Tags
Anti communist, anti-communist fiesta, communist, Hitler, Joseph Stalin, Nazism, totalitarian regimes
ఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు సమాజ చరిత్ర మొత్తం వర్గపోరాటాల మయమే అని కారల్ మార్క్స్ భాష్యం చెప్పారు. దాన్నే మహాకవి శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మరింత సుబోధకంగా జనం ముందు పెట్టారు. విజేతలే ఎప్పుడూ చరిత్రను రాశారు. రెండు సంస్కృతులు సంఘర్షించినపుడు పరాజితులు రూపుమాసిపోతారు. విజేతలు తమ గొప్పతనాన్ని పెద్దదిగా చూపుతూ చరిత్ర పుస్తకాలు రాస్తారు, ఓడిపోయిన శత్రువు గురించి వాటిలో అగౌరవంగా చిత్రిస్తారు అని డాన్ బ్రౌన్ అనే పెద్దమనిషి చెప్పాడు.
ప్రపంచంలో దోపిడీ వ్యవస్ధ సంక్షోభానికి గురైనపుడల్లా మితవాద శక్తులు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా నాజీలైనా కమ్యూనిస్టులైనా ఒకటే ప్రాణాలు తీస్తారు, అలాంటపుడు నాజీలే మెరుగు అని జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. దోపిడీ శక్తుల సమాచార యుద్ధంలో ఇదొక ప్రధాన ఆస్త్రం. నమ్మకం లేదా ప్రచారంలో వున్నదాని ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు మహాభారత యుద్దం జరిగింది. దానిలో కౌరవులు, పాండవులూ కత్తులు దూశారు. యుధిష్టిరుడు నష్టాల గురించి ధృతరాష్ట్రుడికి చెప్పినదాని ప్రకారం ఇరువైపులా 166 కోట్ల 20వేల మంది మరణించగా, 2,45,165 మంది మాత్రమే మిగిలారు. ఇంత మందిని బలి తీసుకున్నప్పటికీ మన సమాజం ఆ యుద్ధంలో పాండవుల పాత్రను హర్షిస్తూ, కౌరవులను విమర్శిస్తున్నది. చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తున్నది. పెద్ద సంఖ్యలో జనం మరణించారు గనుక పాండవులు, కౌరవులు ఇద్దరిదీ తప్పే, ఇరు పక్షాలూ దుర్మార్గమైనవే అనటం లేదు. పాండవులు-కౌరవులను ఒకే గాటన కట్టకూడదన్నపుడు కమ్యూనిస్టులు-నాజీలను ఒకే గాటన ఎలా కడతారు.
1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళికతో దోపిడీ వర్గానికి సరికొత్త ప్రతిఘటన ప్రారంభమైంది. అది ఒక రాజుపై మరొక రాజు, ఒక అధికార(పాలకవర్గ) పార్టీపై మరొక పార్టీ మధ్య జరిగే పోరు, ప్రతిఘటన కాదిది. కనుకనే అప్పటి నుంచి చరిత్రను దోపిడీ వర్గమే కాదు, దోపిడీకి గురయ్యే వర్గం కూడా తన దృక్పధంతో సమాజం ముందుంచుతోంది. మార్క్స్‌కు ముందు, తరువాత చరిత్ర రచనలో వచ్చిన మౌలిక మార్పు ఇది. ప్రస్తుతం మన దేశంలో అధికార వ్యవస్ధలో పైచేయి సాధించిన కాషాయ దళాలు ఇప్పటి వరకు మన ముందుంచిన చరిత్రను నిరాకరిస్తూ తిరగరాసేందుకు, వాస్తవాల ప్రాతిపదికన కాకుండా మతం, విశ్వాసాల ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది వాస్తవానికి దగ్గరగా వుందన్నదే జనం తేల్చుకోవాల్సింది.
ఐరోపాను ఒక దయ్యం వణికిస్తోంది, అదే కమ్యూనిజం అని మార్క్స్-ఎంగెల్స్ 168 సంవత్సరాల క్రితం చెప్పారు. సోషలిజం-కమ్యూనిజాలపై విజయం సాధించాం, అదింక కోలుకోలేదు అని పాతిక సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీవర్గం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా కమ్యూనిస్టు భావజాలంపై దాడి, మ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ కమ్యూనిస్టు వ్యతరేక సమావేశాలు ఎందుకు జరుపుతున్నట్ల్లు ?
రెండవ ప్రపంచ యుద్ధం ముగస్తున్న దశలో ఐరోపా భవిత్యం గురించి 1945 ఫిబ్రవరి 4-11 తేదీలలో జరిగిన యాల్టా సమావేశంలో పొల్గొన్న చర్చిల్-రూజ్వెల్ట్- స్టాలిన్. నాజీజం-కమ్యూనిజం ఒకటే అయితే దానికి జర్మనీ నాజీ ప్రతినిధులను ఎందుకు పిలవలేదు ?
ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన నాజీజం, హిట్లర్ పీచమణిచి ఆ ముప్పు తప్పించిన శక్తులకు నాయకత్వం వహించింది స్టాలిన్. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా నాటి సోవియట్ యూనియన్-హిట్లర్ నాయకత్వంలోని జర్మనీ మధ్య 1939 ఆగస్టు 23న నిర్యుద్ధ సంధి జరిగింది.అది సోవియట్-జర్మనీ మధ్య ఆ ప్రాంత ఐరోపా దేశాలను విభజించుకొనేందుకు జరిగిన ఒక చీకటి ఒప్పందం, దాని వలన కోట్లాది మంది జనం ప్రాణాలు కోల్పోయారంటూ సోషలిజం-నాజీశక్తులను ఒకే గాటన కడుతున్నారు. దానిలో భాగంగానే ఆ సంధి వలన ప్రాణాలు కోల్పోయినవారు, బాధితులను స్మరించుకొనే పేరుతో 2009 ఏప్రిల్ రెండున ఐరోపా పార్లమెంట్ చేసిన నిరంకుశపాలన వ్యతిరేక తీర్మానం మేరకు ని ప్రతి ఏడాది ఆగస్టు 23న ఐరోపాలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఎస్తోనియా రాజధాని తాలిన్‌లో కమ్యూనిస్టు పాలకుల నేరాల పేరుతో ఐరోపా దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం జరిపారు. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వున్నందున ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రీస్ మంత్రి ప్రకటించారు. ఐరోపా చారిత్రాత్మక జ్ఞాపకాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదని ఐరోపా వామపక్ష పార్టీ పేర్కొన్నది. పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్ అయిన ఎస్తోనియాను అటువంటి సమావేశానికి వేదికగా చేసుకోవటం సైద్ధాంతిక లక్ష్యం కోసమే అని పేర్కొన్నది. గ్రీకు మంత్రి బహిష్కరణ నిర్ణయాన్ని ఎస్తోనియా పార్లమెంట్ సభ్యురాలు వుడెక్కి లూనే సమర్ధిస్తూ ఒక లేఖ రాశారు. ఆ సమావేశాన్ని నిర్వహించటమంటే ప్రస్తుత ఎస్తోనియా రాజకీయాలు నాజీజాన్ని పరోక్షంగా సమర్ధించటమే అని పేర్కొన్నారు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ విజయాన్ని మేతొమ్మిదవ తేదీన జరపాలన్న తన నిర్ణయంపై అనేక మంది జర్నలిస్టులు, రాజకీయవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అదే సమయంలో మద్దతు కూడా లభించిందని లూనే పేర్కొన్నారు.
ఎస్తోనియా అధ్యక్షతన రెండవ సారి జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక సమావేశాన్ని సిపిఎం, సిపిఐతో సహా 83కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు ఒక ప్రకటనలో ఖండించాయి. ఫాసిజాన్ని కమ్యూనిజంతో సమంచేసి చెప్పటం రెచ్చగొట్టటం, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ద గర్బంలో జన్మించిన ఫాసిజాన్ని నిర్దోషిగా ప్రకటించటం తప్ప మరొకటి కాదని, ఈ కారణంగానే కమ్యూనిస్టులను ఖండించటం, హింసించటం, అనేక ఐరోపా దేశాలలో పార్టీలపై నిషేధం విధిస్తున్నారని అదే సమయంలో నాజీలతో కుమ్మక్కైన వారు, వారి రాజకీయ వారసులకు పెన్షన్లు ఇస్తున్నారని కమ్యూనిస్టుపార్టీల ప్రకటన పేర్కొన్నది. కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాలు పెరగటం అంటే ప్రజావ్యతిరేక చర్యలను తీవ్రతరం చేయటం, కార్మికుల హక్కులను పరిమితం చేయటం, సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాలకు తెరతీయటమే అని హెచ్చరించింది. మహత్తర అక్టోబరు విప్లవానికి వందేండ్లు నిండిన సందర్భంగా నిజాలు వెలుగులోకి వస్తాయని, టన్నుల కొద్దీ మట్టి చల్లి సోషలిస్టు వ్యవస్ధ గొప్పతనాన్ని మూసిపెట్టటం సాధ్యం కాదని, సంపదలను సౄష్టించే కార్మికులు దానిని తమ పరం చేసే సమాజం కోసం పోరాటాలు జరిపి సోషలిజం నుంచి కమ్యూనిజానికి పయనిస్తారని పేర్కొన్నది.
హిట్లర్ తమ పార్లమెంట్ భవనాన్నే తగుల బెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశాడు. ప్రజల హక్కులను హరించటంతో పాటు కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1933లోనే ఆ దుర్మార్గానికి పాల్పడిన హిట్లర్ కమ్యూనిస్టు వ్యతిరేకత లోకవిదితం. తొలుత పక్కనే వున్న కమ్యూనిస్టు రష్యాను దెబ్బతీస్తే మిగతా ప్రపంచాన్ని చాపలా చుట్టి తన కింద వుంచుకోవచ్చని భావించిన హిట్లర్ అందుకు సన్నాహాలు చేసి సాకు, సమయం కోసం ఎదురుచూశాడు. ఆ తరుణంలో స్టాలిన్ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ బలాబలాలను మదింపు వేసి, తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు, నాటి సామ్రాజ్యవాదుల మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొనేందుకు ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో స్టాలిన్ నిర్యుద్ధ సంధి చేసుకుంది తప్ప ఐరోపాను పంచుకొనేందుకు కాదు. అదే హిట్లర్ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సంధిని వుల్లంఘించి గురించి సోవియట్‌పై దాడికి దిగటం, ఆ దాడిలోనే పరాజయం, ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.అలాంటి హిట్లర్ – స్టాలిన్‌ను ఒకే గాటన కట్టటం దుర్మార్గం. ఐరోపాలోని బ్రిటన్, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఒకవైపు జర్మన్ సామ్రాజ్యవాదంతో వివాద పడుతూనే కమ్యూనిస్టు రష్యాను కూల్చివేసేందుకు హిట్లర్‌కు ఏ విధంగా మద్దతు ఇచ్చిందీ తెలిసిందే. చివరకు తమకే ముప్పు రావటంతో చేతులు కలిపారు తప్ప కమ్యూనిస్టులపై ప్రేమతో కాదు. హిట్లర్, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు,ఫాసిస్టులు తలెత్తటానికిి, బలపడటానికి అనుసరించిన విధానాల బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. స్టాలిన్-హిట్లరూ ఇద్దరూ ఒకటే అయితే స్టాలిన్‌తో ఎందుకు చేతులు కలిపినట్లు? తొలుత జర్మనీలో, తరువాత హిట్లర్ ఆక్రమించుకున్న పోలాండ్ తదితర దేశాలలోనే యూదుల మారణకాండ జరిగింది తప్ప కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వచ్చిన ప్రాంతాలలో అలాంటి వూచకోతలు జరగలేదు, దేశాలను ఆక్రమించుకోలేదు. అలాంటపుడు నాజీజం-సోషలిజం ఒకటే ఎలా అవుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలను నియంతృత్వశక్తుల చేతుల్లోకి నెట్టారన్నది ఇంకొక ఆరోపణ. కమ్యూనిస్టులను నియంతలుగా చిత్రించటం అంతకు ముందు జరిగిందీ తరువాత కొనసాగిస్తున్న పాత చింతకాయ పచ్చడి ప్రచారం తప్ప వాస్తవం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అసాధ్యం కావటంతో తన పెరటితోట వంటి దక్షిణ(లాటిన్) అమెరికాలోని ప్రతి దేశంలో, ఆసియాలో తన కనుసన్నలలో వున్న దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ వంటి చోట్ల మిలిటరీ నియంతలను నిలబెట్టి వాటిని దోచుకున్న అమెరికా చరిత్ర దాస్తే దాగుతుందా? ఆఫ్రికాలో అమెరికా మద్దతు లేని నియంత ఎవడైనా వున్నాడా ? గతంలో సోవియట్, తూర్పు ఐరోపా లేదా ఇప్పుడు చైనాగాని ఏ ఒక్క సైనిక నియంతకైనా మద్దతు ఇస్తున్న వుదంతం వుందా? అమెరికా, ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలలో నయానాజీ శక్తులు తలెత్తుతున్నాయి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి.
ఆగస్టు నెలలో అనేక అమెరికా నగరాలలో నయా నాజీ, ఫాసిస్టు శక్తులు రెచ్చిపోయి భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో జాత్యహంకారం, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులు కూడా వాటి ప్రచారం, ప్రదర్శనలకు పోటీగా వీధులలోకి వస్తున్నాయి. చార్లెటిసవిలేలో జరిగిన దానికి ఇరు వర్గాలూ బాధ్యులే అని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి నయానాజీలను వెనకేసుకు వచ్చాడు. స్వేచ్చాభిప్రాయ వెల్లడికి అవాకాశం ఇవ్వాలని కోరుతూ బర్కిలీలో జాత్యహంకారులు చేసిన ఒక ప్రదర్శన సందర్బంగా జాత్యంహంకారులు కొందరిని వామపక్ష ప్రదర్శకులు కొట్టారని, చూడండి వామపక్ష మద్దతుదారులు ఎలా దాడులకు పాల్పడుతున్నారో అంటూ వాషింగ్టన్ పోస్టు వంటి పత్రిలు గోరంతను కొండంతగా చిత్రించాయి.ముందే చెప్పుకున్నట్లు ప్రచార యుద్దంలో ఇదొక భాగం !