కుటుంబం మీద పెద్ద అప్పుల భారం ఉంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తారా లేక అప్పులు తీరుస్తారా ? రుణం దాని మీద వడ్డీ జాగ్రత్తగా తీర్చకపోతే కుటుంబ భవిష్యత్‌ ఏమౌతుంది ? ప్రత్యర్ధుల వలలో పడకండి.. ఈ దేశభక్తుడైన పౌరుడిగా మీరు దేశ అభివృద్దిలో భాగస్వాములు కండి.ఈ నిరసన అంతా ఎల్లవేళలా ఓట్ల కోసమే, కొంత మంది రాజకీయవేత్తలు తప్పుడు ప్రచారంతో పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు.భారతీయులుగా మీరు ఈ వాస్తవాలను అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను.”


మిత్రోం, ఇన్ని విషయాలు చెప్పిన తరువాత మీకు తత్వం తలకెక్కిందని భావిస్తున్నాను. మీరు నిజంగా దేశభక్తులే , బాధ్యతగల పౌరులే అయితే, దేశం మనకేమిచ్చిందని గాక దేశానికి మనమేం ఇచ్చామని ఆలోచించే వారయితే ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు ఎందుకు పెంచారు, ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. గత ప్రభుత్వం రెండున్నరలక్ష కోట్ల రూపాయల అప్పుకే పాతివేల కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పాను. ముందే చెప్పినట్లు ఈ ఏడాది 121లక్షల కోట్ల దేశీయ, విదేశీ అప్పుకు గాను ఈ ఏడాది వడ్డీ పన్నెండు లక్షల 10వేల కోట్లు, వచ్చే ఏడాది 136లక్షల కోట్లకు గాను పదమూడు లక్షల 60వేల కోట్ల వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది. అదంతా ఎవరు చెల్లిస్తారు. మీకోసం అప్పు చేసినపుడు మీదే బాధ్యత ! నా దగ్గర గడ్డం జులపాలు తప్ప వేరే ఏమీ లేవని తెలిసిందే. అందువలన మీరే చెల్లించాలి. ముందుగానే చెబుతున్నా, ఎవరేమనుకున్నా ఏదీ ఊరికే రాదు అని టీవీల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు కదా, కనుక రాబోయే రోజుల్లో ఇంకా పన్నులు వేయక తప్పదు, దేశభక్తులుగా మీరు భరించకా తప్పదు.
మీ
నరేంద్రమోడీ,
మాతా నీకు వందనం,
భారత మాత వర్దిల్లుగాక ,
జై హింద్‌.

ఇక చాలు నరేంద్రమోడీ గారూ – మీ వైఫల్య భారాన్ని ఇంకేమాత్రం మోయలేం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ ఆగండి ఆగండి నరేంద్రమోడీ అభిమానులారా ! ఈ మాటలన్నది రాహుల్‌ గాంధీయో, సీతారామ్‌ ఏచూరో కాదు. ఒక్కసారి గతంలోకి వెళితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలే ఇవి అని మీరు ఇట్టే గ్రహించేస్తారు.


ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రూపాయి విలువ పతనం కారణంగా మన విదేశీ అప్పు గణనీయంగా పెరిగి పోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వుబ్యాంకే తాజాగా చెప్పింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన విదేశీ అప్పు 570 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. గతేడాది మార్చి నాటికి జిడిపిలో విదేశీ అప్పుశాతం 20.6శాతం ఉంటే ఈ ఏడాదికి అది 21.1శాతానికి ” అభివృద్ధి ” చెందింది. గతేడాది మన విదేశీ అప్పు 11.5బిలియన్‌ డాలర్లు పెరిగింది. మన రూపాయి విలువ పతనం కానట్లయితే ఆ పెరుగుదల 4.7 బిలియన్‌ డాలర్లు ఉండేది, పతనం కారణంగా 6.8బి.డాలర్లు అదనం అయింది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం ఏమంటే ఒప్పందం ప్రకారం వడ్డీ నెల నెలా కట్టకపోతే అది అసలులో కలిసి అప్పు భారం పెరుగుతుంది. మనం కొత్తగా అప్పులు తీసుకోకపోయినా, వడ్డీ సకాలంలో చెల్లించినా రూపాయి విలువ తగ్గితే మన అప్పు పెరిగి పోతుంది. అందువలన మోడీ గారు చెప్పినట్లు రూపాయి విలువ తగ్గుదల-పెరుగుదల ప్రభుత్వాలదే గనుక ఆ పుణ్యం మన నరేంద్రమోడీ ఖాతాలోకే వేయాలి మరి. మన్మోహన్‌ సింగ్‌కు ఒక న్యాయం నరేంద్రమోడీకి ఒక న్యాయం ఉండదు కదా !


మా నరేంద్రమోడీ గారు అప్పులే చేయలేదు, గతంలో చేసిన అప్పులు తీర్చారు అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ఊదరగొట్టారు. మరి రిజర్వు బ్యాంకు చెబుతున్న వివరాల సంగతేమిటి ? అప్పులు తీరిస్తే ఎందుకు పెరుగుతున్నాయి ? 2014లో 446.2 బిలియన్‌ డాలర్ల అప్పుంటే ఇప్పుడు 570బి.డాలర్లకు పెరిగింది. గత ఏడాది చెల్లించిన అసలు , వడ్డీ కలిపి 8.2శాతం ఉండగా అంతకు ముందు 6.5శాతం ఉంది. గత ఏడు సంవత్సరాలలో అది 5.9 నుంచి 8.2శాతం మధ్య ఉంది తప్ప మోడీ భక్తులు చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఏడాదిలోనూ అసాధారణంగా అప్పు తీర్చిన దాఖలా లేదు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇదే కాలంలో 79 బిలియన్‌ డాలర్ల నుంచి 107కు పెరిగాయి. అందువలన గత ప్రభుత్వం మాదిరే మోడీ సర్కార్‌ కూడా అప్పులు తీసుకుంటున్నదీ, చెల్లిస్తున్నది తప్ప 56 అంగుళాల ఆర్ధిక నైపుణ్య ప్రత్యేకత ఏమీ లేదు.


గత ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మోడీ సర్కార్‌ భరించాల్సి వస్తున్నది కనుక సమీప భవిష్యత్‌లో చమురు ధరలు లేదా పన్ను తగ్గించే అవకాశం లేదని అభిమానులు చెబుతారు.మన్‌కీ బాత్‌ అంటూ ప్రతి నెలా మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏ నెలలో అయినా ఆ విషయం చెప్పారా అందువలన ఏదో ఒక సమయంలో ఆ ముక్కేదో నరేంద్రమోడీ గారినే చెప్పమనండి ! చెప్పలేరు ? ఎందుకని ? మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌, అంతకు ముందు వాజ్‌పారు సర్కార్‌ జారీ చేసిన బాండ్లకు గాను చెల్లించాల్సిన మొత్తం లక్షా 30వేల కోట్ల రూపాయలు. వాటి గడువు ఇంకా ఉంది. అది కూడా వినియోగదారులకు సబ్సిడీగా ఇచ్చిన మొత్తం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తానికి గుండెలు బాదుకుంటూ చమురు ధర తగ్గించలేరని చెబుతున్న వారు మోడీ సర్కార్‌ చేసిన అప్పుల గురించి మాట్లాడరు. విదేశీ అప్పు గురించి పైన చెప్పుకున్నాం. గత ఏడు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు ఎంతో తెలుసా ! 2014లో ఉన్న అప్పు 54,90,763 కోట్లు. అది 2021మార్చి 31 నాటికి 116.21 లక్షల కోట్లకు పెరిగింది. చమురు బాండ్లు ఈ మొత్తంలో వందో వంతు కంటే తక్కువే కదా ? మరి ఇంత అప్పు ఎందుకు చేసినట్లు ? ఈ మొత్తంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ? దాని వలన వచ్చిన ఫలితాలేమిటో ఎవరైనా చెప్పేవారున్నారా ?


ఏడు సంవత్సరాల క్రితం ఒక లీటరు పెట్రోలు మీద రు. 9.48 ఎక్సైజ్‌ పన్ను ఉంది. అది ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. ఒక రూపాయి పన్ను పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడు సంవత్సరాల కాలంలో ఆదాయం లక్షా 30వేల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది. యుపిఏ చమురు బాండ్ల పేరుతో ఇంత బాదుడా ? జనాన్ని అంత ఆమాయకంగా చూస్తున్నారా ?
2014 మేనెలలో మనం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా ధర డాలర్లలో 107.7 ఉండగా మన రూపాయల్లో చెల్లించిన మొత్తం 6,326. ఇప్పుడు జూన్‌ నెలలో 71.40 డాలర్లు కాగా రూపాయల్లో 5,257, జూలై రెండవ తేదీ ధర 74.75 కాగా రూపాయల్లో 5,560 ఉంది. ఏడు సంవత్సరాల క్రితం అంత తక్కువ ఎందుకు చెల్లించాము, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాము. అంటే మోడీ గారి ఏలుబడిలో రూపాయి విలువ పతనం కావటమే కారణం. మరి రూపాయి విలువ గురించి గతంలో చెప్పిన మాటలేమైనట్లు ? ఇలా పతనం అవుతుంటే ఎవరు లాభపడుతున్నట్లు ? గోడదెబ్బ-చెంపదెబ్బ మాదిరి వినియోగదారులకు పన్ను పోటు-రూపాయి పోటు రెండూ ఎడాపెడా తగులుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఎక్కడ, అనుభవం ఏమైనట్లు ?


మోడీ పాలనలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంత పెరిగాయి, ఇంత పెరిగాయి చూడండి అంటూ గొప్పలు చెబుతారు. మన వాణిజ్యం ప్రతి సంవత్సరం లోటులోనే నడుస్తున్నది. మరి ఈ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి ? గతేడాది కరోనా కారణంగా వినియోగం తగ్గి దిగుమతులు పడిపోయి వాణిజ్య మిగులు ఉంది తప్ప ఎప్పుడూ మనకు చైనా, జపాన్‌ మాదిరి డాలర్లు మిగల్లేదు. మరి మన దగ్గర ఉన్న డాలర్‌ నిల్వలు ఏమిటి అంటే మన స్టాక్‌ మార్కెట్లో విదేశీయుల పెట్టుబడులు, చేస్తున్న అప్పులు, ప్రవాస భారతీయులు దాచుకుంటున్న నిల్వలు మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే మన జేబులో సొమ్ము తప్ప బీరువా ఖాళీయే. మన రూపాయి విలువ తక్కువ, ఎక్కువ ఉండటం గురించి మన వాణిజ్య వేత్తల్లో విబేధాలు ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తీసుకున్నా లేదా విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా మన దగ్గర డాలర్‌ నిల్వలు పెరుగుతాయి, దాంతో రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ఎగుమతి దారుల లాభదాయకతను దెబ్బ తీస్తుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు పోటీ పడలేవు. అందువలన రూపాయి బలంగా ఉండటాన్ని ఎగుమతిదారులు వ్యతిరేకిస్తారు.ఇప్పుడున్న దాని మీద రూపాయి విలువ 20శాతం తగ్గిస్తే మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని వారు చెబుతారు.


మన రూపాయి బలంగా ఉంటే చమురు, ఇతర దిగుమతుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల మీద భారం తగ్గుతుంది. కనుక రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని దిగుమతిదారులు డిమాండ్‌ చేస్తారు. 2011 నుంచి మన ఎగుమతులు 300 నుంచి 314 బిలియన్‌ డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఒక సంవత్సరం మాత్రం 330 బి.డాలర్లు ఉన్నాయి.ఇదే సమయంలో దిగుమతులు పెరగటమే తప్ప తరగటం లేదు. ఏడు సంవత్సరాలుగా మేకిన్‌ ఇండియా పేరుతో ప్రధాని మోడీ వస్తు తయారీకి పిలుపులు ఇస్తున్నా ఎగుమతులూ లేవు, దిగుమతులూ తగ్గలేదు. అంటే మనకు అవసరమైన వస్తువులను కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మొత్తం మీద చెప్పవచ్చేదేమంటే మోడీ సర్కార్‌ వైఫల్యాలు జనం మీద భారాలు పెంచుతున్నాయి. మునిగే పడవ గడ్డిపోచను కూడా భరించలేదన్నట్లుగా పరిస్ధితి దిగజారుతోంది. అందుకే మోడీ గారు మీ భారాలు మోయలేకున్నాం అని చెప్పాల్సి వస్తోంది. వినిపించుకుంటారా ! అధికారంలో ఉన్నవారు అలాంటి మంచి పని చేసిన దాఖలా లేదు మరి !!

చిలీ అధ్యక్ష పోటీలో ముందున్న కమ్యూనిస్టు అభ్యర్ధి !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది నవంబరు 21న జరగనున్న చిలీ అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్ధిగా అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నేత డేనియల్‌ జాడ్యు ముందుకు దూసుకు వస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. వివిధ పార్టీల అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయనప్పటికీ కాగల అభ్యర్ధులను ఊహించి సర్వేలు చేస్తున్నారు. మే నెలలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో విజయం సాధించిన రెండు వామపక్ష సంఘటనలు, మరొక వామపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి. వారిలో అంతిమంగా జాడ్యు అభ్యర్దిగా నిర్ణయం అవుతారని భావిస్తున్నారు. అదే జరుగుతుందా, మరో వామపక్ష అభ్యర్ధి రంగంలో ఉంటారా అన్నది త్వరలో తేల నుంది. ఈనెల 18న వివిధ పార్టీలు,కూటములు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి.


రాజధాని శాంటియాగో మహానగరంలో ఉన్న రికొలెటా ప్రాంత కార్పొరేషన్‌ మేయర్‌గా ఇటీవల జాడ్యు తిరిగి ఎన్నికయ్యారు. పాలస్తీనా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన జాడ్యు తొలి దశలో పోటీ ఎలా జరిగినప్పటికీ మెజారిటీ రాకపోతే రెండవ దఫా ఎన్నికలో అయినా విజేతగా కాబోయే అధ్యక్షుడంటూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, బొలీవియా, బ్రెజిల్‌, అర్జెంటీనా తదితర దేశాలలో వామపక్ష అధ్యక్షులుగా ఎన్నికైన వారందరూ వామపక్షాలకు చెందిన వారు, మార్క్సిజం-లెనిజం పట్ల విశ్వాసం ప్రకటించిన వారే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. సామ్రాజ్యవాదులు కుట్రలకు పాల్పడి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము గానీ లేనట్లయితే లాటిన్‌ అమెరికాలో మరో ఎర్రమందారం వికసించటం ఖాయంగా కనిపిస్తోంది.తొలి దశలోనే మెజారిటీ సంపాదిస్తారా లేక రెండవ పోటీలోనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నూతన రాజ్యాంగ పరిషత్‌, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలలో అదే పరంపరను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం పచ్చి మితవాది సెబాస్టియన్‌ పినేరా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష శక్తులు, వారిని బలపరిచే వారే మెజారిటీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు జాడ్యుతో పాటు మితవాద పార్టీలైన ఇండిపెండెంట్‌ డెమ్రోక్రటిక్‌ యూనియన్‌ అభ్యర్ధి జాక్విన్‌ లావిన్‌, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన యాసనా ప్రొవోటే మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు.
లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నది. గతనెల ఆరున పెరూలో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో నలభైవేలకు పైగా మెజారిటీతో గెలుపొందినప్పటికీ ఇంతవరకు ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష మితవాద అభ్యర్ధి చేసిన ఫిర్యాదును విచారించే పేరుతో కాలయాపన చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రెజిల్‌లో తిరిగి వామపక్ష నేత లూలా డ సిల్వా తిరిగి ఎన్నిక కానున్నారని, నికరాగువాలో అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా తిరిగి విజయం సాధించనున్నారనే వాతావరణం ఉంది. దానికి అనుగుణ్యంగానే చిలీ పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.


ప్రజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం, వివిధ సేవల ప్రయివేటీకరణ చర్యలతో లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు జరిపిన నూతన ఆర్ధిక లేదా నయా ఉదారవాద విధానాలు సామాన్య జనజీవితాలను దిగజార్చాయి. ధనికుల మీద పన్ను భారం పెంచటం, పెన్షన్‌ వ్యవస్ధను పునర్వ్యస్తీకరించటం, ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ ప్రమేయం పెంపు, పన్నులు ఎగవేసేందుకు కంపెనీలు సరిహద్దులు దాటి పోవటాన్ని నిరోధించటం వంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ప్రపంచంలో అత్యధిక రాగి నిల్వలను కలిగి ఉన్న చిలీ సంపదను బహుళజాతి గుత్త సంస్ధల పాలు చేయకుండా ప్రజల కోసం వినియోగించాలని చెప్పింది. ఖనిజ సంపదకు రాజ్యం యజమాని గనుక అన్ని కార్యకలాపాలలో అది భాగస్వామిగా ఉండాలని కోరింది. సమస్యలపై ఉద్యమించిన ప్రజా సమూహాలపై మాజీ నియంత పినోచెట్‌ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు పినేరా మిలిటరీని ప్రయోగించిన తాజా నిరంకుశుడిగా చరిత్రకెక్కాడు.


కమ్యూనిస్టు నేత జాడ్యు ప్రజాదరణ పొందుతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తుండటంతో మితవాద శక్తులు ఆయన్ను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నాయి. కమ్యూనిస్టును ఎన్నుకుంటే ప్రమాదమని జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అధ్యక్షపదవి అభ్యర్ధిగా ఉన్న జాడ్యు పాఠశాల్లో చదువుకొనే రోజుల్లో యూదు వ్యతిరేకిగా ఉన్నాడని అభిశంసిస్తూ పార్లమెంట్‌లోని మితవాద ఎంపీలు ఒక తీర్మానంలో ధ్వజమెత్తారు. అనుకూలంగా 79 వ్యతిరేకంగా 47 వచ్చాయి. చిలీలో యూదులు ఇరవై వేలకు మించి లేనప్పటికీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని ఆయన కొట్టిపారవేశారు. చిలీలో పాలస్తీనా మూలాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉన్నారు. జాడ్యు క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. ఆయన తాతల కాలంలో పాలస్తీనా నుంచి చిలీకి వలస వచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోలో 1967 జూన్‌ 28జన్మించిన జాడ్యు పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌ యూదుల దురంతాలను వ్యతిరేకించాడు. పాలస్తీనా విముక్తికి మద్దతుగా చిలీ లోని పాలస్తీనియన్‌ విద్యార్ధి సంఘం, తరువాత కమ్యూనిస్టు విద్యార్ధి సంఘ నేతగా, పని చేశారు. నియంత పినోచెట్‌కు మద్దతుదారు అయిన తండ్రిని ఎదిరించి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు.1993లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.2012 నుంచి రికొలెటా కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేస్తున్నారు. పేదలకు అవసరమైన జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపి ప్రశంసలు పొందారు.


జాడ్యు పాఠశాలలోనే ఇజ్రాయెల్‌ దురహంకారం, పాలస్తీనియన్లపై జరుపుతున్న దురాగతాలను వ్యతిరేకించేవాడు. ప్రతి సంవత్సరం ప్రచురించే పాఠశాల ప్రత్యేక సంచికలో జాడ్యు స్నేహితులు సరదాగా అనేక వ్యాఖ్యలు రాస్తుండేవారు.వాటిలో ” అతని వాంఛ యూదుల నగరాన్ని శుద్ధి చేయటం, అతని లక్ష్య సాధన కసరత్తుకు తగిన బహుమానం ఒక యూదును ఇవ్వటమే ” వంటి వ్యాఖ్యలు చేసే వారు. అతని రికార్డులో పాఠశాల తనిఖీ అధికారి జాడ్యు యూదు వ్యతిరేకి అని రాశాడు. చిలీ యూదుల నేత ఒకరు ఈ విషయాలున్న పత్రాల కాపీని ట్వీట్‌ద్వారా ఎంపీలు, ఇతరులకు పంపాడు. దాన్ని పట్టుకొని పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసింది. ఇదంతా అతను ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధిగా ముందుకు వస్తున్న నేపధ్యంలోనే జరిగింది.


పార్లమెంట్‌ తీర్మానాన్ని జాడ్యు కొట్టిపారవేశాడు.” దేశం ఇప్పుడు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా సంక్షోభంతో ఉంది. వందలాది మంది మరణిస్తున్నారు, కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. కానీ మితవాద ఎంపీలు 35 సంవత్సరాల క్రితం ఇతరులు స్కూలు పత్రికలో నా గురించి రాసినదాన్ని వివరించటానికి తీవ్రంగా శ్రమించారు. పాఠశాల తనిఖీ అధికారి రాసిన వాటిని నేను అప్పుడే ఖండించాను ” అని చెప్పాడు. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం జాడ్యుకు 38శాతం మద్దతు ఉండగా అతని సమీప ప్రత్యర్ధికి 33శాతం ఉంది.


చిలీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు భావజాలంతో పని చేసింది) నేత సాల్వెడార్‌ అలెండీ లాటిన్‌ అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్షవాది.1970 నవంబరు మూడు నుంచి 1973 సెప్టెంబరు 11న సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయేంతవరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలెండీ కొనసాగితే లాటిన్‌ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు ఊపందుకుంటాయనే భయంతో అమెరికా సిఐఏ కుట్రలో భాగంగా మిలిటరీ అధికారి పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. మిలిటరీని ఎదుర్కొనే క్రమంలో అలెండీ స్వయంగా, అనుచరులు కూడా ఆయుధాలు చేపట్టారు. అయితే తగిన విధంగా పార్టీ నిర్మాణం, సన్నద్దత లేకపోవటంతో మిలిటరీదే పైచేయి అయింది. తరువాత అమెరికా చికాగో విశ్వవిద్యాలయంలో చదివిన ఆర్ధికవేత్తలను చిలీతో పాటు దాదాపు అన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు అమెరికా పంపటమే గాక ఉదారవాద విధానాల అమలుకు ఆ ఖండాన్ని ప్రయోగశాలగా చేసింది. అందువలనే ఆ విధాన ఆర్ధికవేత్తలందరినీ ” చికాగో బాలురు ” అని పిలిచారు. రాజ్యాంగాల రచనల నుంచి అన్నింటా వారి ముద్ర ఉండేది. తాజా రాజ్యాంగ ఎన్నికలలో వామపక్ష, అభ్యుదయవాదులు విజయం సాధించటంతో చిలీలో వారి శకం అంతరించినట్లే అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అలెండీ నాయకత్వం వహించిన పార్టీలో తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు.


నూటతొమ్మిది సంవత్సరాల క్రితం 1912 జూన్‌ నాలుగున ఏర్పడిన చిలీ కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకొన్నది.. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు 1912లో సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల తరువాత అదే కమ్యూనిస్టు పార్టీగా మారింది.1938లో పాపులర్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తరువాత డెమోక్రటిక్‌ కూటమిలో ఉంది. పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి బలం పుంజుకుంటున్న తరుణంలో 1948 నుంచి 58వరకు పార్టీపై నిషేధం విధించారు.1960 దశకంలో తిరిగి బహిరంగంగా పని చేయటం ప్రారంభించింది. పాబ్లో నెరూడా వంటి నోబెల్‌ బహుమతి గ్రహీత కవి, తదితర ప్రముఖులు పార్టీలో పని చేశారు.1970లో అలెండీ నాయకత్వంలో పాపులర్‌ యూనిటీ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వంలో చేరింది. అలెండీ సర్కార్‌ను కూలదోసిన మిలిటరీ నియంత పినోచెట్‌ 1973 నుంచి 1990 వరకు పార్టీపై నిషేధం అమలు జరిపాడు. మరోసారి కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్లారు.1977లో గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు రికార్డో లాగోస్‌ ఎన్నిక వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. తరువాత 2006లో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు మిచెల్లీ బాచెలెట్‌ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని శాంటియాగోతో సహా అనేక చోట్ల మేయర్లుగా ఎన్నికయ్యారు.1927-31, 1948-1958, 1973-1990 సంవత్సరాల మధ్య నిర్బంధాలకు గురికావటంతో పాటు పినోచెట్‌ పాలనలో పలువురు నేతలతో సహా వేలాది మంది కమ్యూనిస్టులు హత్యలకు గురయ్యారు. తిరుగుబాటు సమయంలో అలెండీని మిగతా వామపక్షాలు వదలి వేసినప్పటికీ కమ్యూనిస్టులు ఆయనతో భుజం కలిపి పినోచెట్‌ను ఎదుర్కొన్నారు. పినోచెట్‌ హయాంలో తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు రహస్యంగా పని చేశారు.


చిలీలో గతంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకత, భయం తగ్గిపోతున్నదని 31 ఏండ్ల యువతి, శాంటియాగో నగరంలోని ముగ్గురు కమ్యూనిస్టు మేయర్లలో ఒకరైన జవీరా రేయాస్‌ చెప్పారు. డేనియల్‌ జాడ్యూ మేయర్‌గా ఒక ఆదర్శం అన్నారు. కార్పొరేషన్‌ తరఫున ఔషధ దుకాణాలు, కండ్లజోళ్ల షాపులు, పుస్తకాల షాపులు, రియలెస్టేట్‌ తదితర సంస్దలను నడుపుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలతో కమ్యూనిస్టు మేయర్లు మున్సిపల్‌ సోషలిజాన్ని (పేదల పక్షపాతం) అమలు జరుపుతారని అన్నారు. 2006లో విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్దుల నాయకురాలిగా ఆమె ప్రస్తానం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు మరో మేయర్‌ హాస్లర్‌తో పాటు అనేక మంది విద్యార్ధి నేతలు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గతంలో 1931, 32, 1999లో కమ్యూనిస్టు పార్టీ తరఫున అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే చిలీ తొలి కమ్యూనిస్టు అధ్యక్షుడిగా డేనియల్‌ జాడ్యు చరిత్రకెక్కుతాడు. ఆయన కూడా విద్యార్ధినేతగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
.

మోడీ అభిమానులూ వంట గ్యాస్‌కు మీ నుంచి కూడా ఎంత పిండుతున్నారో తెలుసా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జూలై ఒకటి నుంచి వంటగ్యాస్‌ సిలిండరు ధర మరో ఇరవై అయిదు రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాదులో 861.50 నుంచి రూ.886.50 అయింది. నలభై రూపాయల సబ్సిడీ పదిహేనుకు పడి పోయింది. ఈ ముష్టి కూడా త్వరలో ఎత్తివేస్తారు. కరోనా కారణంగా కుదేలైన వారికి మరో 6.29లక్షల కోట్ల పాకేజి ప్రకటించిన నిర్మలమ్మ ఘనత గురించి ఇంకా చెప్పుకుంటూ ఉండగానే గ్యాస్‌ ధర పెరిగింది. రోజువారీ పెట్రోలు, డీజిలు ధరలకు జనం అలవాటు పడ్డారు. ఇప్పటికే వంద రూపాయలు దాటింది, 125, 150, 175, మోడీ అభిమానులు ఎదురు చూస్తున్న 200 కూడా త్వరలోనే దాటి పోతుందేమో. కనుక దాని గురించి పదే పదే చెప్పుకున్నా, వామపక్షాలు, కాంగ్రెస్‌ వారు చేసే ఆందోళనవలన ప్రయోజనం లేదు. పెరుగుదల మన ఒక్కరికే కాదు కదా, పెరుగుట విరుగుట కొరకే అన్న వేదాంతంలో నమ్మకం ఉన్న వారం గనుక ఇంకా ఇంకా ఎంత పెంచుతారో అదీ చూద్దాం. త్వరలో వంట గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరి రోజు వారీ పెరుగుతాయా మరొక పద్దతిలోనా అన్నది చూడబోతున్నాం.


2019-20లో వంట గ్యాస్‌ మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.34,085 కోట్లు. 2020-21లో బడ్జెట్‌ అంచనా 37,256 అయితే దాన్ని 36,072 కోట్లకు సవరించారు. 2021-22లో ఆ మొత్తాన్ని 14,073 కోట్లకు తగ్గించి ప్రతిపాదించారు గనుక ఇప్పుడు పాతిక రూపాయలు ధర పెంచారు. ఆ మేరకు సబ్సిడీని తగ్గించారు. వివిధ ప్రాంతాలకు ఇస్తున్న సబ్సిడీలో తేడాలున్నప్పటికీ వడ్డింపులో వివక్ష లేదు కనుక ఆ మేరకు అందరికీ వర్తిస్తుంది.


పెట్రోలు, డీజిలు ధరలతో పాటు తమ ఏలుబడిలో గ్యాస్‌ ధరలు కూడా తక్కువే అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. నమ్మని వారి గురించి వదిలేద్దాం, నరేంద్రమోడీని నమ్మిన వారిని తప్పుదారి పట్టిస్తున్నారనేదే ఆవేదన. దిగువ వివరాలు చూడండి.దిగుమతి ధర డాలర్లలో, వినియోగదారుల ధర, సబ్సిడీ మన రూపాయల్లో అని గమనించాలి. దిగుమతి ధరకు రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి.


సంవత్సరం××× దిగుమతి ధర××× వినియోగదారు ధర××× సబ్సిడీ
2014 ××× 970 ××× 414 ××× 638
2021 ××× 530 ××× 886 ××× 15


ఈ వివరాలను గమనించినపుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గత ఏడు సంవత్సరాలలో గణనీయంగా పడిపోయినందున ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు ఇచ్చే సబ్సిడీ మొత్తం కూడా ఆమేరకు తగ్గిపోతుంది. కానీ అసలు సబ్సిడీ ఎత్తివేయటమే విధానంగా పెట్టుకున్నందున ఇప్పుడు గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరే రోజు వారీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే గతేడాది చమురు ధరలు గణనీయంగా పడిపోయినందున దిగుమతి చేసుకున్న ఎల్‌పిజి ధర కూడా 383 డాలర్లకు పడిపోయింది. గత ఏడు సంవత్సరాలలో ఇలా తరగటం తప్ప యుపిఏ కాలం నాటి ధరలకు పెరిగలేదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున 2018-19లో ఉన్న 526 డాలర్ల స్ధాయికి తిరిగి చేరాయి. దిగుమతి రవాణా ఖర్చు 2014లో టన్నుకు 46 డాలర్లు ఉంటే 2018 జూన్‌ ఒకటిన 20 డాలర్లు మాత్రమే ఉంది.


దేశం ఇప్పుడు రెండుగా చీలి పోయింది. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని దేశద్రోహుల దొడ్లో వేస్తున్నారు. మిగిలిన వారంతా దేశభక్తులే. ” దేశ ద్రోహుల ” గురించి వదలివేద్దాం. వారి నుంచి ఎంత వీలైతే అంత పెట్రోలు,డీజిలు, వంట గ్యాస్‌ నుంచి పిండమనండి ఇబ్బంది లేదు. కొత్త దేవుడైన నరేంద్రమోడీని విమర్శించినందుకు వారికి ఆ శాస్తి జరగాల్సిందే. గడ్డాలు, దుస్తులను చూసి ఎవరు ఏమతం వారు అన్నది గుర్తించి మరీ దాడి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అన్ని మతాల వారూ ఒకే మాదిరి గడ్డం పెంచటం ఒక సరదా అయింది కనుక పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. నాజీ జర్మనీలో యూదులను గుర్తించేందుకు హిట్లర్‌ వారికి పసుపు పచ్చ రంగు గుర్తు(బ్యాడ్జి) వేయించాడు. అలాగే మోడీ వ్యతిరేకులందరికీ ఏదో ఒక రంగు గుర్తు వేస్తే గుర్తించటం సులభం అవుతుంది.


దేశద్రోహులు ప్రతి అంశం మీద ఎప్పటి కప్పుడు వాస్తవాలు చెబుతున్నారు. ఇక దేశభక్తులైన మోడీ అభిమానులైన వారిని తోటి వారే మోసం చేయటమే ఆవేదన కలిగించే అంశం. మోడీ కంటే ముందు సంవత్సరాలలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. వారు పేర్కొన్న అంకెలు సబ్సిడీతో నిమిత్తం లేకుండా దిగుమతి, ఇతర ఖర్చులు, డీలరు కమిషన్‌ వంటి వాటిని కలిపి లెక్కిస్తే నిర్ణీత సిలిండరు ధర ఎంత పడుతుంది అన్న అంశాన్ని అవి వెల్లడిస్తాయి. అవి ఒక వైపు ఉన్న బొమ్మ లాంటివి. మరోవైపు ఉండే బొరుసును కూడా చూపితేనే స్పష్టత వస్తుంది. ఉదాహరణకు యుపిఏ పాలనలో 2014 మార్చి ఒకటవ తేదీ నాడు లెక్కించిన మేరకు సిలిండరు ఒకదానికి వసూలు చేయాల్సిన మొత్తం రు.1001.78. అయితే వినియోగదారు నుంచి వసూలు చేసింది రు. 414 మాత్రమే. మోడీ సర్కార్‌ పార్లమెంటులో స్వయంగా చెప్పినదాని ప్రకారం 2018జూన్‌ ఒకటవ తేదీన వసూలు చేయాల్సిన మొత్తం రూ.698 అయితే వినియోగదారుల నుంచి వసూలు చేసింది రూ.493. ఇచ్చిన సబ్సిడీ 205, 2014తో పోల్చితే అంతర్జాతీయంగా ధరలు తగ్గి ప్రభుత్వానికి ఏకంగా సిలిండరుకు మూడు వందల రూపాయలు మిగిలాయి.

దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది. అది లేని రాష్ట్రాలలో కూడా మద్దతుదారులు ఉన్నారు.ఎవరు అవునన్నా కాదన్నా అది పెద్ద పార్టీగా ఉంది. దీన్ని చూసి ఇంక మోడీ శాశ్వతం అని కొందరు చెబుతుంటే ఇప్పట్లో దిగిపోయే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు గనుక దాన్ని పక్కన పెడదాం. మోడీ భక్తులుగా మీ నుంచి ఈ ప్రభుత్వం ఎంత పిండుతున్నదో అభిమానులు తెలుసుకోవాలి. మోడీ విధానాలను వ్యతిరేకిస్తారా లేదా అనేది వేరే అంశం. మోడీ మీద మాకు అభిమానం ఉంది, పెట్రోలు రెండు వందలు, గ్యాస్‌ బండ రెండువేలు అయినా మాకేమీ ఇబ్బంది లేదు, అంటారా మీ ఇష్టం అని తప్ప ఇంకేమి చెప్పగలం !

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

Tags

, , ,

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

వందేండ్ల చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల ప్రాధాన్యత !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అనేక పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అది పెద్ద విషయం కాదు, వంద పార్టీ జనాలకు ఏమి చేసిందనేదే గీటురాయి. ఈ నేపధ్యంలో జూలై ఒకటవ తేదీన వందవ వార్షికోత్సవం చేసుకోనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) గురించి అందరూ తెలుసుకోవటం అవసరం. వందేళ్ల చరిత్ర, విజయాలు, అనుభవాల వివరణకు పెద్ద గ్రంధమే అవసరం. చైనా సాధించిన విజయాల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంగా మరీ ఎక్కువయ్యాయి.అక్కడ మానవ హక్కులు లేవు, ఏక పార్టీ నియంతృత్వం, ప్రశ్నిస్తే సహించరు. సోషలిస్టు వ్యవస్ధ కూలిపోతుంది, అభివృద్ది అంకెల గారడీ తప్ప నిజం కాదు అని చెబుతారు. అలాంటపుడు అలా చెప్పే దేశాలు, శక్తులు కూలిపోయేంతవరకు వేచి చూస్తే పోయేదానికి ఆందోళన ఎందుకు ? చతుష్టయ కూటములెందుకు, జి7 సమావేశాలెందుకు, చైనాను అడ్డుకోవాలనే సంకల్పాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ?


1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కబుర్లు చెబుతూనే ఉన్నారు. వాటిని ఒక చెవితో వింటూ ఒక కంట కనిపెడుతూనే చైనా తన పని తాను చేసుకుపోతూ అనేక విజయాలు సాధించింది. దీని అర్ధం చైనాకు ఎలాంటి సమస్యలూ లేవని కాదు. ఒక్కొక్క మెట్టూ అధిగమిస్తూ ముందుకు పోతున్నది. ఆ తీరు సామ్రాజ్యవాదులను బెంబేలెత్తిస్తున్నది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాల అనుభవాలు, గుణపాఠాలు తీసుకున్న సిపిసి నాయకత్వం తమవైన లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నది. కూల్చివేతకు గురైన సోషలిస్టు దేశాలలోని జనం తమ స్ధితిని పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న పరిస్ధితినీ పోల్చుకున్నారు గనుకనే కమ్యూనిస్టు వ్యతిరేకుల పని సులభమై ఆ వ్యవస్ధలను కూలదోశారు. అయితే చైనీయులు కూడా పోల్చుకోవటం సహజం. తాము ఉత్పత్తి చేసిన సరకుల మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఆధారపడ్డాయని, ఆ ఎగుమతులు తమ జీవితాలను మెరుగుపరిచాయని కూడా వారికి తెలుసు. ఇలాంటి అనుభవం సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల వారికి లేదు. అప్పుడు సోషలిజం విఫలమైందనే ప్రచారం అమెరికాలో జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది. తాము సాధిస్తున్న విజయాలు పశ్చిమ దేశాల మీద మిగిలి ఉన్న భ్రమలను చైనీయుల్లో క్రమంగా తొలగిస్తున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దంలో సామ్రాజ్యవాదుల పట్ల చైనా ప్రభుత్వ మెతక వైఖరికి నిరసనగా 1919లో విద్యార్ధులు, మేథావులు తీవ్రంగా స్పందించారు. చైనాలోని కొన్ని ప్రాంతాలను జపాన్‌ ఆధీనంలో ఉంచేందుకు అంగీకరించటం ఆగ్రహం కలిగించిది. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన ప్రదర్శనలు నిర్వహించారు. రష్యాలో బోల్సివిక్‌ విప్లవం, ప్రధమ శ్రామిక రాజ్యం ఏర్పడటం వంటి పరిణామాలు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు పురికొల్పాయి. మే నాలుగు ఉద్యమంలో భాగస్వాములైన మేథావులు ప్రపంచ విప్లవం, మార్క్సిజం భావజాలంతో స్పూర్తి పొందారు. రష్యన్‌ కమ్యూనిస్టు ఓటిన్‌స్కీ 1920 ఏప్రిల్‌ నెలలో చైనా వచ్చి అక్కడి మేథావులను కలిసి చర్చలు జరిపారు. షాంఘైలో దూర ప్రాచ్య కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ శాఖను ఏర్పాటు చేశారు. దాని ఫలితమే షాంఘై రివల్యూషనరీ బ్యూరో లేదా కమ్యూనిస్టు గ్రూప్‌ ఏర్పాటు, అధ్యయన తరగతులు నిర్వహించారు.1921 జూలై 1న చైనా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత జూలై 23-31వ తేదీల మధ్య పార్టీ వ్యవస్దాపక మహాసభ జరిగింది.

కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన పార్టీ ప్రధమ మహాసభకు మావో జెడాంగ్‌తో సహా ప్రతినిధులు పన్నెండు మంది మాత్రమే. అది కూడా షాంఘైలోని ఫ్రాన్స్‌ భూభాగంలో ఒక ఇంట్లో జరిగింది. దాన్ని పసిగట్టిన ఫ్రెంచి పోలీసులు సభను అడ్డుకోవటంతో పక్కనే ఉన్న ఒక నదిలో విహార యాత్రీకుల పడవలోకి మార్చారు. అయితే ఆ సమావేశానికి అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు మేధావిగా, చైనా లెనిన్‌గా పేరు గాంచిన చెన్‌ డూక్సీ హాజరు కాలేకపోయినప్పటికీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైయ్యారు.1927వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. చైనా జాతియోద్యమనేత సన్‌యేట్‌ సేన్‌ కమ్యూనిస్టు కాకపోయినప్పటికీ కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలం. చైనా కమ్యూనిస్టులు ఆయన నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీతో కలసి పని చేయటమే గాకుండా జాతీయవాదులను కమ్యూనిస్టులుగా మార్చేందుకు పని చేశారు. ఒక దశలో ఆ పార్టీకి కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తారా అన్న స్దితిలో 1925లో సన్‌ఏట్‌ సేన్‌ మరణించారు. తరువాత చాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీ, ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడు. సన్‌యేట్‌ సేన్‌ మరణించేంతవరకు తన కమ్యూనిస్టు వ్యతిరేకతను దాచుకున్న చాంగ్‌ పార్టీనేతగా మారగానే కమ్యూనిస్టులను పక్కన పెట్టటం ప్రారంభించాడు. పశ్చిమదేశాలకు దగ్గరయ్యాడు.1927 నాటికి కమ్యూనిస్టుల అణచివేతకు పూనుకున్నాడు.


చైనా విప్లవం ఏ పంధాలో నడవాలనే అంశంపై 1925లోనే పార్టీలో చర్చ జరిగింది. కార్మికవర్గ నాయకత్వాన జరగాలని చెన్‌ డూక్సీ ప్రతిపాదించగా చైనాలో ఉన్న పరిస్ధితిని బట్టి రైతాంగం ఆధ్వర్యాన జరగాలని మావో ప్రతిపాదించాడు. కొమింటాంగ్‌ పార్టీతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా చెన్‌ వైఖరి వ్యతిరేకంగా ఉంది. చాంగ్‌కై షేక్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది కమ్యూనిస్టులతో సఖ్యతగా ఉన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం చెన్‌ వైఖరిని తప్పు పట్టింది. చివరికి 1929లో పార్టీ నుంచి బహిష్కరణకు గురై తరువాత ట్రాట్సీయిస్టుగా మారిపోయాడు. చాంగ్‌కై షేక్‌ను ప్రతిఘటించే క్రమంలోనే కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ తరువాత 1948లో అధికార హస్తగతం తెలిసిందే.
దారిద్య్రం నుంచి 77 కోట్ల మందిని బయట పడవేయటం 50 కోట్ల మంది మధ్యతరగతి జనాల వినియోగశక్తిని పెంచటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన పెద్ద విజయం. కమ్యూనిజం మీద వ్యతిరేకత ఉన్నా, దాన్ని కూల్చివేయాలని కోరుతున్నా బహుళజాతి సంస్ధలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టటం, వాణిజ్యానికి ముందుకు రావటం వెనుక ఉన్న కారణం అదే. వీటికి తలుపులు తెరిచే సమయంలోనే సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్న డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. కిటికీలు తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి, అయితే వాటిని ఎలా నిరోధించాలో కూడా మాకు తెలుసు అన్నారు.


గత పద్దెనిమిది నెలలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపి వేస్తుండగా దాన్ని అరికట్టటం, కొద్ది నెలల్లోనే తిరిగి సాధారణ ఆర్ధిక, సామాజిక జీవనాన్ని పునరుద్దరించటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన అతి పెద్ద విజయం. మన దేశంలో కరోనా సోకిన వారు ఆసుపత్రులపాలై ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి సామాజిక సంక్షోభంతో సతమతమౌతున్నారో మనం నిత్యం చూస్తున్నాం. సమర్ధవంతమైన చర్యల ద్వారా చైనీయులకు అటువంటి పరిస్ధితి నుంచి కమ్యూనిస్టు పార్టీ కాపాడింది. అందుకే అంతర్జాతీయ సంస్ధలు జరిపిన సర్వేలో 95శాతం మందికిపైగా జనం కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నూటపది కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయటం చిన్న విషయం కాదు. ఈ విజయాలు సాధించటం వెనుక 9.2 కోట్ల మంది సిపిసి సభ్యుల పాత్ర ఉంది.2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన సంక్షోభం చైనా మీద ప్రభావం చూపింది. అయితే దాన్ని అధిగమించేందుకు మౌలిక సదుపాయాలు, శాస్త్ర, సాంకేతిక, మానవ వనరుల రంగాలలో పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి త్వరలోనే దాన్ని అధిగమించింది. ఆ పెట్టుబడులు ఇప్పుడు వివిధ రంగాలలో చైనా విజయాలను ప్రపంచానికి వెల్లడించుతున్నాయి. టెలికాం రంగంలో 5జి, మొబైల్‌ చెల్లింపులు, ఇ కామర్స్‌, కృత్రిమ మేథ, రోబోటిక్స్‌, రోబో కార్లు,హైస్పీడ్‌ రైల్వేలు, అంతరిక్ష రంగం, అధునాతన ఆయుధాల తయారీలో నేడు చైనా కొత్త వరవడిని సృష్టిస్తోందంటే దాని వెనుక చోదకశక్తి చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు.

చైనా తొలి పంచవర్ష ప్రణాళిక 1953లో ప్రారంభమైంది. సోవియట్‌ యూనియన్ను చూసి ఈ విధానాన్ని ప్రారంభించిన చైనా త్వరలోనే దానిలో ఉన్న లోపాలు, పొరపాట్లను గమనించింది. చైనాకు తగిన విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేసింది.1981-90 మధ్య జిడిపిని రెట్టింపు, తరువాత పది సంవత్సరాలో దానికి రెట్టింపు లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించకుండా ఆర్ధిక కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు లేవని గుర్తించారు. దాంతో అంతకు ముందు అనుసరించిన ప్రణాళికాబద్ద విధానంతో పాటు కొద్ది మార్పులు చేసి సోషలిస్టు మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధగా మార్చి 2001లో ప్రవేశం పొందారు. 2049 నాటికి అంటే సోషలిస్టు వ్యవస్ధ వందవ సంవత్సరంలో ప్రవేశించే నాటికి ఆధునిక సోషలిస్టు రాజ్యంగా రూపొందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. చైనా సాధించిన వృద్ధి ఏదో ఒక ఏడాదిలో వచ్చింది కాదు. సంస్కరణలు ప్రారంభించిన పది సంవత్సరాల తరువాతనే ఫలితాలనివ్వటం ప్రారంభమైంది.
1960లో ప్రపంచ జిడిపిలో చైనా వాటా 4.4శాతం, 1970లో 3.1, 1980లో 1.7, 1990లో 1.6, 2000లో 3.6, 2010లో 9.2, 2020లో 18.34శాతం ఉంది.సంస్కరణల్లో భాగంగా తలుపులు తెరిచినపుడు కమ్యూనిస్టు పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. ఇవి చివరకు పెట్టుబడిదారీ విధానం వైపు దారి తీస్తాయోమో అన్నదే దాని వెనుక ఉన్న ఆందోళన. 1982లో షెంజన్‌లోని షెకావ్‌ పారిశ్రామిక ప్రాంతంలో విదేశీయుడిని వాణిజ్య మేనేజర్‌గా నియమించేందుకు తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర విమర్శ వచ్చింది. వెంటనే డెంగ్‌సియావో పింగ్‌ జోక్యం చేసుకొని దాన్ని సమర్ధించారు,అదేమీ దేశద్రోహ వైఖరి కాదు అన్నారు. చైనా అమలు జరిపిన విధానాలను చూసి పశ్చిమ దేశాల వారు, కొందరు వామపక్ష అభిమానులు కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని ప్రచారం చేశారు. నిజానికి అది పెట్టుబడిదారీ విధానమే అయితే నేడు ఇతర పెట్టుబడిదారీ దేశాలు మన వంటి దేశాలను కూడా కలుపుకొని కలసికట్టుగా వారి మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది ?

గత ఆరు దశాబ్దాలలో చైనాలో వచ్చిన మార్పును వివిధ దేశాల జిడిపితో పోల్చినపుడు ఎలా ఉందో దిగువ చూడవచ్చు. విలువ బిలియన్‌ డాలర్లలో.
దేశం ××× 1960×× 1970×× 1980××× 1990××× 2000×××× 2010×××× 2020
చైనా ××× 59.7 ×× 92.6×× 191.1×××360.9×××1211.3 ×× 6,087.2 ××16,640
జపాన్‌ ×××44.3××212.6 ××1,105.4××3,132.8××4,887.5 ×× 5,700.1 ×× 5,378
బ్రిటన్‌ ××× 73.2××130.7 ××564.9 ××1,093.2 ××1,657.8×× 2,475.2 ×× 3,120
అమెరికా ××543.3 ×1,073.3××2,857.3××5,963.5××10,252.3××14,992.1××22,680


జపాన్‌ అభివృద్ది గురించి లొట్టలు వేసుకుంటూ వర్ణించినంత ఆనందంగా చైనా గురించి మీడియా గానీ మరొకరు గానీ చెప్పలేదు. కారణం ఏమంటారు ? కరోనా రెచ్చిపోయిన 2020 సంవత్సరంలో చైనా గురించి ఎవరెన్ని కథలు చెప్పినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే వారు పొలోమంటూ చైనాకే వెళ్లారు. చైనాకు 163 బిలియన్‌ డాలర్లు రాగా అమెరికాకు 134 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. తరువాత పరిస్దితి మెరుగుపడితే తిరిగి అమెరికాయే మొదటి స్ధానానికి చేరవచ్చు. తొలి రోజుల్లో జనానికి అవసరమైన ఉపాధి, ఆహారం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి చైనా కమ్యూనిస్టుపార్టీ తొలి రోజుల్లో కేంద్రీకరించింది. ఇప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద కేంద్రీకరించింది. అమెరికా వంటి ధనిక దేశాలకు అదే కంటగింపుగా మారింది.

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

చమురు మంత్రి ప్రధాన్‌ తీరు తెన్నులు : డాంబికాలు పోవద్దురో డింగరీ డంగై పోతావు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చాలా మందికి అశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు దిగుమతుల మీద ఆధారపడటం, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లే అని మరోసారి చెప్పారు. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని చెప్పుకున్న పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటి అని ఎవరికైనా తట్టిందా ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం కదా !


ఇంతకీ గత ఏడు సంవత్సరాలలో ” దేశభక్తులు ” భారతీయ చమురు ఉత్పిత్తిని ఎంత పెంచారో చెప్పగలరా ? 2022 నాటికి దేశం చమురు దిగుమతులను పదిశాతం తగ్గించాలని 2015లో ప్రధాని నరేంద్రమోడీ లక్ష్య నిర్ధేశం చేశారు.2014-15లో మన దేశం వినియోగించే చమురులో 78.6శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.యుపిఏ పాలన చివరి ఏడాది 2013-14లో మన దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37,788 మిలియన్‌ టన్నులు.అది 2019-20 నాటికి 32.173 మి. టన్నులకు పడిపోయింది. ఇది పద్దెనిమిది సంవత్సరాలలో కనిష్ట రికార్డు, 2020-21లో మోడీ సర్కార్‌ తన రికార్డును తానే తుత్తునియలు గావించి 30,5 మిలియన్‌ టన్నులకు తగ్గించేసింది. 2019-20 ఏప్రిల్‌-ఫివ్రబరి మాసాల వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశీ దిగుమతుల మీద ఆధారపడింది 86.7శాతం.( కరోనా కారణంగా వినియోగం పడిపోయింది కనుక దిగుమతులు కూడా తగ్గి ఇప్పుడు 85శాతానికి పైగా ఉంది.) దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమా, బండబడ చెవుల్లో పూలు పెట్టుకొని వినేవాళ్లుండాలే గానీ ఎన్ని పిట్ట కథలైనా వినిపించేట్టున్నారుగా !

ఇదే ధర్మేంద్ర ప్రధాన్‌ గారి తీరుతెన్నులను చూస్తే లేస్తే మనిషిని గాను అని బెదిరించే కాళ్లు లేని మల్లయ్య కథను గుర్తుకు తెస్తున్నారు. చలి కాలంలో చమురు డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది, వేసవి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కూడా మంత్రి సెలవిచ్చారు. తగ్గకపోగా రోజూ పెరుగుతున్నాయి. ఇన్నేండ్లుగా ఉన్న కేంద్ర మంత్రికి మార్కెట్‌ తీరుతెన్నులు ఆ మాత్రం తెలియదా లేక తెలిసి కూడా జనాన్ని జోకొట్టేందుకు అలా చెబుతున్నారా ? ఆదివారం ఉదయం (జూన్‌ 27) బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 76.18 డాలర్లు ఉంది, అమెరికా రకం 74.05, మనం కొనుగోలు చేసేది 74.24 డాలర్లు ఉంది. ఇరాన్‌తో ముదురుతున్న అణువివాద నేపధ్యంలో ఎప్పుడైనా 80 డాలర్లు దాట వచ్చన్నది వార్త.


చమురు ఉత్పత్తి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ధరలను తగ్గించని పక్షంలో ” చమురు ఆయుధాన్ని ” వినియోగిస్తామని 2015 నుంచీ మంత్రి ప్రధాన్‌ బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చమురుశుద్ధి సంస్ధలను కోరారు. ” చమురు అమ్ముకొనే వారికి భారత్‌ పెద్ద మార్కెట్‌, వారు మా గిరాకీని, అదే విధంగా దీర్ఘకాలిక సంబంధాలను గమనంలో ఉంచుకోవాలని ” బెదిరించారు. సౌదీ తదితర దేశాలను దారికి తెచ్చే పేరుతో ఇప్పటికే అమెరికా చమురు కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్‌ అధికారంలోకి రాక ముందు మన చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 1.2శాతం మాత్రమే ఉండేది. అలాంటిది ట్రంప్‌తో నరేంద్రమోడీ కౌగిలింతల స్నేహం కుదిరాక ట్రంప్‌ దిగిపోయే సమయానికి 4.5శాతానికి పెరిగింది. మన డాలర్ల సమర్పయామీ, ఆయాసం మిగిలింది తప్ప మనకు ఒరిగిందేమీ లేదనుకోండి. అందుకే మన ప్రధాన్‌ గారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ పెద్ద మనిషి మాటలకు అంత సీన్‌లేదులే, అయినా మా మీద అలిగితే ఎండేది ఎవరికో మాకు తెలుసు అన్నట్లుగా సౌదీ అరేబియా మంత్రిగానీ, అధికారులు గానీ ఖాతరు చేయలేదు. మిగతా దేశాలూ అంతే.

తాజాగా జూన్‌ 24న ఈ పెద్దమనిషే చమురు ధరలతో తట్టుకోలేకపోతున్నాం, మా ఆర్ధిక పరిస్ధితి కోలుకోవటం కష్టంగా ఉంది కనికరించండి అన్నట్లుగా చమురు ఉత్పత్తి-ఎగుమతి(ఒపెక్‌) దేశాల సంస్ధకు వేడుకోళ్లు పంపారు. ధరలు సరసంగా ఉంటే మీకూ మాకూ ఉపయోగం ఉంటుంది అని అర్ధం చేసుకోండీ అన్నారు. లీటరు రెండు వందలైనా సరే చెల్లిస్తాం-దేశభక్తిని నిరూపించుకుంటాం అంటున్న మోడీ వీరాభిమానుల మనోభావాలను దెబ్బతీయటం తప్ప ఏమిటంటారు.( వీరి కోసం కాషాయ పెట్రోలు బంకులను తెరిచి ఆ ధరలకు విక్రయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి లేదా ప్రతి చోటా కొన్ని ప్రత్యేక బంకులను బిజెపి కార్యకర్తలకే కేటాయించాలి) బెదిరింపులనే ఖాతరు చేయని వారు సుభాషితాలను పట్టించుకుంటారా ? నరేంద్రమోడీ గారూ మీరైనా నోరు విప్పండి లేకపోతే ప్రధాన్‌ నోరైనా మూయించండి ! బడాయి మాటలతో చమురు మంత్రి దేశం పరువు గంగలో కలుపుతున్నారు, జనంలో నవ్వులాటలు ప్రారంభమయ్యాయి. వంద రూపాయలు దాటినా నిరసనగా వీధుల్లోకి వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు గానీ అంతిమంగా నష్టపోయేది మీరే, ఆపైన మీ ఇష్టం !

సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) తిప్పుతున్న ఒక పోస్టర్‌లో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ జారీ చేసిన 1.3లక్షల కోట్ల చమురు బాండ్ల అప్పుడు మోడీ సర్కార్‌ను అప్పుల ఊబిలో దింపిందని గుండెలు బాదుకున్నారు. దానిలో చెప్పిందేమిటి ?2005 నుంచి 2010వరకు పెట్రోలు ధరలను తక్కువగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం చమురుబాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లతో చమురు కంపెనీలు రుణాలు తీసుకొనే వీలు కలిగినందున చమురు ధరలను తక్కువగా ఉంచాయి. యుపిఏ కాలం నాటి 20వేల కోట్ల రూపాయల చమురు బాండ్లను ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో యుపిఏ ప్రభుత్వ బాండ్లకు గాను 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిరర్దక ఆస్తులు, యుపిఏ అవకతవకలకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ వాదన ఎంతో వీనుల విందుగా ఉంది కదూ !


ఇందులో చెప్పని, మూసిపెట్టిన అంశం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. చమురు వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు చెల్లించాలి. గతంలో అలాంటి సబ్సిడీల సొమ్మునే చెల్లించలేక సమర్ధ వాజ్‌పాయి, అసమర్ద మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌లు బాండ్ల రూపంలో(జనం ఎవరికైనా అప్పుపడితే ప్రామిసరీ నోట్లు రాసిస్తారు కదా ) ఇచ్చారు. వారందరినీ తలదన్ని 56 అంగుళాల ఛాతీ గలిగిన నరేంద్రమోడీ ఎవడొస్తాడో రండి అంటూ పూర్తిగా సబ్సిడీ ఎత్తివేశారు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. లీటరు మీద ఒక రూపాయి పన్ను లేదా ధర పెంచినా కేంద్రానికి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం. సరే బిజెపి వారు చెబుతున్నట్లుగా గతంలో ఇచ్చిన సబ్సిడీలను జనం నుంచి వసూలు చేసేందుకే పన్ను విధించారని అంగీకరిద్దాం. రాబోయే ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా 1.3లక్షల కోట్ల మేరకు అదనపు భారం పడింది కనుక, నరేంద్రమోడీ అంతమొత్తాన్ని సర్దుబాటు చేయలేని అసమర్ధతతో ఉన్నారు కనుక మనం తీసుకున్నదాన్ని మనమే చెల్లిద్దాం.


కానీ మన నుంచి వసూలు చేస్తున్నది ఎంత ? జేబులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిద్దామా ? మన తేల్‌ మంత్రి మహౌదరు ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన సమాచారం ప్రకారం 2013లో పెట్రోలు, డీజిలు మీద యుపిఏ సర్కార్‌ వసూలు చేసిన పన్ను మొత్తం రు.52,537 కోట్లు, అది 2019-20 నాటికి 2.13లక్షల కోట్లకు చేరింది. ఆ మొత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు నెలలకు రు.2.94లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 1.3లక్షల కోట్ల మన్మోహన్‌ సింగ్‌ అప్పు చెల్లించటానికిగాను మన నరేంద్రమోడీ గారు ఇప్పటికి వసూలు చేసిన కొన్ని లక్షల కోట్లను పక్కన పెడితే, పన్నులేమీ తగ్గించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు కనుక ఏటా మూడు లక్షల కోట్ల వంతున వచ్చే ఐదేండ్లలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ” దేశద్రోహులు ” ప్రశ్నిస్తే లడఖ్‌ సరిహద్దుల్లో మిలిటరీ ఖర్చుకు, చైనాతో యుద్ద సన్నాహాలకు మనం చెల్లించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ మరుగుజ్జులు వెంటనే కొత్త పల్లవి అందుకుంటారు. పోనీ ఆపేరుతోనే పన్ను వేయమనండి ! బిజెపి వారి ఆదర్శం ఔరంగజేబు విధించాడని చెబుతున్నట్లు జట్టు పెంచితే పన్ను తీస్తే పన్ను అన్నట్లుగా ఏదో ఒక పేరుతో వేయమనండి. మధ్యలో మన్మోహనెందుకు, కాంగ్రెస్‌ ఎందుకు ? చిత్తశుద్ది, నిజాయితీలేని బతుకులు ! జనం పట్టించుకోకపోతే ఇవే కబుర్లు పునరావృతం అవుతాయి మరి !