Tags
China-Central Asia Summit 2023, G7 summit, Hiroshima, Joe Biden, Narendra Modi, The Group of Seven (G7) 2023, Xi Jinping warns US-Taiwan separatists
ఎం కోటేశ్వరరావు
ఏ పదజాలం వెనుక ఏమి దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్ మాటలు పరమ సత్యాలు. అలాగే ఏ సమావేశం ఎందుకు జరిగిందో అని కూడా మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే సారి ఆసియాలో రెండు ముఖ్య సమావేశాలు జరిగాయి. ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ శాంతి, అభివృద్ధికి ముప్పు తెస్తున్న అమెరికా నేతృత్వంలోని జి 7 సమావేశం 19-21 తేదీలలో జపాన్‌లోని హీరోషిమాలో జరిగింది. రెండవది చైనాలోని షియాన్ నగరంలో మే 18-19 తేదీలలో మధ్య ఆసియా దేశాల సదస్సు. మొదటిది రాజకీయాల చుట్టూ నడిస్తే రెండవది అభివృద్ధి కేంద్రంగా జరిగింది. చైనాతో విడగొట్టుకోకుండానే నష్టాలను పరిమితం చేసుకోవాలని ఈనెల జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశం పిలుపునిచ్చింది. తన పాటకు అనుగుణంగా నృత్యం చేయించాలని ఈ బృందంతో సహా ప్రపంచదేశాలన్నింటి మీద అమెరికా వత్తిడి తెస్తున్నప్పటికీ దానికి కొన్ని దేశాలు సిద్దంగా లేవన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా ఉన్న సందేశం. అయితే పదజాలం దానికి చెప్పే భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమావేశం జరిగిన తీరు, ఆమోదించిన ప్రకటన చూస్తే చైనా చుట్టూ తిప్పి దాన్ని ఎలా దెబ్బతీయాలన్న దాని మీదే కేంద్రీకరించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి.
అమెరికా కోరుతున్నట్లుగా చైనాతో విడగొట్టుకొనేందుకు జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలు సిద్దంగా లేవు. ఈ కారణంగానే ఆర్థిక అంశాల్లో బస్తీమే సవాల్ అంటూ చైనా మీద తొడగొట్టకుండా అటు అమెరికాను, ఇటు ఇతర దేశాలను సంతుష్టీకరించే విధంగా ఈ పిలుపు ఉంది. ఆర్థికంగా చైనా ఇతర దేశాలను బలాత్కారం చేస్తోందన్న ఆరోపణలను ఇటీవలి కాలంలో అనేక దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.హిరోషిమా సమావేశాలు కూడా దాని చుట్టూ తిరిగాయి గానీ బహిరంగంగా వేలెత్తి చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చైనా నుంచి చేసుకొనే దిగుమతులను తగ్గించుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.చైనా నుంచి విడగొట్టుకోవటం ఇప్పటల్లో జరిగేది కాదని తెలుసు గనుకనే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చూస్తుంది తప్ప చైనా ఆర్థిక ప్రగతి, అభివృద్ధిని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకొనేందుకు చూశాయి. దశాబ్దాల తరబడి పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎంతో అవసరం. గత సంవత్సరం జపాన్ చైనాకు 189 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు, 145బి.డాలర్ల దిగుమతులు చేసుకుంది. నష్టాలను తగ్గించుకోవటం అంటే అవసరమైన వస్తువుల కోసం ఒక దేశం మీద ఆధారపడకుండా చూసుకోవాలన్నది అమెరికా వైఖరి అని జో బైడెన్ చెప్పాడు. చైనాలో పెట్టుబడులతో ముప్పు కూడా ఉంటుందని తెలిసినప్పటికీ తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షుల్జ్ చెప్పాడు.
చైనాతో సంబంధాలను విడగొట్టుకోవాలని జి 7 కోరుకోవటం లేదు, ఎందుకంటే అది ఎంతో కష్టం,ఇబ్బందులను కూడా తెస్తుంది, సాధ్యం కూడా కాదు అని కునీహికో మియాకే అనే విశ్లేషకుడు చెప్పాడు. అందుకే సమావేశ ప్రకటనలో విడగొట్టుకోవటం అనే పదం బదులు ముప్పు తగ్గించుకోవటం అని చెప్పారని అన్నాడు. జి 7 సమావేశం చైనా వ్యతిరేక (వర్క్‌షాప్) కసరత్తు అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వర్ణించింది.2021 నుంచి జి 7 సమావేశాల ప్రకటనలు క్రమంగా ట్రాఫిక్ సిగల్ మాదిరి మారుతూ చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఆ బృందం పూర్తి పేరు ఏడు పారిశ్రామిక శక్తి దేశాల బృందం అనీ, ఆర్థికంగా చేసేదేమీ లేక ఇప్పుడది ఒక చిన్న వర్క్‌షాప్‌గా పని చేస్తూ చైనా వ్యతిరేక నకిలీ ఉత్పత్తుల సామూహిక ఉత్పత్తి మీద కేంద్రీకరిస్తోందని గ్లోబల్‌టైమ్స్ ఎద్దేవా చేసింది. తాజా ప్రకటనలో తైవాన్,తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, షింజియాంగ్, చైనా అణుశక్తి అంటూ ఇరవైసార్లు చైనా పేరును పలవరించినట్లు పేర్కొన్నది. దీనికి తోడు చైనా ఆర్థిక బలత్కారాన్ని కూడా చేర్చినట్లు పేర్కొన్నది. శిబిరాల మధ ఘర్షణలను కోరుతూ ఈ బృందం ప్రపంచ శాంతి, అభివృద్ధికి అతి పెద్ద ముప్పులలో ఒకటిగా మారినట్లు స్పష్టం చేసింది.
ఆర్థిక అంశాలకు సంబంధించి సమావేశ ప్రకటనలో మాటల గారడీ చేసినా రాజకీయాలకు వస్తే చైనా మీద దూకుడుగానే ఉన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ ఆర్థిక నియమావళిని తిరిగి రాసేందుకు పూనుకుందని ఆరోపించాయి. సిడ్నీలో జరగాల్సిన చతుష్టయ(క్వాడ్) సమావేశాలు రద్దు కావటంతో పరువు దక్కించుకొనేందుకు హిరోషిమాకు వచ్చిన అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్, భారతదేశ నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ అధినేత జెలెనెస్కీని ఆహ్వానించి జి7 సభ్యదేశాలన్నీ అతని వెనుక నిలిచాయి.సాయాన్ని పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలను చూసినపుడు ఈ సమావేశం చైనా, రష్యాల మీద కేంద్రీకరించినట్లు చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనలు చేస్తుండగానే దీర్ఘకాలంగా పోరు సాగుతున్న బఖుమత్ పట్టణాన్ని రష్యా తన అదుపులోకి తెచ్చుకొని ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల పప్పులు ఉడకవనే సందేశాన్ని పంపింది. గత సమావేశాలు లేదా ఇతర శిఖరాగ్ర సమావేశాలకు భిన్నంగా హిరోషిమా సభ ఒక రోజు ముందుగానే సమావేశ ప్రకటనను విడుదల చేసింది. మీడియాలో జెలెనెస్కీకి ప్రాధాన్యత ఇచ్చి ఈప్రకటనను పక్కన పడవేస్తారన్న కారణంగా ముందుగానే విడుదల చేసినట్లు కొందరు చెప్పారు. నిజానికి గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్లుగా సమావేశం చేసే ప్రకటనలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద కేంద్రీకరించటం తప్ప కొత్తగా చెప్పేదేమీ ఉండదని ముందుగా ఊహించిందే. దానికోసం ప్రకటన దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు.చైనా మీద వత్తిడి స్వరాన్ని పెంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, సహకరించుకోవటం లక్ష్యంగా ఏర్పడిన జి7 ఇటీవలి కాలంలో దాని కంటే ప్రపంచ రాజకీయాల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ కూటమిలోని దేశాలు నాడు ప్రపంచ జీడిపిలో 70శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాని విలువ నలభైశాతానికి అటూ ఇటూగా ఉంది.
అసలు జి 7 ఎలా ఉనికిలోకి వచ్చిందీ క్లుప్తంగా చూద్దాం. అమెరికా,జపాన్, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం.అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1998లో రష్యా చేరి జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలపుడు ఎవరు దేశాల అధిపతిగా ఉంటే వారు ప్రతినిధిగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు.తమ దేశంలో జరిగే సమావేశాలకు ఇతర దేశాలను ఆహ్వానించే స్వేచ్చ ఆ దేశానికి ఉంటుంది. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. శిఖరాగ్ర సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. మన దేశం ఆహ్వానం అందుకోవటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్న తొమ్మిది దేశాలలో మనది కూడా ఒకటి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలా పాల్గన్నదేశాల అధినేతలు విడి విడిగా ఇతర దేశాల నేతలను కలుసుకోవటం, వేదిక మీద ధర్మోపన్యాసాలు చేయటం తప్ప బృంద నిర్ణయాలతో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఈ ఏడాది అతిధులుగా ఆస్ట్రేలియా,బ్రెజిల్, కామెరూస్,కూక్ ఐలాండ్స్, భారత్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్, వియత్నాం అధినేతలను ఆహ్వానించారు. పసిఫిక్ సముద్రంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదిహేను దీవుల సముదాయం 15,040 మంది జనాభా ఉన్న ఈ దేశ అధినేతకు ప్రపంచంలో పెద్దదైన భారత అధినేతల మర్యాదలు ఒకే విధంగా ఉంటాయి. పసిఫిక్ దీవుల్లో ఉన్న చిన్న దేశాలకు ఏర్పడిన ప్రాధాన్యాత కారణంగానే కూక్ ఐలాండ్స్‌కు ఆహ్వానం పలికారన్నది స్పష్టం.
ఒక దశలో ట్రంప్ ఏలుబడిలో తిరిగి రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.తరువాత అది ముందుకు పోలేదు. దాని వలన చేరే దేశాలకు జరిగే మేలేమీ కనిపించకపోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.అన్నింటికీ మించి అమెరికా అజెండాను ముందుకు తీసుకువెళ్లే ఒక వాహనంగా అది మారింది. ధనిక దేశాల బృందం తన పూర్వపు ఆర్థిక శక్తిని తిరిగి తెచ్చుకొనేందుకు చూపుతున్న శ్రద్ద కంటే ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నారంటే దాని అర్ధం ఈ బృందం అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు తోడ్పడటం తప్ప వేరు కాదు. చైనా ఆర్థిక బలాత్కారం అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్ రుణాల ద్వారా అలాంటి పనిచేసిన, ఇప్పటికీ చేస్తున్నది వాటి మీద పెత్తనం చేస్తున్న ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. తమకు లంగని లేదా రాజకీయంగా వ్యతిరేకించే దేశాల మీద ఆర్థిక, వాణిజ్య అంశాలను ఆయుధాలుగా మారుస్తున్నది పశ్చిమ దేశాలు. లడఖ్ సరిహద్దు వివాదం తరువాత మన దేశంలోని సంఘపరివార్, ఇతర చైనా వ్యతిరేక శక్తులు చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చేసిన హడావుడి గురించి తెలిసిందే. ఊహలు, వాంఛలను బట్టి ప్రపంచం నడవదు. నరేంద్రమోడీ సర్కార్ గత రికార్డులను బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మరోవైపు చైనా నుంచి విడగొట్టుకోవాలన్నదేశాలతో యుగళగీతం ఆలపిస్తున్నారు.
షియాన్ నగరంలో చైనా, ఆరు మధ్య ఆసియా దేశాల సదస్సు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ది అజండాతో జరిగింది. పలు ఒప్పందాలను చేసుకున్నారు.అమెరికా, ఐరోపా, మన దేశంతో చైనా జరుపుతున్న వాణిజ్యలావాదేవీల మాదిరే ఈ దేశాలతో కూడా జరుపుతున్నది. పరస్పర అంగీకారంతో పెట్టుబడులు పెడుతున్నది.కొందరు విశ్లేషకులు ఈ సమావేశాన్ని తన పలుకుబడిని పెంచుకొనేందుకు చైనా చేసిన కసరత్తుగా ఆరోపించుతున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట అమెరికా అభివృద్ది పేరుతో పాగా వేసేందుకు, రక్షణ పేరుతో తన విష కౌగిలిలో బంధించేందుకు చూస్తున్నది తెలిసిందే. అలాంటిది చైనా తన పొరుగున ఉన్నదేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడితే దాన్ని విస్తరణ కాంక్షగా వర్ణించటం అర్ధం లేదు. మన దేశం పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లకు చేస్తున్న సాయాన్ని విస్తరణ కాంక్షలో భాగంగా చేస్తున్నామా ?