Tags
BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్ పోస్ట్ అనే థారులాండ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్ చేసింది. ఆరెస్సస్ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్ సర్కార్ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్ ఆయిల్, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్ ఎస్ భల్లా నాయకత్వంలోని హైలెవెల్ అడ్వయిజరీ గ్రూప్(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.