సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది
ఎం కోటేశ్వరరావు
కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.
నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్ సింగ్ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.
నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.
స్విడ్జర్లాండ్ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.
క్రికెట్ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టగానే లలిత్ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్ పిషర్ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?
వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.
ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్ మార్కెట్ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.
సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)
2012-13 5,66,234.7
2013-14 5,72,923.3
2014-15 5,54,349.04
2015-16 6,11,128.31
కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్ విధానాల నుంచి వైదొలిగితే చాయ్ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.
దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.
వాటిలో స్వచ్చభారత్ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.
మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?
ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.
అప్జల్ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?
ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు
షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, విద్యార్ధి యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?
విద్యార్ధి యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .
Like this:
Like Loading...