కొండూరి వీరయ్య
నక్సలిజం ఒక సైద్ధాంతిక ఆచరణాత్మక ధోరణిగా మొదలై యాభయ్యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నక్సలిజం సాఫల్య వైఫల్యాలపై విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. సమాజాన్ని మార్చాలన్న లక్ష్యంతో మొదలైన ఉద్యమ స్రవంతి ఆ లక్ష్య సాధన దిశగా సమాజాన్ని నడిపించగలిగిందా లేదా అన్నది అర్థం చేసుకోవటానికి దేశంలో విప్లవ సాధనకు అవసరమైన వ్యూహం, ఎత్తుగడల కోణంలో చర్చించాలి. విప్లవోద్యమానికి నాయకత్వం వహించే శక్తులు అనుసరించే సైద్ధాంతిక, ఆచరణాత్మక వైఖరి తప్పు అయితే అటువంటి సైద్ధాంతిక అవగాహన ప్రాతిపదికగా రూపొందించే వ్యూహాలు ఆశించిన ప్రయోజనం కంటే ప్రతికూల ప్రయోజనాన్ని సాధిస్తాయి. యాభయ్యేళ్ల నక్సల్బరీ అనుభవాలు విముక్తి ఉద్యమాలకు నేర్పుతున్న పాఠాలు ఇవే.
దేశంలో నక్సలిజం ఒక సైద్ధాంతిక స్రవంతిగా మొదలైంది అన్న నిర్ధారణను అవగాహన సరైనది కాదు. స్వాతంత్య్రోద్యమం నాటి నుండీ దేశ విముక్తికి సంబంధించి కమ్యూనిస్టులు ప్రత్యామమ్నాయ సైద్ధాంతిక స్రవంతిని ముందుకు తెచ్చారు. నక్సలిజంతో ముందుకొచ్చింది కేవలం ఆచరణకు సంబంధించిన కోణం మాత్రమే. స్వతంత్ర భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గపు ఆధిపత్యాన్ని సంఘటితం చేసుకోవటానికి సామ్రాజ్యవాద శక్తులు సహకరిస్తాయని ఆశించిన వారికి శృంగభంగమైంది. పాలకవర్గాలు అనుసరించిన పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా 1960 దశకంలో తొలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలు ప్రజల మదిలో మెదులుతున్న ఈ సమయంలో ఆ లక్ష్యాలు సాధించటంలో పాలకవర్గం వైఫల్యం పట్ల సహజాంగానే ఆగ్రహావేశాలుకు దారితీశాయి. ఈ ఆగ్రహావేశాలను ఆధారం చేసుకుని ప్రజలు వ్యవస్థ మార్చటానికి సంపూర్ణ రాజకీయ చైతన్యవంతులై ఉద్యమిస్తున్నారన్న అంచనాకు నక్సలిజం పునాది పురుషులు వచ్చారు. స్వతంత్ర భారతదేశం తొలి దఫా సంక్షోభంలోకి అడుగుపెట్టింది. ఈ సంక్షోభం నుండి బయటకు రావటానికి భూసంబంధాల పున:నిర్మాణం తక్షణ పరిష్కారం. స్వాతంత్య్రం వచ్చిన పదిహేనేళ్లు గడుస్తున్నా భూసంబంధాల పునర్నిర్మాణాన్ని పాలకవర్గాలు నెరవేర్చేందుకు సిద్ధం కాలేదు. దాంతో సాగుచేయని యజమానులకు వేలాది ఎకరాల భూమిపై ఆధిపత్యం (ఆబ్సెంటీ లాండ్‌లార్డిజం) – కౌలు దోపిడీ పరస్పర పోషకాలుగా గ్రామీణ సామాజిక ఆర్థిక జీవితాన్ని నియంత్రించే ప్రధాన లక్షాలుగా ఉన్నాయి. ఆ సమయంలో వ్యవసాయ సంబంధాలను సమూలంగా మార్చటానికి దున్నేవానికే భూమి నినాదం అర్థవంతంగా ఉండటమే కాదు. ప్రజలను సమీకరించే సాధనంగా మారింది. ఈ నినాదం ప్రధానంగా భూమిపై సాగు చేస్తున్న కౌలు రైతులను భూములపై హక్కులు దఖలు పడేలా చేసింది. మరోవైపున పాలకవర్గాలు ఎదుర్కొంటున్న తొలి రాజకీయ సంక్షోభం వ్యవస్థాగతమై కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికింది. ఆ క్రమంలో బెంగాల్‌లో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) దున్నేవాడికే భూమి నినాదానికి రాజ్యాంగ పరిమితుల్లోనైనా ఆచరణ రూపం ఇవ్వటానికి నిర్ణయించింది. సాగు చేయని భూస్వాములు భూములు ఆక్రమించుకోవటం, సాగు హక్కులతో పాటు భూమిపై హక్కు కోసం ఉద్యమించటం ఈ కాలంలో గ్రామీణ బెంగాల్‌లో కనిపించిన సార్వత్రిక దృశ్యం. పార్టీ ఇచ్చిన పిలుపునందుకు గ్రామీణ బెంగాల్‌లో పెద్దఎత్తున భూ ఆక్రమణలు సాగాయి. సాధారణంగా పేదలు ఎక్కడన్నా భూమిని ఆక్రమించుకుంటే పోలీసు యంత్రాంగం యజమాని పక్షాన రంగ ప్రవేశం చేయటం మనకు కనిపించే సాధారణ లక్షణం. ప్రజాస్వామిక వ్యవస్థలో తటస్థమైనదిగా మనకు కనిపించే పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ యంత్రాల ప్రధాన లక్ష్యం ప్రైవేటు ఆస్థిని కాపాడటం. దీనికి భిన్నంగా బెంగాల్‌లో యజమానుల తరపున పోలీసులు రంగ ప్రవేశం చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించటంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఈ పరిస్థితుల్లో నక్సల్బరీలో పార్టీ నిర్ణయాలకు భిన్నంగా చారుమజుందార్ నాయకత్వంలో వర్గపోరాటాన్ని వర్గాలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తుల మీద పోరాటంగా మార్చి వ్యక్తిగత హింసావాదం విప్లవ చర్యల్లో భాగం అన్న అవగాహనను ముందుకు తెచ్చింది. దీన్ని పార్టీ నాయకత్వం తిరస్కరించటంతో స్వీయమానసిక వాదానికి లోనైన కొద్ది మంది నాయకులు సిపిఐ(ఎం) నుండి బయటకొచ్చి స్వతంత్ర పంధా అనుసరించటం మొదలు పెట్టారు. దానికి గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసుకుంటూ విప్లవ ప్రస్థానం సాగించిన చైనా విప్లవాన్ని, మావో వ్యూహరచనను ఆదర్శనంగా తీసుకున్నారు. నిజానికి 1940 దశకం నాటి చైనాకు, 1970 దశకం నాటి భారతదేశానికి ఉన్న మౌలిక వ్యత్యాసాలు గమనించటంలో నక్సల్బరీ నాయకత్వం విఫలమైంది.
ప్రజా పునాది లేని పాలకవర్గంపై ప్రజా పునాది సమీకరించుకుంటూ సాగించిన సాయుధ పోరాటం మావోయిజం మౌలిక లక్షణం. భారతదేశంలో మావో ఆలోచనా ధోరణి పేరుతో అమలు జరిగిన నక్సల్బరీ విధానాలు విస్తృత ప్రజా పునాదిని సమీకరించుకోవటంలో విఫలమయ్యాయి. చారిత్రక పరిణామం కీలక దశలో ఉనికిలో వచ్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దోపిడీ వర్గాల పాలనకు అవసరమైన చట్టబద్ధత (లెజిటిమెసీ)ని కల్పించే సాధనంగా మారింది. దోపిడీ వర్గాలకు ఆమోదయోగ్యత సాధించటంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాత్ర. ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికలు. లాంగ్ మార్చ్‌తో పోల్చి దేశంలో విముక్తి ప్రాంతాలను గుర్తించటం, కార్యాచరణ రూపొందించటంలో ఉన్న సత్యదూరమైన, వాస్తవ విరుద్ధమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మావోయే మా చైర్మన్ అన్న నినాదాలు అప్పుడప్పుడే ప్రజల్లో పట్టు సాధిస్తున్న వామపక్ష శ్రేణుల విస్తరణను అడ్డుకోవటంలో పాలక వర్గాలకు సాధనాలుగా మారాయి. కమ్యూనిస్టులందరినీ దేశ ద్రోహులుగానూ, విదేశీ శక్తుల పనుపున పనిచేసే వారిగానూ ముద్ర వేయటానికి అవకాశం అందించాయి. దాంతో కమ్యూనిస్టు ఆలోచన స్రవంతి అభివృద్ధికి ఆటంకం అన్న నానుడి ఘనీభవించటానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోహదం చేశాయి. మరోవైపున 1960-70 దశకాల్లో దేశాన్ని మరోమారు ఉద్యమాల బాట పట్టిన తక్షణ సమస్య వ్యవసాయక సంబంధాలు అని గుర్తించిన పాలకవర్గాలు 1973లో తామే భూసంస్కరణలను అమలు చేస్తామని దేశానికి హామీ ఇవ్వటానికి ప్రణాళిక సంఘం ద్వారా భూసంబంధాలపై ఒక అధ్యయనం జరిపించింది. దాని ప్రాతిపదికన వరుసగా భూసంస్కరణ చట్టాలు ఆమోదిస్తూ వచ్చింది. దీంతో అప్పటి వరకు భూ సమస్య నేపథ్యంలో కమ్యూనిస్టులను అక్కున చేర్చుకున్న గ్రామీణ పేదలు క్రమంగా ఉద్యమాలు వదిలి పాలకవర్గాలు పీడిత వర్గాలను లోబర్చుకునే విధానాలకు (ఎకామడేటివ్ పాలిటిక్స్) బలయ్యారు. ఈ చర్యలన్నీ ఒక పాలకవర్గాలపై భ్రమలు పెంచి పోషించటంతో పాటు మరోవైపు ప్రజలు కమ్యూనిస్టు స్రవంతి నుండి దూరంకావటానికి దారితీశాయి.
అటువంటి సమయంలో ప్రజలకు దగ్గరకావటానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన నక్సలిజం తప్పుడు నిర్మాణపద్ధతులు, ఆచరణ, ఎత్తుగడలు, వ్యక్తిగత సాహస చర్యల పట్ల సాధారణంగా ఉండే ఆసక్తి, క్రేజ్‌ను సొమ్ము చేసుకునే ధోరణిలో చర్యలు అనుసరించటంతో దేశం కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమైన దేశభక్తుల ప్రాణాలకు, త్యాగాలకు విలువ లేకుండా పోయింది. ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కానవసరం లేదు, ఉద్యమకారులు ప్రజల అవసరాలు తీర్చి పెడతారు. మన తరపున త్యాగాలు చేసి పెడతారు. మనం కేవలం ఆ ఫలితాలను అనుభవించటానికి సిద్ధమైతే చాలు అన్న ధోరణికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అటు బూర్జువా పార్టీల ద్వారాగానీ ఇటు వామపక్ష శక్తుల ద్వారాగానీ తమ సమస్యలు పరిష్కరించుకోవటం వరకే పరిమితమయ్యారు తప్ప తద్వారా అందుకోవాల్సిన వర్గ చైతన్యానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో నిజమైన విప్లవోద్యమం వ్యూహం, ఆచరణ,నిర్మాణం, సమీక్షించుకోకుండా లక్ష్య సాధన దిశగా ప్రయాణం సాగదు. బూర్జువా ప్రజాతంత్ర వ్యవస్థ పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవటం, బూర్జువా ప్రజాస్వామ్యం పరిమితుల పట్ల చైతన్యంకలిగించకుండా జనతా ప్రజాస్వామ్యంపట్ల ఆసక్తిని సృష్టించలేము. నిర్దిష్ట పరిస్థితుల గురించి నిర్దిష్ట అంచనాకు లేకుండా క్యాకర్తలను త్యాగాలకు పురికొల్పటం విప్లవోద్యమ నాయకత్వ దక్షత కాబోదు.