Tags
anti china, Anti communist, China, cow sciences, economic reforms, INDIA, india china comparison, India Independence Day
ఎం కోటేశ్వరరావు
దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.
71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్-ఎంగెల్స్ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.
అలెగ్జాండర్ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.
పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్ నాయకత్వంలోని కొమింటాంగ్ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్ మార్చ్.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.
అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్ ఓటమితో పాటు కొమింటాగ్ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.
మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.
వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.
విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?
1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్, మన కంటే పెద్దవిగా జపాన్ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.
స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.
నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.
1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.
తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్ సియావో పింగ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.
ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.
చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.
ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.
చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్ డాలర్లు, హాంకాంగ్ 487 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.
చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.