Tags
“India: The Modi Question”, block out on BBC documentary, Defiant Indian students, DYFI, Explosive BBC documentary, Jamia Millia Islamia, Prime Minister Narendra Modi, sfi
ఎం కోటేశ్వరరావు
పట్టించుకోవాల్సినంత గొప్పది కాదు , వదిలేయండి అంటూనే మోడీపై బిబిసి డాక్యుమెంటరీలను దేశమంతటా ప్రదర్శించే విధంగా, చూసేట్లు విద్యార్థులను, ఇతరులను కేంద్ర ప్రభుత్వం పురికొల్పిందా ? సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్య వికటించిందా ? కుర్రకారును రెచ్చగొట్టిందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలాగే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనానికి అండుబాటులో ఉంచకూడదని మన ప్రజాస్వామిక సర్కార్ భావిస్తే అనేక దేశాల్లో జరిగిన మాదిరి ఏ రూపంలో బహిరంగ ప్రదర్శనలు చేసినా నిషేధం విధించటం తప్ప మరొక మార్గం లేదు, చివరికి అంతపనీ చేస్తుందా ? అనేక ప్రశ్నలు, సందేహాలు. బిబిసి డాక్యుమెంటరీలో నరేంద్రమోడీ పాత్ర గురించి చిత్రించిన తీరును తాను అంగీకరించటం లేదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించటం తప్ప రెండవ భాగ ప్రసార నిలిపివేతకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపున తమకసలు అలాంటి డాక్యుమెంటరీ ఒకటి ఉందని తెలియదంటూ అమెరికా చేతులు దులుపుకుంది. అనేక దేశాల్లో ప్రతికూల స్పందన వెల్లడైంది. నరేంద్రమోడీని విశ్వనేతగా పరిగణిస్తున్న ఏ ఇతర దేశమూ దీని గురించి స్పందించినట్లు వార్తలు లేవు.మొత్తం మీద గాలికి పోతున్నదాన్ని పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నట్లయింది.
గుజరాత్ మారణకాండపై ” భారత్ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్) అనే శీర్షికతో బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని ఖాతరు చేయకుండా రెండవ, చివరి భాగాన్ని మంగళవారం రాత్రి బిబిసి ప్రసారం చేసింది. ఈ భాగంలో 2019లో నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల గురించి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిదాని నిబంధనలే దీనికి వర్తిస్తాయి గనుక సామాజిక మాధ్యమంలో చూడలేము. ఇతర మార్గాల్లో సంపాదించి దేశమంతటా ప్రదర్శిస్తామని విద్యార్థులు ప్రకటించటం, మొదటి భాగం అనుభవం చూసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుగా బృందాలలో ప్రదర్శనలను నిషేధిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ నిషేధించినా వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో చూడవచ్చు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం ఉన్నందున ఆలోగా నిషేధానికి పూనుకుంటే ప్రపంచమంతటా అది మరింతగా ప్రచారం పొందుతుంది, కనుక తరువాత చేస్తారా ? అసలే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, జరిగిన రచ్చ చాలు, ఇంతటితో ముగిద్దామని అనుకుంటారా ?
చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నది సైన్సు చెప్పిన అంశం. అది ఏ విధంగా ఉంటుందన్నది వేరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యకు ప్రతిగా సదరు డాక్యుమెంటరీలో ఏముందో చూడాల్సిందే అంటూ దేశమంతటా విద్యార్థులు పూనుకున్నారు. ఆ మేరకు అనేక చోట్ల పూనుకున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. చూశాము అంటే ఏదో ఒక వైఖరిని వెల్లడించాలి గనుక తప్పించుకొనేందుకు ” అవునా, మా భాగస్వామి, గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ మీద బిబిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిందా, మాకు తెలియదే ” అన్నట్లుగా అమెరికా పెద్ద అమాయకురాలి ఫోజు పెట్టింది. రష్యా,చైనాతో ఉన్న వైరంలో వాటిని దెబ్బతీసేందుకు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని చూస్తున్న అమెరికా ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్దంగా లేదు. అందుకే విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్‌ను విలేకర్లు బిబిసి డాక్యుమెంటరీ గురించి అడగ్గా మీరు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు గానీ అమెరికా-భారత్ రెండూ సచేతన ప్రజాస్వామ్యాలు, సంబంధాలు వృద్ది పొందటానికి పరస్పరం పంచుకొనే విలువల గురించి మాత్రం బాగా తెలుసు అన్నాడు. భారత్‌తో అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం సడలకుండా చూసుకోవటంలో రాజకీయ,ఆర్థిక,ప్రత్యేకించి వ్యక్తిగతమైన సంబంధాలు కూడా కీలకమని పేర్కొన్నాడు. ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా బిబిసి పేర్కొన్నదానిని ఖండించటం గానీ, నరేంద్రమోడీకి మద్దతుగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది పుండుమీద కారం చల్లటం వంటిదే. చూసిన తరువాత చెబుతామంటే ఒకతీరు. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగిన అమెరికాకు భారత్‌లో సంచలనం కలిగించిన మోడీ డాక్యుమెంటరీ వివాదం గురించి తెలియదంటే ఎవరూ నమ్మరు. మోడీ నిలదీసే స్థితిలో లేరు గనుక నటించి అమెరికా ప్రతినిధి తప్పుకున్నాడు. ఏదో ఒక రూపంలో దొంగచాటుగా నైనా చూసేందుకు మోడీ మద్దతుదారులను కూడా పురికొల్పిన ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందని ప్రధాని సలహాదారులు, వ్యూహకర్తలు ఊహించని పరిణామం ఇది.
” మోడీ డాక్యుమెంటరీని అడ్డుకొనేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా దాన్ని చూసేందుకు పోరాడుతున్న విద్యార్థులు ” అనే శీర్షికతో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ రాసింది. ” మోడీ మీద బిబిసి డాక్యుమెంటరీని మరింతగా ప్రదర్శించేందుకు పూనుకున్న తిరుగుబాటు విద్యార్థులు ” అనే శీర్షికతో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఇచ్చిన వార్త ప్రపంచమంతటా అందుబాటులోకి వచ్చింది. ఇంత జరిగినా ఇంటా బయటా కూడా మా ఇంట్లో వారు మోడీకి వ్యతిరేకంగా ఏది చూపినా చూడొద్దన్నారు గనుక చూడం, రాసేవాటిని చదవటం తప్పన్నారు గనుక మేం చదవం అనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారు తప్ప ఇతరులు చూడకుండా ఉంటారా ? ఇంత జరిగాక కూడా అమెరికా వారు కళ్లు మూసుకుంటారా ? అసలేమీ మాట్లాడరా ? ఒక వేళ తప్పు పడితే అమెరికా ప్రవచించే ప్రజాస్వామిక, భావప్రకటనా స్వేచ్చ గురించి కొత్త చర్చ మొదలౌతుంది. ఆ తలనొప్పిని వారు ఎందుకు తెచ్చుకుంటారు ! కేంద్ర ప్రభుత్వం తనకున్న ఎమర్జన్సీ అధికారాలతో సదరు డాక్యుమెంటరీని అందుబాటులోకి తెచ్చే సామాజిక మాధ్యమాల ఇంటర్నెట్ లింకులను తెంపింది తప్ప ప్రదర్శించటాన్ని, చూడటాన్ని నిషేధించలేదు.
నిషేధించకున్నా ఢిల్లీలోని జెఎన్‌యు అధికారులు నరేంద్రమోడీ మెప్పు పొందేందుకుగాను కుంటిసాకులు చూపి విద్యార్ధి సంఘం హాలులో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. మంగళవారం రాత్రి గేట్లు మూసివేసి ప్రాంగణంలో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ప్రదర్శన జరగకుండా అడ్డుకొనేందుకు చూశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపలేరు అన్నట్లుగా విద్యార్థులు ప్రాంగణంలోని ఒక కెఫ్టేరియాలో గుమికూడి తమ సెల్‌ఫోన్లు,లాప్‌టాప్‌లలో చూసి పంతం నెగ్గించుకున్నారు. అలా చూస్తున్నవారి మీద చీకటిలో పక్కనే ఉన్న పొదలమాటు నుంచి రాళ్లతో దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొన్నారు, వారు ఎబివిపికి చెందినవారిగా గుర్తించారు. అంతకు ముందు అధికారుల తీరుకు నిరసన తెలిపారు. రాళ్ల దాడి తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన వారి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు, విద్యార్థి సంఘ అధ్యక్షురాలు అయిషి ఘోష్ చెప్పారు. అధికారులు ఒక ప్రదర్శనను అడ్డుకోవచ్చు, మేం వందల ప్రదర్శనలకు పూనుకుంటాం అన్నారు. కాశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాలను ప్రదర్శించినపుడు వద్దనే సలహాలు అధికారుల నుంచి రాలేదని,తొలిసారిగా ఇప్పుడు వచ్చినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందురోజు ప్రదర్శనకు ముందుగా అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఏ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలో చెప్పాలంటూ విద్యార్ధి సంఘం ప్రశ్నించింది. వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ పండిట్, రెక్టర్ సతీష్ చంద్రగానీ అందుబాటులోకి రాలేదని, తనకు మాట్లాడే అధికారం లేదని డిప్యూటీ రిజిస్ట్రార్ రవి కాంత్ సిన్హా అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది. కాంపస్‌లో మూడో వంతు ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైఫల్యం తప్ప కావాలని నిలిపివేసింది కాదని విసి, రిజిస్ట్రార్ తమకు నివేదించారని విద్యామంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.
ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ అధికారులు కూడా ప్రదర్శనను అనుమతించేది లేదని మంగళవారం నాడు ప్రకటించారు. పోలీసులను రంగంలోకి దించి ఎవరూ గుమికూడ కుండా అడ్డుకున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఎలాగైనా చూడాలనే ఆసక్తిని పెంచుతున్నారని, ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. బుధవారం నాడు అనేక మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలతో సహా 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పిటిఐ పేర్కొన్నది. ప్రాంగణమంతటా సాయుధ బలగాలను మోహరించారు. చండీఘర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన గురించి ఫిర్యాదు చేసినట్లు ఏబివిపి ప్రకటించింది.
దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొన్నది. అసమ్మతి గళాన్ని ఎవరూ నిరోధించలేరని చెప్పారు. కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపు మేరకు అనేక కాలేజీలు, వెలుపల మంగళవారం నాడు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. రాష్ట్రంలో ఈ చిత్ర ప్రదర్శనకు కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు, సంస్థలు పోటా పోటీగా పిలుపునిచ్చాయి. దీన్ని నిరసిస్తూ బిజెపి మద్దతుదార్లు ప్రదర్శనలు చేశారు.చిత్ర ప్రదర్శన దేశద్రోహమని వర్ణించి నిరోధించేందుకు సిఎం పూనుకోవాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రతలకు భంగకరమని రాష్ట్ర బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్ ఈమేరకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు, ఆరోపణలు మరింత పెరిగితే డాక్యుమెంటరీని చూడటం దేశభక్తిగా భావించే అవకాశం ఉంది. బిజెపితో తనకు తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ చిత్ర ప్రదర్శనకు అంగీకరించటంలేదని కాంగ్రెస్ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్ ప్రకటించటం గమనించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎంతగా మూసిపెట్టాలనుకుంటే అంతగా బహిరంగంగా ప్రదర్శిస్తామని, ఒక్క కేరళలోనే గాక దేశమంతటా ఆపని చేస్తామని రాష్ట్ర డివైఎఫ్‌ఐ నేత వికె సనోజ్ విలేకర్లతో చెప్పారు. దీనిలో దేశ వ్యతిరేకత ఏమీ లేదని, ఉద్రిక్తతలను సృష్టించేందుకు కాదని అన్నారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రదర్శిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రకటించింది. మొత్తం మీద దేశమంతటా ఇదొక ప్రధాన అంశంగా మారేతీరు కనిపిస్తోంది.