ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికల్లో చాయ్ వాలా నినాదం మాదిరి తాజా ఎన్నికల్లో నేను కూడా చౌకీదారునే అనే నరేంద్రమోడీ ప్రచారం ఫలితాలనిస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. సామాన్య ఓటర్ల స్పందన ఇంకా తెలియదు. గతంలో బిజెపి వారందరూ చాయ్ వాలా టీ షర్టులు వేసుకున్నారు. వెంకయ్య నాయుడి వంటి పెద్దలు కూడా టీ దుకాణాలు ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి టీతో పాటు తమ ప్రచార సామగ్రిని జనానికి అందచేశారు. మహిళలకు ప్రత్యేకం అన్నట్లు చాయ్ వాలాలు కూర్చొనేందుకు ప్రత్యేక జాగాలు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ సారి ప్రస్తుతానికి విధేయులందరూ మోడీ మాదిరే తమ పేర్లకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. సభల్లో చాయ్ వాలాలను కూర్చోబెట్టిన మాదిరి చౌకీదార్లను సమీకరించే అవకాశం లేదు. నామ మాత్రంగా జీతాలు వచ్చే వుద్యోగాలు కూడా పోతాయి. బిజెపి వారంటే చావో రేవో తేల్చుకోవాలి గనుక ఇష్టం వున్నా లేకపోయినా పొలోమంటూ నరేంద్రమోడీని అనుకరించాలి కనుక ఆ పని చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జుల ఆర్భాటం చూస్తే రాబోయే ఎన్నికల్లో దాన్నొక ప్రధాన ప్రచార నినాదంగా చేసేందుకు తలపెట్టినట్లు ఈ పరిణామం స్పష్టం చేసింది. మోడీ అనుయాయులందరూ తమ పేర్లకు చౌకీదార్లని తగిలించుకోవటాన్ని కాంగ్రెస్ మోడీ బాబా మరియు 40 మంది దొంగలు అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆ పేరుతో జనాన్ని వెర్రివాళ్లను చేసిందని వ్యాఖ్యానించింది.గతంలో టీ స్టాల్స్ ఏర్పాటు చేసిన మాదిరే ఈ సారి దేశంలో ఐదువందల చోట్ల వీడియో కాన్ఫరెన్సుద్వారా నరేంద్రమోడీ నేనూ చౌకీదారునే అనే ప్రతిజ్ఞలు చేయిస్తారని ఇప్పటికే కోటి మంది దీనికి మద్దతు పలికారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
గతంలోనూ ఇప్పుడూ బిజెపికి కాంగ్రెస్ నేతలే ప్రచార అస్త్రాలను అందించారనే ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ బిజెపి ప్రధాన ప్రతిపక్షమూ కాదు, నరేంద్రమోడీ ప్రధాని కాలేడు, కావాలంటే మా ఏఐసిసి సమావేశాల్లో టీ అమ్ముకొనేందుకు అవకాశం ఇస్తాం ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ అవినీతిని ప్రస్తావిస్తూ దేశాన్నే ఏకంగా అమ్మేవారి కంటే టీ విక్రయించేవారే మెరుగు అంటూ బిజెపి చాయ్ వాలా మా ప్రధాని అంటూ నరేంద్రమోడీని ముందుకు తెచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతో సమర్ధుడు, గుజరాత్ నమూనాను దేశమంతటికీ విస్తరింప చేస్తారు అన్న ప్రచారంతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన మా మోడీ టీ అమ్మటాన్ని అపహాస్యం చేస్తారా, చాయ్ వాలా ప్రధాని ఎందుకు కాకూడదు అంటూ సెంటిమెంటును కూడా రెచ్చగొట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రధాని అయ్యాక మిగతా నల్లధనం వెలికితీత, అవినీతి పరులపై చర్య వంటి వాటి మాదిరే మోడీ చాయ్ వాలా, చాయ్ పే చర్చా ప్రస్తావనలే రాకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ వారు దొంగలైతే తానొక కాపలాదారునని ప్రధాని అని గాక చౌకీదార్ అని పిలిపించుకోవటానికి ఇష్టపడతానని గతంలో చెప్పుకున్నారు. రాఫెల్ విమానాల లావాదేవీల్లో ప్రధాని మోడీ కాపలాదారు కాదు దొంగ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించటంతో మోడీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు తన పేరుకు ముందు చౌకీదారు పేరు తగిలించుకొని నేనూ చౌకీదార్‌నే అని అందరూ ముందుకు రావాలని తన మద్దతుదార్లకు పిలుపునిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇది 2014 కాదు, నరేంద్రమోడీ ఏ పిలుపునిస్తే దానిని గుడ్డిగా నమ్మటానికి జనమూ సిద్ధంగా లేరు. చాయ్ వాలా నినాదం పేలితే చౌకీదారు పిలుపు తుస్సుమనే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. భారతీయ జనతా పార్టీకి, నరేంద్రమోడీకీ ఇప్పుడు అంతసీను లేదు.ఎన్‌డిఏలోని మిత్రపక్షాల నేతలు, కొందరు మంత్రులు ఆపని చేసేందుకు సిగ్గుపడి మొహం చాటేస్తున్నారని, తటపటాయించి ఎందుకు మోడీతో అనవసర పంచాయతీ అని ఎట్టకేలకు తగిలించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది బిజెపికి తొలి ఎదురుదెబ్బ అనవచ్చు. వారా పని చేస్తే కేంద్ర సర్కార్ చేసిన అవినీతి అక్రమాలన్నింటికీ వారు కూడా జవాబుదారీ అవుతారు. ప్రతిపక్షాలు వారిని వదలిపెట్టవు. అయితే చౌకీదారు పేరును బిజెపి మిత్రపక్షాలు తగిలించుకోకపోయినా వదలవు అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా చౌకీదారు అని చెప్పుకున్నాడు అంటే దొంగలను స్వేచ్చగా వదలి వేసేబాపతు అనే అభిప్రాయం జనంలో ఇప్పటికే వ్యాపించింది, సామాజిక మీడియాలో ప్రస్తుతం అది పెద్ద ప్రచారంలో వుంది. ప్రచారం వూపందుకున్న తరువాత అదింకా పెరుగుతుంది. అందువలన బిజెపి దీన్ని ఎంతగా జనంలో తీసుకుపోతే అంతగా ఎదురు తన్నవచ్చు.
గత ఎన్నికల్లో నల్లధనం, అవినీతి అక్రమాలు, వాటి నివారణ గురించి చెప్పని మాట లేదు. ఐదు సంవత్సరాలకు ముందు దేశంలోని వివిధ తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలను పదేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి గురించి ఎదురుదాడి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు తన ఐదేండ్ల పాలనలో జరిగిన అక్రమాల గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్ధితిలో పడ్డారు. కాంగ్రెస్ మీద గతంలో మాదిరి దాడి చేస్తే కుదరదు. ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించపోగా రాఫెల్ విమానాల కొనుగోలు కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అత్యంత భద్రంగా వుండే రక్షణశాఖ కార్యాలయంలోకి ప్రవేశించి తీరిగ్గా జిరాక్స్‌లు తీసుకొని వాటిని మీడియాకు అందచేసి ప్రచురించే వరకు కాపలదారును అని చెప్పుకున్న మోడీ ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతూ తన విధి నిర్వహణలో విఫలమయ్యారు? హిందూ పత్రికలో ప్రచురితమైన తరువాత పార్లమెంట్‌లోనూ వెలుపలా కూడా నోరు మెదపకుండా సుప్రీం కోర్టులో ఆ పత్రాలు చోరీ అయ్యాయని చెప్పటం ఏమిటి? ఏ చిన్న చోరీ జరిగినా వెంటనే కేసు నమోదు చేస్తారు. మరి రాఫెల్ పత్రాల చోరీ లేదా జిరాక్స్ గురించి ఎలాంటి ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇంత జరిగాక నేను కూడా చౌకీదార్‌నే అని చెప్పుకోవటం గోబెల్స్ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు. వందసార్లు ఒక అబద్దాన్ని చెబితే చివరకు అది నిజమై కూర్చుంటుంది అన్నది గోబెల్స్ సూత్రం. దాని ప్రకారం తాను నికార్సయిన కాపలాదారును అని చెప్పుకుంటే సరిపోతుందా ? అంతకు ముందే వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమల్య, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ వంటి వారు పారిపోతుంటే ఏమి చేస్తున్నారన్న ప్రశ్నకు ఇంతవరకు జవాబు లేదు.
నరేంద్రమోడీ ఇచ్చిన చౌకీదార్ పిలుపుకు తానూ సిద్ధమే అని పంజాబ్ నేషనల్ బ్యాంకు లూటీ ఫేం నీరవ్ మోడీ చేసిన ట్వీట్‌కు నరేంద్రమోడీ ప్రతి ట్వీట్ ద్వారా మీ భాగస్వామ్యం ద్వారా నేనూ చౌకీదార్‌నే అనే వుద్యమం మరింత బలపడుతుంది అభినందనలు అని చెప్పారంటే తాజా నినాదం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. మోడీ భక్తుడు, మహిళా జర్నలిస్టులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొని కేంద్ర మంత్రి వుద్యోగం పోగొట్టుకున్న జర్నలిస్టు ఎంజె అక్బర్ తన పేరుకు చౌకీదార్ అని తగిలించి ట్వీట్ చేయగానే సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటి రేణుకా సహానే చేసిన ట్వీట్‌లో మీరు కూడా చౌకీదార్ అయితే ఏ మహిళకైనా రక్షణ ఎక్కడుంటుంది, సిగ్గులేని వారికి హద్దేముంది అని వ్యాఖ్యానించారు. దాంతో వెంటేనే అక్బర్ తొలగించారు. అయితే ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అనుకున్నాడో ఏమో కొన్ని గంటల తరువాత తిరిగి చౌకీదారు అని తగిలించుకున్నాడు.
గత ఎన్నికల సందర్భంగా చాయ్ పే చర్చా పేరుతో టీ స్టాళ్ల దగ్గర చర్చలంటూ వూదరగొట్టారు. కొన్ని చోట్ల బిజెపి ప్రచార సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్ధలాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏమైంది, టీ అమ్మేవారి బతుకులు ఏమైనా మారాయా ? చాయ్ వాలా నరేంద్రమోడీ చౌకీదారు అవతారమెత్తి దొంగలు పారిపోతుంటే పట్టనట్లు వూరుకొని ఆపని చేసే వారికి తీరని కళంకం తెచ్చారు. గతంలో చాయ్ వాలాల మాదిరి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చౌకీదార్లకు ప్రత్యేక స్ధలం ఏర్పాటు చేసి కూర్చోపెట్టారంటే పోలీస్ సేషన్లలో బోర్డులపై దొంగలను చూసిన మాదిరి జనం వారిని చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకుంటే ఎవరైనా చౌకీదార్ పని చేస్తానంటే అనుమానించే విధంగా బిజెపి సర్కార్, నరేంద్రమోడీ వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. నల్లధనం వెలికి తీత గురించి అరచేతిలో స్వర్గం చూపారు. చివరకు పెద్ద నోట్ల రద్దు అనే సర్జికల్ స్రైక్(మెరుపుదాడి) జరిపారు.నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారు. చివరకు అది ఖజానాకు, దేశ ఆర్ధిక వ్యవస్ధకు, అన్నింటికీ మించి జనానికి ఎంతో నష్టదాయకంగా మారిన విషయం తెలిసిందే. నోట్ల రద్ధు వలన సాధించిన విజయాలేమిటయ్యా అంటే కింద పడ్డా గెలుపు నాదే అన్నట్లుగా ధనం మొత్తాన్ని బ్యాంకింగ్ వ్యవస్ధలోకి తెచ్చాముగా అని చెప్పుకున్నారు. అవినీతి నిరోధం గురించి బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లోక్‌పాల్ నియామకం చేయాలంటూ అన్నాహజారే చేసిన ఆందోళనకు మద్దతు పలికింది. లోక్‌పాల్ బిల్లును 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదించినా తరువాత అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ ఐదేండ్ల వరకు కుంటిసాకులు చెబుతూ అందుకు చర్యలు తీసుకోలేదంటే చిత్తశుద్ది ఏమిటో అర్దం చేసుకోవచ్చు. సాకులు చెబితే కుదరదు, ఫిబ్రవరిలోగా నియామకం సంగతి తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన కారణంగా దాన్ని అమలు చేయకపోతే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అదొక ప్రచార అస్త్రంగా మారుతుందనే భయంతోనే ఎట్టకేలకు నియామకాలను చేపట్టారు.లోక్‌పాల్ వ్యవస్ధ ఏర్పాటు తమ ఘనతే అని చెప్పుకోవటానికి కూడా వీలులేని విధంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్ లోకాయుక్త నియామకాన్ని వ్యతిరేకించిన చరిత్ర తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల పాటు ఖాళీగా వున్న ఆ పోస్టు నింపకుండా ఏదో ఒకసాకుతో అడ్డుకున్న అతి పెద్ద అవినీతి వ్యతిరేక పితామహుడు. మంత్రివర్గఆమోదం లేకుండా నియామకం చెల్లదన్న వాదనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు నియామకాన్ని సమర్ధించింది.
గత ఎన్నికల్లో చాయ్ వాలా, ఇప్పుడు నేనూ చౌకీదార్‌నే అనే నినాదాలను బిజెపి, నరేంద్రమోడీ మన అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ భావంలో చెప్పాలంటే ఇతరుల నుంచి తస్కరించారు లేదా జిరాక్స్ తీసుకున్నారు. గతంలో అనేక సందర్భాలలో నేను… నేను కూడా….. అనే నినాదాలు ప్రపంచ వ్యాపితంగా జనంలో ప్రాచుర్యం పొందినవే. ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చిన బానిసలు, వారి సంతానాన్ని అమెరికన్ శ్వేతజాతీయులు తమ ‘కుర్రాళ్ల’ ని పిలిచేవారు. బానిసత్వ వ్యతిరేక పౌర వుద్యమంలో నేను కుర్రాడిని కాదు నేను మనిషిని అంటూ వుద్యమించారు.ఇటీవలి వుదంతాల విషయానికి వస్తే 2015లో ఫ్రాన్స్‌లోని వివాదాస్పద పత్రిక చార్లీ హెబ్డో మహమ్మద్ ప్రవక్త మీద ప్రచురించిన ఒక కార్టూన్ కారణంగా ఆల్‌ఖైదా తీవ్రవాదులు పత్రికా కార్యాలయం మీద దాడి చేసి పన్నెండు మందిని కాల్చి చంపారు. దానికి నిరసనగా నేనూ చార్లీనే అనే నినాదంతో లక్షలాది మంది ఐరోపాలో ప్రదర్శనలు చేశారు. మన దేశంలో జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను హిందూత్వ వుగ్రవాదులు హత్యచేసినపుడు దానికి నిరసనగా నేనూ గౌరీలంక్షేష్‌నే అంటూ పలుచోట్ల ప్రదర్శకులు ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. జనలోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హజారే వుద్యమించిన సమయంలో నేనూ అన్నానే అంటూ అనేక మంది తమ టోపీల మీద రాసుకొని దానికి మద్దతు పలికారు. పని స్ధలాల్లో మహిళలపై వేధింపులకు నిరసనగా కొద్ది నెలల ముందు మీ టూ ప్రచారం సంగతి తెలిసిందే. అంటే నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని అనేక మంది మహిళలు ముందుకు వచ్చారు. ఇంకా ఇలాంటివే అనేక దేశాలలో జరిగాయి. వాటి నుంచి కాపీ కొట్టిందే నేనూ చౌకీదార్‌నే అనే నినాదం !