Tags
Anti communist, Austrian Communist Party, Chicago mayor, communism, Communism won, communist manifesto, Joe Biden, karal marx
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్ మార్క్స్-ఫెడరిక్ ఎంగెల్స్ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్ రికార్డ్ అనే వెబ్ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్ మార్క్స్, లెనిన్, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.
మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.
కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.
అమెరికాలో న్యూయార్క్, లాస్ ఏంజల్స్ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్ జాన్సన్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్ యూనియన్, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్-అమెరికన్ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
ఏప్రిల్ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్ డంకల్ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్ గతంలో గ్రీన్ప్ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.
తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్ బోరిక్ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.