Tags
BJP, BJP activist, BJP leaders lies, Naredra Modi, Shivam Shankar Singh, Shivam Shankar Singh Political Consultant
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, శివం శంకర్ సింగ్
శివం శంకర్ సింగ్
(బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ నాయకత్వంలోని బృందంలో అనేక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో శివం శంకర్ సింగ్ పని చేశారు. రచయిత, ఇండియా ఫౌండేషన్‌లో సీనియర్ పరిశోధకుడు అయిన సింగ్ బిజెపి రాజకీయ ప్రచారాల సమాచార విశ్లేషకుడిగా పనిచేశారు. అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్. ఒక పార్లమెంట్ సభ్యుని వద్ద సహాయకునిగా కూడా పని చేశారు )
దేశంలో రాజకీయ చర్చ, కనీసం నా జీవిత సమయంలో అత్యంత నీచమైన స్ధానంలో వుంది.భాగస్వామ్యం అనూహ్యం. తమ పక్షాన వున్న రుజువు ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా జనాలు మద్దతు కొనసాగిస్తున్నారు. తాము కుహనా వార్తలను వ్యాపింప చేస్తునాసషశ్రీతీయత్నీమని రుజువు అయిన తరువాత కూడా వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఇది ప్రతివారిలో వుంది, పార్టీలు మరియు ఓటర్లు లేదా మద్దతుదార్లందరూ దీనికి బాధ్యులే అని చెప్పాల్సి వుంది. నమ్మశక్యం గాని విధంగా అత్యంత శక్తివంతమైన ప్రచారం ద్వారా కొన్ని ప్రత్యేక సందేశాలను వ్యాపింప చేయటంలో భారతీయజనతా పార్టీ ఎంతో చేసింది. ఆ పార్టీకి ఇంకేమాత్రం మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకోవటానికి ప్రాధమిక కారణాలు ఆ సందేశాలే. అయితే అవేమిటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిదీ కాదు పూర్తిగా చెడ్డదీ కాదు అని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత మంచి చేశాయి, కొన్ని రంగాలలో మురికిగా వ్యవహరించాయి.ఈ ప్రభుత్వం దీనికి మినహాయింపేమీ కాదు.
మంచి పనులు
1.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా వుంది. రోడ్డు పొడవును లెక్కించే పద్దతిలో తేడా వుంది, దానిలో కారణాంకనాలున్నప్పటికీ అది వేగంగానే జరిగినట్లు కనిపిస్తుంది.
2.విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. అన్ని గ్రామాలు విద్యుదీకరించబడ్డాయి, జనానికి ఎక్కువ గంటలు విద్యుత్ లభిస్తోంది.( కాంగ్రెస్ ఐదులక్షల గ్రామాలను విద్యుదీకరించింది. చివరి 18వేలకు పైగా వున్న గ్రామాలను మోడీ పూర్తి చేశారు. ఈ సాధనను మీరు కోరుకున్న విధంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విద్యుత్ సరఫరా పెరుగుతూనే వుంది, కానీ మనకు బిజెపి హయాంలోనే పెద్ద పెరుగుదల వున్నట్లు మనం చూడవచ్చు) 3. వున్నత స్ధాయిలో అవినీతి తగ్గింది- ఇప్పటి వరకు మంత్రుల స్ధాయిలో పెద్ద కేసులేమీ లేవు( అయితే యుపిఏ ఒకటి హయాంలో కూడా ఇలాగే వున్నమాట నిజం. దిగువ స్ధాయిలో అలాగే వున్నాయి, చెల్లించాల్సిన మొత్తాలు పెరిగాయి, పోలీసులు, పట్వారీలు తదితరుల ను అదుపు చేయగలవారెవరూ కనిపించటం లేదు.) 4. స్వచ్చభారత్ కార్యక్రమం నిస్సందేహంగా విజయవంతమైంది. గతం కంటే ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు జనాల మనస్సులో స్వచ్చత భావన నెలకొన్నది. 5. వుజ్వల యోజన ఒక గొప్ప చొరవ అయితే రెండవ సిలిండర్‌ను ఎంత మంది కొన్నారో చూడాల్సి వుంది. మొదటిది, స్టవ్ వుచితం, అయితే జనాలు ఇప్పుడు వాటికి డబ్బు చెల్లించాల్సి వుంది, ప్రభుత్వం కార్య క్రమం చేపట్టినప్పటి నుంచి సిలిండర్ ఖర్చు రెట్టింపైంది, ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలకంటే ఎక్కువ వుంది. 6. ఈశాన్య భారత్‌తో సంబంధాలు నిస్సందేహంగా పెరిగాయి. రైళ్లు, రోడ్లు, విమానాలు పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే ప్రధాన స్రవంతి న్యూస్ ఛానళ్లలో ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. 7. ప్రాంతీయ పార్టీల పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్ధితి మెరుగ్గా వుంది.
చెడ్డ పనులు
జాతులు, వ్యవస్ధలను నిర్మించాలంటే దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. బిజెపి పాలనలో నేను చూసిన అతి పెద్ద వైఫల్యం ఏమంటే చాలా దుర్బలమైన కారణాలను చూపి కొన్ని గొప్పవాటిని నాశనం చేయటం.
1. ఎలక్ట్రరల్ బాండ్లు ా ఇది అవినీతిని చట్టబద్దం చేస్తుంది, మన రాజకీయపార్టీలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లు, విదేశీశక్తులకు అవకాశమిస్తుంది. ఈ బాండ్లు అజ్ఞాతమైనవి. కాబట్టి ఒక కార్పొరేట్ సంస్ధ మీరు గనుక ఒక నిర్ణీత విధానాన్ని ఆమోదిస్తే వెయ్యి కోట్ల విలువైన ఎలక్ట్రొరల్ బాండ్లు ఇస్తాను చెబుతుంది, దానిని శిక్షించేవారుండరు. దీని వలన ఒక అజ్ఞాత సాధనం ద్వారా నీకిది నాకది అని నిరూపించే అవకాశం వుండదు. ఇది మంత్రిత్వస్ధాయికి అవినీతిని ఎలా దించిందో కూడా వివరిస్తోంది. దీనికి ఫైలు లేదా వుత్తరువులతో పని లేదు. ఇది అమెరికాలో మాదిరి విధాన స్ధాయిలోనే జరుగుతోంది. 2. ప్రణాళికా సంఘ నివేదికలు :సమాచార ప్రధాన వనరులుగా వీటిని వినియోగించుకోవచ్చు.ప్రభుత్వ పధకాలను అవి ఆడిట్ చేస్తాయి, ఎలా జరుగుతున్నదీ చెబుతాయి. అది పోయిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మటం తప్ప మరొక మార్గం లేదు.(కాగ్ నివేదికలు చాలా కాలం తరువాత వస్తాయి) నీతి అయోగ్‌కు ఈ బాధ్యత లేదు, అది మౌలికంగా సలహాలిచ్చే మేథావులతో నిండిన, ప్రజా సంబంధాల సంస్ధ మాత్రమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకుండానే ప్రణాళిక లేదా ప్రణాళికేతరానికి తేడా లేకుండా చేయవచ్చు.3. సిబిఐ, ఇడిల దుర్వినియోగం: నేను చూసినంత వరకు వీటిని రాజకీయ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. ఒక వేళ అలాంటిదేమీ లేదనుకుంటే మోడీ లేదా అమిత్ షాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ సంస్ధల ద్వారా వారిమీద దాడిచేయిస్తారనే భయం వున్న మాట నిజం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన భిన్నాభిప్రాయాన్ని హతం చేయటానికి ఇది చాలు. 4. కాలిఖో పాల్ ఆత్మహత్య నోట్, జడ్జి లోయా మరణం, సొహ్రబుద్దీన్ హత్యల దర్యాప్తులో విఫలం, వున్నావోలో ఒక రేప్ కేసులో నిందితుడైన ఎంఎల్‌ఏను వెనకేసుకురావటం, అతని బంధువు ఆ బాలిక తండ్రిని హత్యకేసులో నిందితుడు కావటం, ఒక ఏడాది పాటు ఎఫ్‌ఐర్ నమోదు చేయకపోవటం.5. పెద్ద నోట్ల రద్దు: ఇది విఫలమైంది, అంతకంటే దారుణం ఏమంటే ఆ వైఫల్యాన్ని బిజెపి అంగీకరించలేకపోవటం. ఈ చర్య ద్వారా వుగ్రవాదులకు నిధులు నిలిచిపోతాయని, నగదు లావాదేవీలు తగ్గుతాయని, అవినీతి అంతమౌతుందని చేసిన ప్రచారమంతా అసంబద్దమైనది. ఇది వాణిజ్యాన్ని అంతం చేసింది. 6. జిఎస్‌టి అమలు: దీన్ని హడావుడిగా అమలు జరిపారు, వ్యాపారానికి హాని చేసింది. వ్యవస్ధను సంక్లిష్టం గావించింది. వివిధ వస్తువుల మీద అనేక రేట్లు, పన్నుల దాఖలులో సంక్లిష్టత. కొంత వ్యవధిలో స్ధిరపడుతుందని అనుకున్నారు, కానీ అది హాని చేసింది. ఈ వైఫల్యాన్ని అంగీకరించేందుకు బిజెపి ఎంతో దురహంకారంతో వ్యవహరించింది.7.కేవలం చప్పట్లు కొట్టించుకొనేందుకు విదేశాంగ విధానాన్ని గందరగోళపరచటం: శ్రీలంకలో చైనాకు ఒక రేవు వుంది, బంగ్లాదేశ్, పాకిస్ధాన్లలో పెద్ద ప్రయోజనాలున్నాయీభారత్‌ను చుట్టుముడుతోంది, మాల్దీవులలో వైఫల్యం( భారత విదేశాంగ విధాన వైఫల్యం కారణంగా అక్కడ ఇంకే మాత్రం భారతీయ కార్మికులకు వీసాలు దొరికే అవకాశం లేదు) మోడీగారు విదేశాలు తిరుగుతూ 2014కు ముందు విదేశాలలో భారతీయులంటే గౌరవం లేదని ఇప్పుడు ఎంతగానో గౌరవిస్తున్నారని చెబుతున్నారు.( ఇదొక చెత్త మన ఆర్ధిక వ్యవస్ధ మరియు ఐటి రంగంలో పురోగమనం కారణంగా విదేశాలలో భారత్‌కు గౌరవం ప్రత్యక్ష ఫలితం, మోడీ కారణంగా అది ఒక్క ఔన్సు కూడా మెరుగుపడలేదు, బీఫ్ పేరుతో వధించటాలు, జర్నలిస్టులకు బెదిరింపుల వంటి వాటితో అదింకా దిగజారి వుండవచ్చు) 8. పధకాల వైఫల్యం, వాటిని గుర్తించటంలో లేదా సరిచేయటంలో వైఫల్యం : సంసద్ ఆదర్శ గ్రామ యోజన, మేకిన్ ఇండియా, నైపుణ్య అభివృద్ధి, ఫసల్ భీమా( తిరిగి చెల్లింపులను చూస్తే బీమా కంపెనీల జేబులు నింపటం కనిపిస్తుంది.) నిరుద్యోగం, రైతాంగ సంక్షోభాలను గుర్తించటంలో వైఫల్యం, ప్రతి వాస్తవ సమస్యను ప్రతిపక్ష నాటకంగా వర్ణించటం. 9. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల : కాంగ్రెస్ అధికారంలో వుండగా మోడీ, బిజెపి మంత్రులు మరియు మద్దతుదార్లందరూ వాటి ధరలు ఎక్కువగా వున్నాయని విమర్శించారు. అప్పటితో పోలిస్తే అప్పుడు ముడిచమురు ధర తక్కువగా వున్నప్పటికీ ఎక్కువగా ధరలు వుండటాన్ని ఇప్పుడు సమర్ధిస్తున్నారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. 10. అత్యధిక మౌలిక సమస్యల విషయాలపై పని చేయటంలో వైఫల్యం : విద్య, ఆరోగ్య సంరక్షణ. విద్యారంగంలో చేసిందేమీ లేదు, జాతీయంగా అది అతి పెద్ద వైఫల్యం.దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గిపోయింది(ఎఎస్‌ఇఆర్ నివేదికలు) ఎలాంటి చర్య తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణకు వారు చేసిందేమీ లేదు. ఆయుష్మాన్ భారత్ ప్రకటించారు. చేసిందేమీ లేకపోగా ఆ పధకం నన్ను మరింత భయపెడుతోంది.బీమా పధకాలు భయంకర బాటలో నడుస్తున్నాయి అవి అమెరికా బాటలో నడుస్తున్నాయి.అది ఆరోగ్య రక్షణలో భయంకరమైన గమ్యం(మైఖేల్ మూర్ సినిమా సికో చూడండి)
మీరు కొన్నింటిని జోడించవచ్చు, సమస్యను మీ స్వంత అవగాహన మేరకు మరికొన్నింటిని తీసివేయవచ్చు, కానీ ఇది నా మదింపు. ఎలక్ట్రోరల్ బాండ్స్ సమస్య పెద్దది, సుప్రీం కోర్టు దానిని రద్దు చేయవచ్చని అనుకుంటున్నాను. ప్రతి ప్రభుత్వానికి కొన్ని వైఫల్యాలు, కొన్ని చెడులు వుండవచ్చు గానీ అన్నింటికంటే పెద్ద సమస్య నైతికవిలువలకు మించి లేదు.
వికారమైనది
ఈ ప్రభుత్వ నిజమైన ప్రతికూలత ఏమంటే ఎంతో యోచించిన పధకం ప్రకారం జాతీయ చర్చను అది ఎలా దెబ్బతీసిందనేదే. ఇది వైఫల్యం కాదు, ఇదొక పధకం.
1. ఇది మీడియాను నమ్మరానిదిగా చేసింది. దాంతో ఇప్పుడు ప్రతి విమర్శ వెనుక ఒక జర్నలిస్టు బిజెపి లేదా కాంగ్రెస్ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు చిత్రితమౌతున్నది. అనేక మంది జర్నలిస్టుల విషయంలో అది వాస్తవం కాదని నాకు తెలుసు. అంతకంటే ముఖ్య మైన అంశమేమంటే ఏ ఒక్కరూ ఆరోపణలు లేదా ఫిర్యాదుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కేవలం సమస్యను ముందుకు తెచ్చి వ్యక్తుల మీద దాడిచేయటం, తరువాత సమస్యను కూడా విస్మరిస్తున్నారు. 2.గత డెబ్బయి సంవత్సరాలలో ఏమీ జరగలేదనే ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దారు. ఇది పూర్తిగా అనుచితం, ఫలితంగా తలెత్తే మానసిక ప్రవృత్తి దేశానికి హానికరం. ప్రభుత్వం ప్రకటనల మీద నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, ఇప్పుడది ఒక ధోరణిగా మారింది. చిన్న పనులు చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవటం. మొదటిసారిగా రోడ్లను మోడీ నిర్మించలేదు. మాయావతి, అఖిలేష్ యాదవ్‌ల మానసపుత్రికల వంటి పధకాల ద్వారా నిర్మించిన కొన్ని మంచి రోడ్ల మీద నేను ప్రయాణించాను. 1990 దశకం నుంచి భారత్ ఐటి శక్తి కేంద్రంగా మారింది. నేడున్న పరిస్ధితులను బట్టి గత పని తీరును అంచనా వేస్తూ గత నాయకులను దూషించటం సులభం. వుదాహరణకు ఎవరైనా కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేదని అడగవచ్చు. వారు కొన్ని మౌలికమైనవి కూడా చేయలేకపోయారు. ఈ వాదన ఎంతో తర్కబద్దంగా వినిపించవచ్చు, దేశ చరిత్రను చదవటం ప్రారంభించే వరకు నేను కూడా నమ్మాను. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించుకొనే నాటికి మనది చాలా పేద దేశం. మనకు ఒక రాజధాని లేదు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులు లేవు. దీన్ని అధిగమించేందుకు నెహ్రూ సోషలిస్టు మార్గం పట్టి ప్రభుత్వరంగ సంస్ధలను ఏర్పాటు చేశారు. మనకు వుక్కు ఫ్యాక్టరీ నిర్మించుకొనే సామర్ధ్యం లేకపోతే రష్యన్ల సాయం తీసుకున్నారు. దేశంలో యంత్రాలు, వుక్కు తయారీకి రాంచీలో హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇవి లేకుండా మనకు వుక్కు వుండేది కాదు, ఇతర మౌలిక సదుపాయాలూ వుండేవి కావు. మనకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కరవులు వచ్చేవి,పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. జనానికి తిండి పెట్టటం ప్రాధాన్యత, అప్పుడు మరుగుదొడ్లు విలాసం దానికోసం ఎవరూ చూడలేదు. హరిత విప్లవం వచ్చి 1990దశకం నాటికి ఆహార కొరత అదృశ్యమైంది. ఇప్పుడు మనం మిగులు సమస్యను ఎదుర్కొంటున్నాము. మరుగుదొడ్ల మాదిరే పాతికేండ్ల తరువాత నరేంద్రమోడీ అన్ని ఇండ్లకు ఎసి ఎందుకు పెట్టించలేదని అడుగుతారు. అది ఈ రోజు ఒక విలాసంగా కనిపించినట్లే ఒక రోజు మరుగుదొడ్లు కూడా విలాసమే. ఈ పరిణామం త్వరలో జరగవచ్చు లేదా పదిపదిహేనేండ్ల క్రితమే జరిగి వుండవచ్చు. కానీ 70ఏండ్లలో ఏమీ జరగలేదని చెప్పటం బలవంతంగా రుద్దే ఒక భయంకరమైన అవాస్తవం. 3. కుహనా వార్తల వ్యాప్తి, వాటిపై ఆధారపడటం : బిజెపి వ్యతిరేక కుహనా వార్తలు కూడా కొన్ని వున్నాయి, కానీ బిజెపి అనుకూల, ప్రతి పక్ష వ్యతిరేక కుహనా వార్తలు జనానికి చేరటంలో మైళ్ల దూరం ముందున్నాయి. వాటిలో కొన్ని మద్దతుదార్లవి, అయితే ఎక్కువ భాగం పార్టీ నుంచే వస్తున్నాయి. తరచూ అవి విద్వేషపూరితంగానూ జన సమీకరణ వైఖరి అంతకంటే నీచమైనవిగా కూడా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ మద్దతు వున్న ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ మనకు తెలిసినదాని కంటే సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. 4. హిందూయిజం ప్రమాదంలో వుంది: హిందువులు, హిందూయిజం ప్రమాదంలో వుందనే భావనను, మనల్ని రక్షించాలంటే మోడీ మాత్రమే దిక్కు అని జనాల బుర్రలోకి నూరిపోశారు. వాస్తవంలో జనాల భావంలో మార్పు తప్ప ఈ ప్రభుత్వం రాకముందు హిందువులు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు, మారిందేమీ లేదు. హిందువులమైన మనం 2007లో ప్రమాదంలో పడ్డామా? నావరకైతే దాని గురించి రోజూ వినలేదు, మరింత భయం, విద్వేషం తప్ప హిందువుల స్ధితిగతులలో నాకైతే మెరుగుదల కనిపించలేదు. 5. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశవ్యతిరేకులు, ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ఈ విధమైన ముద్రవేయటం ద్వారా న్యాయమైన విమర్శను బయటకు రాకుండా చేస్తున్నారు. మీ జాతీయతను రుజువు చేసుకోండి, ప్రతిచోటా వందేమాతరం పాడండి( బిజెపి నేతలకు దానిలో వుండే పదాలేమిటో కూడా తెలియనప్పటికీ దానిని పాడాలని మిమ్మల్ని బలవంతం చేస్తారు.) నేను జాతీయవాదిగా గర్వపడతాను, అయితే దాన్ని బహిరంగంగా ప్రదర్శించమని ఏవరైనా బలవంతం చేయటాన్ని నా జాతీయవాదం అనుమతించదు. అవసరమైనపుడు లేదా నాకు పాడాలని అనిపించినపుడు జాతీయ గీతాన్ని జాతీయ పాటను నేను పాడతాను. అయితే ఇతరుల వెర్రులకు అనుగుణ్యంగా పాడాలని ఎవరైనా బలవంతం చేస్తే నేను పాడను.6. బిజెపి నేతలు నిర్వహిస్తున్న వార్తా ఛానళ్ల ఏకైక కార్యక్రమం హిందూ-ముస్లిం, జాతీయవాదం-జాతి వ్యతిరేకులు, భారత్-పాకిస్ధాన్, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే, విడిపోయే సమీకరణలను రెచ్చగొట్టే చర్చలు మాత్రమే. అవి ఏవో మీ అందరికీ తెలుసు, నీచమైన ప్రచారాన్ని వెదజల్లే చర్చలు జరిపేవారికి నజరానాలు అందచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 7. సమీకరణ : అభివృద్ధి సందేశం గతించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు బిజెపి వ్యూహం ఏమిటంటే విభజించే సమీకరణలను, కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం. మోడీగారు స్వయంగా తన ప్రసంగాల్లో చెప్పారు. జిన్నా, నెహ్రూ, భగత్ సింగ్ జైల్లో వున్నపుడు కాంగ్రెస్ నేతలు ఆయనను పరామర్శించలేదు( ఆ నకిలీ వార్త స్వయంగా ప్రధాని నోటి నుంచి వెలువడింది). గుజరాత్‌లో మోడీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు పాకిస్ధాన్‌లో సమావేశమయ్యారు. అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ గొప్పవాడని అని యోగి గారు చెబుతారు. జెన్‌యు విద్యార్ధులు జాతి వ్యతిరేకులు, వారు దేశాన్ని ముక్కలు చేస్తారు. ఈ ప్రచారమంతా విడదీయండి, ఎన్నికల్లో గెలవండి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో రూపొందించినది. ఇటువంటి దానిని మా నేతల నుంచి వినాలని కోరుకోవటం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాటలతో దేశం తగుల బడాలని కోరుకొనే ఎవరినైనా అనుసరించేందుకు నేను వ్యతిరేకిస్తాను.
జాతీయ చర్చను ఒక చీకటి కోణంలోకి బిజెపి ఎలా నెడుతోందో చెప్పేందుకు కొన్ని వుదాహరణలు మాత్రమే ఇవి. దీని కోసం నేను బిజెపిలో చేరలేదు, వీటన్నింటికీ నేను మద్దతు ఇవ్వలేను, అందుకే నేను బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నా.
గమనిక: భారత ఆశాకిరణం మాదిరి నరేంద్రమోడీ గారు కనిపించటంతో నేను 2013 నుంచి బిజెపిలో పని చేస్తున్నాను, అభివృద్ధి సందేశాన్ని నమ్మాను. ఆ సందేశం, ఆశ ఇప్పుడు పూర్తిగా పోయాయి. నావరకైతే నరేంద్రమోడీ మరియు అమిత్ షా ప్రభుత్వంలోని సానుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా వున్నాయి.అయితే ప్రతి ఓటరు స్వంతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాన్ని, చరిత్రను ఎలా సంక్లిష్టం గావిస్తున్నారో తెలుసుకోండి. ప్రచారాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆరాధించటం హీనమైన అంశాలు. ఇది ఈ దేశం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి.
ఎన్నికలు దగ్గరపడుతున్నందున మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దాంతో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏ భావజాలాన్ని లేదా ఏ పార్టీ అని కాదు, అది మెరుగైన, బలమైన, దారిద్య్రం లేని, అభివృద్ధి చెందిన భారత్‌ను నడిపించేదిగా వుండేదానికి మనం మద్దతు ఇవ్వాలి. నా ఏకైక ఆశ ఏమంటే మనమందరం సామరస్యతతో పని చేస్తామన్నదే. రెండు వైపులా మంచి వారుంటారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. వారు భిన్న పార్టీలలో వున్నప్పటికీ వారికి ఓటరు మద్దతు, వారి మద్దతు ఓటర్లకు వుండాలి.