Tags
#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS
ఎం కోటేశ్వరరావు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.
”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.
స్వామి సాగర్ సింధు మహరాజ్ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్ మహరాజ్ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్ సింగ్ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)
ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ లేదా మేడిన్ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?
విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్ పార్టీ నేత వార్సి పఠాన్ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్ అధ్యక్షుడు, ఔరంగాబాద్ ఎంపీ జలీల్ ప్రకటించారు. మజ్లిస్ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.
టైమ్స్ నౌ టీవీ ఛానల్ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.
ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్ మనకు ఒక ప్రభాకరన్ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్ తీవ్రవాది), ఒక జనరల్ సాహెబ్ సింగ్ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.
మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.
హరిద్వార్ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్ సమావేశం ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?
డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.
సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.
.