Tags
Adani Group, anti china, BJP, China, Donald trump, Explosive BBC documentary, Hindenburg Controversy, HINDENBURG RESEARCH, Joe Biden, Narendra Modi Failures, Propaganda War, RSS, SJM
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏం జరుగుతోంది ? అనేక మందిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పక్కా నిజాలే చెబుతారు, సత్యహరిశ్చంద్రుడి తరువాత కారణజన్ములు వీరే అన్నట్లు నమ్ముతున్న కొన్ని సంస్థలకు చెందిన వారు పచ్చి అబద్దాలను అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నారు ? వారికా తెగింపు ఎలా వచ్చింది ? అన్నింటికీ మించి మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారు అన్నది బ్రహ్మపదార్ధంగా ఉంది. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ గురించి, అతని కంపెనీల మీద వచ్చిన ఆరోపణలను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గతంలో కాంగ్రెస్ ఏలుబడిలో జరిగిన కుంభకోణాల పునశ్చరణతో దేశాన్ని ముందుకు నడిపించగలరా ? అదానీ కంపెనీలపై వచ్చిన విమర్శలతో ప్రపంచంలో మన మీద విశ్వసనీయత సడలిందని ప్రధాని గుర్తించలేదా ? లేక నటిస్తున్నారా ? అదానీ కంపెనీలపై విచారణ జరిపి అక్రమాలేం లేవు అని తేలిస్తే మన ప్రతిష్ట ఇంకా పెరగేది కదా ! ప్రతిపక్షాలు కోరిన విచారణ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు. అంటే అదానీ కంపెనీలకు మద్దతు ఇచ్చినట్లేనా ! ఆ ముక్కే సూటిగా ఎందుకు చెప్పలేదు. పాత కుంభకోణాలను ముందుకు తెచ్చి అదానీ కంపెనీల అక్రమాలను మూసిపెట్టాలని చూస్తే కుదురుతుందా ? ఇలా ఎన్నో కొత్త ప్రశ్నలు. ప్రతిపక్షాల కంటే తనను తానే ఇరుకున పెట్టుకుంటున్నారా అని నిజంగా మోడీని నమ్మినవారు కూడా ఆలోచిస్తున్న స్థితి ? మక్కువ పడ్డ మగువ కోసం రాజ్యాలనే పోగొట్టుకున్న రాజుల కథలు విన్నాం. ఒక కంపెనీకోసం నరేంద్రమోడీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు?
అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది అమెరికాలోని హిండెన్‌బర్గ్ సంస్థ.ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యకు పాల్పడితే తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన నరేంద్రమోడీ పుతిన్‌తోనూ జో బైడెన్‌తోనూ మాట్లాడి సర్దుబాటు చేసేందుకు చూశారు. అమెరికా నరేంద్రమోడీకి జిగినీ దోస్తు. తన కంపెనీల మీద హిండెన్‌బర్గ్ వదలిన క్షిపణి మన దేశం మీద జరిగిన దాడిగా అదానీ వర్ణించారు. ఉక్రెయిను మీద చూపిన శ్రద్దలో వందో వంతైనా లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మన మదుపర్ల మీద ఎందుకు లేదు అన్నది మోడీ అభిమానులకు సైతం అంతుచిక్కని ప్రశ్న. అమెరికానే మన కాళ్ల దగ్గరకు తెస్తున్న మోడీ అన్న వందిమాగధుల గురించి తెలిసిందే. మిత్రోం లేదా ఏ మోయి జో బైడెనూ మీకు నేను కావాలా వద్దా కావాలనుకుంటే హిండెన్‌బర్గ్ మా మీద చేసిన దాడి గురించి చప్పుడు(మాట్లాడవు) చెయ్యవేమిటి అని ఫోన్ చేసి అడుగుతారేమో అని ఎదురు చూసిన వారికి ఇప్పటి వరకు నిరాశేమిగిలింది.మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్నట్లుగా జనం భావించక ముందే మోడీ స్పందిస్తారా ? ఇది సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి ప్రశ్నగా మారుతుందా ?
హిండెన్‌బర్గ్‌కు ముందు దేశంలోని ఏ సంస్థ లేదా పార్టీ కూడా అదానీ కంపెనీల మీద అలాంటి అంశాలను ముందుకు తేలేదు. ఆరోపణలు చేయలేదు. అది 129 పేజీలలో చెప్పిన అంశాల మీద అదానీ 413 పేజీల వివరణ ఇచ్చారు. ఆ ఒక్కటి మినహా అన్నట్లుగా కీలకమైన అంశాలను వదలి ఇతర గాలిపోగేశారని చెబుతున్నారు. అందుకే దీని మీద నిగ్గుదేల్చాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీసినా మహామౌనమునిగా పేరుతెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అవి నిజమనో కాదనో, అదానీ పరమపునీతుడనో ఏదో ఒకటి చెప్పమంటే మిన్నువిరిగి మీద పడినా నోరు విప్ప అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంటు సమయం, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అవుతున్నా, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనా ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీకి పట్టలేదు.
గుజరాత్‌కు చెందిన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్ కుంభకోణం గురించి దర్యాప్తు జరిపేందుకు 2001లో నాటి వాజ్‌పాయి సర్కార్ జాయింట్ పార్లమెంటరీ కమిటి(జెపిసి)ని వేసింది. గుజరాత్‌లోని సహకార బాంకులను ముంచినందున అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సారధి నరేంద్రమోడీకి దెబ్బతగులుతుందని భావించిన కారణంగా అనివార్యమై ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. ఆ కుంభకోణం వందల కోట్లలోనే ఉంది. కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కుమ్మక్కై కేతన్ పరేఖ్ ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణమది. జి టెలిఫిలిమ్ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్ సాప్ట్ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. ఇప్పుడు అదానీ కంపెనీల వాటా ధరలను కూడా అదే విధంగా లేని విలువను పెంచారన్నదే ప్రధాన ఆరోపణ. నాటి జెపిసి విచారణ జరిపి కుంభకోణం వాస్తవమని తేల్చింది. ఇప్పుడు కూడా అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద అలాంటి కమిటీని వేసేందుకు మోడీ ఎందుకు అంగీకరించటం లేదన్నది ప్రశ్న. నిజం కాదనైనా తేల్చి అదానీ మీద పడిన మచ్చను తొలగించవచ్చు కదా ! వాజ్‌పాయిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు ? దారినపోయే దానయ్య ఒకడు ఏదో అన్నాడని రాముడు సీత పవిత్రతను లోకానికి నిరూపించేందుకు అగ్నిప్రవేశం చేయించిన ఆదర్శవంతుడంటూ గొప్పగా చెప్పే బిజెపి పెద్దలు అదానీ గురించి విచారణకు ఎందుకు జంకుతున్నారు ? రాముడి ఆదర్శం ఓట్లు దండ్లుకొనేందుకు చెప్పుకోవటం తప్ప దాని స్ఫూర్తిని అనుసరించరా ? అదానీ అగ్నిప్రవేశం గురించి ఎవరూ అడగటం లేదుగా !
మరోవైపున నరేంద్రమోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ పరివార్ కాషాయ దళాలు అదానీని సమర్ధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం కట్టుకథలు, పిట్టకతలు చెబుతున్నాయి. జనానికి నిర్ధారించే ఆలోచన, అవకాశాలు ఉండవని కాబోలు పచ్చి అవాస్తవాలను వండి వారుస్తున్నాయి. మన దేశ చరిత్రలో ఒక పారిశ్రామిక, వ్యాపార సంస్థ మీద వచ్చిన తీవ్ర ఆరోపణలు విచారించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటం, సాంస్కృతిక సంస్థ ముసుగువేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ సమర్ధనకు దిగటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. డాక్టర్ సునీల్ గుప్తా అనే పెద్దమనిషి 2023 ఫిబ్రవరి ఆరవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ” ఆర్గనైజర్ ” లో హిండెన్‌బర్గ్ వివాదం అంటూ ఒక విశ్లేషణ రాసి అదానీకి కితాబునిచ్చారు. అది భారత్ మీద జరిపిన కుట్రగా వర్ణించారు. బిబిసి విదేశీ, అది చెప్పినదానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, దాని విశ్వసనీయత ఏమిటి? హిండెన్‌బర్గ్ ఒక విదేశీ సంస్థ దాని నిజాయితీ ఏమిటీ అంటూ అనేక మంది ఒక తర్కాన్ని ముందుకు తీసుకువచ్చారు. వారంతా సంఘపరివార్‌కు చెందిన వారు లేదా దాని మాటలను గుడ్డిగా విశ్వసించే వారు అన్నది తెలిసిందే. నిజమే, ఏ సంస్థనూ ఎవరూ ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం స్వచ్చతను కొలిచేందుకు కారట్ల ప్రమాణాలు ఉన్నాయి. ఏ సంస్థకూ దాని స్వచ్చతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలేమీ లేవు. కానీ ఆర్గనైజర్ విశ్లేషకులు దవోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక మీద భారత ఆర్థిక రంగం మహా గొప్పగా ఉందని బాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ పొగిడారని, అదే సమావేశంలో ఉన్న నోకియా సిఇఓ, ఎరిక్స్‌న్ అధిపతి తదితర అగ్రశ్రేణి ప్రపంచ సిఇఓలు నిజమే అన్నారన, సిఎన్‌బిసితో అనేక ప్రముఖ మీడియా సంస్థలు దేశ ఆర్థిక పురోగతి, వచ్చే రోజుల్లో సాధించనున్న విజయాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మరి ఈ సంస్థలు, సిఇఓలకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ? రిలయన్స్, టాటాల వంటి సంస్థలతో పాటు అదానీ కంపెనీలు దేశ వృద్దిలో భాగస్వాములౌతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న 2014లో ఎనిమిది బిలియన్ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎలా ఎదిగారు, వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నటాటా వంటి వారికి సాధ్యం కానిది అదానీకి ఎలా వచ్చింది, ఎందుకు రాలేదు అన్నది చెప్పాలి.
హిండెన్‌బర్గ్ అదానీ కంపెనీ మీద విడుదల చేసిన నివేదికను దేశం మీద దాడిగా చిత్రించటం అంటే గతంలో ఇందిరే ఇండియా- ఇండియా అంటే ఇందిర అన్న కాంగ్రెస్ నేత డికె బారువా భజనను గుర్తుకు తెస్తున్నది. అదానీయే ఇండియా-ఇండియా అంటే అదానీ అనటమే. ఇదే హిండెన్‌బర్గ్ గతంలో అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్ అనే సంస్థ గురించి కూడా పరిశోధన నివేదికను వెలువరించటంతో ఆ కంపెనీ వాటాల ధర కుప్పకూలింది. అంటే అది అమెరికా మీద దాడి, మాతృ దేశానికి ద్రోహం చేసినట్లా ? దాని వెనుక ఎవరున్నారు ? తీరా తరువాత తేలిందేమిటి నికోలా కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణైంది. అందువలన నడమంత్రపు సిరి వచ్చిన ఏ కంపెనీని ఎవరూ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ విలువలు-వలువల గురించి చెప్పే ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఎందుకు కొమ్ముకాస్తున్నట్లు ? గుజరాత్ మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన బిబిసి చెప్పిందాన్ని నమ్మాల్సిన అవసరం లేదని వాదిస్తున్నవారు అదే బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్టు పత్రిక రాసిందాన్ని నమ్మి తన విశ్లేషణలో దాన్ని ఉటంకించి అదానీ తప్పు చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఎలా సమర్ధించుకుంటుంది ? తమకు అనుకూలంగా ఉంటే విదేశీ కితాబు ఫర్వాలేదా ? విమర్శిస్తే దేశం మీద దాడా ?ఎకానమిస్టు చెప్పిందాన్ని వారు నమ్మే వేద ప్రమాణంగా తీసుకుంటారా ? నిజాన్ని నిగ్గుతేల్చమన్న డిమాండ్‌ను అంగీకరించటానికి నోరెందుకు రాదు.ఆత్మవంచన, పర వంచన, రెండునాలికలతో మాట్లాడటం తప్ప మరొకటికాదు.
ఎవడు కొడితే మైండు బ్లాకై దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు అన్నట్లు హిండెన్‌బర్గ్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన వారు ఎవరేేం మాట్లాడుతున్నారో పొంతన లేదు.ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ గౌతమ్ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఆర్గనైజర్ పత్రికలో 2023 ఫిబ్రవరి 4వ తేదీన వెబ్‌డెస్క్ పేరుతో సరికొత్త కథనాన్ని వండి వడ్డించారు.దానిలోని అంశాలను కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విజయ గజేరా, ద హాకీఎక్స్ అనే వారి ట్వీట్ల ఆధారంగా యధార్ధ సిక్కా దాన్ని పేర్చినట్లు పేర్కొన్నారు.అసలు వారెవరు ? వారి ట్వీట్లకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ?
ఆర్గనైజర్ కథనం సారాంశం ఇలా ఉంది. ” బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మరియు బ్యాంక్ ఆఫ్ థారులాండ్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన కుట్రను పోలి ఉంది. వాస్తవంగా అదానీ కంపెనీలపై దాడి జనవరి 25న హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత ప్రారంభం కాలేదు. ఒక ఆస్ట్రేలియన్ ఎన్‌జివో నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్ 2016-17లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాల్సిన ఎన్‌జిఓ అదాని వాచ్ డాట్ ఓఆర్‌జి పేరుతో అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకం అని చెప్పినప్పటికీ దానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదానీకి సంబంధం లేని అంశాలను కూడా ప్రచురిస్తోంది. రవీష్ కుమార్ ఎన్‌డిటివీని వదిలితే దానికేమిటి పని ? ఒక పర్యావరణ ఎన్‌జిఓకు బిబిసి డాక్యుమెంటరీ మీద ట్వీట్‌ను సమర్ధించాల్సిన అవసరం ఏమిటి ? ఎన్‌ఎఫ్‌ఐ అనే భారత్ ఎన్‌జివో జార్జిసోరస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, బిల్‌గేట్స్, అజీమ్ ప్రేమ్‌జీల నుంచి నిధులు పొందుతున్నది. అజీమ్ ప్రేమ్ జీ ఏర్పాటు చేసిన ఎన్‌జిఓ ఐపిఎస్‌ఎంఎఫ్ ఆల్ట్ న్యూస్, ద వైర్, ద కారవాన్, ది న్యూస్ మినిట్ తదితర సంస్థలకు నిధులు ఇస్తున్నది. సిపిఐ(ఎం) నేత సీతారామ్ ఏచూరి భార్య సీమా చిస్తీ ఎన్‌ఎఫ్‌ఐకి మీడియా ఫెలోషిప్ సలహాదారు. ఆమె ద వైర్ ఎడిటర్. వైర్‌కు సోరోస్, ఫోర్డ్, బిల్‌గేట్స్, అజీమ్ ప్రేమ్‌జీ, రాక్‌ఫెల్లర్, ఓమిడియార్‌తో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. 2017లో అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి వైర్ ఐదు కథనాలను రాసింది.
డిజిపబ్ పేరుతో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లతో ఒక గ్రూపును ధన్యా రాజేంద్రన్ ఏర్పాటు చేశారు. దీనికి న్యూస్‌క్లిక్ ప్రబీర్ పురకాయస్థ ఉపాధ్యక్షుడు.దీనిలోని సైట్లన్నింటికీ ఐపిఎస్‌ఎంఎఫ్ నిధులు ఇస్తుంది.ఈ సైట్లతో ప్రమేయం ఉన్న వారందరి ఖాతాలను చూస్తే సమన్వయంతో అదాని మీద దాడిచేసిన ట్వీట్లను చూడవచ్చు. విదేశీ ఎన్‌జివోలు, దేశంలోని వారి భాగస్వాముల నుంచి నిధులు, శిక్షిణను పొందిన వీరంతా దేశంలోని జాతీయ వాదులు లేదా సంస్థల మీద దాడి చేస్తారు. అదానీ, అంబానీల మీదనే వీరు దాడి చేస్తారు. టాటా, ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, వాద్రా లేదా ఇతరుల మీద ఎందుకు చేయరు ? ” ఆర్గనైజర్ కథనం ఇలా సాగింది.
ఆర్గనైజర్ బాధ అదానీ కంపెనీలను విమర్శించినందుకైతే అంతవరకు పరిమితం కావాలి. కానీ ఇతరుల మీద దాడి ఎందుకు చేయరు అని ప్రశ్నించటం ఏమిటి ? ఒక సాంస్కృతిక సంస్థ అని ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుకుంటుంది. అది నడిపే పత్రికకు ఇతర అంశాలెందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హిండెన్‌బర్గ్ నివేదిక మీద 413పేజీల వివరణ ఇచ్చిన అదానీ తన మీద దేశంలోని కొన్ని వెబ్‌సైట్‌లు నిజంగా దాడి చేస్తుంటే ఇంతవరకు ఒక్క నివేదికా విడుదల చేయలేదేం ? కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు అదానీకి లేని దురద ఆర్‌ఎస్‌ఎస్ ఆర్గనైజర్‌కు ఎందుకు ? అతని కంపెనీలనుంచి ఎంత ముట్టిందేమిటి ? దాని రాతలో పేర్కొన్న సంస్థలు అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు.అమెరికాలోని అనేక సంస్థలు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటపుడు వాటి గురించి నరేంద్రమోడీ గతంలో బరాక్ ఒబామా, ట్రంప్‌కు, ఇప్పుడు జో బైడెన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? జాతీయవాదుల మీద ఆ సంస్థల నిధులతో కొందరు దాడి చేస్తుంటే అసలు సిసలు జాతీయవాదినని చెప్పుకొనే నరేంద్రమోడీ మన దేశంలో వాటి కార్యకలాపాలను ఎందుకు అదుపు చేయరు ? ఈ అంశాలన్నింటినీ ఆర్గనైజర్ ఎందుకు ప్రశ్నించదు ?
సుమీత్ మెహతా, వినయకుమార్ సింగ్ ద్వయం 2023 ఫిబ్రవరి 25న ఆర్గనైజర్‌లో ఒక విశ్లేషణ రాసింది. అదానీ నివేదిక, బిబిసి డాక్యుమెంటరీ కూడా చైనా కుట్రే అన్నది సారం. తమిళనాడులోని స్టెరిలైట్ రాగి కర్మాగారం మూసివేత వెనుక, ఢిల్లీ శివార్లలో రైతులు ఉద్యమించిన సందర్భంగా జరిగిన రిలయన్స్ జియో టవర్ల ధ్వంసం వెనుకా ఉన్నది కూడా చైనా అని ఎందుకంటే దాని 5జి టెలికాం పరికరాలను నిషేధించి రిలయన్స్‌కు ప్రాధాన్యమివ్వటమే చైనా కోపానికి కారణమని సూత్రీకరించారు. భారత కంపెనీల మీద అనుమానాలు రేకెత్తించటం తద్వారా ఆర్థికరంగాన్ని దెబ్బతీయటం,భారత కంపెనీలు నిధులు సేకరించకుండా అడ్డుకోవటం దాగి ఉందన్నారు. స్టెరిలైట్ కాపర్ కంపెనీ వివాదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మూసివేత కోరిన సంస్థల వెనుక చైనా ఉన్నదని, తన వద్ద ఉన్న రాగి నిల్వలను అమ్ముకొనేందుకే ఆపని చేసిందని ఆరోపించారు. అసలు విషయ ఏమంటే ఆ కర్మాగార మూసివేతకు ముందు 2017లో మన దేశం నుంచి చైనా 210 కోట్ల డాలర్ల విలువ గల రాగిని దిగుమతి చేసుకుంది.(ఐబిఇఎఫ్, 2021 సెప్టెంబరు 20).2021లో చైనా పది దేశాల నుంచి రాగి, రాగి ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా గరిష్టంగా చిలీ నుంచి 19.4శాతం(7.3 బి.డాలర్లు) కాగా తొమ్మిదవ స్థానంలో ఉన్న మన దేశం నుంచి 3.28శాతం(1.18 బి.డాలర్లు) ఉంది. అదే విధంగా చైనా దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నది. వాటిలో కొరియాకు 31శాతం ఉంది. చైనా దిగుమతుల విలువ 2,738 కోట్ల డాలర్లు కాగా ఎగుమతుల విలువ 24.23 కోట్ల డాలర్లు మాత్రమే.(ట్రెండ్ ఎకానమీ డాట్‌కామ్ ప్రచురణ తేదీ 2022నవంబరు 14) అందువలన చైనా దగ్గర ఉన్న రాగిని అమ్ముకొనేందుకు స్టెరిలైట్ మీద కుట్ర చేసిందనటం పచ్చి అవాస్తం. ఇది ఒక్కటి చాలు ఆర్గనైజర్ అబద్దాలకు, వక్రీకరణలకు ఇది పక్కానిదర్శనం.
భారత కంపెనీలు చైనా సంస్థలకు పోటీ ఇస్తున్నందున చైనా హిండెన్‌బర్గ్, బిబిసి వంటి వాటి వెనుక ఉండి దాడులు చేయిస్తున్నదని చెబుతున్నారు. ఏ రంగంలో మన దేశం చైనాతో పోటీ పడుతున్నదో చెప్పగలరా ?ఇజ్రాయల్ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవు కోసం ప్రయత్నించినా చైనాకు దక్కుతుందా ? అసలు చైనా అలాంటి ప్రయత్నం చేసినట్లు దానికి అదానీ అడ్డుపడినట్లు ఏ ఆధారంతో చెబుతున్నారు. హైఫా రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని ఇజ్రాయల్, అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే కుదురుతుందా ?
అలాంటి చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటూ రికార్డులను బద్దలు కొడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ను ఇంతవరకు ఆర్గనైజర్ ఎన్నడైనా ప్రశ్నించిందా ? మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నట్లు ? నిజంగా చైనా కుట్రలు పన్నుతుంటే మన ప్రభుత్వం వాటిని నిజమని నమ్మితే మన ప్రభుత్వం చైనాకు నిరసన తెలుపుతూ కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు, పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించటం లేదు ? గాల్వన్ ఉదంతం తరువాత ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత దేశభక్తి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రతిదాన్నీ చైనా మీదకు నెట్టివేస్తే జనం గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్నట్లున్నారు. తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వక్రీకరణలు, తప్పుడు రాతలతో కొందరిని కొంత కాలం మోసపుచ్చగలరు తప్ప అందరినీ ఎల్లకాలం మభ్య పెట్టలేరు.