Tags
ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit
ఎం కోటేశ్వరరావు
రోహిత్ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?
మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.
భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్ ఛాన్సలర్ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్ షైకత్ ఘోష్ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.
ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్ స్షెషల్ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.
చివరగా ఒక్క మాట ! ‘రోహిత్ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్ మాటలివి.
అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !
రోహిత్ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్ ఛాన్సలర్, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !
నిజమే వైస్ ఛాన్సలర్ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!