• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Farmers Delhi agitation

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డిసెంబరు 27: నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ -నిరసనగా రైతుల తాలీ బజావ్‌ !

25 Friday Dec 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi on Farmers


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఖలిస్తాన్‌ ముద్రతో రైతుల ఉద్యమాన్ని బిజెపి అణచివేయనుందా ?

02 Wednesday Dec 2020

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Farmers’ protest, BJP, Farmers, farmers agitation 2020, Farmers Delhi agitation


ఎం కోటేశ్వరరావు
రైతులకు మద్దతుగా ఈనెల ఎనిమిది నుంచి సరకు రవాణా వాహనాలను నిలిపివేయనున్నట్లు ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఎఐఎంటిసి) బుధవారం నాడు ప్రకటించింది. కోటి మంది ట్రక్కు యజమానులు దీనిలో సభ్యులుగా ఉన్నారు.తొలుత ట్రక్కుల నిలిపివేత ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, కాశ్మీర్‌లలో అమలు జరుగుతుందని తెలిపారు. తరువాత కూడా కేంద్రం రైతుల డిమాండ్లను పట్టించుకోని పక్షంలో దేశవ్యాపితంగా చక్కాజామ్‌(రవాణా బంద్‌) ప్రకటించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు కులతరన్‌ సింగ్‌ అతవాల్‌ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి అనేక ప్రాంతాల నుంచి సరఫరాలు నిలిచిపోయాయి. ఆపిల్‌ పండ్లు మార్కెట్‌కు వస్తున్న తరుణంలో ఈ ఆందోళన రైతులకు, వ్యాపారులకు తీవ్ర సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. డిసెంబరు ఒకటిన ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు.
తమకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ నవంబరు 26 నుంచి ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.ఒక విదేశీ ప్రధాని మన దేశంలో జరుగుతున్న ఒక ప్రజా ఉద్యమానికి మద్దతు ప్రకటించటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. గురునానక్‌ జయంతి సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కును తాము సమర్ధిస్తామని, భారత్‌లో రైతుల ఉద్యమం సందర్భంగా పరిస్ధితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ఈ విషయాన్ని భారత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పాడు.
రైతుల ఆందోళన గురించి మన దేశంలోని మీడియాలో కొన్ని తప్ప ఎక్కువ భాగం నిర్లిప్తంగా ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్లుగా వార్తలు ఇస్తున్నాయి. వీటితో పోల్చితే అంతర్జాతీయ వార్తా సంస్ధలు, విలేకర్ల ద్వారా అనేక విదేశీ పత్రికలు,టీవీ ఛానళ్లు వార్తలను ప్రముఖంగా ఇచ్చాయి. డిసెంబరు మూడవ తేదీన రైతు ప్రతినిధులను చర్చలకు పిలుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఒకటవ తేదీనే ఆహ్వానించటం వెనుక విదేశాల్లో తలెత్తిన వత్తిడితో పాటు ఉద్యమానికి దేశీయంగా పెరుగుతున్న మద్దతు ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో సిక్కు రైతాంగం ప్రధాన పాత్రధారులుగా ఉండటం, సిక్కు జనాభా గణనీయంగా ఉన్న కెనడాలో గురునానక్‌ జయంతి రోజున కెనడా ప్రధాని స్పందించటం గమనించాల్సిన అంశం. కెనడా రాజకీయ రంగంలో సిక్కులు ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కెనడా రక్షణ మంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రులుగా సిక్కులు ఉన్నారు. దేశజనాభాలో ఒకటిన్నర శాతానికి పైగా ( ఆరులక్షల మంది ) ఉన్నారు. రైతుల ఆందోళనకు సంబంధించి భారత్‌ నుంచి వస్తున్న వార్తలను గుర్తించకపోతే అశ్రద్ధ చేసిన వాడిని అవుతానని కెనడా ప్రధాని పేర్కొన్నారు. రైతుల ఆందోళన గురించి వాస్తవాలు తెలియకుండా కెనడా నేతలు మాట్లాడారని, ఒక ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అలా మాట్లాడటం అవాంఛనీయమని మన విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా జరిగిన సంభాషణలను రాజకీయ అవసరాల కోసం తప్పుగా వ్యాఖ్యానించటం తగదన్నారు. కెనడా ప్రధానితో పాటు బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేతలు జాన్‌ మెక్‌డెనెల్‌,తన్మన్‌జీత్‌ సింగ్‌ దేశీ, ప్రీత్‌ కౌర్‌ గిల్‌ కూడా రైతుల ఆందోళన పట్ల మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న తీరును విమర్శించారు.
రైతుల ఆందోళన వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారని బిజెపి నేతలు చెప్పటం సమస్యను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. గడ్డం పెంచిన వారందరూ ముస్లింలే అని ఉగ్రవాదులందరూ ముస్లింలే అన్నట్లుగా ప్రచారం చేస్తున్న శక్తులు సిక్కులు అనగానే ఖలిస్తానీ ఉగ్రవాదులని ముద్రవేయటంలో ఆశ్చర్యం ఏముంది ? సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు, చివరికి కొన్ని మీడియా సంస్దలు కూడా అదే పాటపాడాయి. దీనికి గాను రైతుల్లో కొందరు ఖలిస్తానీ తీవ్రవాది, ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో హతుడైన భింద్రన్‌వాలే ఫొటోలను ప్రదర్శించటాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. ఆందోళనకు అనేకరైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. వాటి అనుయాయులుగా ఉన్నవారిలో భింద్రన్‌వాలే మీద సానుభూతి ఉన్నవారు కొందరు ఉండవచ్చు, అతని చిత్రాలను ప్రదర్శించవచ్చు. అంత మాత్రాన రైతు ఉద్యమాన్ని ఉగ్రవాదులే నడుపుతున్నారని చెప్పటం తప్పుడు ప్రచారమే.
ఆంగ్లో-మరాఠాల మధ్య జరిగిన యుద్దాలలో మూడవది మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌ గ్రామం దగ్గర జరిగింది. పీష్వా రెండవ బాజీరావు దళితులను అవమానపరచి తన సైన్యం నుంచి వారిని తొలగించారు. దీంతో పీష్వాలను వ్యతిరేకించిన బ్రిటీష్‌ సైన్యంలో వారు చేరారు. 1818 జనవరి ఒకటవ తేదీ భీమా కొరేగావ్‌ యుద్దంలో పీష్వాలు ఓడిపోయారు. ఇది తమ ఆత్మగౌరవ విజయంగా అప్పటి నుంచి దళితులు భావిస్తున్నారు. ఆ ఉదంతం జరిగిన 200 సంవత్సరాలు గడచిన సందర్భంగా భీమా కొరెగావ్‌లో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ప్రదర్శన, సభ నిర్వహించాయి. దాని నిర్వాహకులు, మద్దతు తెలిపిన వారి మీద బిజెపి ప్రభుత్వ కుట్ర కేసు నమోదు చేసింది. తెలుగు రచయిత వరవరరావుతో సహా అనేక మందిని ఆ కుట్ర కేసులో ఇరికి బెయిలు కూడా ఇవ్వకుండా నిర్బంధించిన విషయం తెలిసిందే. అదే విధంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకించిన ఢిల్లీ ముస్లింలు, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం కేసులు దాఖలు చేసింది. ఈ ఉదంతాలను గోరంతలు కొండంతలు చేసి నిర్వాహకుల మీద దేశద్రోహ ముద్రవేసి వేధిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు ఖలిస్తానీ ఉగ్రవాదులు మద్దతు ఉందనే ప్రచారం ప్రారంభించారు. అనేక దేశాలలో స్ధిరపడిన సిక్కులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఖలిస్తానీ ఆందోళన దేశ వ్యతిరేకమైనది, వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టింది. తీవ్రవాదులు సాయుధ దాడులకు పాల్పడ్డారు. కానీ రైతుల నవంబరు 26 ఆందోళన ఎంతో ముందుగానే ప్రకటించిన కార్యక్రమమే, అదే విధంగా రైతుల ఢిల్లీ చలో పిలుపులో కూడా దాపరికం లేదు. వారేమీ ఖలిస్తానీ డిమాండ్లను ముందుకు తేలేదు, వారంతా ట్రాక్టర్లలో ఆహార పదార్ధాలతో వచ్చారు తప్ప ఆయుధాలు తీసుకు రాలేదు. నిరవధిక ఆందోళనకు సిద్దపడి వస్తున్నారని ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఆందోళన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా చివరికి హర్యానా బిజెపి ముఖ్యమంత్రి కూడా వ్యవహరించారు. నవంబరు 26 నుంచి ఆందోళనకు దిగితే డిసెంబరు మూడున చర్చలు జరుపుతామని ప్రకటించటంలోనే దుష్టపన్నాగం ఉంది. ఎక్కడైనా పోలీసులు, మిలిటరీ రాకుండా ఆందోళనకారులు రోడ్ల మీద గోతులు తవ్వటం, ఆటంకాలను కల్పించటం సాధారణం. కానీ ఢిల్లీ పోలీసులు, కేంద్ర దళాలే రైతులను అడ్డుకొనేందుకు ఆపని చేయటం మోడీ సర్కార్‌ ప్రత్యేకత.
పంజాబ్‌ రైతులు ఉద్యమించటం ఇదేమీ కొత్త కాదు. గతంలో అనేక ఉద్యమాలు చేశారు. వాటి వెనుక ధనిక రైతులు, పేద రైతులూ ఉన్నారు.1984 మే నెలలో చండీఘర్‌లోని గవర్నర్‌ నివాసాన్ని వారం రోజుల పాటు దిగ్బంధించారు. పంజాబ్‌ రైతాంగం అనేక పోరాటాలు సాగించిన అనుభవం కలిగి ఉంది. కమ్యూనిస్టులు, అకాలీలు వాటికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. 1984ఆందోళన సమయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు రూపకల్పన జరిగింది. భింద్రన్‌వాలే, అతని అనుచరుల ఆక్రమణలో ఉన్న స్వర్ణ దేవాలయంలోని హర్‌మందిర్‌ సాహిబ్‌ భవనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సైనిక చర్య జరిపారు. తరువాత ఎనిమిది సంవత్సరాల పాటు పంజాబ్‌లో అన్ని రకాల ఉద్యమాల మీద నిషేధం కొనసాగింది.
ఇప్పుడు సాగుతున్న ఉద్యమం మీద ఖలిస్తానీ ముద్రవేయటం ద్వారా ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని వేరు చేయటం, ఆందోళనను అణచివేసే దుష్టాలోచన కూడా లేకపోలేదు. హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ స్వయంగా అలాంటి ఆరోపణ చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే భీమా కొరేగావ్‌ కుట్ర కేసు, ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళన కారులపై, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద తప్పుడు కేసులు బనాయించిన విషయం తెలిసిందే. రైతుల ఉద్యమం తీవ్రతరం అయినా మరికొంత కాలం సాగినా అలాంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
పంజాబ్‌, హర్యానా వాటికి సమీపంలో ఉన్న రైతులు ప్రస్తుతం ఉద్యమంలో ముందు పీఠీన ఉన్నారు. దీని ప్రభావం 2022లో జరిగే పంజాబ్‌ ఎన్నికలలో పడుతుందనే భయంతో అకాలీదళ్‌ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల మీద కూడా పడనుందనే భయం బిజెపి మిత్రపక్షాల్లో తలెత్తింది. అవి చిన్న పార్టీలు, వ్యక్తులే కావచ్చు గానీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయాన్ని తెలుపుతున్నది. హర్యానాలో బిజెపి మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. సవరించిన చట్టాలలో కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తూ ఒక్క ముక్కను చేర్చేందుకు వచ్చే ఇబ్బంది ఏమిటని ఆ పార్టీ నేత అజరు చౌతాలా ప్రశ్నించారు. డిసెంబరు మూడు వరకు వేచి చూడకుండా ముందే ఎందుకు చర్చలు జరపకూడదని అజరు చౌతాలా కుమారుడు జెజెపి నేత దిగ్విజయ సింగ్‌ చౌతాల కూడా ప్రశ్నించారు. రైతుల పట్ల అనుసరించే వైఖరిని బట్టి తమ పార్టీ భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తాను ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎంఎల్‌ఏలు సోంబిర్‌ సింగ్‌ సంగవాన్‌, బలరాజ్‌ కుందు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరితో ఉన్నదని పేర్కొన్నారు. తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఎన్నికైన బిజెపి బలం 40 కాగా పది సీట్లున్నజెజెపి, ఏడుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. రాష్ట్రంలోని అనేక ఖాప్‌(గ్రామ పెద్దలతో కూడిన కమిటీలు)లు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాజస్ధాన్‌లో బిజెపి మిత్రపక్షమైన రాష్ట్రీయ లోకతాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పి) అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు హనుమాన్‌ వేణీవాల్‌ ఒక ప్రకటన చేస్తూ పార్లమెంట్‌ ఆమోదించిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరారు.తాము జవాన్లు, కిసాన్ల మద్దతుతో ఎన్నికయ్యామని రైతుల సమస్యల మీద పునరాలోచన చేయనట్లయితే ఎన్‌డిఏలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని చెప్పారు.
పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ సవరణ చట్టాలను వెనక్కు తీసుకొనే ప్రసక్తి లేదని, రైతులతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల్లో భయాలు రేపింది తప్ప రైతుల్లో నిజంగా వ్యతిరేకత లేదని ఆరోపిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బిజెపి ఏర్పాట్లు చేసుకుంటున్నది. వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమైనవని, ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపధ్యంలో కేంద్రం వెనక్కు తగ్గే ధోరణిలో లేదన్నది స్పష్టమౌతోంది. రైతులతో చర్చలు కాలయాపన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ కారణంతోనే రైతులు ఢిల్లీకి రాకుండా రాష్ట్రాల నుంచి వచ్చే రహదారులన్నింటినీ మూసివేయటం, రైతులకు ఆటంకాలను కలిగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోకుండా వెనక్కు తగ్గేది లేదని రైతులు ప్రకటించారు. షాహిన్‌ బాగ్‌ ఆందోళనకు, భీమా కొరేగావ్‌ కేసులకు రైతుల ఆందోళనకు ఉన్న తేడాను గమనించకుండా కుట్రతో అణచివేయాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: