Tags
100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism
వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4
ఎం కోటేశ్వరరావు
నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్ యూనియన్, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.
ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్ టైమ్స్ వాఖ్యాత మార్టిన్ వూల్ఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్ సియావో పింగ్ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.
సోవియట్ యూనియన్ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.
ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్ వూల్ప్ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.
తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్ ట్రంప్ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్ వర్గనైజం. బోల్షివిక్ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.
అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ బలపడింది.
సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్ స్క్వేర్ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్ స్క్వేర్ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్ 15న ప్రారంభమై జూన్ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !