సత్య
హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలోని షాద్ నగర్ దగ్గరలో పోలీసులు మట్టు పెట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం గురించి కొన్ని మీడియా సంస్ధలు పేజీల కొద్దీ కథనాలను వండి వడ్డిస్తున్నాయి. వాటిని పాఠకులు కూడా ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. స్త్రీ వేషధారణలో వున్న నయీం ఫొటోను విడుదల చేసిన పోలీసులు వాటికి మరింత కిక్కు ఎక్కిస్తున్నారు. అంతకు ముందు గ్యాంగస్టర్ కధాంశంగా నిర్మించిన రజనీకాంత్ సినిమా కబాలీ గురించి కూడా మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు, వ్యాఖ్యానాలు ఇచ్చింది. మనం అమ్మే సరకు ఏదన్నది కాదన్నయా దాని వలన మనకు ఎంత డబ్బు వస్తుందన్నదే ముఖ్యం అన్నట్లుగా పత్రికలు, టీవీ ఛానల్స్, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియా వంటివి దేనిని ఆదాయవనరుగా మార్చుకోవచ్చో నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నయీం గురించి వర్ణితమౌతున్న కధనాలు రాంగోపాల్ వర్మ తన అభిమాన హీరోయిన్ శ్రీదేవికి 53ఏండ్లు నిండిన కారణంగా ఆమెను హీరోయిన్‌గా పెట్టి తీయలేకపోయినా వేరే వారితో హాలీవుడ్ మాదిరి సీరియల్ సినిమాలు తీయటానికి పనికి వస్తాయి. ఎందుకంటే నయీం కధలలో చీమలను, నరికిన వేళ్లను కరకరా నమిలి తినటం వంటి వాటితో సహా లేడీ డాన్‌లు,గోవా బీచ్‌లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది కనుక కల్పిత పాత్రల కోసం చూడనవసరం లేదు.
ఒక గ్యాంగ్‌స్టర్ హతమైన తరువాత అతగాడి బాధితుల గురించి కధనాలు రాసినట్లుగానే, నిజాలను నిర్భయంగా చెబుతాం, రాస్తాం అనే మీడియా రాజకీయ నేతల బాధితుల కధలు ఎందుకు రాయటం లేదు ? పోయినోళ్లందరూ మంచోరే అయితే గ్యాంగస్టర్‌లు కూడా అంతేగా ? పోనీ పోయిన అందరు గ్యాంగ్‌స్టర్ల గురించి మీడియా అలా రాస్తోందా? ఎందుకు రాయటం లేదు? నయీం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్థులను బాధితులకు తిరిగి ఇస్తాం అని చెబుతున్నట్లుగా రాజకీయ నేతలు లేదా ఆ ముసుగులో కబ్జా చేసిన వాటి గురించి ఏమిటి ? ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ మధ్య కాలంలో అనేక మంది గ్యాంగస్టర్లు, రాజకీయ నేతల బారిన పడిన కథలే కాకుండా మీడియా బారిన పడి ఎలా నష్టపోయిందీ చెబుతున్నారు. నయీం బాధితులకు భరోసా ఇస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా బాధితులకు కూడా అలాంటి హామీ ఇవ్వగలదా ? విక్రమార్కుడి కధలో రాజా నిజం తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి వక్కలౌతుంది అన్నట్లుగా, సమాధానం చెప్పలేకపోతే తల శిరఛ్చేదం అవుతుందనే అపూర్వ చింతామణి కధలు లేదా గులేబకావళికధ సినిమాలో జూదంలో గెలవలేక బందీలుగా మారిపోవటానికి గాని ముందుకు వచ్చే వీరులెవ్వరుంటారు ?
నయీం వంటి గ్యాంగస్టర్‌లను మట్టుపెట్టినపుడు భవిష్యత్‌లో అలాంటి మరొకరిని ఎదగనీయకూడదని అనేక మంది సామాన్యులు నిజంగానే కోరుకుంటారు. వారి సానుభూతిని కొల్లగొట్టటానికి పాలకులు, అధికార యంత్రాంగం కూడా నిరోధానికి కఠిన చర్యల గురించి భీకర ప్రతిన బూనుతుంది. స్మశాన, ప్రసూతి వైరాగ్యాల మాదిరి రెండవ రోజుకు అవి గుర్తుండవు. అంటే మతి మరపు వైరస్ వారిని సోకుతుందా ? ఏమౌతుంది, ఎందుకు అలా జరుగుతుంది.
భూస్వాములు, దొరలు, దేశముఖ్‌ల హయాంలో వారికి ప్రయివేటు సైన్యాలు వున్న విషయం తెలిసిందే. కావాలంటే పాత సినిమాలు చూడవచ్చు. ఆ ఫ్యూడల్ వ్యవస్ధ అంతరించి లేదా అంతరిస్తూ దాని స్ధానంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారి స్ధానాన్ని గ్యాంగస్టర్లు, తాలిబాన్లు (అన్ని రకాల మతోన్మాదులు) భర్తీ చేస్తున్నారు. అనేక హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నాయి. ధనిక దేశాలలో మాఫియా, గ్యాంగస్టర్ల ఆధిపత్యం, పట్టు గురించి ఎన్నో పరిశోధనలు, ఎంతో సాహిత్యం వెలువడుతోంది. వారు అనేక చోట్ల సమాంతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాఫియాతో పాటు నేడు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాలలో బూతు ఒకటి. అన్ని రంగాలలో అగ్రస్ధానంలో వున్న అమెరికాలో హాలీవుడ్ సినిమాలతో సమంగా బూతు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నింటినీ పాలక వర్గాలు, వ్యవస్ధ ఎలా అనుమతించింది. ఎలా కొనసాగనిస్తోంది ?
అందుకే ప్రపంచంలో మనకు ఎక్కడా మంచి భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, మంచివ్యాపారి కనిపించడు. రాజ్యాంగ వ్యవస్ధలు వునికిలోకి వచ్చిన తరువాత వివిధ కాలాలు, దేశాలలో పేరు ఏదైనప్పటికీ పోలీసు, మిలిటరీ అనేది పాలకవర్గాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న అధికారిక యంత్రాంగం. విలువలు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం వంటి వాటి గురించి కబుర్లు చెబుతుంటారు కదా ? అలాంటి వారు పోలీసు వ్యవస్ధద్వారా కొన్ని అక్రమాలు చేయించలేరు. అలాంటి వారు ఏర్పాటు చేసుకొనే అనధికార యంత్రాంగమే గూండాలు. భూస్వామి, దొరలు, దేశ ముఖులు అయితే రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను అదుపు చేయటానికి, వారిపై దాడులకు, పెట్టుబడిదారులు అయితే కార్మిక సంఘాలను, వుద్యమాలను దెబ్బతీయటానికి గూండాలతో పాటు మత శక్తులను వుపయోగించుకోవటం, అడ్డదారిలో లాభాల సంపాదనకు వ్యాపారులు స్మగ్లర్లను వినియోగించుకోవటం తెలిసిందే.ఈ శక్తులన్నింటితో సంబంధాలు, వాటాలు వుంటాయి కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పాలకవర్గ రాజకీయనేతలకు వాటిలో వాటా వుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు యంత్రాంగం కూడా పైన పేర్కొన్న అవాంఛనీయ శక్తులు అదుపుతప్పినపుడు అణచివేయటానికి వారిలోని వారినే వినియోగించుకోవటం ప్రారంభమైంది. వుదాహరణకు నక్సల్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం కొంత కాలం సాగింది. అది బూటకం అని జనానికి అర్ధమైన తరువాత శవాల దగ్గర తుపాకులు,ఎర్ర కరపత్రాలు,సాహిత్యం పెట్టటం వంటి పాతబడిన పద్దతుల స్ధానంలో వారిలోకి కోవర్టులను ప్రవేశపెట్టి వారి చేతే మట్టుపెట్టే సరికొత్త ప్రక్రియకు తెరతీశారు. అది ఇప్పటికీ నడుస్తోంది. నిఘా వ్యవస్ధ, సిబ్బంది కంటే ఈ కోవర్టుల ద్వారానే నక్సల్స్, గూండా, మాఫియా గ్యాంగుల పక్కా సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగలుగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ వ్యవహారం. ఈ క్రమంలోనే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు పోలీసులతో సహా ప్రతివారూ అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఇది ఒక విషవలయం.
గతం గురించి ఎలాంటి అనుభవాలున్నప్పటికీ ప్రతి తరంలోనూ ఇది పునరావృతం కావటానికి ఇది కూడా లాభసాటి వ్యాపారమే కనుక దానికి నాయకత్వం వహించే వ్యవస్దే దీనిని పెంచి పోషిస్తున్నది. నక్సల్స్ ఎందరో భూస్వాములను ఖతం చేశారు, వారి స్ధానంలో కొత్తవారు పుట్టుకు వచ్చారా లేదా, అలాగే సుబ్బరామిరెడ్డి వంటి ఒక పారిశ్రామికవేత్తను హతమార్చారు, అయినంత మాత్రాన ఆ వర్గం అంతమైందా లేదు. ముంబైలో ఎందరో గ్యాంగస్టర్లను అంతమొందించారు, జైళ్లలో పెట్టారు. అయినా అక్కడ కొత్తవారు పుట్టుకు రావటం ఆగిపోలేదే. అమెరికా పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు, ఐఎస్ వుగ్రవాదులు, పంజాబ్, కాశ్మీర్‌లలో వేర్పాటు వాదులను ఎందరినో హతమార్చారు. అయినా కొత్త వారు తయారు కావటం ఆగిపోలేదే. ఎందుకంటే అమెరికా కొత్తవారిని తయారు చేయటం నిలిపివేయలేదు.
మీడియా రంగంలో అవాంఛనీయ శక్తులు, ధోరణులు ప్రవేశించటం దేన్ని సూచిస్తున్నది. దిగువ స్ధాయిలో వున్న విలేకర్లు అనేక అక్రమాలను వెలికి తీసి నివేదిస్తే వాటిని ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల సంగతి తెలియనిదెవరికి? దీన్ని చూసిన తరువాత అదే విలేకర్లలో కొందరు సంపాదనకు దగ్గరదారిగా వుందని భావించి అదే పని చేస్తున్నారా లేదా ?అలాంటి యాజమాన్యాల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలియదా ? తెలిసీ ఎందుకు మౌనంగా వుంటున్నారు. కనీస చట్టాలను కూడా అమలు జరిపేందుకు పూనుకోవటం లేదే ? ఇది పత్రికా యాజమాన్యాలు-ప్రభుత్వనేతలు, రాజకీయనేతల కుమ్మక్కు కాదా ?
అందువలన గూండాగిరి, గ్యాంగస్టర్, మాఫియా వంటి పదాలకు సాంప్రదాయ అర్ధాలను నవీకరించి కొత్త తరగతులను జత చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బ్రిటీష్ వారి పాలనా కాలంలో కొన్ని తరగతుల జనానికి నేరస్థ తెగలనే ముద్రవేసి వారి పునరావాసం పేరుతో కొన్ని కప్పరాలతిప్ప, స్టూవర్టుపురం, సీతానగరం వంటి కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేశారు. చివరికి వారి చేతనే పోలీసు యంత్రాంగం, పలుకుబడిగల పెద్దలు దొంగతనాలు చేయించి వారిని శాశ్వత నేరస్థులుగా చేసిన వుదంతాలు మన కళ్ల ముందే వున్నాయి.
అనేక ప్రాంతాలలో గూండాలుగా తయారై అర్ధంతరంగా జీవితాలు ముగించిన వారి గురించి తెలుసు. అదొక వారసత్వం మాదిరి వారి వారసులు కూడా తయారై కొనసాగటం మన కళ్ల ముందే కనిపిస్తోంది.వారిని వుపయోగించుకుంటున్న రాజకీయ నేతలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.అందువలన ఒక వీరుడు మరణిస్తే వేయి మంది వుద్బవిస్తారు అన్న మాదిరి ఈ రోజులలో వీరులు వుదయించటం లేదు గాని ఒక గూండా మరణిస్తే పదివేల మంది గూండాలు తయారవుతారు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఎక్కడైనా ఒక కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద దుకాణంలో ఎవరైనా అంతరించి పోగా మిగిలి వున్న తమ హక్కులను కాపాడు కొనేందుకు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే వెంటనే వారిపై దాడి. వారి వెనుక ఎవరున్నారని ఆరాలు, ఆ యూనియన్లను అధికారపక్షం స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాకపోతే వారే ఒక యూనియన్ పెడతారు. దానిలో అందరూ చేరాలని వత్తిడి చేస్తారు, బెదిరిస్తారు, వేధిస్తారు, దానికి లొంగకుండా అనివార్య స్ధితిలో ఆందోళన చేస్తే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే వారు వెనక్కు పోతారంటూ కఠినంగా అణచివేసేందుకు పూనుకుంటారు.ఈ విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్‌ఎస్ అందరూ ఏకీభావంతో కూడబలుక్కున్నట్లుగా ఒకే విధంగా వ్యవహరిస్తారు. కార్మిక వుద్యమాల గురించి మీడియా కనీస ప్రస్తావన కూడా చేయదు, రాజకీయ ఫిరాయింపులపై చూపిన ఆసక్తి, కేటాయించిన స్ధలం, సమయాలతో పోల్చితే జనం సమస్యలకు ఇచ్చేది నామమాత్రం.అందుకే వెయ్యి మంది నయీంలు తయారు కావటానికి అయినా ఈ వ్యవస్ధ అంగీకరిస్తుంది కానీ ఒక ప్రజా వుద్యమం పురుడు పోసుకొని ఎదగటాన్ని మాత్రం సహించదు. దోపిడీ వ్యవస్ధల మౌలిక లక్షణం అది.
అందరూ శాకాహారులే మధ్యలో రొయ్యలబుట్ట మాయం, అన్నట్లుగా అందరూ గ్యాంగస్టర్లుగా కఠినంగా వ్యవహరించినవారే గానీ గ్యాంగస్టర్లు తయారవుతూనే వున్నారు, దందాలు చేస్తూనే వున్నారు. నయీం వంటి ఒక సామాన్యుడు గూండాగా మారి వందల మందిని అనుచరులుగా చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నా, నిత్యం అనేక మందిని బెదిరిస్తున్నా, హత్యలు చేసినా, చేయిస్తూ దశాబ్దాల తరబడి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ఇలాంటి పెద్దా, చిన్న గ్యాంగస్టర్లు ఎంత మంది వున్నారు? వారు కూడబెట్టిన ఆస్తులెన్ని, బాధితులెందరు ? వారిని కాపాడిన పోలీసులెవరు? వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన పోలీసులెవరు? వారికి అడ్డుపడిన రాజకీయ నేతలెవరు ? ఎందుకలా చేశారు వంటి అంశాలపై శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు వెల్లడించాలి. ఇవేమీ దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కావు, అవాంఛనీయ శక్తుల అసలు రంగు.ప్రభుత్వం అలా చేయకపోతే లేదా తమకు ప్రత్యర్ధులుగా వున్నవారిని మాత్రమే పోలీసు యంత్రాంగం ద్వారా లక్ష్యంగా చేసుకుంటే ఎస్‌సి, ఎస్‌టి కేసుల మాదిరి నయీం ముఠాపై దాఖలైన కేసులు నీరు గారి పోయి, రాబోయే తరాలకు మరింత వుత్సాహమిస్తాయి. ఇప్పటివరకు గ్యాంగస్టర్లపై నమోదు చేసిన కేసులలో వారితో చేతులు కలిపిన వారిని శిక్షించిన దాఖలాలు లేవు. ఒక వేళ అలాంటివి వున్నా ప్రభుత్వం బయట పెట్టి వాస్తవాలను తెలియచేయాలి. అప్పుడే ఎవరైనా ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. రాబోయే రోజుల్లో చిన్న గ్యాంగులు పెద్ద గ్యాంగులుగా మారకుండా చర్యలు తీసుకోవటానికి నిజాయితీగల యంత్రాంగం ముందుకు వస్తుంది.జోక్యం చేసుకొనే పెద్దలు వెనక్కు తగ్గుతారు.
అలా చేయకపోతే చిత్తశుద్ధిలేని మీడియాలో నయీం గురించి మరికొద్ది రోజులు చదువుకుంటాం. అతగాడి వారసులు రంగంలోకి వచ్చిన తరువాత మీడియాలో వారి గురించి ఒక్క ముక్కా రాదు. ఆ గూండాలు అంతమైన తరువాత అదే మీడియా మరోసారి విజృంభిస్తుంది. కొత్త కథలను వండివారుస్తుంది. యధాప్రకారమే పోలీసు అధికారులు వారిని మేము ఇతర అవసరాలకు వుపయోగించుకున్నాం గానీ, ఇంత ముదురుతారని వూహించలేకపోయాం అంటారు. అతనెవరో కూడా నాకు తెలియదు గానీ అంతమొందించాలని నేను సూచిస్తే పాలకులు అంగీకరించలేదు అని కూడా చెబుతారు. వాటిని నోరు మూసుకొని,చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి. ఎవరైనా కాదంటే పాలకులు, పోలీసులు, గూండాలు కలసి వారి అంతు చూస్తారు.అన్ని దోపిడీ వ్యవస్థలు, ప్రాంతాలలో జరుగుతున్నది ఇదే, ఇక్కడా జరగబోయేది అదే.
ఇలాంటి వారిని అంతం చేస్తే చాలదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారిని తయారు చేస్తున్న వ్యవస్ధను నాశనం చేసి కొత్త సమాజానికి పునాదులు వేయటమే పరిష్కారం. పేరుదేముంది దానికి ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చు.