ఎం కోటేశ్వరరావు
2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్ పత్రాల్లో ఎకౌంట్స్ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్ సర్కార్ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.
జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్ సర్కార్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.
గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్ సర్కార్ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?
ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్ తాజా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్ఆర్ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్ సర్కార్ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్సి (సబ్‌ప్లాన్ )నిధులుగా రు.20,005, ఎస్టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.
పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?
ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!