Tags
Anti Muslim propaganda in India, BJP, Desecularization, Global Religion 2023, hindutva, Hindutva nationalism, India’s population, polygamy, polygamy in india, RSS
ఎం కోటేశ్వరరావు
మతం మంచి కంటే హాని ఎక్కువగా చేస్తున్నదని నమ్ముతున్న వారు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ” ప్రపంచ మతం 2023 ” అనే నివేదిక వెల్లడించిన అంశమిది. ఇప్‌సాస్ అనే అమెరికన్ మీడియా సంస్థ 26దేశాలకు చెందిన వారి మీద జరిపిన సర్వే వివరాలను ఇటీవలనే వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 20 ఫిబ్రవరి మూడవ తేదీ మధ్య సర్వే జరిగింది. కొన్ని దేశాల్లో వెయ్యి, కొన్ని చోట్ల ఐదు వందల మందిని ప్రశ్నించగా మన దేశంలో 2,200 మందిని ఎంచుకున్నట్లు సంస్థ పేర్కొన్నది. వీరిలో తాము హిందువులమని 87శాతం, ముస్లింలు పది, క్రైస్తవులమని రెండు శాతం, మతం ఏమిటో చెప్పని వారు ఒక శాతం ఉన్నారు. సర్వేలో ప్రశ్నలకు వచ్చిన కొన్ని సమాధానాల సారం ఇలా ఉంది. మంచి కంటే మతం హాని ఎక్కువ చేస్తున్నదని నమ్ముతున్న వారు 26 దేశాల సగటు 47శాతం కాగా అగ్రస్థానంలో మన దేశంలో 73 శాతం ఉన్నారు. చుట్టుపక్కల ఇతర మత విశ్వాసాల వారు ఉన్నప్పటికీ పూర్తి నిశ్చింతగా ఉన్నట్లు చెప్పిన వారు సగటున 76శాతం కాగా మన దేశంలో 80శాతం ఉన్నారు. దక్షిణాఫ్రికా 92శాతంతో ప్రధమ, 53శాతంతో దక్షిణ కొరియా అధమ స్థానంలో ఉంది. మత విశ్వాసాలు, దేవుడికి సంబంధించి మన దేశంలో నమ్మకం ఉన్న వారు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేవుడిని కొలిచేందుకు ప్రార్ధనా స్థలాలకు వెళ్లే వారు సగటున 28శాతం ఉండగా మన దేశంలో అధికంగా 71శాతం ఉన్నారు. జపాన్‌లో అతి తక్కువ ఐదుశాతం. మతం, దేవుడు, స్వర్గం, నరకం గురించి విశ్వాసాలు ఉన్నవారు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలోని పట్టణపౌరుల్లో పదింట ఎనిమిదికి దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుడిని నమ్మే వారు సగటున 40శాతం మంది, అదృశ్య శక్తి ఏదో ఉందని భావిస్తున్నవారు 20 శాతం ఉన్నారు. అదే మన దేశంలో 70, 11 శాతాల చొప్పున ఉన్నట్లు తేలింది.
మన దేశంలో ఓటు బాంకు రాజకీయాల సంతుష్టీకరణ అంశం చర్చనీయాంశంగా ఉంది.మైనారిటీల పరిరక్షణకు పూనుకోవటాన్ని సంతుష్టీకరణగా వర్ణించుతున్న శక్తులు, ఉన్మాదం, విద్వేషాన్ని రెచ్చగొడుతూ మెజారిటీ ఓటు బాంకు సృష్టికి పూనుకున్నాయి. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని చెబుతున్న బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారెవరినీ ఒక్క చోట కూడా అభ్యర్ధులుగా పోటీకి నిలపటం లేదు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రముఖ నేత ఒకరు తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే పార్టీ నేతలు అసెంబ్లీ ఫలితాల తరువాత ముస్లిలంతా ఒక పార్టీకి వేసినందున తాము ఓడినట్లు ఆరోపించారు.ఇది మెజారిటీని ఆకర్షించే మార్కెటింగ్ ఎత్తుగడ, ఒక తరహా విద్వేష ప్రచారం. హిందూ మత రక్షణ అంటూ లేని ప్రమాదాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించటమే. వందల సంవత్సరాల ముస్లిం, ఆంగ్లేయుల పాలనలో జరగని హాని ఇప్పుడు జరుగుతోందని చెప్పటం దుష్ట పధకంలో భాగం తప్ప మరొకటి కాదు. హిందూత్వ శక్తులు చెబుతున్నట్లుగా మెజారిటీ మతరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ మాదిరి మట్టి కొట్టుకుపోవటం తప్ప మరొకటి జరగదు. దీన్ని దేశ పౌరులు అంగీకరిస్తారా ? త్వరలో దేశంలో ముస్లిం జనాభా పెరిగి వారి పాలన వస్తుందంటూ వాట్సాప్‌లో రోజూ ఊరూ పేరు, ఆధారం లేని సమాచారాన్ని జనానికి చేరవేసి బుర్రలను ఖరాబు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశం 2030 నాటికి చైనాను నెట్టేసి అధిక జనాభా దేశంగా మారనుందని ఐరాస గతంలో వేసిన అంచనాను దెబ్బతీసి ఏడు సంవత్సరాల ముందే ఆ ఘనతను మనం సాధించాము. ఇతర అభివృద్ధి లక్ష్యాలకు ఎంతో దూరంలో ఉన్నాము.
మత రాజ్యం దిశగా దేశాన్ని మార్చాలని, అదే ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలని చూస్తున్న శక్తులు రెచ్చిపోతున్న కాలమిది. మతం, దేవుళ్లను వీధుల్లోకి తెచ్చి ఓట్లను దండుకోవటం తాత్కాలికం తప్ప శాశ్వతం కాదు గానీ, ఒక్కటిగా ఉండాల్సిన సమాజం పరస్పర అనుమానాలతో విడిపోతుంది. కొన్ని మతాల వారు ఉంటే పరిసరాల్లో ఉండలేమని కొన్ని శక్తులు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని అని ఇప్‌సాస్ సర్వే వెల్లడించింది. మార్కెటింగ్ అవసరాల కోసం ఇప్‌సాస్ సంస్థ వివిధ సర్వేలు చేస్తున్నది. ఓట్లను దండుకోవటం, అధికారం కోసం మతాన్ని, విశ్వాసాలను మార్కెటింగ్ చేసుకొనే శక్తులకు ఈ సర్వే కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో అలాంటి శక్తుల కుట్రలకు దేశం, జనం బలికాకుండా చూసేందుకు పూనుకున్న లౌకిక, పురోగామి శక్తులు కూడా తమ విధానాలు, వైఖరులను రూపొందించుకొనేందుకూ ఇది తోడ్పడుతుంది. ప్రతిదాన్నీ మార్కెట్ సరకుగా మార్చివేస్తున్న పూర్వరంగంలో మతం, విశ్వాసాలు, దేవుడు, దేవతలను కూడా అదే చేస్తున్నారు. ప్రతి పండుగనూ ఒక ఆదాయవనరుగా మార్చివేసి పెట్టుబడి లేకుండా, ఏమాత్రం శ్రమపడకుండా పరాన్న జీవులుగా మారి లబ్దిపొందేందుకు కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వారు అలాంటి శక్తులకు మద్దతుదారులుగా మారటం సహజం. ఇది మార్కెట్ సూత్రంలో భాగమే. వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ తరతమ తేడాలతో మత మార్కెటింగ్‌లో పోటీపడుతుండగా బిజెపి అన్నింటికీ అందనంత ముందు ఉంది. మాది నాణ్యమైన సరకు అంటే కాదు మాదే అసలు సిసలు అని కంపెనీలు పోటీ పడుతున్నట్లుగా నిజమైన హిందూత్వకు ప్రతీకలం తామంటే తామని బిజెపి-శివసేన పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. హిందూత్వ మార్కెటింగ్‌లో భాగంగానే విద్వేష ప్రచారాన్ని చూడాల్సి ఉంటుంది.
ముస్లింలు నాలుగు వివాహాలు చేసుకోవచ్చు, ఎందరినైనా పిల్లలను కనవచ్చు గనుక వారు జనాభాను ఉత్పత్తి చేసి మెజారిటీగా మారనున్నారు అనే తప్పుడు ప్రచారం సాగుతోంది. దేశంలో పిల్లలను ఎందరినైనా కనేందుకు అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో పోటీ చేసేందుకు, సంక్షేమ పధకాలను అందించేందుకు ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టాయి. అంతకు మించి సంతానం ఉన్నవారు వాటికి అనర్హులు. 1951 నుంచి 2011 వరకు నిర్వహించిన జనాభా లెక్కలను చూస్తే మొత్తంగా జనాభా పెరుగుదల రేటు 21.6 నుంచి 17.7శాతానికి తగ్గింది. హిందువుల్లో అది 20.7 నుంచి 16.6కు (నాలుగుశాతం తగ్గింది) పడిపోగా ముస్లింలో 32.7 నుంచి 24.7(ఎనిమిదిశాతం తగ్గింది)శాతానికి, క్రైస్తవుల్లో 29 నుంచి 15.7 శాతానికి తగ్గింది. అందువలన మెజారిటీ ముస్లింలు ఉంటారని చెప్పటం దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమే. ఈ కాలంలో ముస్లిం జనాభా 4.4శాతం పెరిగి 14.2కు, హిందువులు 4.3శాతం తగ్గి 79.8శాతం వద్ద ఉంది. ఈ తీరు తెన్నులతో హిందువులు మైనారిటీ కావటం జరగదు.2050 నాటికి ముస్లింలు 31.1 కోట్లకు, హిందువులు 130 కోట్లకు, క్రైస్తవులు 3.7, ఇతరులు 4.6 కోట్లకు పెరుగుతారని అంచనా. హమ్ పాంచ్ హమారో పచ్చాస్ (మనం ఐదుగురం మనకు పాతిక మంది) హమ్ దో హమారే బారా(మన మిద్దరం మనకు పన్నెండు మంది) అనే తప్పుడు ప్రచారం పనిగట్టుకు చేస్తున్నారు. మన దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలలో వెనుకబాటుతనం, దారిద్య్రం ఎక్కువ.ఇలాంటి స్థితిలో పిల్లలు ఎక్కువ ఉంటారు, దీనికి మతానికి సంబంధం లేదు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింలలో సంతనోత్పత్తి రేటు 3.1, కేరళలో 1.86 ఉందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ ఐదవ సర్వే వెల్లడించింది. దీనికి ఆర్థిక, విద్య, గ్రామీణ, పట్టణ తేడాలు అన్నది స్పష్టం. తమిళనాడులో 1.74 మాత్రమే ఉంది. ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో 2.1 మంది పిల్లలు ఉంటే గ్రామాల్లో ముగ్గురు ఉన్నారు. జనాభా పెరుగదలలో మత విశ్వాసాల కోణం కొంత మేరకు ఉంది. అది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, అన్ని మతాల్లో , వెనుకబడిన సమాజాలన్నింటా ఉన్న లక్షణమే. ఉత్తర ప్రదేశ్‌ను తీసుకుంటే 1991-2001 కాలంలో మొత్తంగా 25.85 శాతం పెరిగితే అది 2001-11 నాటికి 20.9శాతానికి తగ్గింది.
బహుభార్యత్వం గురించి కూడా తప్పుడు ప్రచారం సాగుతున్నది. రాముడు ఏకపత్నీ వ్రతుడైతే, కృష్ణుడు బహుపత్నీ వ్రతుడు. ఇద్దరూ పూజనీయులుగానే ఉన్నారు. అసలు 1955లో చట్టం నిషేధించేవరకు హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు ఒకరికి మించి భార్యలను కలిగి ఉండవచ్చని ఎంత మందికి తెలుసు ? ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మహిళల స్థితి గురించి 1974లో వేసిన కమిటీ నివేదికలో నిషేధించినప్పటికీ హిందువుల్లో బహుభార్యత్వం కొనసాగుతున్నది.గిరిజనుల్లో 15.25, బౌద్దులలో 9.7,జైనుల్లో 6.72, హిందువుల్లో 5.8, ముస్లింలలో 5.7శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నారని పేర్కొన్నది. తరువాత ఇంతవరకు అలాంటి సర్వే జరగలేదు ? అలాంటపుడు ఏ ప్రాతిపదికన ముస్లింలను దోషులుగా చిత్రిస్తున్నట్లు ? ముస్లిం పర్సనల్ లా 1937 ప్రకారం ఎక్కువ మంది భార్యలను, పిల్లలను కలిగి ఉండవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ భాష్యం చెప్పింది.2015లో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం బహుభార్యత్వం ఇస్లాంలో మౌలిక అంతర్భాగం కాదని, ఆర్టికల్ 25 ప్రకారం ఏక భార్యత్వ సంస్కరణ గురించి చట్టం చేసే హక్కు రాజ్యానికి ఉందని చెప్పింది. పర్సనల్ లా అనుమతించినప్పటికీ అది ఇస్లాంను పాటించే వారికి మౌలిక హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
2020 డిసెంబరులో అమెరికా పూ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఈజిప్టులలో బహు భార్యలు ఉన్న పురుషులు ఒక శాతం కూడా లేరు. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో గరిష్టంగా 36శాతం మంది బహుభార్యలను కలిగి ఉంటే ముస్లింలలో 40శాతం, క్రైస్తవులలో 24శాతం మంది కలిగి ఉన్నారు. మరో పద్నాలుగు ఆఫ్రికా దేశాలలో 34 నుంచి రెండు శాతం వరకు ఉన్నారు. ఈ దేశాలన్నింటా ముస్లింలతో పాటు క్రైస్తవులు, మతంతో సంబంధం లేని గిరిజన తెగల్లో కూడా ఎక్కువ మందిని వివాహమాడుతున్నారు. వందల సంవత్సరాలనాడు అరేబియా యుద్ధాలలో పురుషులు ఎక్కువ మంది మరణించటంతో వితంతువులు, అనాధల సమస్య తలెత్తి వారి ఆలనా పాలనా చూసేందుకు బహుభార్యలను కలిగి ఉండవచ్చని ఇస్లాం అనుమతించిందని చరిత్రకారులు చెప్పారు. పాకిస్తాన్‌లో రెండవ వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య రాతపూర్వక అనుమతి అవసరం. అలా తీసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకున్న ఒక కేసులో భర్తకు 2017లో కోర్టు జైలు శిక్ష విధించింది.
మన దేశంలో స్త్రీ – పురుషుల నిష్పత్తిని చూసినపుడు పురుషులకు అనేక ప్రాంతాల్లో అసలు వివాహం కావటమే ఒక సమస్యగా మారినపుడు బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యం కాదు.1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి అది 943కు తగ్గింది. ఏడు దశాబ్దాల సగటు 936 గా ఉంది. ఒక సర్వే ప్రకారం ముస్లింలలో మొదటి భార్యకు సగటున 4.67 మంది ఉంటే రెండవ భార్యకు 1.78 మాత్రమే పిల్లలు ఉన్నట్లు తేలింది. ఒక పరిశీలన ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు హిందువుల్లో 29 ఉండగా ముస్లిం పిల్లల్లో 18 మాత్రమే. అందువలన ఇరు మతాల వారికీ పిల్లలు ఒకే సంఖ్యలో పుట్టినా జీవించే వారు ఎక్కువగా ఉన్నందున జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండవచ్చని తేలింది.
ముస్లింలలో మగపిల్లవాడే కావాలనే వైఖరి లేకపోవటం కూడా స్త్రీ-పురుష నిష్పత్తిలో పెద్ద తేడా ఉండటం లేదన్నది పరిశీలనల్లో తేలింది. మతం కారణంగానే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారనే నిర్ణయానికి వస్తే జననాల రేటు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గటానికి కారణాలేమిటి అనే దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. విద్య, ఆర్థికం వంటి అనేక అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచమంతటినీ ఇస్లామిక్ సమాజంగా మార్చేందుకు పిల్లల్ని ఎక్కువ కంటున్నారనేది మరొక ఆరోపణ. పాకిస్తాన్ సంగతి చూస్తే 1951లో సగటున ఒక స్త్రీ 6.6 మంది పిల్లల్ని కనగా(1980 వరకు అదే రేటు) 2023లో 3.238కి తగ్గింది.2050 నాటికి 2.332కు 2100నాటికి 1.81కి తగ్గనుందని అంచనా. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 1961పాకిస్తాన్‌లో ఒక మహిళ 6.8 మందిని కంటే మన దేశంలో 5.92 మంది.1971లో బంగ్లాదేశ్‌లో 6.86 ఉండగా 2020 నాటికి రెండుకు తగ్గారు.మన దేశంలో 2.05 ఉన్నారు. ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు ?
గతంతో పోల్చితే భావజాల పోరు తగ్గింది. అటువంటపుడు సహజంగానే వివిధ కారణాలతో అణగిమణిగి ఉన్న మతశక్తులు విజృంభిస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రపంచంలో మత ప్రభావం పెరిగింది, దీనికి మినహాయింపుగా మన దేశం ఉండజాలదు. అందుకే మత శక్తులకు అనువైన వాతావరణం నేడున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతం, దాని మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే 45శాతం. 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 41.29శాతమే.ఈ పార్టీలకు కేవలం హిందువులే వేశారని భాష్యం చెప్పినా మెజారిటీ హిందువులు వ్యతిరేకమే అన్నది స్పష్టం. ఓటే వేయనివారు మత రాజ్యంగా మార్చి దేశాన్ని నాశనం చేస్తామంటే అంగీకరిస్తారా ?పేదరికం, బాధల నుంచి బయటపడే చిట్కాల కోసం పేదలు, మరింత ధనికులుగా మారేందుకు, దానికి ఆటంకాలు లేకుండా చూసుకొనేందుకు మధ్యతరగతి, ధనికులు నేడు ఎక్కడ చూసినా గురువులు, స్వామీజీలు, సాధ్వులు, హస్త సాముద్రికులు, వాస్తు పండితుల చుట్టూ తిరుగుతున్నారు. వారి వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా ఉంది. 2007లో అమెరికాకు చెందిన పూ సంస్థ ప్రపంచ దృక్పధం అనే అంశంపై 47 దేశాలలో జరిపిన సర్వేలో ఒక ప్రశ్న అడిగింది. ” మా జనాలు నిర్దోషమైన వారు కాదు. కానీ మా సంస్కృతి ఇతరుల కంటే ఉన్నతమైనది ” అనే అంశాన్ని అంగీకరిస్తారా లేదా అంటే మన దేశానికి చెందిన వారు 93శాతం మంది అవును అని చెప్పి అగ్రస్తానంలో ఉన్నారు. సంస్కృతి పేరుతో సంఘపరివార్ జనంలో మనోభావాలను ఎంతగా చొప్పించిందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా సంస్కృతి మంచి చెడ్డలను ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా, పశ్చిమ దేశాల ప్రభావానికి గురైన వారిగా చిత్రించి దాడి చేస్తున్నారు. ఒక్కసారిగా చంపివేస్తే వేరు కానీ జీవితాంతం మీరు అంటరాని వారు అంటూ కోట్లాది మందిని నిత్యం మానసికంగా చంపటం ఘనమైన సంస్కృతిలో భాగమా ? దాన్ని ప్రశ్నిస్తే నేరమా ?