ఎం కోటేశ్వరరావు
సమస్యలను ఎదుర్కొనే అంశంలో తప్ప ప్రపంచమంతటా రైతాంగం ఒకే విధంగా లేదు. పురాతన పద్దతుల్లో విత్తనాలు చల్లి పండిన మేరకు పంట తీసుకొనే రైతుల మొదలు ఆధునిక పద్దతుల్లో మొత్తం యంత్రాలతో సాగు చేసే వారు ఉన్నారు. కడుపు నింపుకొనేందుకు మాత్రమే పండించుకొనే వారు ఎందరో ఉంటే అమ్ముకొని లాభాలు పోగేసుకొనేందుకు చూసే వారు కొందరు. అందువలన సమస్యలు కూడా ఒకే విధంగా లేవు. మనుషులందరూ ఒకటే గానీ కొందరికి ఆకలి జబ్బు మరికొందరికి తిన్నది అరగని జబ్బు మాదిరి ఎవరి సమస్య వారిది. రైతులు అంటే కేవలం పంటలు పండించేవారే కాదు, అనుబంధ రంగాలలో పని చేసేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో రైతాంగం తీరు తెన్నులు, వారి ముందున్న కొన్ని సవాళ్లు-సమస్యల గురించి చూద్దాం.
ఏ రైతుకైనా కావాల్సిన వాటిలో ఎరువు ఒకటి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ – రష్యా వివాదం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల రైతాంగాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నది.2022లో ఎరువుల ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. అనేక దేశాల్లో మాంద్యం రానుందనే హెచ్చరికల నేపధ్యంలో రైతులు, ఆహార సరఫరా మీద 2023లో మరింత వత్తిడి పెరగనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాతావరణ అనుకూల ప్రతికూలతలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నది రైతులే. ఉదాహరణకు ఉక్రెయిన్ సంక్షోభం, చమురు, గాస్ ధరల పెరుగుదుల, రవాణా అంశాల కారణంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి సాగు ఖర్చు ఇబ్బడి ముబ్బడై అనేక దేశాల రైతాంగం ఇబ్బంది పడింది.2022 రెండవ అర్ధకాలంలో పొటాష్, ఫాస్పేట్ వినియోగం పది నుంచి 40శాతం తగ్గింది, దాంతో ధరలూ తగ్గాయి.చైనా ఎగుమతులు నిలిపివేసిన తరువాత ప్రపంచమార్కెట్లో 2022 ఏప్రిల్లో టన్ను డిఏపి ధర వెయ్యి డాలర్లు ఉండగా తరువాత 713కు తగ్గింది. ఈ ఏడాది 550 డాలర్లకు తగ్గుతుందని ఒక అంచనా. మన దేశంలో ఏడాది పాటు సాగిన రైతాంగ ఆందోళన, వివిధ రాష్ట్రాలు, 2024లో లోక్సభ ఎన్నికల్లో ఎరువుల ధరలు ప్రభావం చూపకుండా చూసేందుకు సబ్సిడీలను పెంచి రైతుల మీద భారం పడకుండా చూసింది. అనేక దేశాలలో రైతులే వాటిని భరించారు. సబ్సిడీ ఎరువులు మినహా, ఇతర పెట్రోలు,డీజిలు, రవాణా ఖర్చులు, పురుగుమందుల ధరల పెరుగుదల వంటి భారాలను మన రైతులే భరించారు. 2022 జూలైలో ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తుల దిగ్బంధననాన్ని రష్యా ముగించటంతో ఎగుమతులు పెరిగి ధరల తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల ఎగుమతులు తగ్గిన మేరకు రైతులకు నష్టం జరిగింది. అందువల ఉక్రెయిన్ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము, దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎలా ఉండేదీ అనూహ్యమే.
ప్రపంచంలో ఫాస్పేట్ను ఎక్కువగా 2021లో చైనా 85మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయగా రష్యా 14మి.టన్నులతో నాలుగవ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ ఫర్టిలైజర్స్ సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ భూముల్లో 85శాతం నత్రజని కొరత, 73శాతానికి ఫాస్పేట్, 55శాతానికి పొటాష్ కొరత ఉంది. ధరల పెరుగుదల కారణంగా అనేక మంది రైతులు వీటి వాడకాన్ని తగ్గించారు. అది పంటల ఆరోగ్యం, దిగుబడుల మీద ప్రతికూల ప్రభావం చూపింది.పొటాష్ ఉత్పత్తిలో 14మి.టన్నులతో కెనడా ప్రధమ స్థానంలో ఉండగా రష్యా,బెలారస్ కలసి 17 మి.టన్నులు ఉత్పత్తి చేశాయి.2022కు ముందు ప్రపంచంలో 40శాతం ఉత్పత్తి వీటిదే. ఉక్రెయిన్ వివాదానికి ముందు ఎంఓపి టన్ను ధర 221 డాలర్లుండగా తరువాత 562 డాలర్లకు చేరింది. 2009 తరువాత ఇదే అధికం.పొటాష్కు డిమాండ్ తగ్గింది. 2022లో ఆంక్షల కారణంగా రష్యా,బెలారస్ నుంచి ఎగుమతులు ఆగాయి. దీన్ని కెనడా సొమ్ము చేసుకొని విపరీత లాభాలు పొందింది. ఈ విధంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రైతాంగాన్ని, సాగును దెబ్బతీశాయి.
వివిధ దేశాలలో మన దేశంలో మాదిరి కనీస మద్దతు ధరలు లేవు. ఉన్నవాటిని కూడా ఒకదానితో మరొకదానిని పోల్చలేము. చైనా వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ముందే చెప్పుకున్నట్లు ఎక్కడ ఎంత ఉన్నా అక్కడి సాగు ఖర్చులతో పోలిస్తే సాగు గిట్టుబాటు కావటం లేదన్నది స్పష్టం. అందుకే అనేక ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి.లేని చోట రైతాంగం నష్టపోతున్నది. ఎగుమతులకు సైతం సబ్సిడీలు ఇచ్చే అమెరికా వంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే. వివిధ దేశాలలో ఉన్న పంటల దిగుబడి కూడా రైతాంగ రాబడిని ప్రభావితం చేస్తుంది. దిగవన కొన్ని దేశాల వివరాలను చూద్దాం. వాతావరణాన్ని బట్టి అంచనాలు మారుతూ ఉంటాయి. ఒక హెక్టారుకు దిగుబడి అంచనాలు కిలోల్లో ఇలా ఉన్నాయి.2023 జనవరి అంచనాలని గమనించాలి. ఆఫ్రికా ఖండానికి సూచికగా ఈజిప్టును తీసుకున్నప్పటికీ పంటల దిగుబడి మిగతా దేశాలలో దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నదని గమనించాలి.
దేశం ××× గోధుమ ××వరి×× ముతక ధాన్యం×× పత్తి ×× చమురు గింజలు××మొక్కజొన్న
ప్రపంచం×× 3,550 ×××4,590××× 4,290 ××× 787 ××× 2,330 ××× 5,740
అమెరికా×× 3,130 ×××8,280××× 10,130×××1,062 ××× 3,150 ×××10,880
ఐరోపా××× 5,500 ××× 6,060××× 4,980××× నిని ××× 2,640 ××× 6,010
బ్రిటన్ ××× 8,610 ××××××××××× 6,320××× ×× ××× 3,400 ××× ×××××××
చైనా ××× 5,860 ××× 7,080××× 6,270××× 2,032××× 2,560 ××× 6,440
భారత్ ××× 3,370 ×××4,120××× 2,030××× 444 ××× 1,030 ×××3,200
బ్రెజిల్ ××× 3,060 ×××7,000××× 5,330××× 1,777××× 3,490 ××× 5,510
ఈజిప్టు ××× 6,410 ×××8,700××× 7,130××× 703 ××× 1,040 ×××8,000
పైన పేర్కొన్న వివరాల అంచనాల్లో స్వల్ప మార్పులు తప్ప దిగుబడుల ధోరణులను వెల్లడిస్తాయి. మన దేశంలో పత్తి కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదని తెలిసిందే. చైనాలో కూడా అంతే ఇచ్చినప్పటికీ అక్కడ దిగుబడులు ఎక్కువ కారణంగా రైతాంగానికి నష్టం ఉండదు. పత్తి పండే దేశాల్లో అనేక ఆఫ్రికా దేశాలకు దగ్గరగా తక్కువ దిగుబడి ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశంలో కనీస మద్దతు ధరలు ఇవ్వటాన్ని సబ్సిడీ ఇవ్వటంగా చిత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిగుబడులు ఎక్కువగా ఉండటం, సబ్సిడీలు ఇచ్చి తక్కువ ధరలకే ఎగుమతులు చేస్తూ మన వంటి దేశాలను అమెరికా,ఇతర ధనిక దేశాలు దెబ్బతీస్తున్నాయి.
ప్రపంచమంతటా 2022లో పెరిగిన సాగు ఖర్చులు, రైతులను ఎలా ప్రభావితం చేసిందీ ఇంకా సమగ్రమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ప్రతి డాలరును పట్టి పట్టి చూస్తారు గనుక మిగతా దేశాలతో పోలిస్తే ఆ లెక్కలు కూడా వేగంగా రూపొందుతాయి. భూమి,యంత్రపరికరాలు, ఇంథనం, ఎరువులు, పురుగుమందుల ధరలు బాగా పెరిగినందున ఉత్పత్తి ఖర్చు పెరుగుదల తీరు గురించి కొంత విశ్లేషణ అందుబాటులోకి వచ్చింది. సాగు పద్దతులు, మెట్ట, తరి వంటి తేడాలు, దిగుబడులు కూడా సాగు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నెబరస్కా లో వివిధ పంటలకు పెరిగిన ఖర్చు ఇలా ఉంది. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటు దిగుబడి బుషెల్స్ (25.4 కిలోలకు సమానం)లో, ఒక్కో బుషెల్కు ఖర్చు డాలర్లలో అని గమనించాలి.
పంట××××××× సగటు దిగుబడి××× 2021 ×××2022
మెట్ట మొక్కజొన్న×× 150 ××× 2.34 ××× 2.87
తరి మొక్కజొన్న×× 239 ××× 2.28 ××× 2.83
మెట్ట గోధుమ ×× 62 ××× 3.36 ××× 4.55
తరి గోధుమ ×× 98 ××× 3.11 ××× 4.20
మెట్ట సోయా ×× 47 ××× 5.53 ××× 6.46
తరి సోయా ×× 73 ××× 4.64 ××× 5.55
యంత్రాల వినియోగాన్ని బట్టి అమెరికాలో శ్రమశక్తి-కార్మికుడి ఖర్చును లెక్కిస్తారు. అది సగటున గంటకు 25డాలర్లు ఉంది.ఇతర అంశాల్లో తప్ప ఈ ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. ఎరువుల ఖర్చు 30 నుంచి 70శాతం వరకు పురుగుమందుల ఖర్చు 16 నుంచి 60శాతం పెరిగింది. అది ఎలా పెరిగిందో చూద్దాం.( డాలర్లలో)
పంట, ఏడాది×× ఎరువు ××పురుగుమందు ××మెటీరియల్×× నిర్వహణ×× భూమి
మెట్ట మొక్కజొన్న×× —- ××× — ××× —- ××××× —×××——
2020 ×× 49 ××× 60 ××× 226 ×××××× 66 ××× 132
2021 ×× 42 ××× 62 ××× 221 ×××××× 75 ××× 135
2022 ×× 84 ××× 69 ××× 280 ×××××× 78 ××× 144
తరి మొక్కజొన్న×× — ××× — ××× — ××××× —××× —-
2020 ×× 95 ××× 70 ××× 344 ×××××× 144 ××× 260
2021 ×× 82 ××× 59 ××× 320 ×××××× 152 ××× 259
2022 ×× 167 ××× 86 ××× 489 ×××××× 152 ××× 281
ఇదే విధంగా మిగతా పంటల పెట్టుబడి ఖర్చుల్లో కూడా పెరుగుదల ఉంది.
పది ప్రధాన దేశాల వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.1చైనా : ప్రపంచంలో పదిశాతం సాగుభూమి ఉన్న చైనా నాలుగో వంతు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది.గోధుమ, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. ప్రపంచ కూరగాయల్లో సగం సరఫరా చేస్తూ 50 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది.2019లో అమెరికా, ఐరోపా సమాఖ్యలను వెనక్కు నెట్టి అగ్రశ్రేణి వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది.2.అమెరికా: మొక్కజొన్న, సోయా, పత్తి ప్రధాన పంటలు. ఆధునిక సాగు పద్దతుల్లో అగ్రస్థానంలో ఉంది. 3.బ్రెజిల్ : ప్రపంచంలో కర్రపెండలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాక కాఫీ, చెరకు, సోయా ప్రధాన పంటలు. ప్రపంచంలో కాఫీ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. జిడిపిలో 25శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది.4.భారత్ : పాలు, జనపనార, పప్పుదినుసుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దది.వరిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం 58శాతం మందికి జీవనాధారంగా ఉంది.జీడిపిలో 19.9శాతం(2020-21) కలిగి ఉంది.పాల ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. 5.రష్యా: గోధుమ, బార్లీ, ఓట్స్ ప్రధాన పంటలు.ఐదోవంతు భూమిలో గోధుమ సాగు చేస్తారు. పదహారు శాతం మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.6. ఫ్రాన్స్ : గోధుమ, తృణ ధాన్యాలు, బంగాళాదుంపల వంటి పంటలతో ఫ్రాన్స్ ఐరోపాలో ముందుంది. ప్రపంచంలో ద్రాక్షతో ఉత్పత్తి చేసే వైన్లో ప్రధమ స్థానంలో ఉంది.ఏడుశాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. 7.మెక్సికో : పండ్లు, మొక్కజొన్న ప్రధాన పంటలు. చెరకు, కాఫీ వాణిజ్య పంటలు.పశుపోషణ ఎక్కువ.8.జపాన్ : ప్రధాన పంట వరి. జిడిపిలో రెండుశాతం వాటా ఉంది, పదిశాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.సగటు కమతం విస్తీర్ణం మూడు ఎకరాలు మాత్రమే. 9.జర్మనీ : ప్రపంచంలో బీట్రూట్ ద్వారా పంచదార ఉత్పత్తి చేసే దేశాల్లో నాలుగో స్ధానంలో ఉంది. తరువాత ప్రధాన పంటగా బార్లీ, గోధుమలు ఉన్నాయి. సాగు రంగంలో ఐరోపాలో నాలుగవదిగా ఉంది. 10.టర్కీ : గోధుమ, బీట్రూట్ ప్రధాన పంటలు. హాజల్నట్స్, చెస్ట్నట్స్,అప్రికోట్స్, చెరీస్ వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. ఇరవై ఐదుశాతం మందికి ఉపాధి కల్పిస్తూ జిడిపికి ఎనిమిది శాతం అందిస్తున్నది.
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక మిత్ర వైరుధ్యంగా చెప్పవచ్చు. తమకు గిట్టుబాటు కావాలంటే యంత్రాలు తప్పవని రైతులు, వాటితో తమ ఉపాధి పోతుందని కూలీలు. రైతులకు గిట్టుబాటు కాకపోవటానికి కూలీల వేతనం కానే కాదు. అదేగనుక వాస్తవమైతే అమెరికాలో కూలీల్లేకుండా చేస్తున్న సాగుదార్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు ? ఐరాస ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) 2022 నివేదికలో యాంత్రీకరణ గురించి చెప్పిన అంశాల సారాన్ని చూద్దాం. దారిద్య్రం, ఆకలిని పోగొట్టాలంటే యాంత్రీకరణ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.అది చిన్న రైతులకు అందుబాటులోకి రాకుంటే అసమానతలను పెంచుతుంది. డిజిటల్ విప్లవం, యాంత్రీకరణలో దేశాల మధ్య, దేశంలోనే ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ పరికరాలు ఉండాలి.యాంత్రీకరణ ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వేతనాలు పెరుగుతున్నపుడు, కూలీల కొరత ఉన్నపుడు అది రైతులు, కార్మికులకు లాభసాటి, నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ కూలీలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉన్నపుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. సబ్సిడీలు ఎంత ఎక్కువ ఇస్తే అంతగా, వేగంగా యాంత్రీకరణ చేయవచ్చు.కూలీలు అగ్గవగా ఉన్నపుడు విధాననిర్ణేతలు సబ్సీడీలు ఇవ్వకూడదు.అంతగా ఇవ్వాలనుకున్నపుడు సంధికాలంలో పని కోల్పోతున్న వారికి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశం, ఇతర అనేక దేశాల అనుభవం చూసినపుడు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవు.
పేదరికం, ఆకలి తాండవించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి.ప్రపంచంలో 2030నాటికి ఆకలితో ఉండేవారు ఉండకూడదన్నది లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలలో ఆఫ్రికాలో తీవ్రమైన కరవులు 300 సంభవించాయంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2021లో ఆ ఖండంలో 30 కోట్ల మంది అన్నార్తులున్నారు. అక్కడి ఆహార ఉత్పత్తిలో 70శాతం చిన్న రైతులే చేస్తున్నారు. నిరంతర సాగు వృద్ది, దిగుబడుల పెంపు,ఉపాధి అక్కడి ప్రధాన సవాళ్లు. ఆహార ఉత్పత్తిలో 40శాతం మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికా సాగు వృద్దికి గాను 2030 నాటికి 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం. అందుకనే ధనిక దేశాలు అక్కడ పెట్టుబడి పెడితే అంటూ పెట్టుబడి-లాభాలు-నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.
అడవిని కొట్టి కొంత కాలం సాగు చేసి ఆ భూమిని వదలి మరోచోట సాగు చేసే పోడు పద్దతిని అనుసరించే అడవి బిడ్డల నుంచి ఆకాశం నుంచి డ్రోన్లు, విమానాల ద్వారా మందులు చల్లే ఆధునిక సాగుదార్లు ఉన్న ప్రపంచంలో దవోస్లో జనవరిలో కొలువు దీరిన ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డిజిటల్ సాగు గురించి సలహాలు ఇచ్చారు. మూడు సాగు చట్టాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్ ముందుకు తీసుకువచ్చిన అంశాలవే. ఇంటర్నెట్లో రైతులు తమ వద్ద ఉన్న పంట గురించి వివరాలు పెడితే, మార్కెట్లో కొనుగోలు చేసే వారు, అప్పులు ఇచ్చేవారు ముందుకు వచ్చి అంతా ఆన్లైన్లోనే లావాదేవీలు జరుపుతారు, రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని దవోస్లో చెప్పారు. కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు అని చెపితే సెల్ఫోన్లకు ఇంటర్నెట్ సంకేతాల కోసం చెట్లు ఎక్కిన పిల్లల మాదిరి మారుమూల రైతులు పొలాలను వదలి చెట్లెక్కాల్సి ఉంటుంది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు 86శాతం మంది ఉన్నారు. ప్రపంచ జిడిపి నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లలో నాలుగుశాతం వాటా, నాలుగోవంతు మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం గురించి ప్రపంచ కార్పొరేట్లు పట్టించుకోవటం వెనుక అసంఘటితంగా ఉన్న రైతుల నుంచి ఎలాంటి పెట్టుబడి, రిస్కు తీసుకోకుండా ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసి లాభాలు పోగేసుకోవాలన్న ఎత్తుగడ తప్ప ఉద్దరించేందుకు కాదు. ప్రపంచంలో మూడో వంతు ఆహారాన్ని 60.8కోట్ల మందిగా ఉన్న చిన్న రైతులు పండిస్తున్నారు. వారికి నిరంతర జీవనం గురించి ఎలాంటి హామీ లేదు.
కార్పొరేట్ శక్తుల ధనదాహం, విచక్షణ రహితంగా రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్న రసాయనాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల కారణంగా ఏటా కోటీ 20లక్షల హెక్టార్ల భూమి సాగుకు పనికి రాకుండా పోతున్నది. దాన్ని అరికట్టి జనాలకు ఉపాధి చూపటం ఒక పద్దతి. దానికి బదులు కృత్రిమ సాగు గురించి కార్పొరేట్ సంస్థలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. వాటిని ఎందుకు తెచ్చినప్పటికీ వీటిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వారు కడుపునిండా తినేందుకు అవసరమైన మొత్తంలో ఆహారం కావాలంటే 70శాతం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అంచనా. ఇతర అవసరాలకోసం చేసే పరిశోధనలు అనేక సందర్భాలలో ఇతర రంగాలలో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించాయి. అంతరిక్ష పరిశోధనలే అందుకు ఉదాహరణ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహణకు చేసిన వార్షిక ఖర్చుతో పోల్చితే అది చేసిన పరిశోధనల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు రెట్లు ఆర్థిక లబ్ది కలుగుతోంది.హరికేన్ల గురించి హెచ్చరించటం మొదలు రోబోటిక్స్ వరకు ఆరోగ్యం నుంచి ఆహార నిల్వ పద్దతుల వరకు అనేక రూపాల్లో అది ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో సాగు గురించి పరిశోధిస్తున్నారు. అంతరిక్ష నౌకలలో వెళ్లి పరిశోధనలు చేసే వారి మీద అంతరిక్ష వెలుగు ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాలతో ఇండ్లలో ఎల్ఇడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియతో మొక్కలను పెంచవచ్చని చేసి చూపారు. దీంతో కొన్ని దేశాల్లో సాగుభూమి కొరతను అధిగమించేందుకు అనేక అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో ఆహారానికి అవసరమైన ఆకుకూరల వంటి వాటిని పండిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో ఒక ఎకరం విస్తీర్ణం అందుబాటులోకి వచ్చి అక్కడ పండించే పంటల మొత్తం భూమి మీద నాలుగు-ఆరు ఎకరాలలో పండేదానికి సమానంగా ఉంటున్నది. ఈ భవనాల్లో ఏడాది అంతటా సాగు చేయవచ్చు. వాటికి భారీ యంత్రాల వంటి పరికరాలు అవసరం ఉండదు, ఇతర ఖర్చులూ తక్కువే. ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాలు మరింతగా అవసరం. అదే విధంగా ఆస్ట్రోనాట్లకు నిల్వవుండే ఆహార పదార్దాలను ఎలా అందచేయాలన్న పరిశోధన వెలుపల ఆహార నిల్వ ప్రక్రియకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలు నూతన వంగడాల మొదలు ఆవిష్కరించిన అనేక నూతన ప్రక్రియలను రైతాంగానికి తక్కువ ధరలతో అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్ సంస్థలకు లాభాల కోసం అప్పగిస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యవసాయ సబ్సిడీలు, వాణిజ్యం మీద దోహా దఫా చర్చలు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా కనుచూపు మేరలో ఒప్పందం కుదిరే అవకాశం కనిపించటం లేదు. ఇంతకాలం చర్చలు చేసి సాధించిందేమిటంటే ఇప్పుడున్న స్థితిని మరింతగా అస్థిరపరచవద్దనే ఏకాభిప్రాయానికి తాజా (2022 జూన్) జెనీవా సమావేశం వచ్చింది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరత అని చెప్పారు తరువాత ఉక్రెయిన్ సంక్షోభం అంటూ సాకులతో కాలం గడుపుతున్నారు. ఒప్పందం కుదిరితే ధనిక దేశాలకు నష్టం గనుక అవి ముందుకు సాగనివ్వటం లేదు. ప్రపంచీకరణకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజన్ మొరాయించలేదు గాని వాహనాన్ని ముందుకు లాగలేకపోతోంది అన్నట్లుగా దాని పరిస్థితి ఉంది. సర్వేజనా సుఖినోభవంతు దానికి ప్రతిదేశం సంపద్వంతం కావాలన్నది ప్రపంచీకరణ సుభాషితం. అందుకు గాను స్వేచ్చామార్కెట్ ఉండాలని చెప్పింది. మార్కెట్ అంటేనే లాభాలు, కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లు అవి మార్కెట్లో పట్టున్నవారికే వస్తాయి. ఇప్పుడు ఆ పట్టుకోసం కుమ్ములాట, ధనికదేశాలు తాము చెప్పిన పద్దతిల్లో ఆట నిబంధనలు ఉండాలని చెబుతున్నాయి.వాటిలో కూడా విబేధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి ముందు ఉన్న పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్) గానీ మీరు పప్పులు తీసుకు రండి మేము పొట్టు తీసుకువస్తాం రెండింటినీ కలిపి ఊదిన తరువాత మిగిలిన వాటిని పంచుకుందాం అన్నట్లుగా పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్నవే. దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకోవటం కుదరదు గనుక మార్కెట్లను ఆక్రమించే ఎత్తుగడదానిలో ఉంది. అది పారలేదు గనుక కొత్త దారులు వెతుకుతున్నాయి. భారత్, చైనా వంటివి కొరకరాని కొయ్యలుగా మారాయి.