డాక్టర్ కొల్లా రాజమోహన్,
అధిక ధిగుబడులు వస్తాయనీ, గులాబీరంగు పురుగు బెడద తప్పుతుందనీ 2002 సం. లో బీ టీ పత్తిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రైతులకు తాత్కాలికంగా ఉపయోగపడింది. మోన్సాంటో లాంటి కంపెనీలకు లాభాల పంటపండింది. కాలం గడిచేకొద్దీ, బీటీ పత్తి వలన రైతులకు ప్రయోజనం లేకపోగా పురుగు బెడద విషమించింది. ప్రురుగు మందుల ఖర్చు ఎక్కువయింది. 2002 సం.లో హెక్టారుకు 100 కేజీల పురుగుమందుల వాడకం 2013సం.కి 220 కేజీలకు పెరిగింది. అయినా పురుగులు కంట్రోలుకాక పంట సగటు దిగుబడి హెక్టారుకు 554 కిలోలనుండి 445 కిలోలకు తగ్గిపోయి, పత్తికి ధర లేక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
బీటీ పత్తి విత్తనాలలో లాభాలను రుచిమరిగిన మోన్సాంటో, బేయర్స్ లాంటికంపెనీలు మానవులందరూ తినే కూరగాయలు, ఆహారధాన్యాలలో బీటీ ప్రవేశపెట్టి అధిక లాభాలనార్జించాలని కంపెనీలు విరామమెరుగని కృషి సాగిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి బీటీ వంకాయ, బీటీ బెండ పై గుంటూరు జిల్లా నారాకోడూరు లో 2005 సం.లో ప్రయోగాలను చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజాసంఘలు, మీడియా చేసిన ఆందోళన ఫలించి ఆ ప్రయోగాలను ప్రభుత్వం ఆపక తప్పలేదు. బీటీ వంకాయ పై మారటోరియం విధించారు.
మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహార పంట – ధారామస్టర్డ్ హైబ్రిడ్-11
ఇపుడు జన్యుమార్పిడి ఆవాలను (GM MUSTARD) ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ( MOEFC) క్రింద పనిచేసే జనిటెక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (GEAC) జన్యుపరంగా మార్పు చేసిన బీ టీ ఆవాలకు 2022 అక్టోబర్ 25న అనుమతించింది. భారతదేశ శాస్త్రవేత్త దీపక్ పెంటేల్, ప్రభుత్వ నిధుల సహాయంతో ” ధారా మస్టర్డ్ హైబ్రిడ్-DMH-11”విత్తనాలను అభివృధిచేశారు. ఆవ మొక్క ఒక్క పువ్వు లోనే మగ స్టేమెన్-ఆడ పిస్టిల్ వుండటంవలన ప్రకృతిలో స్వతహాగా సహజసిధంగా సంపర్కం తేలికగాజరుగుతున్నది. కొత్తజన్యువులను పువ్వులో చొప్పించటానికి బార్-బార్నేస్-బార్ స్టార్ టెక్నాలజీని ఉపయోగించారు. బార్నేస్ పధతివలన మొగ స్టేమెన్ ను నిర్వీర్యం చేసి, బార్ స్టార్ పధతివలన భూమిలో నుండి సేకరించిన బాక్టీరియా బేసిల్లస్ ఆక్వాఫిసియన్స్ జన్యువు ను చొప్పించి ఆడ పిస్టిల్ నుఉత్తేజపరచి, సాంప్రదాయ ఆవాల మొక్కఅయిన వరుణ జన్యువు తో సంకరం చేశారు. హెర్బిసైడ్ రెసిస్టెంట్ కలుపు మందును తట్టుకునేటట్లుగా బార్ జన్యువు ను ప్రవేశపోట్టారు. జన్యుమార్పిడి విత్తనాలే కాకుండా స్ధానిక “వరుణ “తో సంకరం వలన అధిక దిగుబడులు లభిస్తాయంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ గా జన్యు మార్పిడి చేసినందువలన పొలంలో కలుపు తీసే పని లేదంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపు మందు ను తట్టుకునే విధంగా జన్యువులను మార్చటం. కలుపు మందు కొట్తే ఈ జన్యుమార్పిడి ఆవాల పంట మాత్రమే బతుకుతుంది. కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి.
ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగుచేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు. రాజస్ధాన్, పంజాబ్,హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 100 చోట్ల ప్రయోగాలను ఐ.సీ.ఏ. ఆర్ నిర్వహిచాలన్నారు. జీ ఎమ్ ఆవాల అనుమతి, దేశంలోతీవ్రమైన చర్చనీయాంశమయింది. జన్యుపరంగా మార్పుచెందిన ఆవాల పంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంట లో వచ్చిన తేనె ను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్ హెర్భిసైడ్ కలుపుమందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున మా బతుకు బజారున పడుతుందని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. . ఇది మనకు రూ. 75,000 కోట్లు ( రూ. 750 బిలియన్లు ) ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది
GM ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజ పంట ఆవాలు.
సుప్రీమ్ కోర్టు స్టే
అరుణా రోడ్రిగ్జ్ , కవితా కురుగంటి లాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేటందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ ( 2013 ) మరియు జన్యుమార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల ఏకగ్రీవ నివేదికలు జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి.
భారతదేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపుమందులను చేలో చల్లితే తట్టుకునే పంటలు పనికిరావని కమిటీ చెప్పిందన్నారు. హెర్బిసైడ్లు అంటే కలుపు నివారణ మందులు కాన్సర్ కు కారణమవుతాయని కూడా కమిటీ అభిప్రాయపడింది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవ వైవిధ్యం పై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్ అంటే కలుపు మందులు వాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీసిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్ధిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంతభూషణ్ నివేదించారు.
ప్రజారోగ్యం పై పర్యావరణంపై రహస్యనివేదికలకు బదులుగా స్వతంత్ర నిపుణుల సంస్ధలచే , నిర్వహించబడే పబ్లిక్ డొమైన్ లో సమగ్రమైన, పారదర్శకమైన, నిజాయితీతో వాస్తవ అంశాలతోకూడిన బయోసేఫ్టీ రిపోర్టును జీ ఈ ఏ సీ బహిరంగపరచాలన్నారు.
జన్యుమార్పిడి ఆవాల విత్తనాలపై యధాస్ధితినినకొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.
ఆహారం లో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టే ముందు అందరికీ తెలిసేటట్లుగా క్షేత్ర ప్రయోగాలు భారీ ఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. రహస్యనివేదికలే తప్పబహిరంగ రిపోర్టులు లేవు. కనీసం ఇంటర్నెట్ లో కూడా పెట్టలేదు. తేనెటీగలు, తేనె పై బతికే వారి సమస్యలేకాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవ నూనె వాడినందువలన మనుష్యులపై, తాగే నీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై ప్రభావం ఏమిటో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలుజరగాలి. సైంటిఫిక్ గా పరిశోధనలతో నిర్ణయించవలసిన ఆహార భధ్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్ర రాజ్యాల వత్తిడికి లొంగి నిర్ణయం చేయటం మన దేశ స్వతంత్ర్యాన్నిఅమ్ముకోవటమే.
కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్ విత్తనాలను అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహలాడుతున్నాయి. కలుపు నివారణ మందులవలన భూమి విషతుల్యమౌతుందనే వాస్తవాన్ని ప్రభుత్వంకాదనలేకపోతున్నది. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారం చేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే జన్యుమార్పిడి పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది. భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపు మందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోప్రక్క హెర్భిసైడ్ టాలరెంట్ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతిని ఇచ్చి హెర్బిసైడ్ కలుపు నివారణ మందులను యధేఛగా వాడుకోమంటున్నారు. బీ.జే.పీ. ఎన్నికల ప్రణాళికలలో ఆహారం లో జన్యుమార్పిడి పంటలను , హెర్బిసైడ్ కలుపునివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేఛనిచ్చి ప్రజలను మోసంచేస్తున్నారు. జన్యుమార్పిడి పంటలతోపాటుగా , హెర్బిసైడ్స్ వాడకం వలన భూమి నాశనమవటం వలన ఏ మందులకూ లొంగని “సూపర్ వీడ్స్”, “సూపర్ వీడ్స్” అభివృధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువ పురుగు మందుల వాడే అవసరం పెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమయి ప్రకృతి విఛిన్నమై కాన్సర్ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతున్నది.
జన్యమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్య ప్రచారం చెప్తోంది. 1980 సం.లో ఆయిల్ మిషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో వంటనూనెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ హైబ్రిడ్ విత్తనాలతోనే హెక్టారుకు 3012 కేజీల దిగుబడిని రైతులు సాధించారు. DMH-11 జన్యుమార్పిడి విత్తనాలతో 30 శాతం అధిక దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తున్నది. రుజువులను చూపించలేకపోతున్నది.. DDB-DMH -1. సాంప్రదాయ విత్తనంతో 2924 KG ల దిగుబడిని, DDB-DMH-4. సాంప్రదాయ విత్తనంతో 3012 KG, ల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్ టాలరెంటు విత్తనం GM MUSTARD వలన 2626 KG ల దిగుబడి మాత్రమే వచ్చింది. అదేమంటే మీరు సైన్సుకు వ్యతిరేకం అని దబాయిస్తున్నారు.
ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవ నూనెను ఉత్తర భారత దేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మన దేశంలో వంటనూనెల ఉత్రత్తిలో 40 శాతం ఆవనూనెదే. ఆవపంట 80 లక్షల ఎకరాలలో60 లక్షలమంది రైతులు సాగు చేస్తున్నారు. 1993-1994లోనే, ఆవనూనెలో స్వయం సమృద్ధిని సాధించారు. దేశీయ ఉత్పత్తి అన్ని అంతర్గత అవసరాలను తీర్చింది.ఆవనూనె దిగుమతి అవసరం లేదు. దక్షిణ భారత దేశంలో ఆవనూనె వాడకం చాలా తక్కువ. ఊరకనే ఇచ్చినా వాడరు. తక్కువ ఉత్పత్తి వుండి, ఎక్కువమంది ప్రజలు వాడే పామాయిల్, వేరుశనగనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనెలకు ప్రోత్సాహం కరువయింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నపుడు రైతులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తున్నారు.
విదేశాల నుండి దిగుమతి చేస్తున్న పామాయిల్, సన్ ఫ్లవర్ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూరు, ఇండోనేషియా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటేలేదు. ప్రకృతి వైపరీత్యాల లో రైతుకు దిక్కే లేదు. 2022 సం.కు రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని మరిచారు.
బీ టీ కాటన్ వలన కలిగిన దుష్పరిణామాలన్నిటికీ మోన్సాంటో లాంటి బహుళజాతుల సమస్ధలే కారణం అని ఫ్రజలు గుర్తిస్తున్నందున కార్పోరేట్ సంస్ధలు కొత్తముసుగులో ప్రవేశిస్తున్నాయి. బార్, బార్నేజ్, టెక్నాలజీని ఢిల్లీ యూనివర్సిటీ అధ్యయన బృందం మన దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగం లో కొత్తగా కనుగొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బార్, బార్నేజ్, టెక్నాలజీపై బేయర్స్ కంపెనీకి పేటెంట్ వున్నది. 2001 సం లో బార్నేజ్ ,బార్ స్టార్ టెక్నాలజీని బేయర్సకంపెనీ వాడింది.
యూరప్ లో జన్యుమార్పిడి ఆహారాలను తినరు. పంటలకు అనుమతిలేదు. యూరప్ దేశాలు జీ ఎమ్ పంటలను గట్టిగా వ్యతిరేకించాయి. యూరప్ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలున్నయ్యేమో అని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జీ యమ్ లేబుల్స్ అతికించమని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అమెరికా లో శక్తివంతమైన విత్తన సంస్ధల వత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మన దేశంలోజన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని అనుమతించబోమని ఎన్నికల ప్రణాళిక లో స్పష్టంగా చెప్పిన బీజేపీ , ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. ఎమ్ ఎన్ సీ ల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. ఆర్.యస్.యస్ అనుబంధ సంస్ధయిన స్వదేశీ జాగరణమంచ్ జన్యుమార్పిడి ఆవాలను వ్యతిరేకించింది. అయినా విత్తన కార్పోరేట్ కంపెనీలు తమ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క శక్తిని చూపించి ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు అనుమతులను పొందాయి.
దుష్ట పరిణామాలకు భాధ్యత ఎవరిది
అమెరికా లో “లైబిలిటీ లా” వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడ్తారు. మనదేశంలో, మీకేమీ కాదన్నప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జీ ఈ ఏ సీ సభ్యులు, ప్రభుత్వం – ఎవరిదీ బాధ్యత? 2015 సం. లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫోసేట్ను “మానవ క్యాన్సర్ కు ముఖ్య కారణం” గా వర్గీకరించింది. నాన్ హాడ్కిన్స్ లింఫోమాతో సహా 10 రకాల క్యాన్సర్లకుకారకమైన గ్లైఫోసేట్ ఆధారిత హెర్బిసైడ్ వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించనందుకు మోన్ శాంటో / బేయర్ కంపెనీపై లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జీన్ క్యాంపెయిన్‌క జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ సహాయ్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి వాణిజ్య బిటి పత్తి పంటకు సంబంధించిన భద్రతా డేటా ఏదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడలేదన్నారు. అక్టోబర్ 25, 2022న పర్యావరణ విడుదలకు ఆమోదం లభించిన GM మస్టర్డ్‌కు కూడా అదే విధానాన్ని అవలంబించి విత్తనాల విడుదల తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహించబడతాయా?
మన దేశంలో GM ఆవాలు పండించడానికి అన్నిఅడ్డంకులు తొలగినతరువాత ఇతర GM పంటలకు కూడా వరద గేట్లను తెరుస్తారు. బీటీ వంకాయ,బీటీ బెండ, గోల్డెన్ రైస్, వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప-అన్నిటిలో కాస్తోకూస్తో జన్యుమార్పు చేసి వ్యవసాయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కార్పోరేట్ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించలేని ప్రభుత్వాలన్నీలొంగిపోయి మాన్సాంటో, బేయర్స్ లాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. జీ యమ్ ఆవాలు ప్రవేశపెట్టటానికి బలమైన అమెరికా ఒత్తిడి వున్నదని జర్నలిస్టు రష్మీ సెహగల్ అంటున్నారు.
మన దేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం. 66శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడిజీవిస్తున్నారు.53 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది.దేశ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం క్రమేపీ 15 శాతానికి తగ్గింది. జన్యుమార్పిడి పంటలు మన నేలను, నీటిని కలుషితం చేస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రక్రియ కోలుకోలేనిది. వివిధ వాతావరణ పరిస్ధితులున్నభారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తివంతమయినది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు.జీవ వైవిధ్యం మన గొప్ప బలాలలో ఒకటి. అది నాశనం చేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూక్షేత్రాలలో మోనోక్రాప్ తో కోర్పోరేట్ స్ధాయి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.
వ్సవసాయం లో వున్న వారిలో సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికే 86 శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. GM టెక్నాలజీ పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలోఖరీదైన GM విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులనుకొనలేరు. పెంచనున్నవిధ్యుత్ ఛార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీల ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారికి ఏమవుతుంది? ఢిల్లీ సరిహద్దుల లో సంవత్సరంపైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్పూర్తితో మరింత శక్తివంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం.