Tags
Afghanistan Talibans, Akhand Bharat, BJP, BJP’s trolling army, China, Donald trump, Narendra Modi, Propaganda War, RSS
ఎం కోటేశ్వరరావు
” అరెస్టు స్వర భాస్కర్ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్ చెప్పిందేమిటి ? ” తాలిబాన్ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.
ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్ వంటి వారు చెబుతున్నది అదే కదా !
ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్, అమీర్ ఖాన్, జావేద్ అక్తర్, హమీద్ అన్సారీ, నసీరుద్దీన్ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్, మిర్చి దేశారు, రాజ్‌దీప్ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్ కప్ప చీబల్ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.
వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా-టిబెట్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?
ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్ ట్రంప్ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్ టైమ్స్ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్ స్టిక్) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.
తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?
తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?
ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?