డాక్టర్ కొల్లా రాజమోహన్
రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్ మార్కెటింగ్ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్ యార్డులుండవు. ప్రైవేట్ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్ ట్రేడింగ్ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్ నాటకంలో భాగమే.
కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించి మార్కెట్ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్ లను రద్దు చేశారు.మార్కెట్ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.
ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం
రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు.
బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు.
బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..
వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.
వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్ సంస్ధలు, అగ్రిబిజినెస్ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్ వారెంట్ లాంటివని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్ యస్ యస్ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్ పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు.
25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు
వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేష్ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.
గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.