ఎం కోటేశ్వరరావు
డిసెంబరు ఎనిమిదిన రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు భారత బంద్ జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలంటున్నది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా రెచ్చగొట్టేందుకు పూనుకొని వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. తాజా ఆందోళన ఎంతకాలం కొనసాగుతుంది, ఏమౌతుంది అన్నది ఒక అంశమైతే రైతుల ఆందోళనల సందర్భంగా జయప్రకాష్ నారాయణ వంటి మేథావులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. ప్రతి ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించే శక్తులు తప్పుడు వాదనలూ, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పంజాబు రైతులే ఎందుకు ఆందోళనలో ముందున్నారు, మిగతా రాష్ట్రాల వారు ఎందుకు స్పందించటం లేదు వంటి కొన్నింటి తీరు తెన్నులను చూద్దాం.
1.పార్లమెంట్ అంగీకరించిన తరువాత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ?
ఇది తర్కానికి నిలిచేది కాదు. పార్లమెంట్ ఆమోదించినంత మాత్రాన వ్యతిరేకత వ్యక్తం చేయకూడదని చెప్పటం నిరంకుశత్వలక్షణం. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిని అప్పటి పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించారు. అయినా నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం ఎందుకు వ్యతిరేకించింది ? ఆర్టికల్ 370, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా పార్లమెంటు ఆమోదించినవే అయినా బిజెపి ఎందుకు వ్యతిరేకించింది, రద్దు చేసింది ?
2.ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఆందోళన చేయలేదు ?
ఇది తప్పుడు ప్రచారం. ఆర్డినెన్స్‌లు తెచ్చినపుడే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా వీధుల్లోకి రాలేదు, అన్నింటికీ మించి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందనే ఆశ, నమ్మకం ఉండటం. ఇవి రెండూ పోయిన తరువాత మరొక మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన బిజెపి మిత్రపక్షం అకాలీదళ్ చెప్పింది అదే. రెండు వ్యవసాయ, ఒక వినియోగదారుల చట్టాలకు సంబంధించి మార్పులను ఆర్డినెన్సుల ద్వారా అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు అంశాలూ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. చర్చలు జరపలేదు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నాయి గనుక మౌనం దాల్చాయి.
3. ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కదా !
పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ స్దానే బిల్లులను ప్రవేశపెట్టినపుడు సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం తోసి పుచ్చింది. నిరసనల మధ్య ఆమోద తతంగాన్ని పూర్తి చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపింది. వీటిని ఎందుకు తిరస్కరించినట్లు ? ఇది ప్రజాస్వామ్యమా ? విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అంతర్గతంగా హామీ ఇచ్చారు కనుకనే ఆర్డినెన్సు, తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమోద తతంగం చేశారు. అందువలన అవి రద్దయ్యేవరకు గళం విప్పుతూనే ఉండటం తప్పెలా అవుతుంది.
4. రైతులు మొండిగా ఉన్నారు, కమిటీ వేస్తామన్నారు కదా, ఎందుకు అంగీకరించరు ?
మొండిగా ఉన్నది ప్రభుత్వమే. తమ మిత్రపక్షం అకాలీదళ్ నిరసన వ్యక్తం చేసినా రాజకీయంగా దానితో విడగొట్టుకొనేందుకు అయినా సిద్దపడింది గానీ ఆ పార్టీ చెబుతున్నదానిని కూడా వినిపించుకోలేదు. సెప్టెంబరు 25న అఖిల భారత నిరసన దినం పాటించాలని అఖిల భారత కిసాన్ సంఘర్ష సమితి పిలుపు ఇచ్చింది, పాటించారు. అప్పుడు స్పందించలేదు. తరువాత నవంబరు 26న ఆందోళన పిలుపునూ పట్టించుకోలేదు. తీరా రైతులు ఢిల్లీ బయలు దేరిన తరువాత శివార్లలో కందకాలు తవ్వేందుకు, ఆటంకాలు ఏర్పాటుకు చూపిన శ్రద్ద పరిష్కారం మీద లేదు. రైతులు వచ్చిన వారం తరువాత చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయితే వత్తిడిని తట్టుకోలేక ముందే చర్చలకు పిలిచింది. కమిటీని వేస్తామనటం తప్ప మార్పులకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు కేంద్రం వైపు నుంచి లేవు. ఇది కాలయాపన, ఉద్యమాన్ని చల్లార్చే ఎత్తుగడ. అలాంటపుడు రైతులేమి చేయాలి ?
5. కేంద్రం చెబుతున్నది ఏమిటి ? రైతులు కోరుతున్నది ఏమిటి ?
ఐదుసార్లు చర్చలు జరిపారు. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని రైతులు ప్రతిసారీ చెప్పారు. సావిత్రీ నీ పతి ప్రాణంబుదక్క వరాలు కోరుకోమన్నట్లుగా అది మినహా ఇతర అంశాల గురించి మాట్లాడుదాం అనటం తప్ప కేంద్రం నుంచి మరొకమాటలేదు. రైతులు చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఇంతవరకు చెప్పలేదు.
6. కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు, కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తరువాత కూడా రైతులు ఆందోళన చేయటం ఏమిటి ?
ఆ మార్పులేమిటో నిర్దిష్టంగా చెబితే రైతులు ఆలోచిస్తారు. ఎవరు చెబుతున్నది ఏమిటో జనమూ గ్రహిస్తారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరితే ఆందోళనకు మద్దతు తగ్గిపోతుంది. అయినా ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో చెప్పిందేమీ లేదు. ఎవరితో సంప్రదించకుండానే ఆర్డినెన్సు తెచ్చారు. పార్లమెంట్‌లో అభ్యంతరాలను పట్టించుకోలేదు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గురించి బిజెపి ఎంత హడావుడి చేసిందో తరువాత ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. యాభై రోజుల్లో పెద్ద నోట్ల రద్దు సమస్యను పరిష్కరించలేకపోతే శిక్షించమని మోడీ చెప్పారు. నాలుగేండ్ల తరువాత నల్లధనాన్ని తగ్గించామని బుకాయించటం తప్ప అంకెల్లో చూపారా? జిఎస్‌టి ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని చేసుకున్న ఒప్పందానికే ఎగనామం పెడుతూ దేవుడి లీల, కేంద్రం పరిహారం ఇవ్వలేదని బుకాయించిన తీరు చూశాము. అందువలన ప్రధాని నోటి మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు ? కనీస మద్దతు ధర గురించి చెబుతున్న మాటలనే చట్టబద్దం ఎందుకు చేయరని రాజస్దాన్, హర్యానాలో ఉన్న బిజెపి మిత్రపక్షాలే చెబుతున్నాయి. దాన్నయినా చేస్తామని ఎందుకు చెప్పటం లేదు ?
7. రైతులకు ఉపయోగం లేకపోతే జయప్రకాష్ నారాయణ వంటి మేథావులు కేంద్రాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు ?
జయప్రకాష్ నారాయణ ఒక మాజీ ఐఏఎస్ అధికారి. రాజకీయాల్లో ఒక విఫలనేత. ఆయన ఎందుకు సమర్ధిస్తున్నారో స్కాన్ చేసి చూడలేము. అయితే ఒక మేథావిగా ఆయన చెప్పిన మాటలను వినాల్సిందే. కానీ అవే ప్రమాణం కాదు. జెపి కంటే వ్యవసాయ-ఆర్ధిక రంగంలో ఎంతో పరిశోధనలు చేసిన నిపుణులు అనేక మంది వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో జెపి ఎంత బాగా తెలిసిన వ్యక్తో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అంతే తెలుసు. మరి నాగేశ్వర్ వ్యతిరేకతను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.
7. రైతులను బిజెపి వ్యతిరేక పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి !
రైతులు అంత అమాయకులు కాదు. ఒక వేళ ఇతర పార్టీలు తప్పుదారి పట్టిస్తే బిజెపి వారిని సరైనదారిలో పెట్టలేనంత అసమర్ధంగా ఉందా ? ఈ ఆరోపణ రైతుల అనుభవం, తెలివితేటలను అవమానించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో, ప్రపంచంలో రైతాంగ ఉద్యమాలు కొత్త కాదు,ఎన్నో చారిత్మ్రాక పోరాటాలు చేశారని మరచిపోకూడదు. పంజాబ్ పోరాటాల గడ్డ, పంజాబీలు అటు సైన్యంలో జైజవాన్లుగా, వ్యవసాయంలో జైకిసాన్లుగా వారి పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సెప్టెంబరు 25న తొలి ఆందోళన ప్రారంభమైంది. అప్పటి నుంచి రైతులను సమాధాన పరిచేందుకు బిజెపి చేసింది ఏమిటి ?
8.ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్ 2019 మానిఫెస్టోలో చెప్పింది.
ప్లేటు ఫిరాయించటం రాజకీయాల్లో కొత్త కాదు, అది ప్రజలకు మేలు చేసేది, తప్పిదాన్ని సరిదిద్దుకొనేది అయితే ఇబ్బంది ఏమిటి. ముఖ్యమంత్రిగా జిఎస్‌టిని వ్యతిరేకించిన నరేంద్రమోడీ తీరా తాను ప్రధాని అయిన తరువాత తగినకసరత్తు లేకుండా అమలు జరపటాన్ని , దేశాన్ని ఇబ్బందుల పాటు చేయటాన్ని ఏమనాలి. అనేక రాష్ట్రాలకు ప్రకటించిన పాకేజీలు, హామీలను తిరస్కరించటం ఏమిటి ? రెండు తెలుగు రాష్ట్రాలకు బిజెపి, కేంద్రి ఇచ్చిన హామీలకు మొండి చేయి చూపటాన్ని ఏమనాలి? బిజెపి గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తోంది.
9. పంజాబ్ రైతులు, జాట్‌కులస్తులు తప్ప ఉద్యమంలో ఎవరూ లేరు ?
జయప్రకాష్ నారాయణ వంటి మేథావులు చేస్తున్న తప్పుడు వాదన ఇది. కుల వ్యవస్ధ ఉన్న కారణంగా ప్రతి వారూ పుట్టుకతో ఏదో ఒక కులానికి చెందుతున్నారు. అనేక మంది ఐఎఎస్, ఐపిఎస్‌లు ఉన్నారు ? మరి జెపి ఒక్కరే లోక్‌సత్తా ఎందుకు పెట్టారు ? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు ? ప్రజల సొమ్ముతో వైద్య విద్యను చదివి ప్రాక్టీస్ చేయకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, జనానికి అవసరమైన మరొక వైద్యుడు తయారు కాకుండా అడ్డుకోవటమే. అలాంటి వారిలో జెపి ఒకరు ఎందుకు అయ్యారు ? పోనీ ఐఎఎస్ అధికారిగా అయినా కొనసాగి జనానికి మేలు చేయలేదు.
ఎస్ పంజాబ్ రైతులు ఉద్యమంలో ముందున్నారు. సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకేసారి ముందుకు ఎందుకు రాలేదో జెపి వంటి వారు చెప్పాలి. హరిత విప్లవంలో పంజాబ్ రైతులు ముందున్నారు. వ్యవసాయ మిగులును సాధించటంలోనూ వారే ముందున్నారు. ఆ మిగులుకు మార్కెటింగ్ సమస్యలు వచ్చినపుడు ప్రభావితమయ్యేదీ వారే కనుక, ముందుగా మేలుకున్నారు.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వంద ఎకరాలలో వంద కిలోల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయనుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని 15.71 ఎకరాల్లో 16.91 కిలోలు, మధ్య ప్రదేశ్‌లోని 12.7 ఎకరాల్లో 12.08 కిలోలు పంజాబ్‌లోని 5.4 ఎకరాల్లో 11.29 కిలోలు పండుతున్నాయి. మిగిలిన సంవత్సరాలలో కూడా స్వల్ప తేడాలతో ఇదే విధంగా ఉంటాయి. దీనర్దం ఏమిటి పంజాబ్‌లో అమ్ముకోవాల్సిందీ ఎక్కువే. మార్కెట్ కమిటీలను, సేకరణ వ్యవస్ధలను పనికిరాకుండా చేసి, కనీస మద్దతు ధరలను నీరుగారిస్తే ఎక్కువగా నష్టపోయేది పంజాబ్ రైతులే కనుక వారే ముందుగా మేలుకున్నారు.
2017-18 వివరాల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్ 13.26శాతంతో దేశంలో అగ్రస్దానంలో ఉంటే 11.85శాతంతో పంజాబ్, 11.75శాతంతో ఉత్తర ప్రదేశ్ రెండు, మూడు స్దానాల్లో ఉన్నాయి. ఇక బియ్యం వినియోగంలో నెలకు తలసరి వినియోగం పంజాబ్‌లో బియ్యం 0.4కిలోలు ఉంటే 14.5కిలోలతో ఒడిషా ప్రధమ స్దానంలో ఉంది. అందువలన రెండు రాష్ట్రాల రైతులకూ మార్కెటింగ్ సమస్యలు ఒకే విధంగా ఉంటాయా ? ఎంత పండినా వినియోగించే స్దితిలో ఒడిషా రైతు, అమ్ముకోవాల్సిన అవసరంతో పంజాబ్ రైతు ఉంటాడు. అందుకే ఆందోళనలో ముందుంటాడు. ఇలాంటి తేడాలే ఉంటాయి.
10.ఆందోళన చేస్తున్నది రైతులు కాదా ?
మరి ఎవరు ? సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు పంజాబ్ గురించి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకదానిలో చెప్పినదాని ప్రకారం పంజాబ్‌లో వ్యవసాయం చేసే గ్రామాలు కేవలం 1,500 మాత్రమేనట. అక్కడ 30వేల మంది అడితియాస్(కమిషన్ ఏజంట్లు), వారి వద్ద పని చేసే మూడులక్షల మంది సహాయకులు కలిపి ప్రతి గ్రామానికి 220 మంది చొప్పున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారట. చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో 12,729 గ్రామాలున్నాయి. తరువాత ఏవైనా కొన్నింటితో మున్సిపాలిటీలు ఏర్పాటు అయి ఉండవచ్చు. పన్నెండు వేలకు తగ్గవు.పంజాబ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా చెబుతుంటే 1500 గ్రామాలతో అంత ఉత్పత్తి సాధ్యమా ? దీన్ని ప్రచారం చేస్తున్న వారు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. ఇలాంటి లెక్కలతోనే అడితియాసే రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నట్లు బిజెపి, దాని తొత్తులు ప్రచారం చేస్తున్నారు.
11. ఇతర రాష్ట్రాలతో పోల్చటం తప్పంటారా ?
ఈ ప్రశ్నకు పంజాబ్ రైతుల గురించి చెప్పినదానిలోనే కొంత సమాధానం ఉంది. మార్కెట్ యార్డుల వెలుపల అమ్ముకొనే స్వేచ్చ ఇస్తే రైతులకు లాభం అని చెప్పేవారి దగ్గర ఆధారం లేదు. ఒక భ్రమ మాత్రమే. బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం 2006లోనే వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. ధాన్య సేకరణ బాధ్యతను సహకార సంస్దలకు, వ్యాపారమండళ్లకు అప్పగించింది. గత ఏడాది 30లక్షల టన్నులు సేకరణ లక్ష్యంగా చెప్పారు, 20లక్షల టన్నులకు దాట లేదు. గతేడాది క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,815 ఉంటే బహిరంగ మార్కెట్లో సీజన్లో రూ.1,350కి అమ్ముకున్నారు( మే 8, 2019 డౌన్‌టు ఎర్త్). ఏటా బీహార్‌లో 1.6 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో 30లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. ఈ ఏడాది నవంబరు 15 నుంచి డిసెంబరు ఐదువరకు కొన్నది కేవలం 793 టన్నులు మాత్రమే. కనీస మద్దతు ధర రూ.1,868 కాగా రైతులు రూ.800-1200 మధ్య అమ్ముకుంటున్నారు(డిసెంబరు ఆరు, 2020 ఇండియన్ ఎక్స్ ప్రెస్). అందుకే బీహార్ పరిస్ధితితో పోల్చుకొని పంజాబ్ రైతులు ముందే మేలుకున్నారు. పంజాబీలను చూసి బీహారీలు కూడా వీధుల్లోకి రావచ్చు.అందువలన అందరూ ఉద్యమంలోకి ఎందుకు రావటం లేదని కాదు వచ్చిన వారి డిమాండ్లలో న్యాయం ఎంత అన్నది ముఖ్యం.