ఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. నవంబరు నాలుగవ తేదీన బ్యాంకాక్ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి. దానికి మన ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పునరాలోచన గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
ఎగుమతి, దిగుమతి వాణిజ్య లాబీయిస్టులు ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందం షరతులు అమలు జరిగితే ఇప్పటికే మన దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలలో నెలకొన్న సంక్షోభం లేదా తీవ్ర సమస్యలు మరింతగా పెరిగే అవకాశం వుంది కనుక ఒప్పందంపై సంతకాలు చేయరాదని రైతు సంఘాలు మరోవైపున డిమాండ్ చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)లో భాగస్వాములు అయినప్పటికీ గత దశాబ్దకాలంగా అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. అనేక దేశాలు ద్విపక్ష ఒప్పందాలు, ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానిలో భాగమే ఆర్‌సిఇపి. గత ఐదు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప మన దేశం నుంచి ఎగుమతులను పెంచటంలో ఘోరంగా విఫలమైంది. ఆర్‌సిఇపి విషయానికి వస్తే దీనిలో ఆగేయ ఆసియాలోని బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ లాండ్, వియత్నాం(వీటిని ఆసియన్ దేశాలని కూడా అంటారు)లతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో కూడిన కూటమి మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి 2012 నవంబరు నుంచి చర్చలు జరుగుతున్నాయి.
ఈ కూటమి ఆసియన్ దేశాల 2012 సమావేశంలో పురుడుపోసుకుంది.గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తుది ఒప్పంద దశకు చేరుకుంది. పదహారు దేశాలలో 340 కోట్ల మంది జనాభా ఉన్నారు.2017 వివరాల ప్రకారం ప్రపంచ జిడిపిలో 39శాతం అంటే 49.5 లక్షల కోట్ల డాలర్ల వాటా వుంది. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమి కానుంది.2050 నాటికి ఈ దేశాల జిడిపి 250లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందువలన ఇంత పెద్ద కూటమికి దూరంగా ఉండేందుకు మన దేశంలోని బడా కార్పొరేట్ సంస్ధలు ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించవు. గత అనుభవాలను గమనంలో వుంచుకొని రైతు సంఘాలు భయపడుతున్నట్లుగా రైతాంగాన్ని బలిపెట్టి అయినా వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల కార్పొరేట్లు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.చైనా నుంచి మరిన్ని రాయితీలను రాబట్టాలని అవి కేంద్రం మీద వత్తిడి చేస్తున్నాయి.
ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఒప్పందంలో భాగస్వామి అయితే సంభవించే నష్టాలేమిటి, కలిగే లాభాలేమిటి అన్న చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఆసియన్ దేశాలకు మన దేశం నుంచి 2018-19లో 9.56శాతం పెరిగి 37.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 25.87శాతం పెరిగి 59.32 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం ఏ దేశానికీ క్షేమకరం కాదు. అందువలన వాణిజ్య మిగులు సంగతి తరువాత లోటును తగ్గించుకొనేందుకే మన ప్రయత్నాలన్నీ పరిమితం అవుతున్నాయి. సంప్రదింపుల ప్రారంభంలో అంటే 2010-11లో ఆసియన్ దేశాలతో మన వాణిజ్య లోటు 12 బిలియన్ డాలర్లు వుంటే 2018-19 నాటికి 22 బిలియన్లకు పెరిగింది.
ఆసియన్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) విషయానికి వస్తే మన దేశం 74శాతం వరకు పన్నులను రద్దు చేసేందుకు అంగీకరించగా ఇండోనేషియా 50, వియత్నాం 70శాతం మాత్రమే అంగీకరించాయి. ఇది మన కార్పొరేట్‌లను కలవర పెడుతున్నది.కనీసం చైనా కంటే పదిశాతం మేరకు అయినా మనకు అనుకూలంగా వుండాలని కోరుతున్నాయి. ఇతర దేశాలతో దాదాపు ఒప్పందం తుది దశలో ఉండగా చైనాతో ఇంకా ఆదశకు రాలేదు. ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్ పర్యటన సందర్భంగా ఈ అంశం మంత్రుల స్ధాయిలో చర్చించాలని అనుకున్నారు. మన దేశం కూటమిలో భాగస్వామి కాకుండా ప్రయోజనం లేదని భావించిన దేశాలు సంప్రదింపులకు గడువును పెంచాయి.
ఇటీవల నీతి ఆయోగ్ వివిధ కూటములు, దేశాలతో మన ఎగుమతులు, దిగుమతుల గురించి చేసిన సమీక్షలో ఒక్క శ్రీలంక విషయంలో తప్ప మిగిలిన అన్నింటి విషయంలో నష్టం తప్ప లాభం లేదని తేలింది. రెండు వైపులా జరిగే వాణిజ్యంలో 75శాతం మేరకు ఆర్‌సిఇపి స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పరిధిలోకి వస్తాయి. మొత్తం పన్నెండువేల ఉత్పత్తులకు సంబంధించి తొమ్మిదివేల వరకు పన్నులను తగ్గించాల్సి వుంటుంది. పదమూడు వందల ఉత్పత్తులు పన్నుల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో , 1800 వస్తువులు ఆచితూచి వ్యవహరించాల్సిన జాబితాలో ఉన్నాయి. మన దేశం మినహాయింపు జాబితాలో పదిశాతం వస్తువులను చేర్చగా అనేక దేశాలు అంతకంటే ఎక్కువ వస్తువులనే తమ జాబితాల్లో చేర్చాయి.
మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది.
బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఒప్పందాలను అది వ్యతిరేకించింది, ముఖ్యంగా స్వదేశీ జాగరణ మంచ్ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన సంస్ధ ఇప్పటికీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కారణంగా 2018లో మన దేశం 530 కోట్ల డాలర్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే అనేక దేశాల మార్కెట్లు మనకు అందుబాటులో వున్నాయని, ఈ ఒప్పందం ద్వారా కొత్తగా సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావటం లేదు. పాడి, పామోలిన్ రైతాంగం తీవ్రంగా నష్టపోతారని బయటకు వచ్చిన పత్రాల సమాచారం వెల్లడిస్తున్నది.
ఆలిండియా కిసాన్‌సభ (ఎఐకెఎస్) రాగల పర్యవసానాల గురించి ఒక ప్రకటనలో రైతాంగాన్ని హెచ్చరించింది. దేశంలో పది కోట్ల రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ జీవనాధారంగా వుందని, పాలధరలో 71శాతం రైతాంగానికి చేరుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం పాల వుత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న 64శాతం పన్ను రద్దు చేస్తే దిగుమతులతో పాల ధర పతనం అవుతుందని హెచ్చరించింది. న్యూజిలాండ్ తన పాలవుత్పత్తుల్లో 93శాతం ఎగుమతులు చేస్తోందని, మన దేశంలో పాలపొడి కిలో 260 రూపాయల వరకు వుండగా న్యూజిలాండ్ నుంచి 160-170కే లభిస్తుందని కిసాన్ సభ పేర్కొన్నది.దేశంలోని వ్యవసాయ రంగంలో 85శాతం మంది రైతులు చిన్న సన్నకారేనని ఆర్‌సిఇపి ఒప్పందం వారి పాలిట శాపం అవుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆటోమొబైల్ తదితర అన్ని రంగాలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌకధరల వుత్పత్తులతో సమస్య మరింత తీవ్రం కావటం అనివార్యమని ఆయా రంగాల నిపుణులు ఇ్పటికే హెచ్చరించారు.
ఈనెల 11,12 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సిఇపి మంత్రుల సమావేశంలో మన దేశం లేవనెత్తిన అంశాల కారణంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. ముందే చెప్పుకున్నట్లు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒప్పందం అమలు జరిగితే సంభవించే ప్రతికూల ప్రభావంతో 2024 ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే అంచనాతో ఒప్పందం అమలు సంవత్సరాన్ని 2014కు బదులు 2019గా మార్చాలని మన వాణిజ్య మంత్రి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో మన పరిశ్రమల పరిరక్షణ చర్యల్లో భాగంగా సగటున దిగుమతులపై పన్నును 13 నుంచి 17శాతం వరకు పెంచారు. ఇప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తే వెంటనే పన్ను తగ్గించాల్సి వుంటుంది. వివిధ తరగతుల నుంచి వస్తున్న వత్తిళ్ల పూర్వరంగంలో మన దేశం గతంలో లేని కొన్ని కొత్త అంశాలను ఒప్పందంలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తాము చివరి వరకు మన ప్రయోజనాల రక్షణకే ప్రయత్నించామని, విధిలేని స్ధితిలో సంతకాలు చేశామని చెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదే సమయంలో మొత్తంగా మన ఆర్దిక వ్యవస్ధకే ముప్పు వస్తుందని భావిస్తే తమ షరతులకు అంగీకరించలేదనే మిషతో ఒప్పందానికి దూరంగా వుండవచ్చు. ఈ నేపధ్యంలోనే భారత్ లేవనెత్తిన అంశాలపై మిగతా సభ్య దేశాలను అంగీకరింపచేసే బాధ్యత భారతే తీసుకోవాలని కొన్ని దేశాలు ఈనెల రెండవ వారంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.ఇంకా పక్షం రోజులు వున్నందున హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈనెల పది నుంచి 20వ తేదీ వరకు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. అయితే వాటికి పెద్దగా స్పందన వున్నట్లు మీడియాలో మనకు కనపించదు. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది.