Tags
China's peace plan, Donald trump, imperialism, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping, Xi Jinping-Vladimir Putin summit : west in a tight spot on China's peace plan
ఎం కోటేశ్వరరావు
చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్-పుతిన్ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్ వెల్లడించాడు.
షీ జింపింగ్-వ్లదిమిర్ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.
జింపింగ్ పర్యటన ఖరారు కాగానే పుతిన్ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్ ప్రాంతాన్ని పుతిన్ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్ నుంచి పొందిన మిగ్ 29 విమానాలను పోలాండ్, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్ రాక ముందు జరిగాయి.
షీ జింపింగ్ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్ అవసరమైతే ఉక్రెయిన్ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్ మీద అరెస్టు వారంట్ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.
గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్ మాస్కో వెళ్లారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.
కరోనా, తరువాత ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్ మీద పుతిన్ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.