Tags
Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue
ఎం కోటేశ్వరరావు
ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్ అలయన్స్) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.
కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.
స్టేట్స్‌మన్ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్ సింగ్, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్)కు దారి తీసింది.అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.
ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్ దిమ్, అతని సోదరుడు నగో దిన్ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్ వాన్ థీవ్ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్ మార్క్ క్లార్క్ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్ ఫెర్డినాండ్ మార్కోస్ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్ రీగన్ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్ డి న్యూసమ్ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)
అష్రాఫ్ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్-ఈస్ట్ ఆసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్), బాగ్దాద్ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్ 715బిలియన్ డాలర్లుగా బైడెన్ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.
సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్ షింగర్ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్-చైనీస్ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ అభిప్రాయపడ్డాడు. కాబూల్ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.
అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్ సముద్రం – బాల్టిక్ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్ మరియు రోడ్ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్ 400 బిలియన్ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్ అధిపతి ముల్లా అబ్దుల్ బరాదర్ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.
కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.